Friday 4 September 2015

సంసారమా? సన్యాసమా??

‘ఏవండీఈఈఈఈఈఈఈ.....’

‘యురేకాఆఆఆఆఆఆఆ..... అని అలనాడెప్పుడో ఆర్కెమిడీస్ మహాశయుడు గొంతు చించుకున్నట్టు; హేవిటే... ఆ అరవ సాగతీత సీరియల్ గావుకేకలు. ఇది కులీనుల కొంపనుకున్నావా? కాకినాడ రైల్వే స్టేషననుకున్నావా? నీ దుంపతెగనని! అసలే నా హార్టు వీకూ. నీ అరుపుల దెబ్బకు ఏదో ఒకరోజు తత్కాల్ టికెట్ బుక్ చేసుకుని కైలాసానికి టపా కట్టేస్తానేమోనని రోజూ జడుసుకు ఛస్తున్నాననుకో. ’

‘ఇది కొంపో, కర్మాగారమో తర్వాత తీరిగ్గా కూర్చుని కూలంకషంగా చర్చిద్దాంలే గానీ... ఏంటిది? ఆహా... అసలేంటిది? ఇది పెసరట్టా? లేక శేషాచలం కొండలపై మంటల్లో చిక్కి మాడి మసైపోయిన ఎర్రచందనం బొగ్గా? అసలేం జరుగుతోందీ వంటింట్లో??? నాకు తెలియాలి! ఇప్పుడే తెలిసి తీరాలి, హ్హా!! అయినా, వంట చేసేటప్పుడు ఆ దరిద్రపుగొట్టు వాట్సాపు గ్రూపుల్లో పడి బలాదూరుగా ఊరేగొద్దని ఎన్నిసార్లు చెప్పాలండీ మీకు??’

‘ఏడిశావులేవోయ్! వసపిట్టలా నువ్వూ, నీ అతి వాగుడూనూ. చెట్టంత పతిదేవుణ్ని పట్టుకుని భయం భక్తీ, మర్యాదా మప్పితం లేకుండా ఏంటా నిలదీయడం? మడిషన్నాక చిన్నాచితకా పొరపాట్లు; మొగుడున్నాక అన్నంకూరా మాడగొట్టడాలు సహజాతిసహజమని గీతలో కృష్ణపరమాత్మ అరిచి గీ పెట్టాడా లేదా? చూడు శ్రీమతీ... ఏడాదికొకసారైనా వేద పారాయణం చేస్తూ ఉండవోయ్. కాస్త పారమార్థిక జ్ఞానం బుర్రలోకి దూరి నీ మతి భేషుగ్గా ఉంటుంది. ఎంతకాలమిలా మాడిన దోశలు, ఎండిన పెసరట్లు అనబడు తుచ్ఛ ఐహిక విషయాల్ని సిల్లీగా పట్టుకు వేలాడుతూ బీపీలు గట్రా పెంచుకుని ఆరోగ్యం చెడగొట్టుకుంటావ్?? అన్నట్టు నీకో విషయం తెలుసా?! తాను దోచిందే డబ్బు, చేసిందే ఓదార్పు అన్నట్టు ఇంతకాలం కాలరెగరేసుకు కన్నూ మిన్నూ కానక తిరిగిన మన యువనేత అంతటివాడే స్వయంగా... ‘నేనేమైనా మారాలా’ అని పార్టీ నేతల చొక్కాలు పట్టుకుని, బుగ్గ బుగ్గా రాసుకుని మరీ భోరున విలపించి మొసలి కన్నీరు కార్చి ఆత్మపరిశీలన చేసుకున్నాడు. ఆయన్ను చూసైనా నువ్వు మారవా? ఆత్మ పరిశీలన చేసుకోవా?’

‘అఘోరించారులే! మీరూ, మీ మోకాలికీ-బట్టతలకీ ముడిపెట్టే తింగరి సూత్రీకరణలు. ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ అక్కణ్నుంచి తరలించకముందే మిమ్మల్ని ఓసారి తీసుకెళ్లి మీ మోకాలికి కాస్త బలమైన పరీక్షలు గట్రా చేయించాలి సుమీ. రాన్రాను తలాతోకా లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అయినా మిమ్మల్నని ఏం లాభంలే. తప్పంతా నాదే. ఓట్లకు నోట్లు గుమ్మరిస్తూ అడ్డంగా దొరికిపోయిన బుర్ర తక్కువ నాయకుల్లాగా... లక్షలకు లక్షలు డబ్బు పోసి మిమ్మల్ని వేళం పాటలో కొనుక్కునేటప్పుడే కాస్త జాగ్రత్త పడాల్సింది. వంటా-వార్పూ, శుచీ-శుభ్రత, చదువూ-సంధ్యా, సంసారం-సట్టుబండలూ చక్కగా వచ్చో లేదో ఒకటికి లక్ష సార్లు శూలశోధన చేయించి మరీ ఆ మూడు ముళ్లకు పచ్చజెండా ఊపాల్సింది. మా అమ్మనాన్నలకు బుద్ధి లేదసలు. పిల్లాడు ఎర్రగా బుర్రగా మహేష్ బాబులా ఉన్నాడు. అన్నింటికీ ఆధార్ లింకు చేయించాడు అని ఎగిరి గంతేసి, పప్పులో  కాలేసి,  పొలోమని నిన్ను బరబరా లాక్కొచ్చి నా గొంతులో గుదిబండలా వేలాడేశారు. భగవంతుడా... అడ్డంగా బుక్కైపోయాను కదయ్యా. తప్పు చేశానండీ, తప్పు చేశాను.’

‘వామ్మో!! నీ అహంకారం  కాకులెత్తుకెళ్లా! నీ అతిశయం పాడుగానూ!! ఏం చూసుకునే నీకింత గర్వాతిశయం? ఏంటీ... తప్పు చేశావా? నోటికి అడ్డూ అదుపూ లేకుండా ఏంటా దిక్కుమాలిన ప్రకటనలు? అవును మరి.... నువ్వో పెద్ద ప్రపంచ ప్రఖ్యాత సత్య నాదెళ్లవాయే! కాకలు తీరిన రతన్ టాటావాయే!! తప్పు చేశానని ప్రపంచానికి ప్రకటిస్తున్నావ్ మరి. దిక్కుమాలిన సంత. అంతా నా ఖర్మే. ఆ అమెరికోడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, తుమ్మితే ఊడే ముక్కుల్లా తయారైపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగం పుణ్యమాని నేను, స్వయాన నా అంతటివాణ్ని నీకు అడ్డంగా దొరికిపోయా. ఆ హైటెక్ సిటీలో ప్రాజెక్ట్ అటకెక్కి, నా నెత్తిన శని ఎక్కి, బెంచ్ మీద తోక తెగిన బల్లిలా పడున్న నన్ను, అక్కడి నుండి లాగి పెట్టి కొడితే గిరికీలు కొట్టుకుంటూ గోల్ఫ్ బంతిలా ఇదిగో ఇలా వంటింట్లోకొచ్చి పడ్డాను. రాజాలా బతికినవాణ్ని. చివరికిలా పులిరాజాలా తయారైపోయా. నా ఖర్మ కాకపోతే మరేంటి?? ఛస్.... దిక్కుమాలిన ఉద్యోగం. దిక్కుమాలిన కొంప. దిక్కుమాలిన జీవితం. సన్యాసం తీసుకుంటే పీడా విరుగడవుద్ది.’

‘ఇదిగో... మిమ్మల్నే!! ఇంకోసారి ఆ ‘దిక్కుమాలిన’ అనే పదం ఉపయోగిస్తే... ముక్కు కోసేస్తానేమనుకున్నారో. ఇప్పుడేమన్నానని ఆ ఏడుపు? ఓ గంట వంట చేయమంటేనే సన్యాసం, సత్తరకాయా అని నిష్ఠూరాలు పోతున్నారు. మరి, గానుగెద్దులా పొద్దస్తమానం ఉద్యోగం చేసొచ్చే నాకెంత చిరాకేయాలి? నేనెన్ని చిందులేయాలి? నోర్మూసుకుని వంటింట్లోకి దయచేయండి. సన్యాసమట సన్యాసం!!’

‘ఏంటీ.... ఒక గంట వంటనా? నా తలకాయేం కాదు. ఉల్లి లొల్లి, కరెంటు బిల్లు, గ్యాస్ గోల, బొంతలుతకడం ఓ కళ, పిల్లలు ఫీజులూ, ట్యూషన్లూ వగైరా... ఇవి కాదా భర్తకు భారం అని ప్రశ్నించదలచుకున్నా అధ్యక్షా!’

‘అమ్మోయ్.... నాన్నోయ్....! ఇది ఇళ్లనుకున్నారా, ఢిల్లీ పార్లమెంటనుకున్నారా? అధికార ప్రతిపక్షాల్లా ఏంటీ అరుపులు, గోలలు, వాగ్వివాదాలు, మొండిపట్లు. ఛస్... మీకిలా కాదు. జై మాహిష్మతి!! మా ఇంటికి మకిలి పట్టింది... కట్టప్పా... నువ్వెక్కడున్నావయ్యా? దీన్ని ఖండించి కడిగిపారేయ్!!!’

‘ఓరి నీ బాహుబలి పైత్యం తగలెయ్యా!! ఏరా గడుగ్గాయ్... నువ్వూ బుల్లి భళ్లాలదేవలా తయరయ్యావా? కట్టప్ప అరంగేట్రం చేయాల్సినంత దృశ్యమిక్కడ లేదులేవోయ్. సంసారమన్నాక ఈ సరిగమలూ, పదనిసలూ షరా మామూలే గానీ, నువ్వు నోర్మూసుకుని బడికి బయల్దేరవోయ్.’

‘ద్యేవ్డా! వీళ్లు మారరా!!’
Google Courtesy 

(ఈనాడుకోసం రాసింది.... చివరకిక్కడ తేలింది!) 

8 comments:

  1. ఒక అజెండా అంటూ లేని తీర్మానంలా ఈ పోస్టు నచ్చలేదండీ !

    ReplyDelete
    Replies
    1. హహ్హా! ఇంటిని అడ్డం పెట్టుకుని పార్లమెంటు మీద దాడి చేద్దామనుకున్నా. ప్చ్... మిసైల్ టార్గెట్ మిస్సయినట్టుంది. లాంచింగ్ కి ముందు తిరుపతిలో పూజలు గట్రా బలంగా చేయించుంటే బాగుండేదేమో :)

      Delete
    2. మొగుడూపెళ్ళాల గొడవలకి తిరుపతి వెంకన్న చాలా దూరంగా ఉంటాడండీ...మ(అ)ల్లన్నే బెటర్ !

      Delete
  2. పోష్టు కన్నా కార్టూను బావుంది!
    మిస్సైలు దారితప్పినా క్యామిడీ పండింది,
    ఫర్లేదు అడ్జస్టయిపోవచ్చు!

    ReplyDelete
    Replies
    1. హహ్హా... థ్యాంక్సండీ! :)

      Delete
  3. గోంగూర పచ్చడి + ఆవకాయ + బిరియాని+ చాయ్ + సాంబారు + పూతరేకులు అన్నీ మిక్స్ చేసినటు అతిగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. ద్యేవ్డా!!
      నేను కేవలం పెసరట్టు మాత్రమే అనుకున్నానే.... అంత అరాచకమైన డిష్ తయారైందా?
      థాంక్యూ :)

      Delete