Wednesday, 30 July 2014

మీలో ఎవరు శనీశ్వరుడు!సభలు, సమావేశాలతో చిర్రెత్తిన నాయకగణం ఓ రాహుకాలాన శంకరగిరి మాన్యాలకు షికారు కెళ్లారు. అడ్డూ అదుపూ లేని నేతల కేరింతలు, కోలాహలం దెబ్బకు అడవిలోని జంతువులంతా జడుసుకుని అంతర్థానమైపోయాయి. వానర మూకను మించిన వీళ్ల వేలం వెర్రికి అడ్డుకుట్ట వేయాలనే ఉద్దేశంతో సభాధ్యక్షుల వారు గొంతులోని స్వరతంత్రుల్ని ఆరున్నొక్క రాగంలో సవరించుకుంటూ... మనమందరం కలసి ఓ విచిత్రమైన, వినూత్నమైన రియాల్టీ షో ఆడదామని నేతలకు సగౌరవంగా అరిచి గోల పెట్టి విన్నవించుకున్నారు. ఆ రియాల్టీ షో పేరు ‘‘మీలో ఎవరు శనీశ్వరుడు’’!  

ఇందులో నేతలు చేయాల్సిందల్లా... తమ నెత్తినెక్కి తైతక్కలాడుతున్న శనీశ్వర యోగం గురించి, తమకు పట్టిన మహా దగ్దయోగం గురించి తమ గోడును శక్తిమేర వెల్లబోసుకోవాలి. ఎవరైతే గొప్పగా శనీశ్వర విశ్వరూప సందర్శనం కళ్లకు కడతారో వారే... చివర్లో ఈ షో విజేతగా నిలుస్తారన్నది సారాంశం. నేతలంతా జబ్బలు చరుచుకుని, ఈలలు కొట్టి మరీ షో ఆడడానికి సై అన్నారు. నేతల దగ్దయోగం సంగతుల్ని వారి మాటల్లోనే విందాం.

కమలానికి కాండము నేనై, హిందూత్వం దన్నును నేనై, కాకలుతీరిన కాషాయ యోధుణ్నై, కొమ్ములు తిరిగిన రామభక్త హనుమంతుణ్నై, అన్నీ నేనై, చివరకు కంట్లో నలుసై, ప్రధాని పదవికి దూరమై, అస్త్ర సన్యాసం చేసిన కురు వృద్ధుణ్ని అయితిని. హతవిధీ! అదృష్ట దేవత నమోనమ: అంటూ చాయివాలాని వరించగా, శని దేవత నా శిరస్సునెక్కి కసి తీరా కరాళ నృత్యం చేసిందనడానికి నాకంటే ప్రబల నిదర్శనం ఎవ్వరూ లేరు అధ్యక్షా!

పిడి విరిగిన కొడవలి, నేల రాలిన కంకి, మట్టి కరచిన సుత్తి ఇవి కావోయ్ చరిత్ర సారం. సైద్ధాంతిక చట్టుబండలు, చారిత్రక తప్పిదాలు, కాంగ్రెస్ తో చెట్టాపట్టాల్, పొడ సూపని మూడో ఫ్రంటు కావాలోయ్ నవ్య పథానికి. జనం చెవిలో మందారం పూలు పెట్టి, సవాలక్ష పోచికోలు కబుర్లు చెప్పి, రైటిస్టులతో రైటో రైటని రాసుకు పూసుకు తిరిగే లెఫ్ట్ బ్రదర్స్ మేమే. ఢిల్లీ పీఠం కోసం చకోర పక్షుల్లా దశాబ్దాలుగా ఎదురుతెన్నులు చూస్తున్నా ఆ భాగ్యం దక్కని అభాగ్యులం మేమే. మాచే అధ:పాతాళానికి తొక్కివేయబడ్డ మార్క్సిస్టు సిద్ధాంతాల మీద ఒట్టు... సర్వవిధ భ్రష్టత్వం మాదే. దరిద్రం, దగ్దయోగానికి ప్రతిరూపాలం మేమే, మేమే! సృష్టిలో శ్రేష్ఠమైన శనీశ్వరులం మేమే అధ్యక్షా!

గల్లీలోని గరీబు నేనే. ఢిల్లీనేలిన నవాబు నేనే. ఢామ్మని పేలిన మతాబు నేనే. శని తలకెక్కిన షరాబు నేనే. ఎలా ఉంది నా పాట? ఈమధ్య పెరిగిన గోళ్లు గిల్లుకోవడం, చిరిగిన టోపీ కుట్టుకోవడం తప్ప, పెద్దగా పనులేం లేకపోవడంతో నాపై నేనే కట్టిన విషాదగీతం తాలూకు పల్లవి అది. హేవిటో... వెనకటికి పిలిచి పిల్లనిస్తే కన్ను మెల్ల అన్నాట్ట నాబోటి నష్ట జాతకుడు. అవినీతి, ఆమ్ ఆద్మీ, అన్నాభజన పేర నేను చేసిన బ్రహ్మాండమైన కథాకళి నృత్యకేళిని మెచ్చి ఢిల్లీ జనం నాకొక పట్టం కట్టబెట్టారు. ప్చ్.. ఏం లాభం? గిర్రున నెల తిరక్కుండానే కుర్చీని అడ్డంగా కాళ్లు తెగ నరికిన ఉద్ధండుణ్ని నేను. నా నెత్తి మీది కుచ్చుటోపి కింద మూడంకె వేసి గుర్రు పెట్టి కునుకు తీస్తున్న శని, దెయ్యంలా అస్తమానం నా చేత ఇలాంటి తింగరి పనులు చేయిస్తూ ఉంటుంది. కావున, బూజు పట్టిన ఈ చీపురుకట్ట మీద, దుమ్ము కొట్టుకుపోయిన నా టోపీ మీద ఆన. ఈ ప్రపంచంలోనే నన్ను మించిన శనీశ్వరుడు ఇంకెవ్వరూ ఉండరు, ఉండబోరు అధ్యక్షా!

ఇడుపులపాయ మట్టిని నేను. రాజన్న ఇంటి రత్నాన్ని నేను. మహానేత మలిచిన మణిపూసను నేను. గనుల్ని మింగిన ఘనుణ్ని నేను. ఓదార్పు మంత్రం సిద్ధించిన వియోగిని నేను. చెంచల్ గూడ యోగం పట్టిన చరితార్థుణ్ని నేను. వలువల్లేని విలువల్ని వల్లించే విజ్ఞుణ్ని నేను. శని దేవత ఎక్కుపెట్టిన శరాన్ని నేను. భగవంతుడా! దిక్కుమాలినంత డబ్బూదస్కం ఇచ్చావు. లెక్కలేనంత మంది వందిమాగధులనిచ్చావు. ఏం లాభం? అధికారం మాత్రం ఆకాశ తారగానే మిగిల్చావు కదయ్యా. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో... కాదు కాదు నా నోటి నిండా, నా ఒంటి నిండా, నా ఇంటి నిండా శని చుట్టుకుంది మహాప్రభో. శని గ్రహానికి నిఖార్సైన నిర్వచనం నేనే అధ్యక్షా!

సొట్ట బుగ్గ నా సొంతం. బ్రహ్మచర్యం నా అభిమతం. గాంధీగిరి నా వారసత్వం. ఇటలిండియా నా పౌరసత్వం. పార్టీలో నాదే పూర్తి ఆధిపత్యం. ఐనా, నేనంటే ఎందుకో అందరికీ అలసత్వం. నన్ను ప్రధానిగా చూడాలనుకోవడం మా అమ్మ అమాయకత్వం. ఇవేవీ పట్టించుకోకపోవడం నా తింగరి తత్వం. అముల్ బేబీలా బాగా చెప్పాను కదా! వచ్చే పదేళ్లకంతా కాస్త తిన్నగా మాట్లాడ్డం నేర్చుకోరా తింగరి సన్నాసి అని అమ్మ ఈమధ్య చెవిలో ఇల్లు కట్టి మరీ తిట్టి పోస్తూ ఉంది. అందుకనే ఈ మధ్య బుల్లి నానీలు, చిట్టి హైకూలు, మినీ కవితలు రాస్తున్నాన్లే. అభాగ్యుడికి ఆకలెక్కువ, నిర్భాగ్యుడికి నిద్రెక్కువ అన్నట్టు నేనేం చేసినా దరిద్రమే. అడుగు పెట్టిన చోటల్లా దగ్దయోగమే. మా ముత్తాత, నానమ్మ వీళ్లెవ్వరికీ సాధ్యం కాని రీతిలో మహత్తర పార్టీ ప్రతిష్ట మంట గలిసింది నా హయంలోనే. అందుకే త్రిలోకాల్లో నేనే శని. శనే నేను. అదే తథ్యం. అదే వేదం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అధ్యక్షా!

అముల్ బాబా అంతరంగ దగ్దయోగ ఆవిష్కరణం విన్న నాయకగణం భోరున ఏడ్చి, గాఠిగా ముక్కు చీది, పంచెతో కళ్లు తుడుచుకుని, ‘‘మాలో అముల్ బాబే గొప్ప శనీశ్వరుడు’’ అని గాద్గదిక కంఠంతో దిక్కులు పిక్కటిల్లేలా గావుకేక పెట్టారు. 

‘‘జై అముల్ బాబా’’!! 

[నోట్: మొన్న 28వ తేదీన ఈనాడు ఎడిటోరియల్ పేజీలో పబ్లిష్ అయిన సెటైర్ ఇది. సొంతూరికి వెళ్లడం వల్ల ఓ రెండ్రోజులు లేటుగా బ్లాగులోకి పట్టుకొస్తున్నా. టైం చేసుకుని చదవగలరు. థాంక్యూ :-) ]


6 comments:

 1. నాగరాజుగారూ,

  ఈ నా ఉ.బో.స మీకు కోపం తెప్పిస్తే క్షంతవ్యుడిని. కేవలం నా చాదస్తం కారణంగా ఈ‌ మాట వ్రాయకుండా ఉండలేని నా బలహీనతకు నా మీద మీరు జాలిపడినా ఇబ్బంది లేదు. విషయంలోనికి వస్తే, ఈ‌ శనీశ్వరుడు అనే పదం మీద కొంచెం వ్రాయవలసి ఉంది.

  ఈ 'శనీశ్వరుడు' అన్న పదం పొరపాటు. మీరే కాదు లోకంలో బహుళప్రజానీకం ఇలాగే వాడుతూ‌ఉంటారు. చివరకు ఈ‌మాట మనకు గుళ్ళల్లోనూ‌ దర్శనం ఇస్తుంది. సగంసగం తెలిసిన జ్యోతిష్యులూ, పురోహితులైతే ఈ పదాన్ని దర్జాగా వాడుతూ ఉంటారు. శని ఒక నవగ్రహాల్లో ఒక గ్రహం మాత్రమే. అంతే కాని ఆయన దేవుడు కాదు. శనిగ్రహాధిపతి శని, సూర్యుడికీ - ఛాయాదేవికీ‌ కొడుకు. ఆయన గొప్ప విష్ణుభక్తుడని చెబుతారు. దేవుడు కాదు కాబట్టీ, ఈశ్వరాంశ కాడు కాబట్టీ మనం శనీశ్వరుడు అనకూడదు.

  సరైన పదం 'శనైశ్చరుడు' ఈ మాటకు అర్థం మెల్లమెల్లగా కదిలే వాడు అని. శని కుంటివాడు. కాబట్టి వేగంగా కదలిపోలేడు. గ్రహాల్లో శనిగ్రహం అతిమెల్లగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఒక్కసారి అలా తిరిగి రావటానికి పట్టే కాలం, భూమిమీద మనకాలమానంలో 29సం॥ 6నెలలు. ఈ‌ శనికి మందుడు అని మరో‌ప్రసిధ్ధమైన పేరు. మందుడు అంటే మెల్లగా మందకొడిగా కదిలే వాడనేదే అర్థం పై వలెనే. తూర్పుగోదావరిజిల్లాలో మందపల్లె అని ప్రఖ్యాతమైన శని ప్రతిష్ఠితమైన శివాలయం ఉంది. ఇక్కడ మందుడంటే శనియే. అక్కడ శనిత్రయోదశి దినాల్లో శివాభిషేకాలు విశేషప్రసిధ్ధి.

  ఈ వ్యాఖ్య అంతా , టపా విషయానికి సంబంధం‌లేదు కాబట్టి, నా అధిక ప్రసంగం అనుకుంటే మన్నించమని ముందే మనవి చేసాను.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారు,
   మీ చక్కని వివరణకు ధన్యవాదాలండీ. శనైశ్చరుడు పదం నేనూ విన్నానండీ. కానీ, ఈ పోస్టుకు ప్రేరణ ఇటీవలి ఓ పాపులర్ ప్రోగ్రామ్ నుండి తీసుకోవడం; పత్రికల్లో ఇటీవలికాలంలో వాడుక భాష పేరిట జనం నోళ్లలో నానుతున్న పదాల వైపే మొగ్గు ఎక్కువగా చూపుతుండడం; ఈ టపా కేవలం వ్యంగ్యం (కాస్త కల్పితం + కొంత అతిశయోక్తి మిశ్రమం)తో కూడుకున్నది కావడం... అనే మూడు కారణాల రీత్యా ప్రచురణలో శనీశ్వరుడే అచ్చులో బయటికొచ్చేశాడండీ. పెద్ద మనసుతో మీరందించిన వివరణకు మరొక్కమారు థ్యాంక్సండీ :-)

   Delete
 2. ఉ.బో.స. అంటే ఏమిటి?

  ReplyDelete
  Replies
  1. ఉచిత -- సలహా అయ్యుండొచ్చని ఓ రాక్షస గెస్సు :-)

   Delete
  2. ఓహోహో, అర్ధమయింది. మధ్యలోని డాష్ తో సహా అర్ధమయింది. Thanks. మీ "రాక్షస గెస్సు" కరక్ట్ గానే తగిలింది.

   Delete
 3. ఉ.బో.స. : ఉచిత బోడి సలహా

  ReplyDelete