Saturday, 28 September 2013

రగిలే నిప్పు కణిక! నిత్య స్ఫూర్తి జ్వాల!!


నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను..!
 
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను...!!

మహాకవి శ్రీశ్రీ ఈ వాక్యాల్ని... దేశ స్వేచ్ఛ కోసం 23 ఏళ్ల చిరుప్రాయంలో ఉరికంబమెక్కి తృణప్రాయంగా ప్రాణాలర్పించిన ‘స్వాతంత్ర్య సమర సేనాని’ భగత్ సింగ్ కోసమే రాశారా అనిపిస్తుంది. భగత్ సింగ్ జన్మించి నేటికి 106 ఏళ్లవుతోంది. భగత్ సింగ్ అమరవీరుడా? కాదా? అన్న విషయం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ఆ యోధుడికి ఒక చిరు నివాళి అర్పించే ప్రయత్నమే ఈ చిన్ని రైటప్. 

భగత్ సింగ్!
అసాధారణ సంకల్పం... 
అంతులేని సాహసం...
అబ్బురపరిచే త్యాగనిరతి...
అనన్యసామాన్యమైన మేధాసంపత్తి...
ఇలాంటి అత్యద్భుత లక్షణాల్ని కలగలిపి పోతపోసి ‘మర ఫిరంగి’లా పేలే మనిషిని తయారుచేయాలనుకుంటే అతడు భగత్ సింగ్ రూపం ధరించి మనకు సాక్షాత్కారమవుతాడు. తెల్లవాడి గుండెల్లో శతఘ్నిలా పేలి... భారతీయుల గుండె చప్పుడుగా అజరామరంగా నిలిచిపోయిన వాడు భగత్ సింగ్! భగత్ సింగ్ పేరు స్మృతిపథంలో కదలగానే అన్యాయం-అధర్మాలపై కదన శంఖారావం పూరించే ఉప్పెనలాంటి ఉద్వేగం గుండెల నిండుగా ఉప్పొంగుతుంది. ఇంతటి అపూర్వ చరిత్ర కలిగిన భగత్ సింగ్ పేరుకు ప్రభుత్వ రికార్డుల్లో అమరవీరుడిగా గుర్తింపు లేకపోవడం నిజంగా విడ్డూరం కలిగించే విషయం. భగత్ సింగ్ అమరత్వం చర్చనీయాంశమై ఇటీవల పత్రికల పతాక శీర్షికలనెక్కింది. భగత్ సింగ్ విషయంలో ప్రభుత్వాల దారుణ, నిర్లక్ష్య పూరిత వైఖరికి జాతి యావత్తూ నివ్వెరపోయింది. 


భగత్ సింగ్ అమరవీరుడు కాదట!

బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి భరతజాతిని విముక్తి చేయడానికి ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ ను అమరవీరునిగా గుర్తించడానికి తమ వద్ద ఎలాంటి రికార్డులూ లేవని ఇటీవల కేంద్ర హోంశాఖ వెల్లడించడం, ఆ మేరకు సమాచార హక్కు కింద దాఖలైన పిటిషన్ కు అధికారులు విడ్డూరమైన వివరణలివ్వడం విని, ఆ తతంగాన్ని మీడియాలో వీక్షించి యావద్భారతం విస్తుపోయింది. రాజ్యసభలో ఈ విషయమై పెద్ద దుమారం రేగినప్పుడు కూడా హోంశాఖ అధికారులు ఎప్పట్లాగే కప్పదాటు వైఖరి అవలంబించారు. ఇక భారత ప్రధాని తీరిగ్గా మౌనవ్రతం వీడి... ‘భగత్ సింగ్ అమరత్వం రికార్డులకు అతీతమైంది’ అని నాలుగు కంటితుడుపు మాటలు మీడియాలో ప్రకటించి చేతులు దులిపేసుకున్నాడు. ఇంతా జరిగాక కూడా భగత్ సింగ్ ను అమరవీరుడిగా ప్రకటించడానికి చర్యలు తీసుకుంటామన్న హామీ అటు ప్రధాని గానీ, ఇటు ప్రభుత్వం కానీ ఇవ్వకపోవడం గర్హనీయం! నిజానికి ఆనాడు 1931 మార్చి 23న, అనుకున్న తేదీకంటే ఒక రోజు ముందుగానే, బ్రిటిష్ ప్రభుత్వం అన్నిరకాల న్యాయ నిబంధనల్ని తుంగలో తొక్కి భగత్ సింగ్ ను ఉరితీసిన రోజున, జాతి మొత్తం నిద్రా హారాల్ని మానుకుని కన్నీటి సంద్రమైంది.  జన జీవితం స్తంబించిపోయింది. అప్పటినుండే భారత ప్రజానీకం భగత్ సింగ్ ను ‘అమరువీరుల్లో శ్రేష్ఠుని’ (షహీద్ ఏ ఆజమ్)గా గౌరవించుకుంటోంది. సామాజికాభ్యుదయాన్ని ప్రతిఫలించే ఆశయ సాధన కోసం ప్రాణాలు వదిలిన గొప్ప వ్యక్తుల్ని అమరవీరులుగా గుర్తించి గౌరవించడం ఏ దేశంలోనైనా పరిపాటిగా జరిగే విషయమే. కానీ అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే మనదేశంలో దేశ స్వేచ్ఛ కోసం చిరునవ్వుతో ప్రాణాల్ని బలిదానం చేసిన భగత్ సింగ్ కు లభించిన ఘన సత్కారం ఇది! 


భగత్ సింగ్ టెర్రరిస్ట్ అట! 

భారతీయుల బానిస సంకెళ్లను బదాబదలు చేసే సదాశయంతో ఉరికంబమెక్కిన స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను టెర్రరిస్టులుగా చిత్రించిన ఘన ఖ్యాతి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే, అపర మేధావి కపిల్ సిబల్ నేతృత్వంలోని హెచ్.ఆర్.డి విభాగం ఐ.సి.ఎస్.సి పదో తరగతి పుస్తకాల్లో భగత్ సింగ్ ను టెర్రరిస్టు అని ముద్రించేశారు. అంతేకాదు, ఐఏఎస్ పరీక్షా పత్రంలో భగత్ సింగ్ నేతృత్వం వహించిన ‘రెవల్యూషనరీ టెర్రరిజం’ గురించి విశ్లేషించండనే ప్రశ్నను ఇవ్వడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిజానికి ఆనాడు సాతంత్ర్యోద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసే దురుద్దేశ్యంతో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా, భగత్ సింగ్ తన సహచరుడు బీకే దత్ తో కలసి 1929 ఏప్రిల్ 8న ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు వేసి స్వచ్ఛందంగా అరెస్టయ్యాడు. ఈ సంఘటనలో ఎవ్వరూ చనిపోలేదు. ఎవ్వరూ గాయపడలేదు కూడా. ఆ బాంబులు మనుషుల్ని చంపడానికి ఉద్దేశించినవి కావని బ్రిటిష్ ఫొరెన్సిక్ విభాగమే ధ్రువీకరించి స్వయంగా నివేదిక సమర్పించింది. భారతీయుల నిరసన వాణిని బ్రహ్మ చెవుడు ఆవహించిన బ్రిటిష్ వాళ్ల కర్ణభేరి బద్ధలయ్యేలా వినిపించేందుకు ప్రజలెవ్వరూ లేనిచోట బాంబులు వేశామని, తమ ఆశయాలను కోర్టు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడానికే స్వచ్ఛందంగా లొంగిపోయామని భగత్ సింగ్ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు, బాంబులు, పిస్తోళ్ల సంస్కృతికి తాను వ్యతిరేకిననీ; ఉన్నత భావాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మాత్రమే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వాలు సాధించగలమని లిఖితపూర్వకంగా భగత్ సింగే ప్రకటించాడు. అలాంటి భగత్ సింగ్... మన కాంగ్రెస్ ప్రభుత్వం పండితులకు, మేధావులకు టెర్రరిస్టుగా కనిపించడం దేశం చేసుకున్న దురదృష్టం అనాలా? లేక జాతికి పట్టిన దౌర్భాగ్యం అనాలా? ఏమనాలి?

 భగత్ సింగ్... ఒక ధ్రువతార!


నిజానికి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో శాంతియుత ధోరణి, సాయుధ ధోరణి అని రెండు ప్రవాహాలు కనిపిస్తాయి. శాంతియుత పంథాకు గాంధీజీ నేతృత్వం వహిస్తే; సాయుధ పోరాటానికి భగత్ సింగ్ నాయకత్వం వహించాడు. ఈ రెండు ప్రవాహాల్లో కొనసాగిన సుదీర్ఘ పోరాటాల అంతిమ ఫలితంగా మాత్రమే మనదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అందుకే ప్రజలు కూడా భారత జాతిపితగా గాంధీజీని ఎంతగా అభిమానిస్తారో; అత్యున్నత అమరవీరునిగా భగత్ సింగ్ ను కూడా అంతేస్థాయిలో ప్రేమిస్తారు. స్వాతంత్ర్య సముపార్జనే లక్ష్యంగా మృత్యువునే పరిహసిస్తూ ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ జాతి జనుల గుండెల్లో సదా అమరవీరునిగా నిలిచిపోతారు. ఆనాడు భగత్ సింగ్ ఎలుగెత్తి నినదించిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే రణన్నినాదం అరాజకీయం, అన్యాయం, అధర్మం రాజ్యమేలినంత కాలం భారతీయుల హృదయ స్పందనగా మార్మోగుతూనే ఉంటుంది.

ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ప్రచురితమైన చిన్న రైటప్!!


Tuesday, 24 September 2013

భలే మంచి రోజు!!

యువనేతకు బెయిల్ మంజూరు!
సోమవారం ఇదే శిఖర వార్త!
కాదు కాదు, అదొక వైరస్ వార్త!
ఈ వార్తా వైరస్ సృష్టించిన కల్లోలం ముందు మొత్తం వైరస్ జాతంతా సిగ్గుతో తలదించుకుంది!
మొదట తెలుగు మీడియా కోడై కూసింది!
ఆపై జాతీయ మీడియా జోరీగై జనం చెవుల్లో చిల్లులు పెట్టింది !!
ఆపై ప్రపంచ మీడియా.. ఎలా స్పందించిందో వీక్షించలేకపోయినందుకు రాత్రంతా నిద్ర పట్టలేదు!!
ఆమధ్య ఉట్టి పుణ్యానికే ప్రపంచాన్ని గగ్గోలు పెట్టించిన ఎయిడ్స్ మహమ్మారికి మందు కనిపెట్టేశానని ఎవడన్నా ప్రకటించినా సరే, ఈ లెవెల్లో మీడియా స్పందిస్తుందో, లేదో? నాకైతే డౌటే! రాష్ట్ర ఆశాజ్యోతి యువనేత విషయంలో మీడియా నిష్పక్షపాత విశృంఖల విలయతాండవ వైఖరి చూసి ముచ్చటేసింది. మీడియా సృష్టించిన 24 గంటల దావానల వైరస్ వార్తా స్రవంతిలో మొదట హైదరాబాదు, పిమ్మట రాష్ట్రమ్మొత్తం, తదుపరి దేశం యావత్తూ  తడిసి ముద్దైపోయి, తరించిపోయింది. పాపం, ప్రజలకే ఈ వార్తను చూసి సంబురాలు జరుపుకోవాలా? లేక ముక్కున వేలేసుకోవాలా? లేక బిక్కమొగమేస్కుని మిన్నకుండిపోవాలా? అసలేం చేయాలో అర్థం కాక సైలెంటుగా ఉండిపోయారు. జనం ఖర్మ కాకపోతే, అదేంటో, మీడియా ఎప్పుడూ ప్రజల భావోద్వేగాలకు పెను సవాళ్లను విసురుతుంటుంది. సర్లే, ఈ బెయిల్ విషయమై కవులు, కళాకారులు, పండితులు, ఆర్థికవేత్తలు, మేధావులు ఎలా స్పందిస్తారో చూసి, ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దామని ప్రజలు డిసైడైపోయి జడత్వంలోకి జారుకున్నారు. ఈలోగా ఏం జరిగిందంటే.... 


‘‘ఇదొక శుభదినం.
రాష్ట్ర చరిత్రలోనే, కాదు కాదు, దేశ చరిత్రలో ఒక పర్వదినం.
మన యువనేత రాజకీయాలకే తలమానికమై నిలిచాడు. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా; అస్సాం నుండి గుజరాత్ దాకా ఎవ్వడూ సాధించలేని ఘనతను మనవాడు సాధించాడు. రికార్డులన్నీ మన యువనేతవే. ఆస్తులు కూడబెట్టడంలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయాడు. కారాగారవాసంలో సైతం కొత్త పోకడలు సృష్టించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా బెయిల్ సాధించాడు. కొమ్ములు తిరిగిన హైకమాండునే ప్రసన్నం చేసుకున్నాడు. ఇంత జరిగినా ఏమాత్రం ఆదరణ తగ్గకుండా మ్యాజిక్ చేస్తున్నాడు. భేష్!  ఇకపై నేతలెవ్వరూ అవినీతికి, అక్రమార్జనకు పాల్పడేందుకు ఏమాత్రం మొహమాట పడక్కర్లేదు. జైళ్లకెళ్లేందుకు అస్సలు సిగ్గు పడక్కర్లేదు. బెయిల్ దక్కదేమో అన్న బెంగను ఇహ తుంగలో తొక్కవచ్చు. ఇకపై అన్నింటికీ, మనందరికీ యువనేతే మార్గదర్శి!! పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం (అ)రాజకీయాల్ని వెలగబెట్టేందుకు. ప్రజాధనం కొల్లగొట్టేందుకు... ’’ అంటూ చెంచల్ గూడ జైలు ముందు ఓ మీటింగు పెట్టేసి మాటల తూటాలతో మైకును విరగ్గొడుతున్నాడు ఓ గల్లీ లెవెల్ లీడర్... మిగతా గల్లీ లెవెల్ అమెచ్యూర్ లీడర్లనుద్దేశించి!

‘‘ఇక ప్రజలంతా నిశ్చింతగా ఉండొచ్చు. గుండె మీద చేయేసుకుని నిద్రపోవచ్చు. జన గర్జనలు అక్కర్లేదు. సాగర ఘోషలు అవసరం లేదు. మిలియన్ మార్చులు చేయాల్సిన పనిలేదు. ఉద్యోగులు ముష్టియుద్ధాలు చేసుకోనక్కర్లేదు. యువకులు ఆత్మహత్యలు పాల్పడనక్కర్లేదు. దుష్టచతుష్టయం హైకమాండు బారిన పడి రాష్ట్రం రెండుగా విడిపోతుందా లేక మూడు ముక్కలైపోతుందా అన్న ఆందోళనలు అసలే అక్కర్లేదు. ఏది ఏమైనా, ఏది ఏమీ కాకపోయినా, తెలుగుజాతిని భుజం తట్టి, వెన్ను చరచి, ఆలింగనం చేసుకుని, ఓదార్చి, సాంత్వన చేకూర్చడానికి యువనేత జైలు గోడల్ని బద్ధలు కొట్టుకుని మళ్లీ మనమధ్యకు వచ్చేశాడు. ఇక భయం ఎంతమాత్రం అవసరం లేదు. వచ్చేశాయ్ వచ్చేశాయ్, జగన్మాథ జగన్నాథ, జగన్ నాథుడి రథ చక్రాల్... ’’ అంటూ తెలుగుజాతి ఆత్మశాంతి సభలో అవిరళంగా ఓదార్పు వచనాలు పలుకుతున్నాడు ఓ ప్రవక్త. 

‘‘ఈ రోజు... భలే మంచిరోజు. యావద్భారతానికి అభయహస్తం లభించిన రోజు. ఇకపై ఉల్లి ధర గురించి లొల్లి చేయాల్సిన పనిలేదు. పాతాళానికి పడిపోయిన రూపాయి బూస్ట్ తాగి రివర్స్ బంగీ జంప్ చేసి ఆకాశానికి ఎగురుతుంది. స్టాక్ మార్కెట్లో ఇక మీదట రోజూ బుల్ రన్ కొనసాగుతుంది. ఐసీయులో స్ట్రెచర్ మీదున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇక నిషేధిత స్టెరాయిడ్స్ తీసుకున్న రన్నర్ లా దూసుకుపోతుంది. వ్యాపారం కోసం, పెట్టుబడుల కోసం ఇకపై అమెరికోడి ముందు బాంచన్ కాల్మొక్త అని వెంపర్లాడిన అవసరం లేదు. జాతి యావత్తూ ఇకపై సుభిక్షంగా ఉంటుంది. యువనేత పునరాగమనంతో గత ఏడాదికాలంగా త్రిశంకుస్వర్గంలో, చీకట్లో మగ్గిపోయిన అపార ధనరాశులు ఇకపై నిప్పులు చిమ్ముకుంటూ బయటకొచ్చి పెట్టుబడులుగా ప్రవహించి అటు వ్యవసాయాన్ని, ఇటు పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించి జాతిని సుభిక్షం చేస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఉందిలే మంచికాలం ముందుముందునా... అందరూ సుఖపడాలి నంద నందనా...  ’’ అంటూ ఢిల్లీలోని వార్ రూమ్ అధిష్ఠాన సమావేశంలో మౌనవ్రతాన్ని వీడిన మన్మోహన్ సింగు మాంచి మెలోడి పాడుకుంటూ మెడిటేషన్ లోకి వెళ్లిపోయాడు. 


మళ్లీ మీడియా విశ్వరూప సందర్శనానికొద్దాం. మర్నాడు రాజధానిలో అంగుళమంగుళం కెమెరాల మోహరింపులు జరిగిపోయాయి. గల్లీగల్లీ చివర ఓ రిపోర్టరు నిరంతర వార్తా స్రవంతిని అందజేస్తున్నాడు. చెంచల్ గూడ దగ్గర మీడియా తొక్కిసలాట... మునుపటి తొక్కిసలాటల రికార్డుల్ని బద్ధలుకొట్టింది. టీవీల్లో స్టూడియాల్లో పండితుల, మేధావుల అపూర్వమైన, అద్భుతమైన చర్చోపచర్చలు నిరంతరాయంగా కొనసా...గుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఇంత జరిగినా, జరుగుతున్నా... యువనేత బెయిల్ విషయమై ఇంకా ఎలాంటి భావోద్వేగంతో స్పందించాలో తెలీక జనం తికమకపడుతూనే, గందరగోళపడుతూనే ఉన్నారు. పాపం... జగన్ కష్టాలు, ఇప్పడు జనానికొచ్చినట్టున్నాయ్! హతవిధీ!!

Tuesday, 17 September 2013

మూషికోపాఖ్యానం!

కాదేదీ కవిత కనర్హం - అన్నది మహాకవి ఉవాచ!
రాజకీయాల్ని చీల్చి చెండాడానిక్కూడా ఈ సూత్రాన్నే అనుసరించవచ్చునేమో!
నీచ, నికృష్ట, భ్రష్ట, తుచ్ఛ (ఎలుక భాష) రాజకీయాలపై సరదాగా ఎక్కుపెట్టిన మూషికాస్త్రమే ఈ రైటప్.
ఇవాళ్టి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ప్రచురితం! ఎప్పట్లాగే శ్రీధర్ కార్టూన్ ఇక్కడ అదనపు హంగు!!!


Thursday, 5 September 2013

ఇవాళ టీచర్స్ డే!


విద్య కన్నా
వినయం గొప్పది!
పుస్తక పాండిత్యం కన్నా
జీవితానుభవ సారం గొప్పది!!
అనే చిన్ని సత్యాన్ని నేర్పిన గురువులందరినీ స్మరించుకుంటూ....
నాకు బాగా నచ్చిన అబ్రహాం లింకన్ లెటర్ ను మరోసారి చదవాలనిపించింది!
గురు పూజోత్సవ శుభాకాంక్షలతో....!!!!

 

Respected Teacher,


My son will have to learn that all men are not just, all men are not true. But teach him also that for every scoundrel there is a hero; that for every selfish politician, there is a dedicated leader. Teach him that for every enemy there is a friend.

I know, it will take time, but teach him, if you can, that a dollar earned is far more valuable than five found. Teach him to learn to lose and also to enjoy winning. Steer him away from envy, if you can. Teach him the secret of quite laughter. Let him learn early that the bullies are the easiest to tick. Teach him, if you can, the wonder of books.. but also give him quiet time to ponder over the eternal mystery of birds in the sky, bees in the sun, and flowers on a green hill –side.

In school, teach him it is far more honourable to fail than to cheat. Teach him to have faith in his own ideas, even if every one tells him they are wrong. Teach him to be gentle with gentle people and tough with the tough. Try to give my son the strength not to follow the crowd when every one is getting on the bandwagon.

Teach him to listen to all men but teach him also to filter all he hears on a screen of truth and take only the good that comes through.Teach him, if you can, how to laugh when he is sad. Teach him there is no shame in tears. Teach him to scoff at cynics and to beware of too much sweetness.

Teach him to sell his brawn and brain to the highest bidders; but never to put a price tag on his heart and soul. Teach him to close his ears to a howling mob… and to stand and fight if he thinks he’s right.Treat him gently; but do not cuddle him because only the test of fire makes fine steel.

Let him have the courage to be impatient, let him have the patience to be brave. Teach him always to have sublime faith in himself because then he will always have sublime faith in mankind.

Abraham Lincoln.