Monday, 13 May 2019

Avengers Reunion


ఒక శిలకు... నాలుగు ఉలి దెబ్బలు పడితే అదో మెట్టు గానో; మైలురాయి గానో తయారై, ఎక్కడో చోట అనామకంగా స్థిరపడిపోతుంది. అదే శిలకు ఓ నాలుగు వేల ఉలి దెబ్బలు పడ్డాయనుకోండి.. అది ఏ గుళ్లోనో దేవుడి విగ్రహంగానో ప్రతిష్ఠితమై పూజలందుకుంటుంది. ఓరుగల్లు రామప్ప లాంటి శిల్పులైతే దేవుడి విగ్రహం దాకా ప్రయత్నించి ఆపేస్తారు. అయితే, కొన్నిసార్లు అదే శిలకు ఓ నాలుగు లక్షల ఉలిదెబ్బలు పడితే.. ఏం జరుగుతుందో చూద్దామనే క్రేజీ ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. అలాంటప్పుడే కొన్ని చిత్రవిచిత్రమైన metomorphosisలు జరుగుతాయి. ఆ శిల కాస్తా ప్రాణం పోసుకుని ఏకంగా జర్నలిస్టుగా తయారై సమాజానికి కంట్లో కునుకు లేకుండా చేస్తుంది. అలాంటి క్రేజీ ప్రయోగంలో భాగంగానే 2002-03లో ఈనాడు జర్నలిజం స్కూల్లో... రాష్ట్రవ్యాప్తంగా రెక్కీ నిర్వహించి ఓ ఎనభై మంది శిలాసదృశ మనుషుల్ని కిడ్నాప్ చేసుకొచ్చి, ఓ ఏడాది పాటు అజ్ఞాతవాస కఠోర శిక్షణలో, శతకోటి శల్యపరీక్షలకు గురిచేసి, రిపోర్టర్లుగా రాటుదేల్చి అందరినీ కట్టగట్టి రమాదేవి పబ్లిక్ స్కూలు ప్రాంగణం నుండి సమాజం మీదకు ఎక్కుపెట్టి వదిలారు. అలా నిప్పులు చిమ్ముకుంటూ ఏ జిల్లాలో ఎగిరిపోయిన ఈ బ్యాచ్ రిపోర్టర్లు తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా శాఖోపశాఖలుగా విస్తరించి వేళ్లూనుకుపోయారంటే, ఇప్పుడున్న ముగ్గురు ముఖ్యమంత్రులను ఇన్ ఫ్లూయెన్స్ చేసేంత. ఆ మూడో ముఖ్యమంత్రెవరు అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం.

********

ఇది జరిగి పదిహేనేళ్లు గడిచింది.
ఈ మధ్యకాలం(2004-2019)లో అసలేం జరిగింది?  
1.      ఓ సునామీ వచ్చింది.
2.      అమెరికా ఎప్పటిలాగే తానే మాన్యుఫాక్చర్ చేసి ప్రపంచం మీదకు వదిలిన టెర్రరిజం బూచి చూపి ఓ నాలుగైదు దేశాలపై దాడులు చేసింది.
3.      ఆ మార్వెల్ స్టూడియో వాడు ఇష్టారాజ్యంగా ఓ ఇరవై సినిమాలు తీసి, ఆపై అన్నింటినీ కలిపి కిచిడీ కింద అవేంజర్స్ పేరుతో గెలాక్సీల మీదకు వదిలి బిలియన్లు సంపాదించాడు.
4.      ఆ నాసా వాళ్లు అచ్చంగా డోనట్ లాంటి బ్లాక్ హోల్ నొకటి కనిపెట్టి ఫొటో తీశారు.
5.      ఈలోపు ఇండియాలో మోడీ పెద్ద నోట్లు రద్దు చేసి బ్లాక్ మనీని భూస్థాపితం చేసి, టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేసి, అఖండ భారత జాతికి అచ్చేదిన్ తీసుకొచ్చాడు.
6.      స్పీల్ బర్గ్ సైతం సూసైడ్ చేసుకునే రేంజిలో... ఐపీఎల్ మ్యాచులకు నరాలు తెగే ఉత్కంఠతో క్లయిమాక్స్ ఇవ్వగల అద్భుత ఫిక్సింగ్ దర్శకత్వ ప్రతిభను మనవాళ్లు సంపాదించారు. జయహో అంబానీ! జియో నీతా అంబానీ!!
(అసలూ... ఈ లింకుల్లేని ముఖ్యాంశాలు మాకెందుకంటారా?
అక్కడికే వస్తున్నా. ఉపోద్ఘాతంలోనే చెప్పాగా. జనాల గుండెల్లో బుల్లెట్ రైళ్లు పరిగెత్తించడానికే మీడియా మనుషులు అవతరించారని. ఎక్కడినుండి ఎక్కడికైనా, దేన్నైనా ముడిపెట్టి మసిపూసి మారేడుకాయ చేయగల సమర్థులు... రిపోర్టర్లు! నాదీ రిపోర్టర్ డీఎన్ఏ నే కాబట్టి, నేనూ అదే బాపతే)
పైన చెప్పుకున్న ప్రధాన ఘటనలతో పాటే,
7.      నిన్న ఆదివారం నాడు ఈనాడు జర్నలిజం (2002-03) బ్యాచ్ ‘గెట్ టుగెదర్’ జరిగింది.
(ఏమయ్యా, బ్యాచ్ మీట్ జరిగిందని ఒక్క ముక్క చెబితే పోయేదానికి, అంత ఉపోద్ఘాత రాద్ధాంతం అవసరమా, అంటారా? మళ్లీ అదే ప్రశ్న. ప్రశ్నలు వేస్తే గీస్తే పవన్ కళ్యాణ్ వేయాలి, లేదంటే మీడియా వాళ్లే వేయాలి. మిగతా అందరూ మీడియా చెప్పిందే వినాలి, బ్లైండుగా ఫాలో అవ్వాలి. ఐనా, సామాజికోద్ధరణ కోసం ఎక్కడెక్కడి గ్రహాంతరాళాలకో విసిరివేయబడ్డ మా బ్యాచ్ రిపోర్టర్లు... ఆ Thanos గాడి లాంటి దుష్ట విధి నిర్వహణను, సంసార బంధనాలను తెంచుకుని ఒక్కచోట చేరాలంటే అదేమైనా ఆషామాషీ వ్యవహారమా ఏంటి? పైగా ఈ బ్యాచ్ రిపోర్టర్లు మామూలు వాళ్లా ఏంటి? ఒక్కరోజు వీళ్లు లేకపోతే ఓ మూడు ప్రధాన పేపర్లు, ముప్ఫై టీవీ ఛానెళ్లు వార్తల్లేక కకావికలమైపోయే పరిస్థితి. అంతటి వెయిటేజీ ఉన్న మీడియా మనుషులాయే. ఐనా సరే, అవెంజర్స్ లా ఎక్కడికెక్కడి నుండో  ఎగిరొచ్చి ఒక్కచోట రీయూనియన్ అయ్యారంటే, అది ఎంతమాత్రమూ మామూలు విషయమైతే కాదు. అందుకే ఈ దశాబ్దంన్నర కాలంలో జరిగిన ప్రధాన ఘటనల్లో మా జర్నలిస్టు బ్యాచ్ రీయూనియన్ ని కూడా ఓ ప్రధాన ఘటనగా చేర్చేశా.)

*********

ఇంతకూ,
ఈ అవేంజర్స్ రీ యూనియన్ మూవీ ఎక్కడ రిలీజైందట?
– హైదరాబాద్, బేగంపేట్ ది ప్లాజాలో.  
(అంత వెయిటేజీ ఉన్నవాళ్లు, ది ప్లాజా పక్కనే ఉన్న సీఎం క్యాంప్ ఆఫీసులో మీట్ పెట్టుకోకపోయారా అనే కదా మీ ప్రశ్న. మొదలైతే అదే అనుకున్నాం. అక్కడ పొలిటికల్ లీడర్ల తాకిడెక్కువ, ప్రశాంతంగా మాట్లాడుకోవడానిక్కూడా వీలుపడదని పక్కనే ప్లాజాలో పెట్టుకున్నాం. నమ్మాలి మరి.)
మరి, నిర్మాణ సారధ్యం ఎవరో?
– ఏముంది, ఇప్పుడంతా cloud funding trend నడుస్తోందిగా, అదే ఫాలో అయ్యాం.
దర్శకత్వ బాధత్యలెవరివో? – సినిమా పెద్దది, భారీ తారగణం కాబట్టి, మూడు యూనిట్లు పెట్టి, ఒక్కో యూనిట్ కి ఒక్కో దర్శకుడు డైరెక్షన్ చేశాడు. నైజాం యూనిట్- మల్లారెడ్డి; ఆంధ్ర యూనిట్ – వేణుగోపాల్ రెడ్డి; సీడెడ్ యూనిట్ – సతీష్.
ఇంతకీ రిజల్టేంటో?
– ఏముంది. ఊహించిందే. బొమ్మ బంపర్ హిట్టు. మూడు గంటలపాటు హిలేరియస్ కామెడీ. ఈ ప్రివ్యూ మూవీ మీట్ ను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రతి ఒక్కరికీ కమ్-సే-కమ్ మూడు నాలుగేళ్ల ఆయుష్షైనా పెరుగుంటుందన్నది ఈటీవీ సుఖీభవ డాక్టర్ల స్టడీ.
ఫైనల్ మెసేజ్ ఏంటి?
-      ఏముంది, అల్టిమేట్ గా నాగరాజ్ (నాకే) కి పెళ్లి చేయాలని తీర్మానించారు.
అదేంటి? ఎందుకలా?
-      పెళ్లైన వాడు సుఖపడినట్టు; బ్యాచిలర్ ని వాడి మానాన వాణ్ని బతకనిచ్చినట్టు చరిత్రలో లేదు, కాబట్టి.
ఇంతకూ ఏమంటావు?
ఏమంటా.. మా బ్యాచు మీటు నా సావుకొచ్చిందీ అంట. అంతే.
చివరగా, సమ్మెట నాగమల్లేశ్వరరావు సారుకి నమోనమ:

*********

ఉపసంహారం:
ఈ సరదా పోస్టులోని...
మితిమీరిన అతిశయోక్తి ప్రతిహతమగుగాక!
శృతిమించిన ఉపోద్ఘాతాలు ఉపశమించుగాక!!

Friday, 10 June 2016

చెదరని జ్ఞాపకం!!

ఈ నెల తెలుగు వెలుగు మ్యాగజైన్లో ప్రచురితమైన ‘నాన్న’ తాలూకు చెదరని జ్ఞాపకాల సవ్వడి...!