Thursday, 14 August 2014

గాడ్ మదర్ !!

[మొన్నామధ్య నట్వర్ సింగ్ పుస్తకంపై మండి పడుతూ నా పుస్తకం నేనే రాసి పారేస్తానని సోనియాగాంధీ ప్రకటించిన నేపథ్యంలో... అసలొస్తుందో రాని మేడమ్ ఆటోబయోగ్రఫీ పుస్తకం ఆధారంగా ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించి ఈనాడు ఎడిట్ పేజీ కోసం రాసిన రైటప్ ఇది, అక్కడ కాలం చెల్లడంతో ఇక్కడికి పట్టుకొచ్చా]

చిత్రం: గాడ్ మదర్
బ్యానర్: ఓన్లీ 44 రీల్స్
నిర్మాణం: కుంభకోణం క్రియేషన్స్
దర్శకత్వం: మేడమ్

కథాకమామిషు:
ఇటాలియన్ మాఫియా తీరుతెన్నుల్ని కళ్లకు కట్టిన హాలీవుడ్ అజరామర చిత్రరాజం ‘గాడ్ ఫాదర్’ని, భారతీయ మహిళ అసాధారణ పోరాటాన్ని ప్రతిఫలించిన బాలీవుడ్ ఆణిముత్యం ‘మదర్ ఇండియా’ని కలిపి మిక్సీలో వేసి గిర్రున గిలక్కొట్టి, కిలోల్లెక్కన భావోద్వేగాల మసాలాల్ని దట్టించిన ఫక్తు క్లాసికల్ మాస్ చిత్రమే... గాడ్ మదర్! ఇదొక భారీ సస్పెన్సు థ్రిల్లర్. చిత్ర కథానాయిక ఇటలీలో పుట్టి ఇండియాలో మాఫియా డాన్ గా ఎలా ఎదిగారన్నదే టూకీగా చిత్ర కథ.

ఛమక్కులు:
పదే పదే అదేపనిగా అవాక్కవడానికి సిద్ధంగా ఉండండిక! ఈ చిత్రానికి కథ, కథనం, కథానాయిక, మాటలు, పాటలు, సంగీతం, నృత్యం, దర్శకత్వం... అన్నీ ఒక్కరే. ఆ ఒక్కరే మేడమ్! దర్శకురాలి నిజ జీవిత చరిత్రే ఈ చిత్ర కథకు ఆధారం. ఇంకో విశేషం ఏమంటే, ఆమె తన అంతర్వాణి అనునిత్యం అప్పుడప్పడు ఉలిక్కిపడుతూ ముక్కుతూ మూలుగుతూ వినిపించే ఆత్మకథను ఒకవైపు సొంతంగా గ్రంథస్తం చేస్తూనే, మరొకవైపు దానిని ఒక అత్యద్భుత కళాఖండంగా సెల్యులాయిడుపై చిత్రిస్తారు. అటు పుస్తకాన్ని, ఇటు సినిమాని, రెండింటినీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని భాషల్లో ఒకే రోజున విడుదల చేస్తారు. చిత్ర విషయానికొస్తే ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. మేడమ్ మనసులో చిత్ర రూపకల్పనకు సంబంధించిన ఆలోచన మొగ్గ తొడుగుతోందన్న సమాచారాన్ని కాకితో కబురందుకున్న 2జి స్పెక్ట్రమ్ క్రియేటివ్స్, బోఫోర్స్ ఏజెన్సీ పిక్చర్స్, కోల్ గేట్ కమర్షియల్స్, ఆదర్శ్ హౌజింగ్ కార్పొరేషన్ లాంటి దిగ్గజ నిర్మాణ సంస్థలు చిత్ర నిర్మాణ హక్కుల్ని చేజిక్కించుకోవడానికి బరిలోకి లంఘించి సర్వశక్తులొడ్డి మరీ పోటీపడ్డాయి. అందరూ భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెప్పడంతో మేడమ్ చేసేదేమీ లేక కలగూరగంప లాంటి మల్టీ కంపెనీ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. చిత్ర ఓవర్సీసు హక్కుల్ని మాత్రం మేడమ్ తన వద్దే అట్టిపెట్టుకున్నారట. పదేళ్లుగా పరిశ్రమలో దడ పుట్టిస్తున్న క్రేజీ కుర్ర హీరో, సొట్టబుగ్గ అముల్ బాబు ఇందులో ఎవ్వరూ ఊహించని, ఎవ్వరికీ అర్థం కాని ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారట. అలనాటి మూకీ చిత్రాల మేరునగధీరుడు సైలెంట్ సింగ్ ఈ చిత్రంలో ఓ విశిష్ట పంజాబీ గీతంలో ఆడి, పాడి హుషారెక్కిస్తారట. సినిమా ప్రచార బాధ్యతల్ని జూనియర్ మేడమ్ పర్యవేక్షిస్తారు. ఈ సినిమా పైరసీని అడ్డుకోవడానికి కండలవీరుడు, పహిల్వాన్ అల్లుడు వాద్రాను పూర్తిస్థాయిలో వాడుకోనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని పాడుబడిన, బూజు పట్టిన 10 జనపథ్ బంగ్లాలో మేడమ్ ఒంటరిగా బాసింపట్టు వేసుక్కూచుని కసిగా కథను సిద్ధం చేస్తున్నారట. దోపిడీలు, కుట్రలు, కుయుక్తుల సన్నివేశాల్ని ఒళ్లు గగుర్పొడిచే రీతిలోనూ; పోలీసుల్ని, కోర్టుల్ని, గూఢచార వ్యవస్థల్ని వెర్రి వెంగళప్పల్ని చేసి ఆడించే చిత్రవిచిత్ర విన్యాసాల్ని కళ్లు జిగేల్మనిపించే రీతిలో ఉండేలా స్క్రిప్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మేడమ్. ఇకపోతే, కొంతకాలంగా పనీ పాడు లేకుండా ఉట్టినే తిని తొంగుంటున్న దుష్ట చతుష్టయం డిగ్గీబాయ్, ఆయారాం రమేషు, కపిల్ త్రోబాల్, సుశీల్ ముండేలు అందుమైన లోకేషన్ల వేటలో దేశవిదేశాలు పట్టుకు ఊరేగుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ సినిమాతో హిట్ కొట్టి పాలిటిక్సులో మట్టికొట్టకుపోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని మేడమ్ నిద్రాహారాలు మాని మరీ గాఠిగా కృషి చేస్తున్నారట.

కిసుక్కులు:
గాడ్ ఫాదర్ లో ఫాదర్ని లేపేసి, మదర్ ఇండియాలో ఇండియాను కప్పెట్టేసి... అడ్డదిడ్డంగా గాడ్ మదర్ అని ఓ దిక్కుమాలిన పేరు పెట్టినంత మాత్రాన అదొక సినిమా అవుద్దా అని అప్పుడే పుకార్లు షికార్లు చేయడం మొదలెట్టాయి. అసలు ఆ కథే ఓ పాత చింతకాయ్, కథనమొక పనికిమాలిన కాకరకాయ్, చివరకు ఆ చిత్రం అవుతుంది ఆటలో అరటికాయ్... అని పరిశ్రమంతా పేరడీలు కట్టి మరీ మూకుమ్మడిగా మెలోడీలు పాడేసుకుంటున్నారు. ఇహ, శని శీతకన్ను వేసి, కుజుడు క్రీగంట చూస్తుండడంతో ఆ సినీ దర్శకురాలికి మరో పదేళ్ల దాకా దగ్దయోగం తప్పదని జ్యోతిశ్శాస్త్ర పండితులు గ్రహగతుల్ని లెక్కగట్టి, కుండబద్ధలు కొట్టి మరీ సవాళ్లు విసరుతున్నారు. దానికితోడు లక్ష శని గ్రహాల పెట్టు అముల్ బాబును సినిమాలో పెట్టుకోవడం అంటే కోరి సర్వనాశనం కొని తెచ్చుకున్నట్టేనని ఛలోక్తులు విసురుతున్నారు. మొత్తంగా ఆ చిత్ర యూనిటే ఒక దిక్కుమాలిన సంత, ఒక తొట్టి గ్యాంగు అని జనాలు కామిడీ చేస్తున్నారు. ఇక శ్యాం జెఠ్మలానీ, ఛత్వార్ సింగ్ లాంటి కురువృద్ధ సినీ విమర్శకులు ఛాన్సు దొరికినప్పుడల్లా చిత్ర కథను, దర్శకురాల్ని చిత్రవధ చేసేందుకు కత్తులు, కటార్లూ సిద్ధం చేసుకుంటున్నారు. అసలా సినిమాకు ఆధారం ఆత్మకథా కాదు, ఆవకాయ పచ్చడీ కాదు, అక్కడాఇక్కడా, ఎక్కడపడితే అక్కడ, ఎవరెవరి కథల్నో కొంచెకొంచెంగా పీక్కొచ్చి అతుకుల బొంతలాంటి ఓ కథను అందంగా అల్లుతున్నారని గాసిప్స్ వైరస్సులా వ్యాపిస్తున్నాయి.

కొసమెరుపు:
బాక్సాఫీసు వద్ద ఈ సినిమా గనక హిట్టు కొడితే, దీనికి సీక్వెలుగా అముల్ బాబుని పెట్టి అరివీర భయంకర రేంజిలో ‘ది వండర్ కిడ్’ అనే సినిమా తీయాలనే ఆలోచన దర్శకురాలికి ఉందట. ఒకవేళ సినిమా గనక ఫట్టంటే తట్టాబుట్టా, మూటాముల్లె సర్దుకుని ఇండియా వదిలి, ఇటలీకెళ్లి పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసుకుంటూ శేషజీవితం గడుపేద్దామనే బృహత్తర రోడ్డుమ్యాపు కూడా మేడమ్ రచించుకున్నారని ఓ భోగట్టా!!


Photo Courtesy: Google

Tuesday, 12 August 2014

సత్యం వధ, ధర్మం చెర!

Disclaimer: డిస్క్లెయిమర్ మాత్రమే చదివి, కింద రైటప్ ని చదవనివారు నేరుగా నరకానికి పోయే ప్రమాదముందని శాస్త్రాలు గొంతు చించుకుని మరీ హెచ్చరిస్తున్నాయ్. ముందే ఆలోచించుకోండి మరి. తర్వాత మీ ఇష్టం. మళ్లీ ముందే చెప్పలేదనేరు :-)

స్కూలు రోజుల నాటి సంగతి. పొలాల గట్లెమ్మట రాలుగాయిలా గాలి తిరుగుళ్లు తిరుగుతూ, రాళ్లిసిరి చింతకాయలు కొట్టుకుతింటూ చిన్నబడిని (ప్రైమరీ) దిగ్విజయంగా పూర్తి చేసుకుని, పెద్దమనిషినై (నో ఈకల్ పీకుడ్స్ ప్లీజ్) పెద్ద బడిలోకి (హైస్కూలు) అరంగేట్రం చేసిన తొలినాళ్ల సంగతిది! ఆ కాలంలో మా స్కూల్లో శ్రీమాన్ రంగస్వామి అని సోషల్ స్టడీస్ మహాశయుల వారుండేవారు. పాఠాలు తక్కువ చెప్పాలి, పిల్లల్ని గొడ్డులా చితకబాధాలి అనేది మా సారువారి బీభత్స పాలసీ. అప్పటికీ మా ఊళ్లో శారీరక వ్యాయామం అనే కాన్సెప్టు ఇంకా ఉనికిలోకి రాకపోవడం చేత... మేం పిల్లకాయలం అందరం మా శక్తి మేర ఆయన చేతుల్లో ఒళ్లు హూనం చేసుకుంటూ... ఆయన క్లాసును ఓ హనుమాన్ వ్యాయామశాలగా, ఆ తన్నుల్ని మాంఛి ఫిజికల్ ఎక్సర్ సైజ్ గా భావిస్తూ, బతుకులు భారంగా వెళ్లదీస్తున్న రోజులవి. 

ఆ గడ్డు రోజుల్లో ఒకానొక దుర్దినాన, రంగస్వామి మహాశయుల వారు క్లాసులోకి రావటం రావటమే... ఈ రోజు ఎవడెవడు స్నానం చేయలేదో లేచి నిలబడండర్రా బడవాఖానాస్ అని ఓ ఆదేశం జారీ చేసి కుర్చీలో కూలబడ్డారు. ఇతగాడు ఇవాళ పాఠం చెప్పడానికి బదులు, తరగతి గదిలో పదో నెంబరు ప్రమాద సూచిక ఎగరేశాడ్రోయ్ అనే సంకేతం ప్రతోడికీ ఇట్టే తేలిగ్గానే కనెక్ట్ అయిపోయింది. ఇహ క్లాసులో కలకలం, కలవరం మొదలైంది. పిల్లకాయలందరూ ఒక్కోడూ పులిపంజా దెబ్బ రుచి చూడ్డానికి సిద్ధపడ్డ మేక పిల్లల్లా అటూ ఇటూ అలజడిగా కదలడం మొదలెట్టారు. మా ఊళ్లో పిల్లకాయల స్నానం కాన్సెప్టు ఏంటంటే... మధ్యాహ్నం యేట్లోకెళ్లి (తుంగభద్రలోకి) విపరీతంగా, విశృంఖలంగా దూకి దూకి, మునిగి మునిగి రెండు కళ్లల్లో చింతనిప్పుల్ని పోసుకుని మాపటేళకి ఇంటికి చేరడమన్నమాట. ఇది కేవలం సెలవల్లో మాత్రమే సాధ్యమయ్యే బృహత్ కార్యం. అందుకే స్కూలు దినాల్లో యెవ్వడూ స్నానం చేయడు. అసలలాంటి రక్త చరిత్ర ఎవ్వరింటా, మా ఊరా అసలే లేదు. ఆ మాటకొస్తే ఇంటి స్నానమే వేస్ట్ అనీ, అదొక పనికిమాలిన పని అనేది మా ఊరి పిల్లకాయల గాఠి నమ్మకం మరియు అద్భుత థియరీ రెండూనూ. 

నిజానికి మాలో ఎవ్వడూ స్నానం చేయలేదని మాకూ తెలుసు, రంగస్వాముల వారికీ తెలుసు. కానీ ఎవ్వడూ నిలబడి చావడే. ముందెవ్వడు లేస్తాడా, వాడి వెనక గొర్రెమందలాగా అందరం కట్టకట్టుకుని లేద్దామా అని ఎవ్వడికి వాడు పక్కోళ్లని దొంగ చూపులు చూస్తా కూచుని, మేష్టారు చండశాసనుణ్ని ఓర కంట గమనిస్తున్నారు. ‘‘ఒరేయ్ దున్నపోతుల్లారా... మీలో ఎవడెవడు స్నానం చేయలేదో నాకు తెలుసురా, వాడి మొహాన్ని చూసి ఇట్టే చెప్పేయగలన్నేను, మర్యాదగా లేచారో సరేసరి, లేకపోతే వీపు విమానం మోతే’’ అని గద్దించాడాయన. ఐనా ఎవ్వడూ లేచిచావడే. అవతల మేష్టారు వారి బీపీ సర్రున నషాళానికి ఎగబాకుతోంది. క్లాసంతా చావు నిశ్శబ్దం అలముకుంది. పిల్లల మొహాల్లో ప్రేత కళ కథాకళి నాట్యం చేస్తోంది. తుఫాను ముందర ప్రశాంతత అనే మాట అప్పటిదాకా వింటమే, ఆ రోజున అందరికీ ఇట్టే అర్థమైపోయింది. నాకేమో గుండె దడ పెరిగిన వేగం స్పష్టంగా వినిపిస్తోంది. ఛస్, ఈ టార్చర్ ని తట్టుకోవడం నావల్ల కాదురా బాబో అనుకుని, తంతే తన్నాడులే భరిద్దాం అని మొట్టమొదట బకరాగా నేను మెల్లగా లేచి నిలబడ్డాను. ఎలాగూ నా తర్వాత ఈ సంత మూక అందరూ లేస్తారులే అన్నది నా దిక్కుమలిన కాన్ఫిడెన్సు. లేచి నిల్చుని నేనందరి వేపు అదే పనిగా పిచ్చి చూపులు చూస్తున్నా, తొందరగా లేచి చావండ్రా యెధవల్లారా అని. నన్ను మాత్రం ఎవ్వడూ చూడట్లేదు. చిత్రం! ఆశ్చర్యం! ఇలాంటి అద్భుతాలు అరుదుగా సంభవిస్తాయి. అప్పుడే చూడాలి వాటిని కళ్లు విప్పార్చుకుని, నోరు వెళ్లబెట్టుకుని. రెండు నిమిషాలు గడిచినా ఒక్క సన్నాసీ కూడా లేవలేదే. ఓరి దొంగసచ్చినోళ్లారా, ఎంత పని చేశార్రా! ఖర్మరా ఖర్మ! పెద్ద పుడింగిలా అనవసరంగా లేచానని, నన్ను నేనే తిట్టుకుంటూ, దరిద్రం నెత్తినెక్కి డిస్కో డ్యాన్స్ చేయడమంటే ఇదే కాబోలని తన్నులు తింటానికి మెంటల్ గా ప్రిపేరవుతున్నానిక.

సరిగ్గా ఆ క్షణాన ‘‘ఒరేయ్ నాగరాజు ఇట్రారా’’ అని పిలిచి బ్లాక్ బోర్డు పక్కన నిలబెట్టారాయన నన్ను. నేను ఉరిశిక్షకు సిద్దపడి బోనులో నిల్చున్న ముద్దాయిలా... ఈయన గారు ఎంతసేపు తన్నొచ్చు.. అనే లెక్కలు వేసుకుంటున్నా. మళ్లీ చిత్రం! అద్భుతం!! రంగస్వాముల వారు బెత్తం చేతుల్లోకి తీసుకోకుండా, స్పీచు పీకడం మొదలెట్టారిలా... ‘‘వీడురా నిజమైన స్టూడెంటంటే!! తప్పు చేయడం తప్పు కాదురా, తప్పును ఒప్పుకున్నోడే గొప్పోడ్రా (నా అంతర్యాణి... మీ  డైలాగు సంతకెళ్లా. స్నానం చేయకపోవడం తప్పా? తోటకూర కట్టేం కాదు. అసలా పదమే మా డిక్షనరీల్లో లేదు కదా బాబయ్యా)!! నిజాయితీ ఉండాల్రా. ఏది చేసినా నిజాయితీగా ఒప్పుకోవాల్రా. నిజాయితీ లేనోడు, నిజం చెప్పనోడు జీవితంలో బాగు పడడ్రా...’’ ఇలా అది ఇదీ అని ఓ రెండు నిమిషాలు ఒహటే పొగుడుతున్నారాయన నన్ను. ఈ లెవెల్లో నన్ను పరాయి మనిషి పని గట్టుకుని పొగట్టం జీవితంలో అదే ఫస్ట్ టైమ్. అసంకల్పిత ప్రతీకార చర్యలా నా కళ్లల్లో కొళాయి ఆన్ అయిపోయి నీళ్లు జలజలా కట్టలు తెంచుకుంటున్నాయి. ఒకరు పొగిడితే కూడా ఏడుపొచ్చేస్తాదని తొలిసారి అనుభవమైంది. ఓయీ మహానుభావా.... ఏంటయ్యా ఈ చిత్రవధ! నన్ను పట్టుకుని నాలుగు చితకబాదినా నేనింతటి బాధకు గురయ్యేవాణ్ని కాదు కదయ్యా. ఇక ఆపేయండి మహానుభావా.. ఇంతలేసి పొగడ్తల్ని తట్టుకోవడం నా చిట్టి ప్రాణం వల్ల కావట్లేదని మనసులో మూగగా రోధిస్తున్నా. అయ్యవారు నా వైపు చూసి, ‘‘పోయి నువ్వు కూచోరా’’ అని, ‘‘ఒరేయ్ దున్నపోతుల్లారా అందరూ లేచి నిలబడండిరా’’ అని ఒక్కోణ్నీ ఈతబెత్తంతో ఇరగదీసి వదిలిపెట్టాడు. అందరూ గావుకేకలు పెడుతున్నారు. తన్నులకు నేనొక్కణ్నే మినహాయింపు. నలుగురితో నారాయణ అన్నది నా కాన్సెప్టు. ఆ కాన్సెప్టు కకావికలం కావడంతో నాకేమో మళ్లీ ఏడుపు. నేను నిజం చెప్పినందుకు, నాకొక్కడికే తన్నులు తప్పినందుకు... క్లాసు క్లాసంతా ఓ వారం రోజులుపాటు నన్ను పురుగుని చూసినట్టు చూసి.. వెలి వేశారు. నిజం చెప్పడం, నిజాయితీగా ఉండడం కూడా తప్పేనా అని నా పసి మనసు విలవిల్లాడిపోయింది. సత్యం వధ అంటే ఇది కాదా అధ్యక్షా??!!


ఇది టెంథ్ క్లాసు సంగతి. తొమ్మిదో క్లాసు దాకా బ్యాక్ వర్డ్ క్యాస్ట్ లాగా బ్యాక్ బెంచిల్లో కూచుని అల్లరి చిల్లర పనులు చేసుకుంటూ, అడపాదడపా ఓ మోస్తరుగా చదువుతూ స్వర్ణయుగం నడిపించాం. కాస్తో కూస్తో చదవడం కూడా పెద్ద పాపమైనట్టు... ఆ పిల్ల బ్యాచినంతా బియ్యంలో రాళ్లలా ఏరి, కట్టగట్టి ఓ క్లాసుగా విడదీసి కో-ఎడ్ రిజర్వేషన్ వసతి కల్పించి మరీ ఓ క్లాసొకటి ఏర్పాటు చేసి చచ్చారు. ఈ క్లాసులో మన పర్ ఫార్మెన్సు లాస్టు నుండి ఫస్టులో ఉండేది. ఏ సారువాడు ఏ క్వశ్చను వేసినా గడస్తంభంలా లేచి నిల్చుని అందరి చేతుల్లో ముక్కు చెంపలు (అనగా ఓ చేత ముక్కు పట్టుకుని అటేపు చెంపని, ఇటేపు చెంపని ఎర్రగా కందిపోయేటట్టు కసి దీరా ఇంకో చేయితో చాచి కొట్టడమన్నమాట) తింటూ ముక్కుతూ మూలుగుతూ స్టడీస్ నడిపిస్తున్న ముదనష్టపు రోజులవి. ఆ క్లాసులో పద్మనాభాచారీ అనే హెడ్మాస్టర్ మాకు ఫిజిక్సు చెబుతుండేవారు. ఆతడు ఆరున్నరడుగుల ఆజానుబాహుడు. ఖంగుమనే కంచు కంఠం. తెల్లని లాల్చీ, ఖద్దరు ధోతి కట్టుకుని, ముఖాన నిలువు నామం ఒకటి పెట్టుకుని... చూస్తేనే వంగి దణ్ణం పెట్టాలనిపించేలా ఉండేవారాయన. పిల్లల్ని ఎక్కువగా తన్నడు కానీ, తన్నడం మొదలెడితే డజన్ రంగస్వాములు కూడా ఇతని ముందు బలాదూరే. ఈ బాపనయ్య ఫిజిక్సును అద్భుతంగా చెబుతాడు. పద్మనాభం వారికున్న ఒకే ఒక మహా చెడ్డగుణం ఏమంటే... ఏదో ఒక దుర్మూహార్తాన పాత పాఠాల క్వశ్చన్సును చెప్పాపెట్టకుండా అడిగేసి, ఆ రోజు ఆ క్లాసునంతా దండోపాయానికి కేటాయిస్తారన్నమాట.

ఓ దరిద్రపుగొట్టు దినాన... ఒరేయ్ Force ని ఏ యూనిట్లలో కొలుస్తారో చెప్పండ్రా అని అనూహ్యమైన క్వశ్చన్ వేశాడు. ఒక్కొక్కణ్ని అడుగుతుంటే, బిక్క మొహాలేసుకుని అందరూ లేచి నిశ్శబ్ద నిశ్చల సమాధి స్థితి ఆసనంలో నిలబడుతున్నారు. ఇట్టా కాదు గానీ, ఆన్సర్ తెలీనోళ్లంతా లేచి నిల్చోండ్రారేయ్ అని కేకేశాడు. బిరబిరమని ఆడ, మగ పిల్లకాయలందరూ ఠంచనుగా లేచి నిల్చున్నారు. ఆడపిల్లల్లో ఒకమ్మాయి (క్లాస్ ఫస్ట్ కేండిడేట్), మగ పిల్లకాయల్లో నేను (క్లాస్ లాస్ట్ కేండిడేట్) మాత్రమే కూచున్నాం. నాకు ఫిజిక్సులో గుర్తున్న ఒకే ఒక్క ఆన్సర్ అది. అది కరెక్టే అయ్యుంటుందిలే అన్న ధైర్యం ఒకపక్క, ఒకవేళ తప్పు అయితే నా వీపును తలుచుకుని ముంచుకొస్తున్న భయం మరోపక్క... రెండూ ఒకేసారి మైండులో జుగల్బందీ చేస్తున్న విచిత్రమైన మానసిక స్థితి నాది అప్పుడు. మేష్టారు వారు నన్ను అత్యంత ఆశ్చర్యంగా, వింతగా, విడ్డూరంగా చూసేడు... వీడు క్వశ్చన్ సరిగా వినిపించక కూచున్నాడా అని. ఉరేయ్ నువ్వు చెప్పురా నాగరాజు అనేశాడు. పెదాల తడి ఆరిపోతుండగా, గుండె గడబిడగా కొట్టకుంటుండగా జై హనుమాన్ అని మనసులో తలచుకుని... ‘‘డైన్స్’’ సర్ అని తడబడుతూ చెప్పేసి బిత్తర చూపులు చూట్టం మొదలెట్టాను.  అద్భుతం మళ్లీ రిపీటైంది! ఆయన కరెక్ట్ అనేసి, అందరికీ చెంపలు వాయించరా అని ఆర్డరేశాడు. ఇహ చూస్కో... కోతికి ఫస్ట్ టైం కొబ్బరిచిప్ప దొరికినట్టు... చేతులు నొప్పెడుతున్నా పట్టించుకోకుండా మొగపిల్లకాయల్ని ముక్కు పట్టుకుని లాగి లాగి వాయించి వదిలిపెట్టి, బుద్ధిమతుడిలా వచ్చి కూచోబోతున్నాను. ఆడపిల్లల్ని ఎవడు కొడతార్రా భడవా, నీ అయ్య వస్తాడా, పోయి కొట్టూ అనరిచాడు. నేనేమో బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నా కొట్టకుండా. ఇక్కడో బుల్లి బీభత్సమైన ఫ్లాష్ బ్యాక్ చెప్పాల. మా అవ్వ చిన్నతనంలో తన ఆకురాయి రోట్లో రుబ్బి సొంతంగా మాన్యుఫాక్చర్ చేసిన ఏవేవో కథలు చెపుతూ, కొన్ని నీతి వాక్యాల్ని కలగలిపి చెబుతుండేది. ఆడపిల్లల్ని కొట్టినా, తిట్టినా వాడు నరకానికి పోతాడు అని. ఆ నరకంలో ఉండే శిక్షల్ని కళ్లకు కట్టినట్టు చెబుతా ఉండేది. అది మన మైండులో ప్రింట్ పడిపోయింది. అందుకే ఎంత కోపమొచ్చినా ఆడపిల్లల్ని తిట్టడం, కొట్టడం అనే గొప్ప పనుల్ని డిక్షనరీలోంచి తొలగించాల్సి వచ్చింది. అదీ సంగతి. ఇప్పుడెలా??? వీళ్లను ముక్కుచెంపలు కొట్టి, ఉట్టి పుణ్యానికే నరకానికెళ్లడం నాకు సుతారమూ ఇష్టం లేదు. అలాగని ఆ ధర్మసూక్షాన్ని బయటపెడితే వీడో తింగరోడని అందరూ పగలబడి నవ్విపోతారు. మన పరువు గంగపాలైపోద్ది. ఆ టైంలో నా పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యిలా తయారైంది. ఏదయితే అదైంది, నరకానికి మాత్రం సచ్చినా పోకూడదనే నిశ్చయించుకున్నా. దీంతో హెడ్మాస్టర్ల వారి ఈగో విపరీతంగా హర్ట్ అయింది, ఫలితంగా నా వీపంతా విధ్వంసానికి గురైంది. వాడకుండా పారేసిన ఓ కరెంటు తీగ పక్కనే దొరకడంతో నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేశాడాయన కోపంలో. ఆయన చేతులు పడిపోనూ... కాళ్లకు బోధకాలు రానూ... అని మా అవ్వ ఓ నెలరోజుల పాటు ఆయనపై విపరీతమైన శాపనార్థాలు పెట్టేసింది. ఆయన చేతులు నిజంగానే పడిపోతాయేమోనని, బోధకాలు వస్తాయేమోనిని నేను ఓ రెండునెలల పాటు ఓపిగ్గా వేచిచూశా. ప్చ్... విధి బలీయమైంది. దేవుడు దయలేని వాడని అర్థమైంది. ధర్మానికి కాలం లేదు అని ఆనాడు మరోసారి రుజువైంది.

ఇప్పుడు చెప్పండి. సత్యానికి వధ, ధర్మానికి చెర అంటే ఇది కాదా యువరానర్! ఏమాటకామాటే చెప్పుకోవాలి... ఈ రెండు ఘటనలు స్కూల్లో మేష్టార్లందరికీ, పిల్లకాయలందరికీ తెలిసిపోయాయి. ఎప్పుడు ఎక్కడ కనబడ్డా ఈ రంగస్వాముల వారు, ఆ పద్మనాభం వారు... నన్ను ఆప్యాయంగా చూసి భుజం చరుస్తుంటే, పిల్లకాయలేమో నన్ను... ఈడు నా ఫ్రెండే అన్నట్టుగా చూస్తుంటే... అబ్బో అందులో ఉండే కిక్కే వేరబ్బా. ఈ రెండు సంఘటనలు నా హృదయంపై ఏదో తెలీని ముద్ర వేశాయనే విషయం తర్వాత అర్థమైంది. అన్నట్టు... నాటి నుండి నేటిదాకా ధర్మ సంరక్షణార్థం నేను సత్యవాదిగానే నిజాయితీగా బతుకుతున్నాననే గొప్ప విషయాన్ని మీరందరూ నమ్మాలి. నమ్మి తీరాలంతే. అదే ఫైనల్. కంప్యూటర్ గారూ దాన్నే ఫిక్స్ చేసేయండీ :))))
చివరి తోక: చిన్ననాటి ఈ స్వీట్ మెమొరీస్ అదే పనిగా గుర్తొస్తుంటే ఏ పనీ లేకపోవడంతో ఇవాళ పని గట్టుకుని మరీ రాసిపడేశా, పడుంటాయని!!