Friday, 5 December 2014

నా INTERSTELLAR యాత్ర!!


Statutory Warning: కాస్తో కూస్తో గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నోళ్లే ఈ పోస్టును చదవగలరు. లేదంటే బీభత్సమైన black hole లాంటి confusionలో పడి కొట్టకుపోయి.. మానసికంగా ఏదైనా జరిగితే... అందుకు బాధ్యత నాది ఎంతమాత్రమూ కాదని సవినయంగా తెలియజేసుకుంటున్నాను ;)

సండే అనేది అత్యంత దరిద్రపుగొట్టు దినం. దరిద్రం కాకపోతే... తిట్టుతో పోస్టు మొదలెట్టాల్సి వస్తోంది మరి! బహుశా... నాలాగే, ఆ ఆర్కే నారాయణ్ మహాశయుడికి కూడా సండే అంటే ఎలర్జీ, ఎసిడిటీ, కడుపు మంట వగైరా వగైరా అనుకుంటా. అందుకే Next Sunday అనే స్టోరీ రాసి.. సండేని చెవులు మూసి చితకబాదాడు. విషయం ఏమంటే... ఎప్పట్లానే వచ్చే ఆదివారం Hercules లాగా కనీసం ఓ లక్ష పనుల్ని ఒంటి చేత్తో చకాచకా ఫినిష్ చేసి అవతలకి విసిరేద్దామనుకుంటామా! అందుకోసమని డావిన్సీ లెవెల్లో స్కెచ్చులేస్తామా! మెక్షగుండం లెవిల్లో ప్లాన్లు గీస్తామా! ఐన్ స్టీన్ లెవిల్లో ఫలితాల్ని ఊహించేసుకుంటామా! తీరా ఏమవుద్ది? ఎన్నాళ్లో వేచిన సండే... క్యాట్ వాక్ చేసుకుంటూ రానే వస్తుంది. అలా మనం నోరెళ్లబెట్టి చూస్తా ఉండగానే ఏ ఒక్ఖ పనీ కంప్లీట్ అవకుండానే అది కాస్తా గుడ్ బై చెప్పేసి గూడ్స్ బండెక్కి వెళ్లిపోద్ది. దీంతో మనం చేయాల్సిన పనులు ఓ జీవితకాలం లేటు అని తేలిపోద్ది. ఇంకే ముంది... జన్మమెత్తితిరా..., అనుభవించితిరా..., సండే సమరంలో ఓడిపోయితిరా... అని ఓ ప్యాథటిక్ పాటేసుకుని, మళ్లీ వచ్చే ఆదివారం కోసం వెయిటింగ్. ఈ రకంగా కంప్లీట్ చేయాల్సిన పనుల చిట్టా (To Do List) భారత న్యాయస్థానాల్లోని పెండింగ్ కేసుల్లా కొండల్లా పేరుకుపోతుంటాయి. ఇదొక అంతులేని విషాధ గాథ. ఇక్కడికి సండే తిట్టు పురాణం పరిసమాప్తి.

ఇంతకూ ఆ ఊకదంపుడెందుకో చెప్పలేదు కదూ. ఐతే వినుడి. ఆ క్రిస్టఫర్ నోలాన్ ‘‘ఇంటర్ స్టెల్లార్’’ మూవీని ఓ సండేపూట తనివితీరా వీక్షించాలన్నది ఓ మాస్టర్ ప్లాన్. అఫ్ కోర్స్, పనీ పాడూ లేని ప్రతోడూ ప్లాన్లు వేయగలడు. కానీ, వేసిన ప్లాన్ మీద వర్కవుట్ చేసి రిజల్ట్ రాబట్టినోడే గొప్పోడు (ఏయ్, నువ్వూ ఏసేశావ్, అంటారా! శ్రీను వైట్ల పంచ్ ఎఫెక్ట్ ఇంకా పనిచేస్తోందనుకుంటా, నామీద). నేనూ.. గొప్పోడికి ఏమాత్రమూ తీసిపోనన్నది నాకున్న సవాలక్ష పీలింగ్సులో ఓ ప్రధాన ఫీలింగు (అసలిలాంటి ఫీలింగ్సు లేనోడు ఎప్పటికీ గొప్పోడు కాలేడని ఇంకో ఫీలింగు కూడా ఉంది, అయ్యన్నీ పబ్లిగ్గా చెప్పకూడదు కాబట్టి, ఇలా కుండలీకరణాల్లో సీక్రెట్ గా చెబ్తున్నా). ఆ ఫీలింగును రియాల్టీ షో కింద మారుద్దామని అంతర్జాలంలోకి అరంగేట్రం చేశా. ఇవాళ్రేపు పొలిటీషియన్లు ‘పవరు’ని నమ్ముకున్నట్టు; తింగరి మనుషులు ప్రతీదానికీ ‘ఇంటర్నెట్టు’ను నమ్ముకుంటున్నారాయే. ఇంటర్నెట్టు అన్నది మనుషుల బలమో, బలహీనతో అర్థం కావట్లా. ఏమైతేనేం, నెట్టును నమ్ముకున్న పాపానికి నాలుగు సండేలు... టికెట్లు దొరక్కుండానే ఉఫ్ మని ఎగిరిపోయాయి. ఇలాంటి ఒకటి అరా వైఫల్యాలు చూపించి ‘‘నేను గొప్పోణ్ని కాదు’’ అని విమర్శకులు ఈకలు పీకే అవకాశం లేకపోలేదు. అందుకే ఒకసారి చరిత్రను తిరగేయండని చెప్పదలుచుకున్నా. ఓ అబ్రహాం లింకనూ, ఓ థామస్ అల్వా ఎడిసనూ... ఓ నాగరాజ్ అను నేనూ ఒకటే కేటగిరీ అన్నమాట. ‘‘వరుస వైఫల్యాల తర్వాత వరించే విజయం కిక్కే వేరబ్బా’’ అని మనం సామెతల్ని మార్చుకోవాల. మొత్తానికి లాస్ట్ సండే ప్రసాద్స్ ఐమాక్స్ వాడికి ఓ వెయ్యి రూపాయలు స్వాహా అని సమర్పించుకుని ఇంటర్ స్టెల్లార్ మూవీ చూసి తరించామన్నమాట. ఇహ, అసలు కథ, అదే సినిమా కథలోకి వద్దాం. దానికంటే ముందు ఓ disclaimer అవసరమనుకుంటా.

Disclaimer: వెనకటికెవరో... ‘‘ఈ భూపెపంచకంలో ‘థియరీ ఆఫ్ రిలేటివిటీ’ని కరెక్టుగా అర్థం చేసుకున్నది ఇద్దరే వ్యక్తులు’’ అన్నాట్ట. ఎవరయ్యా అంటే... ‘‘ఒకటి ఐన్ స్టీనూ, రెండు నేనూ’’ అన్నాట్ట ఆ ఘనుడు. అదో పాత కాలం నాటి జోక్. లైట్ తీస్కోండి. ఇహ, ఈ ఇంటర్ స్టెల్లార్ సినిమా కాన్సెప్టుపై కనీసం ఆ డైరెక్టరు కన్నా కంప్లీటు ఐడియా ఉందో, లేదో. ఏమో డౌటే. ఎందుకంటే ఇది బిలియన్ల సంవత్సరాల తర్వాత సంభవించబోయే బీభత్సమైన ఇమేజినరీ కాన్సెప్టు. అందుకే డైరెక్టరుకి కూడా పూర్తిగా అవగాహన ఉండాలని ఆశించడం భావ్యం కాదేమో. సో, ఈ పరిస్థితుల్లో నాకు సినిమా అర్థమైందని చెప్తే, హాస్యాస్పదంగా ఉంటుంది. అందుకే అలా చెప్పబోవడం లేదు. రివ్యూలు గివ్యూలు కాకుండా ఏదో నా అనుభూతి, అదే అదే ఫీలింగు... రాద్దామని ప్రయత్నిస్తా. అదైనా ఎంతవరకు సరిగ్గా రాయగలనో, చదివినోళ్లకి అదెంత వరకు అర్థమవుతుందో ఆ భగవంతుడికే ఎరుక. ‘‘సైంటిఫిక్ సినిమా గురించి రాస్తూ.. భగవంతుడి మీద భారమేస్తున్నావ్ చూడూ... నువ్వు శానా గొప్పోడివి సామీ’’ అంటారా! ‘‘ఒహ్హో... మరైతే... శ్రీహరికోటలో రాకెట్టు వదులుతూ, అది సక్సెస్ కావాలని తిరప్తిలో హోమాలు జరిపించే సైంటిస్టుల్నేమంటారు..’’ అని నేనూ అడగగలను. అదంతా ఎడతెగని రాద్ధాంతం... వదిలేద్దాం డూడ్స్!! మనకిప్పుడు ఇంటర్ స్టెల్లార్ మూవీ ముఖ్యం. ఇక అంతరిక్షంలోకి వెళదామా... అదే సినిమా కథలోకి...

సాధారణంగా మనం పీకల మీదకొచ్చేదాకా ఏ పనీ మొదలెట్టం కదా. అదంతే, ఇండియన్ సైకీ. మూవీ షో టైమ్ లేట్ నైట్ 10:45కి. ఓ పావుగంట ముందు బైకులో ట్రిపుల్ రైడింగులో ఊరేగి, సెల్ ఫోన్ మెసేజ్ వాడి మొహాన కొట్టి, టికెట్లు తీసుకుని హడావుడిగా ఎంటరయ్యాం. అదేంటో, అందరూ ఓ గోనెసంచెడు కార్న్ ఫ్లేక్సూ, బకెట్టుడు కోకూ పట్టుకుని ఐమ్యాక్సులోకి ఎంటరవుతున్నారు. అదేమన్నా రూలా అని పక్కనోళ్లని అడిగాం. అబ్బే అదేం లేదండీ అన్నారెవరో. మనమూ కొందామా అన్నాడొక ఫ్రెండు. ఇంకో వెయ్యి వదిలించుకుంటావా అన్నాడింకో ఫ్రెండు. ఇహ మాటల్లేవ్. కట్ చేస్తే... బిగ్ స్క్రీన్ ముందర ప్రత్యక్షమయ్యాం. వాడేదో... EXPERIENCE IMAX FEEL ...అని ఓ నాల్గు తింగరి యాడ్స్ వేసి చెవుల్లో సీసం, కళ్లల్లో కాపర్ పోసి వాయించాడు. మా బెర్తులు ఓ సైడుగా కన్మర్మ్ అవడంతో దృశ్యాలన్నీ వంకర టింకరగా కనిపిస్తున్నాయి. ఆ మాటే అడిగాడు వెనక సీటోడు పక్కోణ్ని. దీన్నే ఐమ్యాక్స్ ఎఫెక్ట్ అంటార్రా అని పంచ్ ఇచ్చాడు పక్క సీటోడు. సరే, సోది ఆపేసి, సినిమా కథలోకి వెళ్దాం. (ఈపాటికే మీకు చాలా కోపం వచ్చేసింటాది. ఇలాంటప్పుడే మనుషుల్లో ‘సహనం’ అనే అద్భుత ఎమోషన్ ఒకటుంటుందని గుర్తించాలి, ఆయ్)


కథ.. క్లుప్తంగా చెప్పాలంటే, కొన్ని మిలియన్ల లేదా బిలియన్ల సంవత్సరాల తర్వాత భూగోళం పరిస్థితి ఎలా ఉంటుందంటే... విపరీతమైన డస్ట్ తుఫాన్లతో, అనూహ్యమైన పర్యావరణ మార్పులతో... పంటలు సరిగా పండకా, కరవులు, కాటకాలతో మొత్తంగా మానవాళికి అత్యంత గడ్డు స్థితి కొనసాగుతుంటుంది. ఈ భూమ్మీద మానవాళి మనుగడకు ఇక అతి త్వరలో కాలం చెల్లబోతోంది అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఈ స్థితిలో మానవ చరిత్రలో ఫస్ట్ టైమ్... మన సౌర కుటుంబాన్ని దాటి... ఆవలి గెలాక్సీలో ఏవన్నా... ప్రాణి మనుగడకు అవకాశముందా అనే ప్రాబబిలిటీని పరీక్షించేందుకు NASA నడుం బిగిస్తుంది. స్పేస్ లోని ఓ ఏలియన్ ఇంటెలిజెన్స్ (?) సంకేతాల ద్వారా సౌరకుటుంబానికి అవతల ఒక బ్లాక్ హోల్ (కృష్ణబిలం) చుట్టుపక్కల మూడు ప్లానెట్స్.. ప్రాణి మనుగడకు అనుకూలంగా ఉన్నాయనే విషయం తెలుస్తుంది.

సో, నాసా ఏం ప్లాన్ చేస్తుందంటే... రెండు ప్లాన్స్ ప్రిపేర్ చేస్తుంది. ప్లాన్-A ఏమంటే... ఆ మూడు ప్లానెట్సులో ఏది మానవ మనుగడకు అనుకూలంగా ఉందో కనుక్కుని, దాంతోపాటే అక్కడి బ్లాక్ హోల్ కు సంబంధించిన డేటా కూడా కనుక్కుని ఎర్త్ కు వివరాలు అందజేస్తే, తద్వారా గ్రావిటేషన్ ప్రాబ్లమ్ పై వర్కవుట్ చేసి... భూమ్మీది మానవాళిని అక్కడికి మూకుమ్మడిగా షిఫ్ట్ చేయడం. ఇక ప్లాన్-B ఏమంటే, ఈ భూగోళం, ఇక్కడి మానవాళిని అలా వదిలేసి..., ఆ మూడింటిలో అనుకూలంగా ఉన్న ఏదో ఒక ప్లానెట్ పై ఇక్కడి నుండి తీసుకెళ్లిన ఫ్రోజెన్ హ్యూమన్ ఎంబ్రియోస్ (పిండ దశలో ఉన్న మానవ శిశువులు) తో కొత్త కాలనీని ఏర్పాటు చేసి నూతన మానవ వికాసానికి తెర తీయడం. ప్లాన్-A దాదాపు అసాధ్యం, కేవలం ప్లాన్-B మాత్రమే వర్కవుట్ అయ్యే ఆశలున్నాయన్నది... NASA టాప్ సైంటిస్ట్ నమ్మిక. 


ఇహ... ఈ కాన్సెప్టుతో నలుగురు వ్యోమగాములతో కూడిన Endurance అనే అంతరిక్ష యాత్ర మొదలవుతుంది. వీరు warm hole గుండా గెలాక్సీలోకి వెళతారు. అక్కడి నుండి ముందే అనుకున్నట్టుగా, మొదటి ప్లానెటుకు వెళతారు. అక్కడి రాక్షస అలల తాకిడికి ఓ సైంటిస్టు మృతి చెందడం, అనంతరం ఆ ప్లానెట్ ప్రాణి మనుగడకు అనుకూలమైనది కాదని నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఈ ప్లానెట్... బ్లాక్ హోల్ కు అతి సమీపంలో ఉండడం; ఫలితంగా ఏర్పడిన గ్రావిటేషనల్ టైమ్ డయలేషన్ కారణంగా... ఆ ప్లానెట్ పై 1hr = భూమ్మీద 7 years అన్నమాట. ఒక గంటలో ప్లానెట్ ను సందర్శించి తిరిగి వద్దామని వెళితే, అక్కడి అలల ప్రమాదం కారణంగా జర్నీ టైం మూడు గంటలకు మించడంతో.. భూమ్మీది లెక్కల ప్రకారం 23 ఏళ్లు గడిచిపోతాయి. ఇదంతా జరిగే సరికి.. భూమ్మీద... హీరో కూతురు పెరిగి పెద్దయిపోయి నాసా సైంటిస్టుగా పనిచేస్తూ ఉంటుంది. 


అనంతరం రెండో ప్లానెట్ మీదకు సందర్శన. అది విపరీతమైన మంచుతో కప్పబడి ఉంటుంది. అది కూడా దాదాపు ప్రాణి మనుగడుకు అనుకూలం కానిదే. ఎప్పుడో పంపిన ఓ వ్యోమగామి (మ్యాట్ డామన్) ఆ ప్లానెట్ మీద ఇంకా బతికే ఉంటాడు. అక్కడ హీరోకు, మ్యాట్ డామన్ కు... నాసా ప్లాన్స్ విషయమై గొడవలై ఫైట్ చేసుకుంటారు(అంతరిక్షంలో కూడా కొట్టుకోవడం మనకే చెల్లింది). ఆ గొడవలో మ్యాట్ డామన్... హీరో ఆక్సిజెన్ సప్లయిని తొలగించి... హీరో స్పేస్ షటిల్ ను వేసుకుని... Endurance కి వెళతాడు. ప్రమాదంలో పడిన హీరోని హీరోయిన్ కాపాడి... తిరిగి స్పేస్ స్టేషనుకి వచ్చేప్పటికీ, మ్యాట్ డామన్ అక్కడ ఇంకో సైంటిస్టుని చంపేసి, Endurance లో మూడో ప్లానెట్ పైకి వెళ్లాలని ప్రయత్నించే క్రమంలో ప్రమాదానికి గురై చనిపోతాడు. ఈ ప్రమాదంలో ఇంధనం, ఆక్సిజెన్ కొంత పేలిపోయి కొరత ఏర్పడుతుంది. మిగిలిన ఫ్యూయల్, ఆక్సిజెనుతో కేవలం ఒక ప్లానెటును మాత్రమే సందర్శించగలిగే స్థితి ఏర్పడుతుంది. (పూర్తి ప్లాన్ ఏంటంటే.. మూడు ప్లానెట్సును సందర్శించి, బ్లాక్ హాల్ డేటా కూడా కలెక్ట్ చేయడం).


ఇక, దీంతో హీరో స్లింగ్ షాట్ సూత్రం ప్రకారం.. హీరోయిన్ తో కూడిన ఎండ్యూరెన్సును మూడో ప్లానెట్ మీదకు వెళ్లేలా చేసి, తను మాత్రం బ్లాక్ హోల్ లో పడిపోతాడు. అక్కడ ఫిఫ్త్ డైమెన్షన్లో తేలి... అక్కడినుండి తను ప్రసారం చేసిన వివరాల ద్వారా.... నాసాలో ఉన్న హీరో కూతురు... గ్రావిటేషన్ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేస్తుంది. దీంతో మానవాళిని మూడో ప్లానెట్ మీదకు షిఫ్ట్ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఐతే, ఆ ఫిఫ్త్ డైమెన్షన్ తాలూకు ఘనతను... హీరో... ఏలియెన్సును అంటగడతాడు. కట్ చేస్తే... మొత్తానికి కొన్ని ఏళ్ల తర్వాత... హీరో నాసా స్పేస్ స్టేషన్లో కనిపిస్తాడు. అప్పటికి హీరోతో పాటు మానవాళి అంతా శని (సాటర్న్) గ్రహం మీద బ్రేక్ జర్నీలో ఉంటారు. వాళ్లంతా మూడో ప్లానెట్ పైకి వెళ్లడానికి ప్రయాణమై వచ్చారన్నమాట. మళ్లీ కట్ చేస్తే... ఆ మూడో ప్లానెట్ మీద హీరోయిన్ అప్పటికే కొత్త మానవులతో కాలనీని ఏర్పాటు చేసుంటుంది. ఇక్కడ శుభం కార్డు పడుతుంది. హమ్మయ్యా.... తికమకగా, గజిబిజిగా, గందరగోళంతా స్టోరీ చెప్పగలిగా... (సెభాష్... సొంతంగా భుజం తట్టుకుంటున్నా). అదండీ సంగతి. 

నేనేదో చెప్పడానికి ప్రయత్నించాననీ... ఫలితంగా మీకేదో అర్థమయ్యుంటుందనీ.. నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ మన బుర్రలకి అంత ఈజీగా ఆనవు. చిన్నతనంలో పిల్లకాయలు నింగిలో ఎగిరే విమానాన్ని చూసి... ఓ మూరెడో, లేదంటే బారెడో, లేదంటే ఇంకాస్త పొడుగో ఉంటుందనుకోవడం కద్దు. అది జస్ట్ దూరం నుండి చూసి ఏర్పరుచుకునే perception. కానీ, విమానాన్ని దగ్గరి నుండి చూసి, అందులో ప్రయాణించి, అది ఏ సూత్రంలో పనిచేస్తుందో తెలుసుకుంటే ఏర్పడే కంప్లీట్ conception వేరు. అందుకు టైం పడుతుంది కదా. ఈ అనంతమైన అంతరిక్షం (Infinite Space) విషయంలో మానవాళి కాన్సెప్ట్ ఇంకా పర్ సెప్షన్ స్థాయిలోనే ఉందని చెప్పక తప్పదేమో. కొంత కాలం గడిస్తే... అంతరిక్షం గురించి మరిన్ని కాన్సెప్ట్స్ స్పష్టంగా తెలుస్తాయేమో. వేచి చూద్దాం.

ఇక ఈ సినిమాలో 1. Warm hole, 2. Black hole, 3. Theory of Relativity, 4. Fifth Dimension, 5. Aliens .... అనే ఐదు రకాల కాన్సెప్ట్స్ వినిపించి, కనిపిస్తాయి. 


Black hole కాన్సెప్ట్ తెలిసిందే. నక్షత్రాలు (Stars) లైట్ ఎనర్జీని కంటిన్యూయస్ గా రిలీజ్ చేస్తూ... ఒకానొక నిర్ధిష్ట స్థాయికి దాని రేడియస్ (చంద్రశేఖర్ లిమిట్ అంటార్ట, మన ఇండియన్ సైంటిస్ట్) కుంచించుకుపోతే... ఇక ఆ star లోని మాస్ అంతా ఒక పాయింటు దగ్గరికి కొలాప్స్ అయిపోయి బ్రహ్మాండమైన డెన్సిటీ కల్గిన బ్లాక్ హోల్ గా తయారవుతుంది. ఈ బ్లాక్ హోల్ పరిధిలోకి ఏది వెళ్లినా అది అందులోకి పడిపోతుంది. బ్లాక్ హోల్ ఇలా అన్నింటినీ ఆకర్షించి ఆకర్షించీ మళ్లీ తిరిగి తన రేడియస్ ను పెంచుకుంటే అది white dwarf గా మారి, మళ్లీ నక్షత్రాలుగా ఆవిర్భవిస్తుందని ఓ ప్రామినెంట్ థియరీ. ఐతే, ఈ warm hole కాన్సెప్ట్ మాత్రం... నిర్ధిష్టంగా కనిపించదు. ఐన్ స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం.. స్పేస్ అనేది curve షేప్ లో ఉంటుందనీ, ఆ curve చివర్లు ఒకచోట కలుస్తాయని (సింగులారిటీ కాన్సెప్ట్) చెప్పడం ఫిజిక్సులో చెబుతుంటారు. దీన్ని పట్టుకునే... ‘‘బిగ్ బ్యాంగ్’’ (Big Bang) థియరీ ఒకటి ఉనికిలోకి వచ్చింది. విశ్వం (పదార్థమంతా Matter) అంతా ఒక పాయింట్ నుండి explode అయి... విస్తరిస్తూ ఉందనీ, అది మళ్లీ ఒక పాయింట్ లోకి shrink అవుతుందని ఆ థియరీ. మేజర్ సైంటిఫిక్ కమ్యూనిటీ మాత్రం.. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది సైంటిఫిక్ కాదని కొట్టిపారేస్తుంటారు. 


ఇహ ఫిఫ్త్ డైమెన్షన్ కాన్సెప్ట్! ఇప్పటిదాకా హైట్, విడ్త్, లెంగ్త్, టైమ్... ఈ నాలుగూ ప్రూవ్డ్ డైమెన్షన్స్ కనిపిస్తాయి. మనిషి కన్సెప్షన్ మేరకు... ఏ ఫినామినానైనా ఈ నాలుగు డైమెన్షన్స్ తో మెజర్ చేయొచ్చు అన్నది నిరూపిత అంశం. కొత్తగా సినిమాలో ప్రపోజ్ చేసిన ఫిఫ్త్ డైమెన్షన్ కాన్సెప్టుతో దేనిని మెజర్ చేస్తారన్నది అనూహ్యం. నిజానికి మ్యాథ్స్ లో n డైమెన్షన్స్ కాన్సెప్ట్ ఉపయోగిస్తుంటారు. మ్యాథ్స్ లో abstractness ఎక్కువ కాబట్టి దానిని జెనరలైజ్ చేయలేమన్నది ఇంకో థియరీ. ఇక... థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఐన్ స్టీనుకు ముందు... మాస్(M), లెంగ్త్(L), టైమ్(T), యాంగిల్(ɵ) అనేవి ఫండమెంటల్ యూనిట్స్. అవి ఎక్కడైనా ఏ మార్పు లేకుండా స్థిరంగా ఉంటాయని నమ్మేవాళ్లు. ఐతే, ఐన్ స్టీన్ మాత్రం... ఏ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్సులో చూస్తున్నామనే దానిపై ఆధారపడి... అవి కూడా మార్పుకు లోనవుతాయని అన్నట్టు మనం నేర్చుకున్న విషయం. ప్రతీదీ సాపేక్షకంగా, అదే సమయంలో నిర్దిష్టంగా ఉంటుందన్నది ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కాన్సెప్ట్.

ఇహ...Aliens. ఇప్పటిదాకా ఐతే... ఏలియెన్స్ అనేవి ఉన్నట్టు ఎక్కడా కాంక్రిట్ ప్రూఫ్ లభించలేదంటారు. Matter... పదార్థం తాలూకు బిలియన్ల సంవత్సరాల పరిణామ క్రమంలో... థింకింగ్ బ్రెయిన్ ఫ్యాకల్టీ కల్గిన మనిషి మాత్రమే అత్యున్నత జీవిగా ఆవిర్భవించాడన్నది అందరూ విశ్వసిస్తున్న విషయం.

అదండీ సంగతి. మొత్తానికి సగం సైన్సూ, సగం ఫిక్షన్ కలిపి తీసిన ఇంటర్ స్టెల్లార్ మూవీ కచ్చితంగా చూడదగ్గ చిత్రమే. ఇన్ని హయ్యర్ కాన్సెప్ట్సును తలకెత్తుకుని... దానిని ఓ కుటుంబం మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ ఆధారంగా చక్కగా అల్లడం, అద్భుత రసంతో దృశ్యాల్ని చిత్రించడం... నిజంగా వండర్ ఫుల్. అంతే. మరో మాట లేదు.

ఇక, ఇదంతా రాసేసరికి నా దుంప తెగింది. ఏదో చిన్న పోస్టు అవుతుందనుకుంటే... ఇది చైనా వాల్ అంత పొడుగై కూచుంది. కావున పెజలారా... భూదేవికున్నంత ఓర్పుతో, సహనంతో ఈ పోస్టును చదవాల్సి ఉంటదేమో. అలాగే ఈ లెవిల్లో రాసినందుకు నన్ను క్షమించాల్సి కూడా ఉంటుందేమో. స్వస్తి ;)))