Friday, 4 September 2015

సంసారమా? సన్యాసమా??

‘ఏవండీఈఈఈఈఈఈఈ.....’

‘యురేకాఆఆఆఆఆఆఆ..... అని అలనాడెప్పుడో ఆర్కెమిడీస్ మహాశయుడు గొంతు చించుకున్నట్టు; హేవిటే... ఆ అరవ సాగతీత సీరియల్ గావుకేకలు. ఇది కులీనుల కొంపనుకున్నావా? కాకినాడ రైల్వే స్టేషననుకున్నావా? నీ దుంపతెగనని! అసలే నా హార్టు వీకూ. నీ అరుపుల దెబ్బకు ఏదో ఒకరోజు తత్కాల్ టికెట్ బుక్ చేసుకుని కైలాసానికి టపా కట్టేస్తానేమోనని రోజూ జడుసుకు ఛస్తున్నాననుకో. ’

‘ఇది కొంపో, కర్మాగారమో తర్వాత తీరిగ్గా కూర్చుని కూలంకషంగా చర్చిద్దాంలే గానీ... ఏంటిది? ఆహా... అసలేంటిది? ఇది పెసరట్టా? లేక శేషాచలం కొండలపై మంటల్లో చిక్కి మాడి మసైపోయిన ఎర్రచందనం బొగ్గా? అసలేం జరుగుతోందీ వంటింట్లో??? నాకు తెలియాలి! ఇప్పుడే తెలిసి తీరాలి, హ్హా!! అయినా, వంట చేసేటప్పుడు ఆ దరిద్రపుగొట్టు వాట్సాపు గ్రూపుల్లో పడి బలాదూరుగా ఊరేగొద్దని ఎన్నిసార్లు చెప్పాలండీ మీకు??’

‘ఏడిశావులేవోయ్! వసపిట్టలా నువ్వూ, నీ అతి వాగుడూనూ. చెట్టంత పతిదేవుణ్ని పట్టుకుని భయం భక్తీ, మర్యాదా మప్పితం లేకుండా ఏంటా నిలదీయడం? మడిషన్నాక చిన్నాచితకా పొరపాట్లు; మొగుడున్నాక అన్నంకూరా మాడగొట్టడాలు సహజాతిసహజమని గీతలో కృష్ణపరమాత్మ అరిచి గీ పెట్టాడా లేదా? చూడు శ్రీమతీ... ఏడాదికొకసారైనా వేద పారాయణం చేస్తూ ఉండవోయ్. కాస్త పారమార్థిక జ్ఞానం బుర్రలోకి దూరి నీ మతి భేషుగ్గా ఉంటుంది. ఎంతకాలమిలా మాడిన దోశలు, ఎండిన పెసరట్లు అనబడు తుచ్ఛ ఐహిక విషయాల్ని సిల్లీగా పట్టుకు వేలాడుతూ బీపీలు గట్రా పెంచుకుని ఆరోగ్యం చెడగొట్టుకుంటావ్?? అన్నట్టు నీకో విషయం తెలుసా?! తాను దోచిందే డబ్బు, చేసిందే ఓదార్పు అన్నట్టు ఇంతకాలం కాలరెగరేసుకు కన్నూ మిన్నూ కానక తిరిగిన మన యువనేత అంతటివాడే స్వయంగా... ‘నేనేమైనా మారాలా’ అని పార్టీ నేతల చొక్కాలు పట్టుకుని, బుగ్గ బుగ్గా రాసుకుని మరీ భోరున విలపించి మొసలి కన్నీరు కార్చి ఆత్మపరిశీలన చేసుకున్నాడు. ఆయన్ను చూసైనా నువ్వు మారవా? ఆత్మ పరిశీలన చేసుకోవా?’

‘అఘోరించారులే! మీరూ, మీ మోకాలికీ-బట్టతలకీ ముడిపెట్టే తింగరి సూత్రీకరణలు. ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ అక్కణ్నుంచి తరలించకముందే మిమ్మల్ని ఓసారి తీసుకెళ్లి మీ మోకాలికి కాస్త బలమైన పరీక్షలు గట్రా చేయించాలి సుమీ. రాన్రాను తలాతోకా లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అయినా మిమ్మల్నని ఏం లాభంలే. తప్పంతా నాదే. ఓట్లకు నోట్లు గుమ్మరిస్తూ అడ్డంగా దొరికిపోయిన బుర్ర తక్కువ నాయకుల్లాగా... లక్షలకు లక్షలు డబ్బు పోసి మిమ్మల్ని వేళం పాటలో కొనుక్కునేటప్పుడే కాస్త జాగ్రత్త పడాల్సింది. వంటా-వార్పూ, శుచీ-శుభ్రత, చదువూ-సంధ్యా, సంసారం-సట్టుబండలూ చక్కగా వచ్చో లేదో ఒకటికి లక్ష సార్లు శూలశోధన చేయించి మరీ ఆ మూడు ముళ్లకు పచ్చజెండా ఊపాల్సింది. మా అమ్మనాన్నలకు బుద్ధి లేదసలు. పిల్లాడు ఎర్రగా బుర్రగా మహేష్ బాబులా ఉన్నాడు. అన్నింటికీ ఆధార్ లింకు చేయించాడు అని ఎగిరి గంతేసి, పప్పులో  కాలేసి,  పొలోమని నిన్ను బరబరా లాక్కొచ్చి నా గొంతులో గుదిబండలా వేలాడేశారు. భగవంతుడా... అడ్డంగా బుక్కైపోయాను కదయ్యా. తప్పు చేశానండీ, తప్పు చేశాను.’

‘వామ్మో!! నీ అహంకారం  కాకులెత్తుకెళ్లా! నీ అతిశయం పాడుగానూ!! ఏం చూసుకునే నీకింత గర్వాతిశయం? ఏంటీ... తప్పు చేశావా? నోటికి అడ్డూ అదుపూ లేకుండా ఏంటా దిక్కుమాలిన ప్రకటనలు? అవును మరి.... నువ్వో పెద్ద ప్రపంచ ప్రఖ్యాత సత్య నాదెళ్లవాయే! కాకలు తీరిన రతన్ టాటావాయే!! తప్పు చేశానని ప్రపంచానికి ప్రకటిస్తున్నావ్ మరి. దిక్కుమాలిన సంత. అంతా నా ఖర్మే. ఆ అమెరికోడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, తుమ్మితే ఊడే ముక్కుల్లా తయారైపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగం పుణ్యమాని నేను, స్వయాన నా అంతటివాణ్ని నీకు అడ్డంగా దొరికిపోయా. ఆ హైటెక్ సిటీలో ప్రాజెక్ట్ అటకెక్కి, నా నెత్తిన శని ఎక్కి, బెంచ్ మీద తోక తెగిన బల్లిలా పడున్న నన్ను, అక్కడి నుండి లాగి పెట్టి కొడితే గిరికీలు కొట్టుకుంటూ గోల్ఫ్ బంతిలా ఇదిగో ఇలా వంటింట్లోకొచ్చి పడ్డాను. రాజాలా బతికినవాణ్ని. చివరికిలా పులిరాజాలా తయారైపోయా. నా ఖర్మ కాకపోతే మరేంటి?? ఛస్.... దిక్కుమాలిన ఉద్యోగం. దిక్కుమాలిన కొంప. దిక్కుమాలిన జీవితం. సన్యాసం తీసుకుంటే పీడా విరుగడవుద్ది.’

‘ఇదిగో... మిమ్మల్నే!! ఇంకోసారి ఆ ‘దిక్కుమాలిన’ అనే పదం ఉపయోగిస్తే... ముక్కు కోసేస్తానేమనుకున్నారో. ఇప్పుడేమన్నానని ఆ ఏడుపు? ఓ గంట వంట చేయమంటేనే సన్యాసం, సత్తరకాయా అని నిష్ఠూరాలు పోతున్నారు. మరి, గానుగెద్దులా పొద్దస్తమానం ఉద్యోగం చేసొచ్చే నాకెంత చిరాకేయాలి? నేనెన్ని చిందులేయాలి? నోర్మూసుకుని వంటింట్లోకి దయచేయండి. సన్యాసమట సన్యాసం!!’

‘ఏంటీ.... ఒక గంట వంటనా? నా తలకాయేం కాదు. ఉల్లి లొల్లి, కరెంటు బిల్లు, గ్యాస్ గోల, బొంతలుతకడం ఓ కళ, పిల్లలు ఫీజులూ, ట్యూషన్లూ వగైరా... ఇవి కాదా భర్తకు భారం అని ప్రశ్నించదలచుకున్నా అధ్యక్షా!’

‘అమ్మోయ్.... నాన్నోయ్....! ఇది ఇళ్లనుకున్నారా, ఢిల్లీ పార్లమెంటనుకున్నారా? అధికార ప్రతిపక్షాల్లా ఏంటీ అరుపులు, గోలలు, వాగ్వివాదాలు, మొండిపట్లు. ఛస్... మీకిలా కాదు. జై మాహిష్మతి!! మా ఇంటికి మకిలి పట్టింది... కట్టప్పా... నువ్వెక్కడున్నావయ్యా? దీన్ని ఖండించి కడిగిపారేయ్!!!’

‘ఓరి నీ బాహుబలి పైత్యం తగలెయ్యా!! ఏరా గడుగ్గాయ్... నువ్వూ బుల్లి భళ్లాలదేవలా తయరయ్యావా? కట్టప్ప అరంగేట్రం చేయాల్సినంత దృశ్యమిక్కడ లేదులేవోయ్. సంసారమన్నాక ఈ సరిగమలూ, పదనిసలూ షరా మామూలే గానీ, నువ్వు నోర్మూసుకుని బడికి బయల్దేరవోయ్.’

‘ద్యేవ్డా! వీళ్లు మారరా!!’
Google Courtesy 

(ఈనాడుకోసం రాసింది.... చివరకిక్కడ తేలింది!) 

Tuesday, 7 July 2015

సెల్ఫీ ఇన్ శ్మశానమ్!!అశుభమా అని... శ్మశానంతో పోస్ట్ మొదలెట్టాల్సొచ్చిందేవిటో.. ఖర్మ కాకపోతే! ఎవరి ఖర్మ అంటారా?? ఎవరిదైతే ఏముంది డూడ్స్... ఈ పోస్టు రాయాల్సి రావడం నా ఖర్మ! దాన్ని పబ్లిష్ చేయాల్సి రావడం గూగులోడి ఖర్మ!! చివరకి దాన్ని చదవాల్సి రావడం మీ  అందరి ఖర్మ!!! సో, ఖర్మ మాత్రం కామన్! ఎంతైనా మనది ఖర్మభూమి కదా!! యోవ్... నీ దుంపతెగా, అది ‘ఖ’ కాదు, ‘క’ అంటారా, ఏదో ఒకట్లెండీ, సర్దుకుపోండీసారికి. ఎనీవే, ఈ పోస్టు ఎన్ని మెలికలు తిరిగి, ఎక్కడికి పోయి, ఎలా ముగుస్తుందో ఆ దేవుడికే... సారీ, ఆ భూత ప్రేతాలకే తెలియాలి. పోస్టులో ఎక్కడైనా పిచ్చి ప్రేలాపనలాంటి పదాలు, వాక్యాలు అసందర్భంగా మిమ్మల్ని కించిత్ దిగ్భ్రాంతికి గురిచేస్తే... అది నా తప్పు ఎంతమాత్రమూ కాదనీ, అన్యదా భావించవలదనీ, అది కేవలం నన్ను ఆవహించిన చిలిపి దెయ్యాల అఘాయిత్యమేనని భావించి సర్దుకోగలరు. అలాగే, పోస్టు చదివేటప్పుడు ఎక్కడైనా కంటెంట్ మింగుడుపడక హార్టులో నొప్పి, వాపు లాంటివేవైనా వస్తే... ఎందుకైనా మంచిది ముందే ఝండూబామో, టైగర్ బామో పక్కనే పెట్టుకోండి, కాస్త మర్దన చేసుకుని ముందుకెళ్లడానికన్నమాట. ఓ మై గాడ్! చూశారా... అప్పుడే, ఏదేదో రాసేస్తున్నా. ఇక్కడికి ఆపేస్తానీ డిస్క్లెయిమర్..!

మా ఊళ్లో నదికెళ్లే దార్లో ఓ శ్మశానం ఉంటుంది. శ్మశానం అన్నాక దెయ్యాలు; దెయ్యాలన్నాక భయాలు; భయాలన్నాక కట్టుకథలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. సందర్భం వచ్చింది కాబట్టి చిన్నతనంలో విన్న ఓ కట్టుకథను క్లుప్తంగా చెబుతానుండండి. మా వీధికి ఒకవైపు రెడ్డిగార్ల కొంప ఒకటుండేదిట. అది నిజంగానే లంకంత కొంప. ఆ కొంపలో ఒకే ఒక్క జేజమ్మని తప్ప మిగతావాళ్లని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పన్లేదు. ఆ జేజమ్మ నామధేయమే...రెడ్డి గారి నర్సమ్మ!! రెడ్డి గారి నర్సమ్మ అంటే అటేపు ఓ వందూళ్లు; ఇటేపు ఓ వందూళ్లలో హడల్! హడల్ ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నా. ఎప్పుడూ వదులుగా వేలాడేసి చివర్న జారు ముడేసిన పొడుగాటి బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ జుట్టు; నుదుటన గుండ్రటి రూపాయి బిళ్లంత కుంకుం బొట్టు; చేతులకు అటేపు ఓ డజను, ఇటేపు ఓ డజను వెండి కడియాలు; నోట్లో ఎప్పుడూ నమలబడుతూ ఉండే ఎర్రటి తాంబూలం; ఆరు గజాల జరీ అంచు నేత చీరలో ధగధగా మెరిసిపోయే రెడ్డి గారి నర్సమ్మకు ఎనలేని అతీతశక్తులుండేవని భోగట్టా. అవేంటంటే... ఆవిడ రాత్రిళ్లు మా ఊరి శ్మశానంలో ఇన్ సోమ్నియాతో బాధపడుతూ నేలపై పడి దొర్లుతూ ఉండే దెయ్యాలను నిద్రలేపి, వాటిని వశీకరణం చేసుకుని, వాళ్ల లంకంత కొంపకి తీసుకొచ్చి, రాత్రంతా వెట్టి చాకిరి చేయించి, నిత్యం గద్వాల్, బెంగళూర్ పట్టుచీరల్ని నేయించేదట. వాళ్ల బిజినెస్ అదే. అలాగే, మా చుట్టుపక్కల ఊళ్లలో ఎవరికి దెయ్యం పట్టినా, ఈవిడ మంత్రం వెేస్తే దెబ్బకు దెయ్యాలు హాహాకారాలు పెట్టి, సదరు వ్యక్తుల్ని విడిచిపెట్టి, మా ఇంటి చివరున్న ఆంజనేయుడి గుడి దగ్గరి చింతచెట్టుకు శీర్షాసనాలు వేసేవట. ఓసారి పక్కజిల్లా మంత్రగాళ్ల బ్యాచ్... రెడ్డిగారి నర్సమ్మతో మంత్రతంత్ర విద్యల్లో తాడోపేడో తేల్చుకుందామని వస్తే, వాళ్లందరినీ కట్టగట్టి తేళ్లను, పాముల్ని చేసిపారేసి, గోడలకు, మిద్దెలకు అతుక్కునేలా విసిరి కొట్టిందట. అదీ ఆవిడ టెంపర్. మా పిల్ల బ్యాచ్ తాలూకు తిరుగులేని ఐకన్... రెడ్డిగారి నర్సమ్మ పరమపదించాక ఆవిడ తాలూకు మంత్రతంత్రాల తాళపత్రాలను ఓ మూటలో గట్టి ఎవరికీ తెలీకుండా మా గుడి దగ్గరి బావిలో విసిరేశార్ట. దాంతో యాభై అడుగుల లోతు నీటితో అలరారే ఆ బావి... దెబ్బకు వఠ్ఠిపోయిందట. అదీ ఆవిడ తాటాకు తాళ పత్రాల పవర్. ఇలా చెప్పుకుంటూ పోతే, ‘‘నీకేమైనా దెయ్యం పట్టిందా, ఏది పడితే అది రాస్తున్నావ్’’ అని ఫ్రస్ట్రేషన్ తో మీరు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. ఐనా, నేను ముందే చెప్పాగా... ఈ పోస్టు శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులా ఎన్ని మెలికలు తిరుగుతుందో నాకే తెలీదు, నన్ను ఆవహించిన దెయ్యాలకే తెలియాలి అని. ఏదేమైనా మళ్లీ మా ఊరి శ్మశానం దగ్గరికొద్దాం.

మా ఊరి శ్మశానం పక్కగా ఎప్పుడు నదికెళ్లినా... ఓ రకమైన విచిత్రమైన భయం ఆవహించి ఉండేది. శ్మశానంలోని దెయ్యాల తాలూకు బలమైన చేతులు బబుల్ గమ్ లా అలా సాగిపోయి నావైపుగా వచ్చి కాళ్లను పట్టేసుకుని, బరబరా సమాధుల్లోకి లాక్కెళ్లిపోతాయేమో అని. అఫ్ కోర్స్, ఎప్పుడూ అలా జరగలేదనుకోండి. అలా జరక్కపోవడానికి కూడా ఓ బలమైన కారణముంది. నేనే మంత్రించి నా కుడి చేతికి కట్టుకున్న కాశీదారం రక్షరేఖ వల్ల చాలా భయంకరమైన శాకినీ, ఢాకినీ, మోహినీ పిశాచాలు, కొరివి దెయ్యాలు సైతం నా చుట్టుూ ప్రదక్షిణలు చేసి పారిపోయాయే తప్ప, నాతో బాహాబాహీ తలపడలేకపోయాయ్. వింటానికి నేనేదో శివమణి డ్రమ్స్ వాయిస్తున్నట్టు అనిపించొచ్చు కానీ, అదొక చారిత్రక చేదునిజం! ఇక, హయ్యర్ స్టడీస్ కోసమని సిటీకొచ్చాక.. ఇక్కడ దెయ్యాలుండవని తేలిపోయింది. ఎందుకంటే, సిటీలో రోడ్ల మీద నడుద్దామంటే వెహికిల్స్ కింద పడో; పోనీ, గాల్లో ఎగురుదామంటే ఎలక్ట్రిక్ వైర్ల బారిన పడో.. కుక్కచావు ఛస్తయ్ కాబట్టి దెయ్యాలు నగరాల్ని వదిలేసి పల్లెల్లోనే సెటిలైపోయాయని నా స్టడీలో తేలింది. అందుకే, ఓసారి హాలీడేస్ లో ఊరెళ్లినప్పుడు నా చేతికున్న కాశీదారం తీసి చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ ఈశ్వర్ గాడికి గిఫ్ట్ కింద ఇచ్చేశా, ఉంచుకొమ్మని. అన్నట్టు ఎక్కడున్నాం మనం? శ్మశానం, భయాల దగ్గర కదా. రైట్..! ఇక అసలు పోస్టులోకి వెళ్దాం.

మొన్న సండే పొద్దున్నే క్రికెట్టాడొచ్చి చేతులు సచ్చుబడిపోయి, కాలి పిక్కలు వాచిపోయి, కళ్లు పీక్కుపోయి... నా మానాన నేను వెంటిలేషన్ మీదున్న పేషెంటులా... కాళ్లూ వేలాడేసుకుని, కళ్లు తేలేసుకుని పడుంటే, సరిగ్గా ఆ దుర్ముహూర్తాన్నే, ఉజ్వలుడనే మిత్రదుర్మార్గుడొకడు గబ్బిలంలా నా పక్కన వాలిపోయాడు. నా ఖర్మకి... కొత్తగా వాడొక లెన్స్ కేమెరా కొన్నాట్ట. DSLRఓ, BSLNఓ ఏదో పేరు చెప్పాడు. సో... వాడేదో, ‘‘My Weird Experiments with New Lens Camera Along with Nagaraj’’ అనే ముదనష్టపు పుస్తకమొకటి రాయాలని కంకణం కట్టుకున్నాట్ట. ఆ విధంగా నా ఖర్మ కాలిపోయిందన్నమాట ఆ దినాన. సన్నాసి అన్నాక అడవులు పట్టుకు తిరగడం; సంసారి అన్నాక శ్రీమతి కొంగుపట్టుకు తిరగటం; బ్రహ్మచారి అన్నాక బలాదూర్ తిరుగుళ్లు తిరగడం... క్వైట్ కామన్, అలా చేయకపోతేనే వీడు కొంచెం తేడా అనుకుంటార్రా అబ్బాయ్, అసలే పాడులోకం... అని ఓ తింగరి సామెత చెప్పి; చలనం లేని శాల్తీని అర్థాత్ నన్ను పిలియన్ రైడర్ (బైకుపై వెనక్కూచునేటోళ్లని పిలియన్ రైడర్స్ అంటార్ట)గా వెనకేసుకుని టోలీచౌకి దిశగా దారితీశాడు. శాల్తీలోని నాగరాజ్ నిద్రలేచి, ఒళ్లు విరుచుకుని ‘‘చూడబ్బాయ్ లేత విక్రమార్కా... ఇంతకీ మనమెక్కడికి ఊరేగుతున్నాం’’ అని భేతాళ ప్రశ్న వేయగా; ‘‘సెవెన్ వండర్స్ ఆప్ హైదరాబాద్.... సెవెన్ టూంబ్స్ ఉరఫ్ సాథ్ గుమ్మజ్ అలియాస్ కుతుబ్ షాహీ సమాధుల’’ దగ్గరికెళుతున్నామని బాంబు పేల్చాడు.

నేను: ఏమిరా బాలరాజు, ఏమి ఈ అఘాయిత్యం!! మన ఖైరతాబాదులో ఉన్న ఖైరతున్నిసా బేగం యొక్క తుప్పుపట్టిన టూంబును నిత్యం చూస్తూనే ఉన్నాం కదరా. దానిపైన తరతరాలుగా నివాసం ఉండే పావురాల గుంపుతో రోజూ రెట్టలు వేయించుకుంటూనే ఉన్నాం కదరా. అది చాలదా??? ఇప్పుడు మళ్లీ కొత్తగా ఈ సెవెన్ టూంబ్స్, సెవెన్ థౌజండ్ డోవ్స్ (సబ్బులు కాదు, పావురాలు) ఎందుకురా బుజ్జే... !!

ఫ్రెండు: ఛస్ నోర్మూయ్. మన రాజరిక చారిత్రక వారసత్వ పురాతత్వ సంపద గురించి కనీసం ఐడియా కలిగి ఉండకపోతే కళ్లు పోతాయ్. పద ఇవాళ నీ కళ్లు తెరిపిస్తా.

నేను: నీ తలకాయ్. ముందు ఆ కళ్లజోడు సరిగ్గా పెట్టుకుని బండి నడుపు. అసలే టోలీచౌకీ తలాతోకా లేని ట్రాఫిక్కులో ఊరేగుతున్నావ్, ఎవడికన్నా గుద్దావంటే, తోలు తీసి డోలు కడతారు. ఎధవ నస!!

అక్కడికెళ్తే... ఒక్ఖ తెలుగు ప్రాణి లేదు. అంతా తెల్లోళ్లే. అదే లోకల్ చంటిగాళ్లు తరహా ఎవరూ కనిపించట్లా. అందరూ ఐ.ఎస్.డీలే. అదే ఫారినర్స్.

ఫ్రెండు: ఆహా... వీళ్లు కదా ఆర్కియలాజికల్ ప్రేమికులు! వీళ్లురా నిజమైన చారిత్రక వారసులు!!.. వీళ్లురా నిజమైన దేశభక్తులు... వీళ్లురా...

నేను: ఆపరా బాబూ నీ సుత్తి విదేశీ స్థుతి! ముందా టికెట్ తీసుకుని తగలడు, కెమెరాకేమీ టికెట్ తగలెట్టకు. లోపల ఏ ఏప్రాసీ ఉండడు. అసలే ఇదో భారీ శ్మశానం, ఉండేవన్నీ సమాధులు. ఎన్ని ఫొటోలు తీసుకున్నా అడిగే దిక్కుండదిక్కడ. అధవా, ఎవడన్నా అడిగితే ఫదో ఫరకో పారేద్దాంలే. టికెట్టు తీస్తే ఊరికే వంద బొక్క. ఐనా ఇంత బతుకూ బతికి చివరికి సమాధులు చూడాల్సి వచ్చింది చూడూ, పొద్దున్నే లేచి ఎవడి మొహం చూసి తగలడ్డానో...!!

ఫ్రెండు: ఎవడిదో ఏంటి, సెల్ ఫోన్లో నీ దరిద్రపు సెల్ఫీనే చూసుకుని తగలడుంటావ్. అనుభవించు రాజా! లోపలికి పద... కుతుబ్ షాహీ కాందాన్ గురించి వాళ్ల చేతే నీకు జ్ఞానోదయం గావిస్తా..!

నేను: ఏడిశావ్...లే! అవున్రా... వచ్చేప్పుడు వెంటబెట్టుకొచ్చిందేమీ లేదు; పోయేప్పుడు కట్టగట్టుకు తీసుకుపోయేదేమీ లేదు, ఆ మాత్రం దానికి ఆరడుగుల నేల చాలదట్రా?! వీళ్లేంట్రా... అదేదో అప్పనంగా వచ్చిందని చెప్పి, ఎకరాలకి ఎకరాలు పోగేసి, చక్కా సమాధులు కట్టించుకున్నారు. ఇదేం చోద్యంరా బాబూ!! ప్రశ్నించే వాడే లేడనా???

ఇంతలో... నింగిలో నిశ్శబ్దం బద్ధలైంది. గాలి సుళ్లు తిరిగింది. ఎండుటాకులు ఎగిరిపోయాయ్. చెట్లపై కాకులు పారిపోయాయ్. భూమి నెర్రలు విచ్చుకుంది. సమాధిలోంచి కుతుబ్ షాహీ మహాశయుని ఆత్మ లేచి కూర్చుంది. గొంతు సవరించుకుంది.

కుతుబ్ షాహీ ఆత్మ: నాయనా నాగ్రాజ్! నువ్వు సైన్సు వాడివేగా. సత్యం సాపేక్షమైందనే విషయం తెల్సా. నిన్న ఉన్నట్టు నేడుండదు. నేడున్నట్టు రేపుండదు. రేపున్నట్టు మర్నాడుండదు. నీ నవీన డెమోక్రటిక్ కళ్లద్దాలతో, మా ప్రాచీన రాజరికపు విషయాలను తరచి చూడరాదు నాయనా. రాజు సర్వశక్తిసంపన్నుడు. వాడు తలచుకుంటే పన్నులు, తన్నులకే కాదు.... మెడకాయల మీద తలకాయలని ఎగరేసి టెన్నిస్ ఆడేయగలడు. కనుచూపు మేర జమీన్ ని పాదాక్రాంతం చేసుకోగలడు. రాజు ఖడ్గానికీ, ఆదేశానికీ అడ్డూ అదుపూ ఏదీ ఉండదబ్బాయ్. రాజు ఆడిందే నేషనల్ గేమ్స్. పాడిందే క్లాసికల్ కచేరీ. ఆ లెక్కన ఆ కాలంలో మేమేం చేసినా రైటో రైట్. అదే అప్పటి సత్యం. ఐనా ఈజిప్షియన్లు కట్టిన భారీ పిరమిడ్స్ చూశావటోయ్... అవీ సమాధుల్లాంటివే, అయితేనేం! అదెంతటి ఘనకార్యమనీ, ఘనతనీ, అద్భుతమనీ, వింతనీ, విడ్డూరమనీ!!! చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను కళా హృదయంతో చూసి ఆనందించాలి గానీ.... పోతే ఆరడుగులనీ... పడితే అరటికాయ తొక్కనీ... హాఫ్ నాలెడ్జితో అంచనా కట్టే ప్రయత్నం చేయరాదు సుమీ...!

నేను: వామ్మో! మొత్తానికి అర్థమయ్యీ, కానట్టూ క్లాసేదో పీకినట్టు అర్థమైంది జహాపనా! దణ్ణం దేవరా. క్షమించుడి. మరే, ఆ కవి గారెవరో... ఓయీ నిజాం పిశాచమా, కానరాడు, నిన్నుబోలిన రాజు మాకెన్నడేని... అని తీవ్రంగా మండిపడ్డాట్ట కదా. ఆ లెక్కన మీ రాజుల జాతంతా అట్టాంటి బాపతేనా???

కు.షా ఆత్మ: ఛస్, నీవూ అదేపనిగా చారిత్రక తప్పిదాలు చేసే మన కుహనా కమ్యూనిస్టుల్లాగే అడ్డంగా మాటాడేస్తున్నావ్ సుమీ! కాస్త చరిత్రా చట్టుబండలూ స్టడీ చేసి చావచ్చుగా. పెన్ను పట్టిన ప్రతోడూ చరిత్రంతా చెత్త, హిస్టరీ అంతా ట్రాష్ అని రాసిపారేస్తే పోలోమని గొర్రెదాటులా గుడ్డిగా నమ్మేయడమేనా? ప్రశ్నించేది లేదా? పోస్టుమార్టం చేసేది లేదా?? ఆ రాజెవడు? వాడి వంశమేది? వాడు పాలించిన కాలమేది? వాడు చేసిన పనులేంటి? అప్పటి ప్రజల స్థితిగతులేంటి? ఇవన్నీ బేరీజు వేయాలా లేదా? ఉట్టినే చెంఘిజ్ ఖానో, నాదిర్షానో, ఎవడైతేనేం ఒక్కొక్కడు ఒక నరహంతకుడని అందరినీ ఒకే గాటన కట్టేస్తే ఎలా సామీ??? అప్పటి కాలమాన స్థితిగతులను, రాజు పాలనా తీరుతెన్నులను బట్టి.. వాడు గొప్పోడా, దరిద్రుడా అని అంచనా వేయాలి గానీ; నిజాం & రజాకార్లు కలిసి జనాన్ని కాల్చుకుతిన్నారు కాబట్టి, రాజులందరూ నియంతలే అని గాలివాటం మాటలు మాటాడితే ఎట్టా అంట?? అసలు నీకో విషయం తెల్సా? మా హయాంలోనే ఇక్కడ భాషా సాంస్కృతిక వికాసం జరిగింది. మేమేమీ ప్రజల్ని కష్టపెట్టలేదు. పోయి చరిత్ర చదువుకో, ఫో!

నేను: ఓహ్హో... మా ఊరి శ్మశానం, సమాధుల్ని చూసిన కళ్లతో, బుర్రతో... మీ సమాధుల్ని కూడా  చూట్టం వల్ల వచ్చిన తంటా అనుకుంటా ఇది. శ్మశానంలోని సమాధుల కింద శవాలకు సంబంధించి ఇంత చరిత్ర ఉందని తెలీలేదు సుమీ. క్షమించండి సుల్తాన్ జీ!!

కు.షా ఆత్మ: ఫర్వా నై, బేటా నాగ్రాజ్! ఈ గోల్కోండ ప్రాంతం... ఒకప్పటి గొల్లకొండ. అంటే గొర్ల కాపర్ల కొండ. అది కాకతీయుల అధీనంలో ఉండేది. ఆ తర్వాత ఇరాన్ వంశీయులైన బహుమని సుల్తాన్ల పాలనలోకి, ఆపై మా కుతుబ్ షాహీల పాలనలోకి, ఆ తర్వాత మొఘల్స్ పాలనలోకి, అనంతరం నిజాం అధీనంలోకి, ఇప్పుడు మీ కేసీఆర్ దొర హయాంలోకి వచ్చింది. అదన్నమాట సంగతి. ఇంతకూ మా కళాపోసన, సమాధుల సౌందర్యం గురించి ఏమంటావోయ్...?

నేను: ఏమంటాను. ఆ సమాధి ప్రేత పురాణం / ఈ పక్షలు వేసిన రెట్టలు / మతలబులూ, మన్నూ మశానం / ఇవి కావోయ్ చరిత్ర సారం... అంటాను, హ్హా!!

కు.షా ఆత్మ: ఓయీ మూర్ఖ శిఖామణి! నేనింతగా గొంతుచించుకున్నా మళ్లీ మొదటికే వస్తావా! నువ్వు మనిషివా??? మీడియావాడివా??? ఎవరక్కడ!! ఇతగాణ్ని తీసుకెళ్లి ఆ కారాగారంలో బంధించి, కుళ్లి కృషించిన తర్వాత, కాకులకు, గద్దలకు విసిరేయండి!!

నేను: హిహ్హిహ్హీ! మీరింకా పురాతత్వ ఫ్యూడలిజం భ్రమల్లోనే బతికేస్తున్నట్టున్నారు సుమీ. ఇది నిఖార్సైన డెమోక్రసీ. మీరు చప్పట్లు కొడితే ఎగేసుకుని రావడానికి నేను, నా ఫ్రెండు తప్ప ఈ చుట్టుపక్కల అయిదారు కిలోమీటర్ల దాకా మానవమాత్రడనేవాడు లేడు మహాశయా. ఐనా అదంతా ఉట్టి హాస్యంలే. జోక్ చేశా జహాపనా! శాంతించి సమాధి స్థితిలోకెళ్లి విశ్రాంతి తీసుకోండి సుల్తాన్ జీ!! నేను హలీమ్ తినే టైమైంది. మరి వస్తా. గుడ్ బై!!

[PS: అదన్నమాట సంగతి. ఎక్కడ మొదలెట్టానో, ఏం రాశానో, ఏం చెప్పాలనుకున్నానో, అసలేమన్నా చెప్పానో లేదో.. నాకస్సల్ తెలీదు. ఏదో ఊకదంపుడు పోస్టు ఇది. సరదాకి చదువుకోండి. మనోభావాల్ని గాయపరచుకోమాకండి ;)) ]చివరి తోక: చాలారోజులైంది కదా... బ్లాగ్ ముఖం చూసి... అందుకే ఈ ఊకదంపుడు పోస్ట్!! ;)

Tuesday, 17 February 2015

చౌమహల్లా ప్యాలెస్ - ఓ చారిత్రక పర్యటన


సెలవుల్లో టీవీ చూట్టమో, లేదంటే ఎంచక్కా గోళ్లు గిల్లుకోవడమో అన్నవి అనాదిగా మానవాళికి సంక్రమిస్తున్న గొప్ప హాబీలు. ఒకవేళ చూట్టానికి టీవీ, గిల్లుకోటానికి గోళ్లు రెండూ అందుబాటులో లేకపోతే (నాలాగన్నమాట) జీవితం దుర్భరమైపోద్దేమో!! నా పరిస్థితి అలాగే ఉండి ఉండెను ఒకానొక సండే దినాన. ఐతే, సెలవు రోజున చేయటానికేమీ లేకపోతే కనీసం కళాపోషణైనా చేయవోయ్... అని సెలవిచ్చాడట ఎవరో శాస్త్రకారుడు వెనకటికి. పోనీ, ఈ ఐడియా ఏదో భేషుగ్గా ఉందని చెప్పి, వర్కవుట్ చేసి, ఓ సుముహూర్తాన భాగ్యనగరంలో ఓ చారిత్రక పర్యటన నిర్వహించాను. అనగా, ఫ్రెండ్సుతో కలిసి చౌమహల్లా ప్యాలస్ సందర్శన చేశామన్నమాట. నిజాం నగరానికొచ్చి దశాబ్దం గడిచినా ఇప్పటిదాకా ఈ రాజసౌధం గురించి వింటమే కానీ, చూసింది లేదాయే. చార్మినార్, మక్కా మసీద్, గోల్కోండ ఖిల్లా, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా ప్లానిటోరియం... ఇలాంటి వాటన్నింటినీ ఓ రౌండ్ వేసినా, చౌమహల్లా ప్యాలెస్ పై పెద్దగా దృష్టి సారించలేకపోయా, అక్కడేముంటుందిలే అని. బహుశా, శని గ్రహం నా చేత ఈ ప్యాలెస్ పై శీతకన్ను వేయించిందేమో! తీరా పర్యటించి చూద్దును కదా.. అక్కడ అన్నీ ఆశ్చర్యాలే!! ఎక్స్ పెక్టేషన్స్ ఏమీ లేకుండా వెళ్లడం వల్లనేమో... ఈ ప్యాలెస్ అనేక వింతలతో మరింత అబ్బురపరిచింది.

ముందుగా టికెట్ దగ్గర్నుండి మొదలెడదాం. టికెట్టు ధర.. తిప్పి కొడితే ఓ పదో పరకో ఉంటుందనుకున్నా. కానీ 40 రూపాయలట. ఒకటో ఆశ్చర్యం! మొబైల్ తో ఫొటోలు తీస్కోవాలంటే మరో 50 రూపాయలు మూల్యం చెల్లించాలట. రెండో ఆశ్చర్యం!! ఎంటరవ్వంగానే క్యాంటీన్లో టీ తాగితే... గభాల్ని ఓ రెండు గాంధీ నోట్లు గుంజేస్కున్నాడు, భడవఖానా. మూడో ఆశ్చర్యం!!! కూసంత దూరం లోపలికెళ్లాక ఓ అందమైన కళంకారీ షాపు. అందులో శోభాయమానంగా వెలిగిపోతున్న విభిన్న కళాకృతుల మధ్య నాకెందుకో చెస్ బోర్డు తెగ నచ్చేసింది. నా తలకాయ అనబడు బీరువాలో కళల ‘అర’ కంటే, క్రీడల ‘అర’ డామినేషనే ఎక్కువగా ఉందని ఆ క్షణాన ఇంస్టింక్టివ్ గా కనిపెఠేశా. సర్లెమ్మని, రేటు అడిగితే రూ.1300 జహాపనా అనేశాడు అతగాడు. ఆశ్చర్యం టు ది పవర్ ఆఫ్ టెన్!!!!!! జీ హుజూర్.. ఫిర్ మిలేంగే... అని సలాం కొట్టి, వెంటనే అబౌట్ టర్న్ తీసుకుని నిశ్శబ్దంగా నా కాళ్లు వాటంతటవే ఎగ్జిట్ గేటు వైపుగా వెళ్లిపోయాయ్. ఇట్టాంటి యాక్టివిటీస్ నే అసంకల్పిత ప్రతీకారచర్యలు అంటారని చిన్నప్పుడెప్పుడో చదువుకున్న పాఠం ఠకీమని గుర్తొచ్చింది. కాసేపు నిర్వేదంతో మనసులో ఇలా పేరడీ యాడ్ రూపంలో కుళ్లి కుళ్లి బాధపడ్డాను... ఈ నగరానికేమైంది? ఒకవైపు మూసీ రోత! మరోవైపు ధరల వాత! ఐనా, ఎవ్వరూ ముక్కు మూయరెందుకు? ఒక్కరూ నోరు మెదపరెందుకు?! ఖళ్ ఖళ్ ఖళ్ !!!

కాసేపటికి ఆశ్చర్యపోవడం కామనైపోయింది. ప్యాలెస్ గురించి టూకీగా నాలుగు మంచి ముక్కలు మాటాడుకుంటే... చౌ మహల్లా అంటే... నాలుగు (చౌ), భవనాలు (మహల్లా) అని అర్థమట. చార్మినార్ పక్కనే ఉన్న మక్కా మసీదుకు వెనకవైపున లాడ్ బజార్ ఏరియాలో ఉంటుందీ ప్యాలెస్. 270 ఏళ్ల క్రితం నిర్మించారట ఈ సౌధాన్ని. అసఫ్జాహీ వంశస్థులు నిర్మించిన అనేక కట్టడాల్లో ఇది ప్రశస్థమైందట. మొగల్ శైలిలో ఉంటుందీ నిర్మాణం. నిజాం నవాబుల పాలనకు అధికారిక నివాసంగా ఈ ప్యాలెస్ ఉండేదని ప్రతీతి. దీని విస్తీర్ణం 14 ఎకరాల పైమాటేనట. నాలుగు భవంతులుగా విభజించి ఉంటుంది. నింపాదిగా అన్ని భవంతుల్లోని విశేషాల్ని చూడాలంటే మినిమమ్ ఓ మూడు గంటలు పట్టుద్ది.

ఆపై ప్యాలెస్ లోపలి విశేషాల విషయానికొస్తే... అసఫ్జాహీ వంశస్థులైన నిజాం నవాబుల రాజసానికి, వైభవానికి సంబంధించిన చారిత్రక వస్తు సంపదను ఈ అందమైన భవంతుల్లో భద్రపరిచారు. రాయల్ దర్బార్ హాల్ భలేగా ఉంటుంది. నిజాం నవాబుల తాలూకు పింగాణీ పాత్రలు, కత్తులు, కటార్లు, వేషధారణలు, గుర్రపు బగ్గీలు, వింటేజ్ కార్లు, విశ్రాంతి మందిరాలు, ఇంకా ఎన్నో వింతలు, విశేషాలు, వంశ వృక్షాలు ఇలాంటి వాటన్నింటినీ అనేక గదుల్లో భద్రపరిచారు. ఓ రెండు పేద్ద వాటర్ ఫౌంటెన్లు, ఓ నాలుగు తెల్లని బాతులు, కొన్ని పచ్చిక బయళ్లు కూడా దర్శనమిస్తాయి. హైదరాబాదులో కచ్చితంగా చూడదగ్గ ప్రదేశమిది.

అటు వైపు నుండి నరుక్కొస్తే... ఈ భవంతిలో ఉన్నవన్నీ రాజరికాల నాటి సంగతులు కదా. నవాబుల తాలూకు అతిశయం, డాంభికాలు, లగ్జూరియస్ వస్తు సేకరణలు వగైరా వగైరా తప్పించి, సామాన్యుల జీవన చిత్రం ప్రస్తావన గానీ, సొసైటీకి వారి కాంట్రిబ్యూషన్స్ గానీ, కళా, సాహిత్య వికాసాల ప్రస్తావన గానీ మనకు అగుపించవు. బహుశా... రాజరికాల శకం ముగింపు దశకు చేరుకుంటున్న కాలంలో ఈ నవాబులు జీవించారేమో (Slavery ఎండింగులో విలాసాల్లో మునిగితేలిన రోమన్లలాగా). అందుకే ఇక్కడ వారి విలాసాలు, భోగలాలసలే ఎక్కువగా కనబడతాయి. పోనీయండి. నాటి సంగతుల్ని నేటి దృక్పథంతో చూడ్డం కూడా సరికాదేమో.

చివరగా, ఒక్క విషయం మాత్రం క్లియర్ గా అర్థమైంది. ఒక వ్యక్తి తాలూకు విలాసాలు, అధికార దర్పాలు, భోగభాగ్యాలనేవి అంతిమంగా మ్యూజియాలలో భద్రపరచబడితే; ఆ వ్యక్తి తాలూకు మంచితనం, మానవత్వం లాంటి సద్గుణాలు మాత్రం వాటి మోతాదును బట్టి జనం గుండెల్లో నిక్షిప్తం చేయబడతాయని!! అదండీ చారిత్రక పర్యటన తర్వాత నేను కనిపెట్టిన టిపికల్ క్రిటికల్ ప్యాలెస్ ఫిలాసఫికల్ థియరీ ;))

Note 1:ప్యాలెసుకు national holidays & friday సెలవు. timings: 10am-5pm. 
Note 2: మొబైల్ ఫొటోగ్రఫీకి టికెట్టు అవసరం లేదని లోపలికెళ్లాక తెలిసింది. నా జేబుకు రూ. 50లు చిల్లు!!

ఆ బుడ్డోడు.... ఆరో నిజాం అట..!!!

ఇదే నాటి రాజ దర్బార్...!!

నేను ఓ ఫొటో తీసుకుంటానని చెబితే... అందరూ ఇటేపు తిరిగి మాంఛి ఫోజిచ్చారు...!!! :)

నిజాం నవాబు గారి భార్యలు, వాళ్ల బుడుగులూ వగైరా వగైరా...!!

నిజాం సేకరించిన ఓ ఘరానా కారు...!!

నిజాం గారి రోల్స్ రాయిస్ కారు...!!

చౌమహల్లా ప్యాలెస్ లో ఒక సైడ్ వ్యూ...!!

నిజాం నవాబు పెంచుకున్న బాతులు... ఆయన పోయినా, ఇవి మాత్రం ప్యాలెసుని వదలి వెళ్లట్లేదట...!!

మర ఫిరంగి...!!
నిజాం నవాబు పింగాణి పాత్రలు...!!

పింగాణీ పాత్రలు, ఇత్తడి మగ్గులు, తుత్తునియం బల్లేలు... ఇవి కాదోయ్ చరిత్ర సారం.. అంటే నిజాం ఒప్పుకోడేమో..!

ఒక మేమ్ సాహిబా...!

వీళ్లిద్దరినీ ఎటేపు నుండి చూడాలబ్బా...!!

చింతచెట్టుకు బాబ్డ్ హెయిర్ కట్ చేస్తే ఇదిగో ఇలాగుంటుంది....!!ప్యాలెస్ దారీ, దాని కథా కమామిషు ఇవిగోండి...!!