Showing posts with label నేను సైతం. Show all posts
Showing posts with label నేను సైతం. Show all posts

Saturday, 28 September 2013

రగిలే నిప్పు కణిక! నిత్య స్ఫూర్తి జ్వాల!!


నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను..!
 
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను...!!

మహాకవి శ్రీశ్రీ ఈ వాక్యాల్ని... దేశ స్వేచ్ఛ కోసం 23 ఏళ్ల చిరుప్రాయంలో ఉరికంబమెక్కి తృణప్రాయంగా ప్రాణాలర్పించిన ‘స్వాతంత్ర్య సమర సేనాని’ భగత్ సింగ్ కోసమే రాశారా అనిపిస్తుంది. భగత్ సింగ్ జన్మించి నేటికి 106 ఏళ్లవుతోంది. భగత్ సింగ్ అమరవీరుడా? కాదా? అన్న విషయం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ఆ యోధుడికి ఒక చిరు నివాళి అర్పించే ప్రయత్నమే ఈ చిన్ని రైటప్. 

భగత్ సింగ్!
అసాధారణ సంకల్పం... 
అంతులేని సాహసం...
అబ్బురపరిచే త్యాగనిరతి...
అనన్యసామాన్యమైన మేధాసంపత్తి...
ఇలాంటి అత్యద్భుత లక్షణాల్ని కలగలిపి పోతపోసి ‘మర ఫిరంగి’లా పేలే మనిషిని తయారుచేయాలనుకుంటే అతడు భగత్ సింగ్ రూపం ధరించి మనకు సాక్షాత్కారమవుతాడు. తెల్లవాడి గుండెల్లో శతఘ్నిలా పేలి... భారతీయుల గుండె చప్పుడుగా అజరామరంగా నిలిచిపోయిన వాడు భగత్ సింగ్! భగత్ సింగ్ పేరు స్మృతిపథంలో కదలగానే అన్యాయం-అధర్మాలపై కదన శంఖారావం పూరించే ఉప్పెనలాంటి ఉద్వేగం గుండెల నిండుగా ఉప్పొంగుతుంది. ఇంతటి అపూర్వ చరిత్ర కలిగిన భగత్ సింగ్ పేరుకు ప్రభుత్వ రికార్డుల్లో అమరవీరుడిగా గుర్తింపు లేకపోవడం నిజంగా విడ్డూరం కలిగించే విషయం. భగత్ సింగ్ అమరత్వం చర్చనీయాంశమై ఇటీవల పత్రికల పతాక శీర్షికలనెక్కింది. భగత్ సింగ్ విషయంలో ప్రభుత్వాల దారుణ, నిర్లక్ష్య పూరిత వైఖరికి జాతి యావత్తూ నివ్వెరపోయింది. 


భగత్ సింగ్ అమరవీరుడు కాదట!

బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి భరతజాతిని విముక్తి చేయడానికి ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ ను అమరవీరునిగా గుర్తించడానికి తమ వద్ద ఎలాంటి రికార్డులూ లేవని ఇటీవల కేంద్ర హోంశాఖ వెల్లడించడం, ఆ మేరకు సమాచార హక్కు కింద దాఖలైన పిటిషన్ కు అధికారులు విడ్డూరమైన వివరణలివ్వడం విని, ఆ తతంగాన్ని మీడియాలో వీక్షించి యావద్భారతం విస్తుపోయింది. రాజ్యసభలో ఈ విషయమై పెద్ద దుమారం రేగినప్పుడు కూడా హోంశాఖ అధికారులు ఎప్పట్లాగే కప్పదాటు వైఖరి అవలంబించారు. ఇక భారత ప్రధాని తీరిగ్గా మౌనవ్రతం వీడి... ‘భగత్ సింగ్ అమరత్వం రికార్డులకు అతీతమైంది’ అని నాలుగు కంటితుడుపు మాటలు మీడియాలో ప్రకటించి చేతులు దులిపేసుకున్నాడు. ఇంతా జరిగాక కూడా భగత్ సింగ్ ను అమరవీరుడిగా ప్రకటించడానికి చర్యలు తీసుకుంటామన్న హామీ అటు ప్రధాని గానీ, ఇటు ప్రభుత్వం కానీ ఇవ్వకపోవడం గర్హనీయం! నిజానికి ఆనాడు 1931 మార్చి 23న, అనుకున్న తేదీకంటే ఒక రోజు ముందుగానే, బ్రిటిష్ ప్రభుత్వం అన్నిరకాల న్యాయ నిబంధనల్ని తుంగలో తొక్కి భగత్ సింగ్ ను ఉరితీసిన రోజున, జాతి మొత్తం నిద్రా హారాల్ని మానుకుని కన్నీటి సంద్రమైంది.  జన జీవితం స్తంబించిపోయింది. అప్పటినుండే భారత ప్రజానీకం భగత్ సింగ్ ను ‘అమరువీరుల్లో శ్రేష్ఠుని’ (షహీద్ ఏ ఆజమ్)గా గౌరవించుకుంటోంది. సామాజికాభ్యుదయాన్ని ప్రతిఫలించే ఆశయ సాధన కోసం ప్రాణాలు వదిలిన గొప్ప వ్యక్తుల్ని అమరవీరులుగా గుర్తించి గౌరవించడం ఏ దేశంలోనైనా పరిపాటిగా జరిగే విషయమే. కానీ అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే మనదేశంలో దేశ స్వేచ్ఛ కోసం చిరునవ్వుతో ప్రాణాల్ని బలిదానం చేసిన భగత్ సింగ్ కు లభించిన ఘన సత్కారం ఇది! 


భగత్ సింగ్ టెర్రరిస్ట్ అట! 

భారతీయుల బానిస సంకెళ్లను బదాబదలు చేసే సదాశయంతో ఉరికంబమెక్కిన స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను టెర్రరిస్టులుగా చిత్రించిన ఘన ఖ్యాతి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే, అపర మేధావి కపిల్ సిబల్ నేతృత్వంలోని హెచ్.ఆర్.డి విభాగం ఐ.సి.ఎస్.సి పదో తరగతి పుస్తకాల్లో భగత్ సింగ్ ను టెర్రరిస్టు అని ముద్రించేశారు. అంతేకాదు, ఐఏఎస్ పరీక్షా పత్రంలో భగత్ సింగ్ నేతృత్వం వహించిన ‘రెవల్యూషనరీ టెర్రరిజం’ గురించి విశ్లేషించండనే ప్రశ్నను ఇవ్వడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిజానికి ఆనాడు సాతంత్ర్యోద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసే దురుద్దేశ్యంతో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా, భగత్ సింగ్ తన సహచరుడు బీకే దత్ తో కలసి 1929 ఏప్రిల్ 8న ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు వేసి స్వచ్ఛందంగా అరెస్టయ్యాడు. ఈ సంఘటనలో ఎవ్వరూ చనిపోలేదు. ఎవ్వరూ గాయపడలేదు కూడా. ఆ బాంబులు మనుషుల్ని చంపడానికి ఉద్దేశించినవి కావని బ్రిటిష్ ఫొరెన్సిక్ విభాగమే ధ్రువీకరించి స్వయంగా నివేదిక సమర్పించింది. భారతీయుల నిరసన వాణిని బ్రహ్మ చెవుడు ఆవహించిన బ్రిటిష్ వాళ్ల కర్ణభేరి బద్ధలయ్యేలా వినిపించేందుకు ప్రజలెవ్వరూ లేనిచోట బాంబులు వేశామని, తమ ఆశయాలను కోర్టు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడానికే స్వచ్ఛందంగా లొంగిపోయామని భగత్ సింగ్ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు, బాంబులు, పిస్తోళ్ల సంస్కృతికి తాను వ్యతిరేకిననీ; ఉన్నత భావాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మాత్రమే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వాలు సాధించగలమని లిఖితపూర్వకంగా భగత్ సింగే ప్రకటించాడు. అలాంటి భగత్ సింగ్... మన కాంగ్రెస్ ప్రభుత్వం పండితులకు, మేధావులకు టెర్రరిస్టుగా కనిపించడం దేశం చేసుకున్న దురదృష్టం అనాలా? లేక జాతికి పట్టిన దౌర్భాగ్యం అనాలా? ఏమనాలి?

 భగత్ సింగ్... ఒక ధ్రువతార!


నిజానికి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో శాంతియుత ధోరణి, సాయుధ ధోరణి అని రెండు ప్రవాహాలు కనిపిస్తాయి. శాంతియుత పంథాకు గాంధీజీ నేతృత్వం వహిస్తే; సాయుధ పోరాటానికి భగత్ సింగ్ నాయకత్వం వహించాడు. ఈ రెండు ప్రవాహాల్లో కొనసాగిన సుదీర్ఘ పోరాటాల అంతిమ ఫలితంగా మాత్రమే మనదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అందుకే ప్రజలు కూడా భారత జాతిపితగా గాంధీజీని ఎంతగా అభిమానిస్తారో; అత్యున్నత అమరవీరునిగా భగత్ సింగ్ ను కూడా అంతేస్థాయిలో ప్రేమిస్తారు. స్వాతంత్ర్య సముపార్జనే లక్ష్యంగా మృత్యువునే పరిహసిస్తూ ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ జాతి జనుల గుండెల్లో సదా అమరవీరునిగా నిలిచిపోతారు. ఆనాడు భగత్ సింగ్ ఎలుగెత్తి నినదించిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే రణన్నినాదం అరాజకీయం, అన్యాయం, అధర్మం రాజ్యమేలినంత కాలం భారతీయుల హృదయ స్పందనగా మార్మోగుతూనే ఉంటుంది.

ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ప్రచురితమైన చిన్న రైటప్!!