Saturday, 28 September 2013

రగిలే నిప్పు కణిక! నిత్య స్ఫూర్తి జ్వాల!!


నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను..!
 
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను...!!

మహాకవి శ్రీశ్రీ ఈ వాక్యాల్ని... దేశ స్వేచ్ఛ కోసం 23 ఏళ్ల చిరుప్రాయంలో ఉరికంబమెక్కి తృణప్రాయంగా ప్రాణాలర్పించిన ‘స్వాతంత్ర్య సమర సేనాని’ భగత్ సింగ్ కోసమే రాశారా అనిపిస్తుంది. భగత్ సింగ్ జన్మించి నేటికి 106 ఏళ్లవుతోంది. భగత్ సింగ్ అమరవీరుడా? కాదా? అన్న విషయం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ఆ యోధుడికి ఒక చిరు నివాళి అర్పించే ప్రయత్నమే ఈ చిన్ని రైటప్. 

భగత్ సింగ్!
అసాధారణ సంకల్పం... 
అంతులేని సాహసం...
అబ్బురపరిచే త్యాగనిరతి...
అనన్యసామాన్యమైన మేధాసంపత్తి...
ఇలాంటి అత్యద్భుత లక్షణాల్ని కలగలిపి పోతపోసి ‘మర ఫిరంగి’లా పేలే మనిషిని తయారుచేయాలనుకుంటే అతడు భగత్ సింగ్ రూపం ధరించి మనకు సాక్షాత్కారమవుతాడు. తెల్లవాడి గుండెల్లో శతఘ్నిలా పేలి... భారతీయుల గుండె చప్పుడుగా అజరామరంగా నిలిచిపోయిన వాడు భగత్ సింగ్! భగత్ సింగ్ పేరు స్మృతిపథంలో కదలగానే అన్యాయం-అధర్మాలపై కదన శంఖారావం పూరించే ఉప్పెనలాంటి ఉద్వేగం గుండెల నిండుగా ఉప్పొంగుతుంది. ఇంతటి అపూర్వ చరిత్ర కలిగిన భగత్ సింగ్ పేరుకు ప్రభుత్వ రికార్డుల్లో అమరవీరుడిగా గుర్తింపు లేకపోవడం నిజంగా విడ్డూరం కలిగించే విషయం. భగత్ సింగ్ అమరత్వం చర్చనీయాంశమై ఇటీవల పత్రికల పతాక శీర్షికలనెక్కింది. భగత్ సింగ్ విషయంలో ప్రభుత్వాల దారుణ, నిర్లక్ష్య పూరిత వైఖరికి జాతి యావత్తూ నివ్వెరపోయింది. 


భగత్ సింగ్ అమరవీరుడు కాదట!

బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి భరతజాతిని విముక్తి చేయడానికి ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ ను అమరవీరునిగా గుర్తించడానికి తమ వద్ద ఎలాంటి రికార్డులూ లేవని ఇటీవల కేంద్ర హోంశాఖ వెల్లడించడం, ఆ మేరకు సమాచార హక్కు కింద దాఖలైన పిటిషన్ కు అధికారులు విడ్డూరమైన వివరణలివ్వడం విని, ఆ తతంగాన్ని మీడియాలో వీక్షించి యావద్భారతం విస్తుపోయింది. రాజ్యసభలో ఈ విషయమై పెద్ద దుమారం రేగినప్పుడు కూడా హోంశాఖ అధికారులు ఎప్పట్లాగే కప్పదాటు వైఖరి అవలంబించారు. ఇక భారత ప్రధాని తీరిగ్గా మౌనవ్రతం వీడి... ‘భగత్ సింగ్ అమరత్వం రికార్డులకు అతీతమైంది’ అని నాలుగు కంటితుడుపు మాటలు మీడియాలో ప్రకటించి చేతులు దులిపేసుకున్నాడు. ఇంతా జరిగాక కూడా భగత్ సింగ్ ను అమరవీరుడిగా ప్రకటించడానికి చర్యలు తీసుకుంటామన్న హామీ అటు ప్రధాని గానీ, ఇటు ప్రభుత్వం కానీ ఇవ్వకపోవడం గర్హనీయం! నిజానికి ఆనాడు 1931 మార్చి 23న, అనుకున్న తేదీకంటే ఒక రోజు ముందుగానే, బ్రిటిష్ ప్రభుత్వం అన్నిరకాల న్యాయ నిబంధనల్ని తుంగలో తొక్కి భగత్ సింగ్ ను ఉరితీసిన రోజున, జాతి మొత్తం నిద్రా హారాల్ని మానుకుని కన్నీటి సంద్రమైంది.  జన జీవితం స్తంబించిపోయింది. అప్పటినుండే భారత ప్రజానీకం భగత్ సింగ్ ను ‘అమరువీరుల్లో శ్రేష్ఠుని’ (షహీద్ ఏ ఆజమ్)గా గౌరవించుకుంటోంది. సామాజికాభ్యుదయాన్ని ప్రతిఫలించే ఆశయ సాధన కోసం ప్రాణాలు వదిలిన గొప్ప వ్యక్తుల్ని అమరవీరులుగా గుర్తించి గౌరవించడం ఏ దేశంలోనైనా పరిపాటిగా జరిగే విషయమే. కానీ అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే మనదేశంలో దేశ స్వేచ్ఛ కోసం చిరునవ్వుతో ప్రాణాల్ని బలిదానం చేసిన భగత్ సింగ్ కు లభించిన ఘన సత్కారం ఇది! 


భగత్ సింగ్ టెర్రరిస్ట్ అట! 

భారతీయుల బానిస సంకెళ్లను బదాబదలు చేసే సదాశయంతో ఉరికంబమెక్కిన స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను టెర్రరిస్టులుగా చిత్రించిన ఘన ఖ్యాతి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే, అపర మేధావి కపిల్ సిబల్ నేతృత్వంలోని హెచ్.ఆర్.డి విభాగం ఐ.సి.ఎస్.సి పదో తరగతి పుస్తకాల్లో భగత్ సింగ్ ను టెర్రరిస్టు అని ముద్రించేశారు. అంతేకాదు, ఐఏఎస్ పరీక్షా పత్రంలో భగత్ సింగ్ నేతృత్వం వహించిన ‘రెవల్యూషనరీ టెర్రరిజం’ గురించి విశ్లేషించండనే ప్రశ్నను ఇవ్వడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిజానికి ఆనాడు సాతంత్ర్యోద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసే దురుద్దేశ్యంతో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా, భగత్ సింగ్ తన సహచరుడు బీకే దత్ తో కలసి 1929 ఏప్రిల్ 8న ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు వేసి స్వచ్ఛందంగా అరెస్టయ్యాడు. ఈ సంఘటనలో ఎవ్వరూ చనిపోలేదు. ఎవ్వరూ గాయపడలేదు కూడా. ఆ బాంబులు మనుషుల్ని చంపడానికి ఉద్దేశించినవి కావని బ్రిటిష్ ఫొరెన్సిక్ విభాగమే ధ్రువీకరించి స్వయంగా నివేదిక సమర్పించింది. భారతీయుల నిరసన వాణిని బ్రహ్మ చెవుడు ఆవహించిన బ్రిటిష్ వాళ్ల కర్ణభేరి బద్ధలయ్యేలా వినిపించేందుకు ప్రజలెవ్వరూ లేనిచోట బాంబులు వేశామని, తమ ఆశయాలను కోర్టు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడానికే స్వచ్ఛందంగా లొంగిపోయామని భగత్ సింగ్ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు, బాంబులు, పిస్తోళ్ల సంస్కృతికి తాను వ్యతిరేకిననీ; ఉన్నత భావాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మాత్రమే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వాలు సాధించగలమని లిఖితపూర్వకంగా భగత్ సింగే ప్రకటించాడు. అలాంటి భగత్ సింగ్... మన కాంగ్రెస్ ప్రభుత్వం పండితులకు, మేధావులకు టెర్రరిస్టుగా కనిపించడం దేశం చేసుకున్న దురదృష్టం అనాలా? లేక జాతికి పట్టిన దౌర్భాగ్యం అనాలా? ఏమనాలి?

 భగత్ సింగ్... ఒక ధ్రువతార!


నిజానికి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో శాంతియుత ధోరణి, సాయుధ ధోరణి అని రెండు ప్రవాహాలు కనిపిస్తాయి. శాంతియుత పంథాకు గాంధీజీ నేతృత్వం వహిస్తే; సాయుధ పోరాటానికి భగత్ సింగ్ నాయకత్వం వహించాడు. ఈ రెండు ప్రవాహాల్లో కొనసాగిన సుదీర్ఘ పోరాటాల అంతిమ ఫలితంగా మాత్రమే మనదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అందుకే ప్రజలు కూడా భారత జాతిపితగా గాంధీజీని ఎంతగా అభిమానిస్తారో; అత్యున్నత అమరవీరునిగా భగత్ సింగ్ ను కూడా అంతేస్థాయిలో ప్రేమిస్తారు. స్వాతంత్ర్య సముపార్జనే లక్ష్యంగా మృత్యువునే పరిహసిస్తూ ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ జాతి జనుల గుండెల్లో సదా అమరవీరునిగా నిలిచిపోతారు. ఆనాడు భగత్ సింగ్ ఎలుగెత్తి నినదించిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే రణన్నినాదం అరాజకీయం, అన్యాయం, అధర్మం రాజ్యమేలినంత కాలం భారతీయుల హృదయ స్పందనగా మార్మోగుతూనే ఉంటుంది.

ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ప్రచురితమైన చిన్న రైటప్!!


7 comments:

 1. చాలా బాగా రాశారు నాగరాజ్! భగత్ సింగ్ అమరవీరుడు కాక పోతే ఇంకెవరూ?? రికార్డులకు అతీతం అని పోసుకోలు మాటలు మాట్లాడ్డం వాళ్ల నిర్లజ్జా పూరిత వైఖరిని ప్రభుత్వమే బయట పెట్టుకోవడం తప్ప మరేమీ కాదు

  The legend of Bhagath Singh అజయ్ దేవ్ గణ్ సినిమా చూశారా మీరు? చాలా చక్కగా తీశారు. రాజ్ గురు, సుఖ్ దేవ్, భగత్ లను ఉరి తీయడానికి తీసుకెళ్ళే సమయాన చిత్రీకరించిన పాట "మొరే రంగ్ దే బసంతీ" కదిలించి వేస్తుంది.

  మృత్యువు ఎదురుగా కనిపిస్తుండగా చిరునవ్వుతో వెళ్ళి ఆలింగనం చేసుకునే వాడి కంటే అమరుడెవ్వరు?

  ReplyDelete
  Replies
  1. సుజాత గారు,
   టెర్రరిజానికి, పేట్రియాటిజానికి కనీస తేడా తెలీని మహా మేధావుల పాలనలో జీవిస్తుండడం మన దౌర్భాగ్యం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుండీ కూడా ఈ ప్రభుత్వాలు ఒక్క గాంధీ, నెహ్రూ కుటుంబాల్ని తప్ప, దేశం కోసం ప్రాణాలర్పించిన ఏ ఒక్క యోధుడినీ (మన అల్లూరితో సహా) పట్టించుకున్న పాపాన పోలేదు. అదే క్షమించరాని దారుణ విషయమైతే, అది చాలదని... భగత్ సింగ్ టెర్రరిస్ట్ అనీ, అమరవీరుడు కాడనీ; అలాగే, నేతాజీ చనిపోలేదనీ... బాబా రూపంలో చాలాకాలం జీవించే ఉన్నాడనీ... పిచ్చి ప్రేలాపనలు చేయడం చూస్తుంటే, అసలు వీళ్లు మనుషులా లేక మనుషుల రూపంలో జీవిస్తున్న వింత ప్రాణులా అన్నంత కోపం వస్తుంది? ఈ పనికిమాలిన ప్రబుద్ధుల్ని మానవజాతి ఇంకెంతకాలం భరించాలో???

   The Legend of Bhagat Singh మూవీ చాలాసార్లు చూశానండీ. అవును, రంగ్ దే బసంతీ సాంగ్ చాలా బావుంటుంది. సినిమా కూడా బాగా తీశారు. 1965లో వచ్చిన మనోజ్ కుమార్ షహీద్ మూవీలో మన్నా డే, రఫీ ఎమోషనల్ గా పాడిన సర్షరోషీ కీ తమన్నా... అనే సాంగ్ కూడా చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది.

   పట్టుబడితే ప్రాణాలు దక్కవని తెలిసీ, కోర్టులో స్వచ్చంధంగా లొంగిపోవడం; ఆ తర్వాత జైళ్లల్లో ఉన్న భారత స్వాతంత్ర్య సమరవీరులందరినీ ’’పొలిటికల్ ప్రిజనర్స్’’ గా గుర్తించి గౌరవించాలని ఏకంగా 116 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం, భారతీయ యువకులు దేశ స్వాతంత్ర్యం కోసం నవ్వుతూ ఎలా ప్రాణత్యాగం చేయగలరో చూసే మహత్తర భాగ్యం నీకు దక్కిందని భగత్ సింగ్ తనకు ఉరిశిక్ష విధించిన జడ్జితో అనడం... ఇలాంటి అసాధారణ ధైర్యసాహసాలు, మహోన్నత వ్యక్తిత్వం గురించి విన్నప్పుడు, ఔరా... ఎంతటి అద్భుత వ్యక్తులు వీళ్లు అనిపిస్తుంది.

   Delete
 2. పాఠ్య పుస్తకాల్లో నెహ్రూ, గాంధీల గురించి తప్ప ఎవరి గురించీ గొప్పగా చదువుకోనేలేదు. చదువైపోయినాకే ఇంతింత గొప్పవాళ్ళగురించీ తెలుస్తున్నది యువతరానికి. దేశభక్తి ని నింపాల్సిన వయసులో ఇట్లాంటి వీరుల గురించి చెప్పకపోతే మరి ఇప్పటి నాయకుల్లాంటి వారు కాక దేశభక్తులెందరు తయారు కాగలరు? అయిన దానికీ కానిదానికీ దిసీజ్ ఇండియా అనేసి ఇగిలించేవాళ్ళు తప్ప?

  ReplyDelete
  Replies
  1. లక్ష్మీ దేవి గారూ,

   ఇప్పుడే కాదు స్వాతంత్ర పోరాటపు రోజులనుంచి మొదలుకుని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా, మన దేశం లౌకిక వితండవాదుల చెరలో, ఇంకా చెప్పాలటే లౌకిక వాద చాందసుల చెరలో ఉన్నది. మనకు ఇంకా వీళ్ళ దగ్గరనుంచి విముక్తి దొరకవలసి ఉన్నది. వీళ్ళకు వామపక్ష ఆలోచనా ధోరణులు కూడా కలిసి, మన దేశం చరిత్ర, భారత దేశపు ఔన్నత్యం, మన చదువుల్లో రాకుండా ఈ చాందస వాదులు ఒక పథకం ప్రకారం చాప కింద నీరులాగా యూనివర్సిటీల్లోకి, విద్యా సంబంధిత ఉన్నత పదవుల్లోకి దూరిపొయ్యి, మన చదువుకు సంబంధించిన సిలబస్ లను అవకతవకగా చేసి పారెశారు. అందువలననే మీరు చదువుకున్న రోజుల కంటె చదువు ఐపోయిన తరువాత మాత్రమె గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోగలుగుతున్నారు, మీకు ఆసక్తి ఉంది కాబట్టి. ఆసక్తి లేనివాళ్ళకు ఈ విషయాలు ఎప్పటికీ తెలియవు.

   Delete
 3. లక్ష్మీదేవి గారు,
  గొప్ప వ్యక్తుల ఆశయాలు, ఆలోచనలు ప్రజల్ని ప్రభావితం చేయడం మొదలుపెడితే మొత్తంగా తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే విషయం పాలకులకు బాగా తెలుసు. అందుకే ప్రభుత్వాలు, పాలకులు ఒక పథకం ప్రకారం గొప్పవ్యక్తులను ప్రజలకు దూరం చేస్తూ వస్తున్నారు. ఈ జనరేషన్ కు తెలిసిన గొప్పవాళ్లు ఎవరంటే ఏమాత్రం సామాజిక స్పృహ లేని సినిమాతారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్ వగైరా. లియో టాల్ స్టాయ్ అన్నట్టు, ప్రజలను అజ్ఞానంలో ఉంచడంలోనే ప్రభుత్వాల బలం, మనుగడ దాగున్నాయన్నది అక్షరసత్యం.

  ReplyDelete
 4. భగత్ సింగ్ అమర వీరుడు, అద్భుతమైన స్వాతంత్ర్య వీరుడు, బలి దానం, నవ్వుతూ ఉరి కంబం ఎక్కాడు, జీవితాన్నే త్యాగం చేశాడు. ఆయన మీద సినిమా భలేగా తీశారు! ఇవన్నీ ఎప్పుడూ వినేవే. కాని మన దేశంలో ప్రతివాళ్ళూ (నేనేమీ ఈ సూత్రానికి అతీతుణ్ణి కానే కాదు) కోరుకునేది ఏమిటి! భగత్ సింగ్ పక్కింట్లో పుట్టాలి, మనింట్లో కాదు. మనబ్బాయి మాత్రం శుభ్రంగా చదువుకుని, ఐటి లో ఉద్యోగం, న్యూయార్క్ లో కాపరం. నా ఉద్దేశ్యం మన పిల్లల్ని రెచ్చగొట్టి (పిల్లల్ని రెచ్చగొట్టి నక్సలైట్లల్లోకి రిక్రూట్ చేసే ప్రొఫెసర్ల పిల్లలూ అమెరికాలోనే చదువుకుంటారుష) విప్లవకారులుని చెయ్యక్కర్లేదు. ప్రస్తుతం ఆ అవసరం కూడా లేదు. కనీసం ఎన్ సి సి లేదా ఎన్ ఎస్ ఎస్ లో చేరనిస్తే చాలు. మన పిల్లవాడు వచ్చి మిలటరీలోనో, నేవీ లేదా ఐర్ ఫోర్సులోనో (ఈ మూడిట్లనూ యుధ్ధం చేసే విభాగాల్లో) చేరుతాను అంటె, ముఖ్యంగా మన దక్షిణ భారత దేశంలో, అందులోనూ మధ్యతరగతి కుటుంబాల్లో, ఎవరన్నా ఆ ఆలోచనను ఆదరించి, ఆ పిల్లవాణ్ణి ఆశీర్వదించి పంపుతారా! నాకు నమ్మకం లేదు. పొద్దుట్నించీ ట్యూషన్లు, ఎం సెట్, చదువు ఉద్యోగం, విదేశీ ప్రయాణం ఇదే చట్రంలో బిగిసి పొయ్యాము. భగత్ సింగ్ లకు టైం ప్రకారం నివాళులు మాత్రమే! వారి స్పూర్తి అంది పుచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నరంటారా. నా వల్ల కాలేదు. కానీసం నా వల్ల కాలేదని నాకు తెలుసు.

  ReplyDelete
  Replies
  1. శివరామప్రసాద్ గారు,
   మీరన్నది అక్షరసత్యం. స్వాతంత్ర్యానంతర కాలంలో క్రమంగా ఇండియాలో చాలా మార్పులే వచ్చాయి. నిజాయితీ, నిబద్ధత లాంటి గుణాలు దేశాన్ని పాలించే నాయకుల్లోనే మెల్లగా కనుమరుగవుతూ వచ్చాయి. యథా రాజా, తథా ప్రజా కదండీ. వ్యవస్థలో అవినీతిపరులైన నాయకులు, నేతలు పెరిగిపోతుంటే, వాటి ప్రభావం ప్రజలపై పడకుండా ఉంటుందా? మంచైనా, చెడైనా తన చుట్టూరా ఉన్నవాటిని ప్రభావితం చేయకుండా ఉండదు కదా? స్వాతంత్ర్యం వచ్చాక అధికారంలోకి వచ్చిన నేతలు స్వాతంత్ర్య సమరయోధుల్ని ఏనాడూ ప్రొజెక్ట్ చేసి, వారి క్వాలిటీస్ ని ప్రజల్లోకి చొప్పించిన పాపాన పోలేదు. తద్భిన్నంగా వ్యవస్థలో అన్ని స్థాయుల్లో అవినీతి, అక్రమాలు వేళ్లూనుకుపోవడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోడ్పడ్డారు. ఈ క్రమంలోనే సామాజిక బాధ్యత, సామాజిక ప్రగతి అన్న అంశాలు తెరమరుగైపోతూ వచ్చాయి. దాని స్థానంలో ఇండివిడ్యువల్ గా జీవితంలో కాస్తో కూస్తో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బిజినెస్ పీపుల్, సినిమా తారలు, క్రీడాకారుల్లాంటి వారిని నానా సత్కారాలతో, దేశ హీరోలుగా ప్రొజెక్ట్ చేయడంతో ప్రజలకు కూడా అలాగే జీవించాలి కాబోలు అని, వాళ్ల పిల్లల్ని ఏదో ఒక రూపేణా డబ్బు, హోదా సంపాదించేందుకు ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా నీ బతుకేదో నీవు బతికెయ్, పక్కోడు ఏమై పోయినా ఫర్వాలేదు, సమాజం ఏమైనా కానీ, ఎటైనా పోనీ, పట్టించుకోవాల్సిన పనిలేదు... అన్నది నేటి జీవన విధానంగా మారిపోయేలా చేశారు. 66 ఏళ్లకు పైగా మనదేశాన్ని పాలించిన నేతల, నాయకుల పుణ్యమే ఇది. ప్రజల ఆలోచనా విధానాన్ని అలా తయారు చేశారు. అఫ్ కోర్స్, ఏది ఎల్లకాలం అలాగే ఉండిపోదు కదా. మహా మహా సామ్రాజ్యాలే కనుమరుగైపోయాయి కాలానుగుణ మార్పుల్లో. ఈరోజు కాకపోతే, రేపైనా గొప్పవాళ్ల స్ఫూర్తిని అందుకుని ముందుకు సాగే మనుషులు వస్తారని ఆశిద్దాం. ఆశే మనిషిని నడిపిస్తోంది మరి, అనాదిగా. థాంక్యూ.

   Delete