‘కామ్రేడ్స్! అందరికీ లాల్ సలాం. సకల జీవరాశుల ఐక్యత వర్ధిల్లాలి! ప్రకృతి మాతా జిందాబాద్!! అన్నట్టు, అందరూ కుశలమే కదా?’
‘కుశలమే మృగరాజా. కరోనా కరాళ నృత్యం చేస్తోంది కదా. దీంతో ఆల్చిప్పకు మల్లే, మనిషి స్వగృహ కారాగారవాసం విధించుకున్నాడుగా. ఇళ్లల్లో బందీలైన మనుషుల్ని ఏడవకండేడవకండంటూ ఓదార్పు యాత్ర చేస్తూ పాదయాత్రలో వస్తున్నా.’
‘హహ్హా. భళా గజరాజా! చూస్తోంటే, కాలగమనంలో ఈ ఏడాది తన విశిష్ఠతను ఘనంగానే చాటుకునేలా ఉందోయ్. ప్రకృతికి కొత్త ఊపిరిలూదింది. భూగోళానికి కొంగొత్త సొబగులద్దింది. సకల చరాచర జీవరాశికి నవ్య స్వేచ్ఛనేదో ప్రసాదించింది. ఇక, ఈ భూగోళాన్నే ఎత్తి భుజమ్మీద మోసేంత ఘనులైన మనుషులకు, కరోనాకు మధ్య కురుక్షేత్ర సంగ్రామానికి తెరలేపింది. అందుకే 2020.. ఈ అంకెలోనే ఏదో మ్యాజిక్కుందనిపిస్తోంది.’
’ఊర్కోండి, మహారాజా! మానవాళికి మీరింకే భుజకీర్తులు తొడగకండి. ఈ మనిషికి విశ్వాసమనేది ఏ కోశానా లేదు. ఆకాలంలోనే అప్పుల బాధ తాళలేక ఓ పెద్దాయన , జూదంలో మరో పెద్దాయన స్త్రీమూర్తుల్నే తాకట్టు పెట్టారట. హవ్వ, ఎంతటి చోద్యం! ఇక, ఈ ఘోర కలియుగంలో, బంధాల్నీ, బంధువుల్నీ, భూముల్నీ, బ్యాంకుల్నీ, దేశాన్నీ కూడా తాకట్టు పెట్టే మహానుభావులు బయలుదేరారు. వీరికి స్వప్రయోజనమే సర్వస్వం. స్వార్థ చింతనే తారకమంత్రం. ఛఛ, ఇంతటి నీచ మానవులతోనా నేను తరతరాలుగా విశ్వసనీయ స్నేహం చేసింది. తలచుకుంటేనే సిగ్గేస్తోంది.’
‘నీ ఆవేదనను నేనర్థం చేసుకోగలను శునకమిత్రమా. కర్మఫలం ఎవ్వరినీ వదలదు. ఆ మనిషి బోడి పెత్తనానికి బలికాని ప్రాణి అంటూ ఈ భూగోళం మీద ఉందా అసలు? మనబోటి జీవరాశి సరేసరి. తోటి మనుషుల్నే బానిసల్ని చేసి రాచి రంపాన పెట్టిన ఘనచరిత్ర వారిది. బానిస, భూస్వామ్య, పెత్తందారీ, జమీందారీ లాంటి వివక్షాపూరిత వ్యవస్థల్ని మనమెరుగుదుమా? పేరుకే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క అంటూ ఊకదంపుడు. కాస్త తరచి చూస్తే కులమనీ, మతమనీ, ప్రాంతమనీ, జాతి అనీ, దేశమనీ... ఈ మానవుల చరిత్రంతా వివక్ష, విభజన, విద్వేషాలమయమే. ఈ మనిషనే వాడే కాస్త వింతజీవి, గురూ!’
‘నిజమే ప్రభూ! ఆకలేసో, ఉబుసు పోకో, దంతాలకు దురదపెట్టో... ఏవో చిన్నచిన్న కన్నాలేస్తేనే పొగబెట్టో, బోన్లో బంధించో, మందు పెట్టో చిత్రహింసలు పెట్టి మరీ మమ్మల్ని చంపుతాడే. మరి, ఈ మనిషి ఏకంగా ఓజోన్ పొరకే కన్నమేశాడు. ఇక భూగోళాన్నైతే విచక్షణారహితంగా కుళ్లబొడుస్తున్నాడు. మాకేనా శిక్షలు? ఈ మానవులకేమీ వర్తించవా? ’
‘నీ ఆక్రోషాన్ని ప్రకృతి ఆలకించిందేమో, మూషికమిత్రమా. ఈ మనుషుల కోరలు పీకి, తోకలు కత్తిరించే క్షురఖర్మకు శ్రీకారం చుట్టిన్నట్టే ఉంది. లేకపోతే, ఎంత బడాయి జాతో, ఈ మనుషులది! చెప్పేవేమో జీవకారుణ్యం, పర్యావరణ సమతుల్యతలాంటి శ్రీరంగనీతులు. చేసేవన్నీ కల్తీ, కాలుష్య, కాసారపు, కసాయి పనులు. నింగీ నీరూ నేలా నిప్పూ ఇలా పంచభూతాలపై ఈ మనిషి సాగిస్తున్న విధ్వంస రచనకు అంతర్థానమైపోయిన జీవరాశికి లెక్కాపత్రం ఏమైనా ఉందా? ఈ భూమండలమంతా వీళ్ల బాబు సొత్తైనట్టు, వీళ్ల అజమాయిషీ ఏంటో. ఇది ఒక రకంగా ఈ ధరిత్రిపై మానవులు సాగిస్తున్న నియంతృత్వమే.’
‘నిజమే మహారాజా! నేను కళ్లు మూసుకుని పాలు తాగే జీవినే కావచ్చు. కానీ, నేను కళ్లారా వీక్షించిన వీరి ఆగడాలకు అంతేలేదు. అశ్వమేథ యాాగాలు చేస్తాడు. కాకితో కబురంపుతాడు. చిలుకలతో జ్యోతిషాలు చెప్పిస్తాడు. మైనాతో పాడిస్తాడు. కోళ్లతో కత్తియుద్ధాలు చేయిస్తాడు. ఎద్దులతో జల్లికట్టు ఆడతాడు. పశువుల తోలు వలచి చెప్పులు కుట్టించుకుంటాడు. గొర్రెల కేశాలతో బట్టలు కుట్టించుకుంటాడు. పులిచర్మం కిందేసుకుని ధ్యానం చేస్తాడు. ఏనుగు దంతాలు పీకి బొమ్మలు చేస్తాడు. పాము కోరల్లో విషం తీసి వైద్యం చేస్తాడు. జంతువుల్ని జూలలో బంధించి, సర్కసుల్లో ఆడించి వికృతానందం పొందుతాడు. ఈ మనిషి దాష్టీకాలకు, దురాగతాలకు లెక్కేలేదు. మ్యావ్!’
‘లెస్సపలికితివి మార్జాలమా! పిల్లికి బిచ్చం కూడా పెట్టనివాడు సమసమాజం నిర్మిస్తాడట. సామ్యవాదం సంగతేంటో గానీ, ఉగ్రవాదం మాత్రం సృష్టించాడు. రెండు ప్రపంచయుద్దాలతో ఎనలేని విధ్వంసం సృష్టించాడు. హిరోషిమా, నాగసాకి వినాశనాల్ని మరవగలరా? ఇంత జరిగినా, ఇంకా అణ్వాయుధాలతో కయ్యాలకు సయ్యంటూ భూమాత ఉనికికే విఘాతం తెచ్చేలా ఉన్నాడు.’
‘ముమ్మాటికి వాస్తవం మహారాజా! చైతన్యశీలిననీ, నాగరికతా నిర్మాతననీ ఉత్తర ప్రగల్భాలు పోతాడే. కరవులు, కాటకాలు, మహమ్మారులు, పేదరికం, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, ఆకలిచావులు, హాహాకారాలు ఇదేనా వీరి బోడి నాగరికత? ఇదేనా వీరి చైతన్యం? చివరాఖరికి వీరి సాంగత్య ఫలితాన నాక్కూడా కరోనాను అంటించారు, రెండు వారాల క్వారెంటైన్ మీదట ఈ సమావేశానికి హాజరవుతున్నా. హతవిధీ!’
‘ఎంతటి దుర్గతి దాపురించింది వ్యాఘ్రోత్తమా! ఈ మానవజాతి చేసిన చారిత్రక తప్పిదాల లెక్కను సరిచేసేందుకే ప్రకృతి కరోనావతారం దాల్చిందేమో. చూస్తున్నాంగా, ఈ నాగరిక జీవి ముక్కూచెవులూ పిండి, నోటికి తాళమేసి, కాళ్లూ చేతులు కట్టేసి క్వారంటైన్ చేసింది. ఈ కుహనా సాంఘిక జీవిని సామాజిక జీవనానికి దూరం చేసి లాక్ డౌన్ చేసింది. పోన్లెండి, అత్యంత విషమ పరీక్షా కాలమిది. మానవాళి ఆత్మావలోకం చేసుకోవాల్సిన సమయమిది. మనిషి తన తప్పుల్నుండి గుణపాఠం నేర్చుకుని ఈ మహాగండాన్ని దాటుతాడని ఆశిద్దాం. అన్నట్టు, కరోనాకు స్త్రీ-పురుష, చిన్న-పెద్దా, నీగ్రో-శ్వేత జాతీయులనే కాక, చివరికి మానవ-పశుపక్ష్యాదులునే వివక్ష కూడా లేదనే విషయాన్ని గుర్తెరగాలి. మనం కూడా ఎంతో జాగరూకతతో మెలగాల్సిన తరుణమిది. అందుకే నేటి మన సర్వసభ్యసమావేశం.’
‘నిజమే, మహారాజా! ఈ ఆపద గడియల్లో మీ దిశానిర్దేశానికై మా వృక్షజాతి తరఫున కూడా వేడుకుంటున్నాం!’
‘కామ్రేడ్స్! యధాయధాహి ధర్మస్య.. అన్నట్టు, అరాచకం పెచ్చరిల్లినప్పుడల్లా ప్రకృతి కూడా కొత్త అవతారమెత్తి సమస్థితిని తీసుకొస్తుందేమో. కరోనా అవతారం అదే కావచ్చు. మానవజాతిలా మనకు మందులూ మాస్కులూ లేవు; శానిటైజర్లూ వెంటిలేటర్లూ అసలే లేవు. కాబట్టి, ప్రస్తుతానికి మనం హ్యూమన్ డిస్టెన్స్ పాటిద్దాం. అదే మనకు శ్రీరామరక్ష. రెండోది కీలకమైన బుద్ధుడి మార్గం. యుద్ధం వ్యర్థమని రుజువైంది కాబట్టి మనం శరణాగతి మార్గం అనుసరిద్దాం. ఇకపై కరోనాను మన ఇలవేల్పుగా కొలుద్దాం. సకల జీవరాశిపై చల్లని దయ చూపమని వేడుకుందాం. కరోనా సంహిత అనే వైద్యగ్రంథాన్ని రాసుకుందాం. ఈ ఏడాదిని కరోనా నామ సంవత్సరంగా ప్రకటిద్దాం. కరోనాపై కొత్త కథల్ని, పాటల్ని, నాట్యాల్ని, నాటకాల్ని, సినిమాల్ని, క్రీడల్ని విరచించి కొండాకోనా హోరెత్తేలా చేద్దాం. ప్రస్తుత ప్రపంచ ఏడువింతల్ని పోలిన కరోనా మహల్, కరోనా పిరమిడ్లు, కోవిడ్ గోడ, కోవిడ్ కలోసియం లాంటి కొత్త వింతల్ని సృష్టిద్దాం. మయసభను మించిన కరోనా మ్యూజియాన్ని అమెజాన్ అడవుల్లో నిర్మిద్దాం. చివరగా నైలూనదీ ఒడ్డున నింగినంటేలా స్టాచ్యూ ఆఫ్ కరోనాను ఆవిష్కరించి, జీవరాశికి విముక్తి ప్రసాదించమని సామూహిక అంజలి ఘటిద్దాం. స్వస్తి!’
’కరోనా శరణం గచ్ఛామీ!’