Thursday 14 August 2014

గాడ్ మదర్ !!

[మొన్నామధ్య నట్వర్ సింగ్ పుస్తకంపై మండి పడుతూ నా పుస్తకం నేనే రాసి పారేస్తానని సోనియాగాంధీ ప్రకటించిన నేపథ్యంలో... అసలొస్తుందో రాని మేడమ్ ఆటోబయోగ్రఫీ పుస్తకం ఆధారంగా ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించి ఈనాడు ఎడిట్ పేజీ కోసం రాసిన రైటప్ ఇది, అక్కడ కాలం చెల్లడంతో ఇక్కడికి పట్టుకొచ్చా]

చిత్రం: గాడ్ మదర్
బ్యానర్: ఓన్లీ 44 రీల్స్
నిర్మాణం: కుంభకోణం క్రియేషన్స్
దర్శకత్వం: మేడమ్

కథాకమామిషు:
ఇటాలియన్ మాఫియా తీరుతెన్నుల్ని కళ్లకు కట్టిన హాలీవుడ్ అజరామర చిత్రరాజం ‘గాడ్ ఫాదర్’ని, భారతీయ మహిళ అసాధారణ పోరాటాన్ని ప్రతిఫలించిన బాలీవుడ్ ఆణిముత్యం ‘మదర్ ఇండియా’ని కలిపి మిక్సీలో వేసి గిర్రున గిలక్కొట్టి, కిలోల్లెక్కన భావోద్వేగాల మసాలాల్ని దట్టించిన ఫక్తు క్లాసికల్ మాస్ చిత్రమే... గాడ్ మదర్! ఇదొక భారీ సస్పెన్సు థ్రిల్లర్. చిత్ర కథానాయిక ఇటలీలో పుట్టి ఇండియాలో మాఫియా డాన్ గా ఎలా ఎదిగారన్నదే టూకీగా చిత్ర కథ.

ఛమక్కులు:
పదే పదే అదేపనిగా అవాక్కవడానికి సిద్ధంగా ఉండండిక! ఈ చిత్రానికి కథ, కథనం, కథానాయిక, మాటలు, పాటలు, సంగీతం, నృత్యం, దర్శకత్వం... అన్నీ ఒక్కరే. ఆ ఒక్కరే మేడమ్! దర్శకురాలి నిజ జీవిత చరిత్రే ఈ చిత్ర కథకు ఆధారం. ఇంకో విశేషం ఏమంటే, ఆమె తన అంతర్వాణి అనునిత్యం అప్పుడప్పడు ఉలిక్కిపడుతూ ముక్కుతూ మూలుగుతూ వినిపించే ఆత్మకథను ఒకవైపు సొంతంగా గ్రంథస్తం చేస్తూనే, మరొకవైపు దానిని ఒక అత్యద్భుత కళాఖండంగా సెల్యులాయిడుపై చిత్రిస్తారు. అటు పుస్తకాన్ని, ఇటు సినిమాని, రెండింటినీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని భాషల్లో ఒకే రోజున విడుదల చేస్తారు. చిత్ర విషయానికొస్తే ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. మేడమ్ మనసులో చిత్ర రూపకల్పనకు సంబంధించిన ఆలోచన మొగ్గ తొడుగుతోందన్న సమాచారాన్ని కాకితో కబురందుకున్న 2జి స్పెక్ట్రమ్ క్రియేటివ్స్, బోఫోర్స్ ఏజెన్సీ పిక్చర్స్, కోల్ గేట్ కమర్షియల్స్, ఆదర్శ్ హౌజింగ్ కార్పొరేషన్ లాంటి దిగ్గజ నిర్మాణ సంస్థలు చిత్ర నిర్మాణ హక్కుల్ని చేజిక్కించుకోవడానికి బరిలోకి లంఘించి సర్వశక్తులొడ్డి మరీ పోటీపడ్డాయి. అందరూ భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెప్పడంతో మేడమ్ చేసేదేమీ లేక కలగూరగంప లాంటి మల్టీ కంపెనీ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. చిత్ర ఓవర్సీసు హక్కుల్ని మాత్రం మేడమ్ తన వద్దే అట్టిపెట్టుకున్నారట. పదేళ్లుగా పరిశ్రమలో దడ పుట్టిస్తున్న క్రేజీ కుర్ర హీరో, సొట్టబుగ్గ అముల్ బాబు ఇందులో ఎవ్వరూ ఊహించని, ఎవ్వరికీ అర్థం కాని ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారట. అలనాటి మూకీ చిత్రాల మేరునగధీరుడు సైలెంట్ సింగ్ ఈ చిత్రంలో ఓ విశిష్ట పంజాబీ గీతంలో ఆడి, పాడి హుషారెక్కిస్తారట. సినిమా ప్రచార బాధ్యతల్ని జూనియర్ మేడమ్ పర్యవేక్షిస్తారు. ఈ సినిమా పైరసీని అడ్డుకోవడానికి కండలవీరుడు, పహిల్వాన్ అల్లుడు వాద్రాను పూర్తిస్థాయిలో వాడుకోనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని పాడుబడిన, బూజు పట్టిన 10 జనపథ్ బంగ్లాలో మేడమ్ ఒంటరిగా బాసింపట్టు వేసుక్కూచుని కసిగా కథను సిద్ధం చేస్తున్నారట. దోపిడీలు, కుట్రలు, కుయుక్తుల సన్నివేశాల్ని ఒళ్లు గగుర్పొడిచే రీతిలోనూ; పోలీసుల్ని, కోర్టుల్ని, గూఢచార వ్యవస్థల్ని వెర్రి వెంగళప్పల్ని చేసి ఆడించే చిత్రవిచిత్ర విన్యాసాల్ని కళ్లు జిగేల్మనిపించే రీతిలో ఉండేలా స్క్రిప్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మేడమ్. ఇకపోతే, కొంతకాలంగా పనీ పాడు లేకుండా ఉట్టినే తిని తొంగుంటున్న దుష్ట చతుష్టయం డిగ్గీబాయ్, ఆయారాం రమేషు, కపిల్ త్రోబాల్, సుశీల్ ముండేలు అందుమైన లోకేషన్ల వేటలో దేశవిదేశాలు పట్టుకు ఊరేగుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ సినిమాతో హిట్ కొట్టి పాలిటిక్సులో మట్టికొట్టకుపోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని మేడమ్ నిద్రాహారాలు మాని మరీ గాఠిగా కృషి చేస్తున్నారట.

కిసుక్కులు:
గాడ్ ఫాదర్ లో ఫాదర్ని లేపేసి, మదర్ ఇండియాలో ఇండియాను కప్పెట్టేసి... అడ్డదిడ్డంగా గాడ్ మదర్ అని ఓ దిక్కుమాలిన పేరు పెట్టినంత మాత్రాన అదొక సినిమా అవుద్దా అని అప్పుడే పుకార్లు షికార్లు చేయడం మొదలెట్టాయి. అసలు ఆ కథే ఓ పాత చింతకాయ్, కథనమొక పనికిమాలిన కాకరకాయ్, చివరకు ఆ చిత్రం అవుతుంది ఆటలో అరటికాయ్... అని పరిశ్రమంతా పేరడీలు కట్టి మరీ మూకుమ్మడిగా మెలోడీలు పాడేసుకుంటున్నారు. ఇహ, శని శీతకన్ను వేసి, కుజుడు క్రీగంట చూస్తుండడంతో ఆ సినీ దర్శకురాలికి మరో పదేళ్ల దాకా దగ్దయోగం తప్పదని జ్యోతిశ్శాస్త్ర పండితులు గ్రహగతుల్ని లెక్కగట్టి, కుండబద్ధలు కొట్టి మరీ సవాళ్లు విసరుతున్నారు. దానికితోడు లక్ష శని గ్రహాల పెట్టు అముల్ బాబును సినిమాలో పెట్టుకోవడం అంటే కోరి సర్వనాశనం కొని తెచ్చుకున్నట్టేనని ఛలోక్తులు విసురుతున్నారు. మొత్తంగా ఆ చిత్ర యూనిటే ఒక దిక్కుమాలిన సంత, ఒక తొట్టి గ్యాంగు అని జనాలు కామిడీ చేస్తున్నారు. ఇక శ్యాం జెఠ్మలానీ, ఛత్వార్ సింగ్ లాంటి కురువృద్ధ సినీ విమర్శకులు ఛాన్సు దొరికినప్పుడల్లా చిత్ర కథను, దర్శకురాల్ని చిత్రవధ చేసేందుకు కత్తులు, కటార్లూ సిద్ధం చేసుకుంటున్నారు. అసలా సినిమాకు ఆధారం ఆత్మకథా కాదు, ఆవకాయ పచ్చడీ కాదు, అక్కడాఇక్కడా, ఎక్కడపడితే అక్కడ, ఎవరెవరి కథల్నో కొంచెకొంచెంగా పీక్కొచ్చి అతుకుల బొంతలాంటి ఓ కథను అందంగా అల్లుతున్నారని గాసిప్స్ వైరస్సులా వ్యాపిస్తున్నాయి.

కొసమెరుపు:
బాక్సాఫీసు వద్ద ఈ సినిమా గనక హిట్టు కొడితే, దీనికి సీక్వెలుగా అముల్ బాబుని పెట్టి అరివీర భయంకర రేంజిలో ‘ది వండర్ కిడ్’ అనే సినిమా తీయాలనే ఆలోచన దర్శకురాలికి ఉందట. ఒకవేళ సినిమా గనక ఫట్టంటే తట్టాబుట్టా, మూటాముల్లె సర్దుకుని ఇండియా వదిలి, ఇటలీకెళ్లి పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసుకుంటూ శేషజీవితం గడుపేద్దామనే బృహత్తర రోడ్డుమ్యాపు కూడా మేడమ్ రచించుకున్నారని ఓ భోగట్టా!!


Photo Courtesy: Google

No comments:

Post a Comment