Friday 30 May 2014

తోక జీవితం !!



[ఇవాల్టి ఈనాడులో ప్రచురితమైన రాజకీయ చకోర పక్షుల లైటర్ వీన్ ఒరిజినల్ టెక్స్ట్ ఇక్కడ ఇస్తున్నా. స్టార్టింగ్ నేను రాసిన దాన్ని ఈసారి పిచ్చిపిచ్చిగా మార్చిపారేశారు వాళ్ల అవసరాల మేరకు. కొన్ని చోట్ల కొన్ని వాక్యాల్నే తీసేసారు. హేవిటో. ప్లీజ్ రీడ్. థాంక్యూ :-)]

జీవితం క్షణభంగురం. ఎప్పుడెలా గిరికీలు కొట్టి టపా కట్టేస్తుందో పైవాడికే ఎరుక. జీవితం ఓ నీటి బుగడ. ఎప్పుడు ఠప్ మని బకెట్ తన్నేస్తుందో ఎవ్వరికీ తెలీదు. జీవితం ఓ బంగాళాఖాతం. దిగితే కానీ లోతుపాతులు, అంతూదరీ తెలీవు. జీవితం ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచులాంటిది. ఏ నిమిషానికి ఏ మలుపు తీసుకుంటుందో నిశ్చయంగా చెప్పడం కష్టం. జీవితం ఓ థంబోలా గేములాంటిది. ఎవ్వరికి ఏ నెంబరుతో అదృష్టం వరిస్తుందో ఏ మేధావీ చెప్పలేడు. జీవితం ఓ స్టాక్ మార్కెట్ లాంటిది. ఎప్పుడు పాతాళానికి తంతుందో, ఎప్పుడు ఆకాశానికెత్తేస్తుందో కొమ్ములు తిరిగిన ఆర్థికవేత్తలకు సైతం అర్థం కాని పజిల్. ఇలా జీవితానికి సవాలక్ష నిర్వచనాలు, శతకోటి విశ్లేషణల్ని ఇచ్చుకోవచ్చు. ఛస్, జీవితాన్నిలా కొలవడమేమిటోయ్, పిచ్చి కాకపోతే, జిందగీని అనుభవించి పలవరించాలంతే అని గిరీశం లాంటోళ్లు గావుకేక పెట్టొచ్చుగాక. అయినా సరే, అదీ ఓ రకం నిర్వచనమే. ఇలాంటివన్నీ గ్రంథస్తం చేద్దామంటే, రాసుకోవడానికి చైనాగోడ, రాయడానికి మన జీవితం రెండూ సరిపోవు మరి. అదో చిక్కు.  

జీవితమంటే ఫర్లేదు. కిందా మీదా పడి ఎలాగోలా బండిని లాగించేయొచ్చు. కానీ, జీవితానికో తోక ఉంటుంది. అదే శేష జీవితం. వచ్చిన చిక్కంతా ఆ తోక జీవితంతోనే. క్రికెట్టునే తిని, తాగి, తొంగొనే ఓ గొప్ప ఆటగాడికి రిటైరయ్యాక ఏం చేయాలన్నది ఓ చిక్కుముడి. సినిమాల్లో ముఖానికి రంగేసి, చిందేసి, రఫ్పాడించే ఓ మహా నటుడికి తెరకు వీడుకోలు పలికాక ఏం చేయాలన్నది ఓ భేతాళ ప్రశ్న. అస్తమానం యుద్ధాలు, ఉగ్రవాదం, ఉపద్రవాలు, మన్నూమశానంతో నెత్తీనోరూ బాదుకునే అరివీర భయంకర అగ్రరాజ్య అధ్యక్షుడికి పదవి ముగిశాక ఏం చేయాలన్నది ఎటూ పాలుపోని ఓ బ్రహ్మపదార్థం. అచ్చంగా ఇలాగే మొన్న ఎన్నికల్లో చావుదెబ్బ తిని, చేతులెత్తేయడంతో పాటే, కళ్లూ ముక్కూ చెవులూ అన్నీ తేలేసిన మన రాజకీయ ఉద్ధండ పిండాలు శేషజీవితాన్ని ఎలా గడుపుతారు, ఏం చేస్తారు అన్నది కించిత్ ఆసక్తి గొలిపే అంశం. జన ఛీత్కారం, పదవుల పరాభవం మూటగట్టుకున్న మన నాయకమ్మణ్యులు తోకజీవితాన్ని ఎలా గడుపుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

పేరు: శ్రీమాన్ రాహుల్ బాబా
ప్రదేశం: శంకరిగిరి మాన్యాల్ 
ప్రత్యేకత: హస్త సాముద్రికా ప్రావీణ్యం.

మా నానమ్మ ఎప్పుడూ ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి అని ఓ కథ చెబుతుండేది. అదేదో కట్టుకథో, కాకమ్మ కథో అయ్యుంటుందిలే అని పెద్దగా పట్టించుకోలా. కానీ అసలు విషయం ఇప్పుడర్థమైంది. జీవితమంటే ఇన్నాళ్లూ పంచభక్ష్యాలు వడ్డించిన వెండి కంచం అనుకునేవాణ్ని. కానీ ఇలా కుక్కలు చింపిన, కాకులు కుళ్లబొడిచిన విస్తరి అవుతుందని కలలో కూడా అనుకోలేదు. అరవై ఏళ్లుగా జనం నెత్తిన శఠగోపం పెడుతూ, కాదు కాదు గొడుగు పడుతూ వచ్చిన హస్తం పార్టీకి ఈ స్థాయిలో హ్యాండిచ్చి బొంద పెడతారని ఏనాడూ ఊహించలేదు. అదేంటో నేను పాదం మోపిన చోటల్లా భస్మీపటలం సంభవించింది. ప్చ్.. పవరున్నప్పుడే పెళ్లి చేసుకుని ఉన్నా బావుండేదేమో. ఇప్పుడు పిల్లనిచ్చేవాడే కాదు, కనీసం గడ్డం గీసేవాడూ కరువైపోయాడు. నా పరిస్థితి రెంటికే కాదు, అన్నింటికీ చెడ్డ రేవడైపోయింది. రాజమాత చెప్పాపెట్టకుండా తట్టాబుట్టా సర్దుకుని ఇటలీకెళ్లిపోయింది. ఆస్థాన ముసలిసింహాలూ, కురువృద్ధులంతా అంపశయ్యమీద పడి హాహాకారాలు పెడుతున్నారు. ఇన్నాళ్లూ అమ్మ కొంగు పట్టుకుని అముల్ బేబీలాగా తిరిగినవాణ్ని. ఇప్పుడిలా హఠాత్తుగా రోడ్డున పడేసరికి దిక్కుతోచడం లేదు. కాళ్లరిగేలా తిరిగి తిరిగి, చివరికిలా శంకరగిరి మాన్యాల్ని వెదుక్కుని హస్తసాముద్రికాలయం పెట్టుకున్నా. జనం చేతుల్లో ముష్టిఘాతాలు తిన్న ప్రతోడూ చచ్చినట్టు ఇక్కడికే వస్తాడు కదా. అలాంటి అమాయక జీవుల్ని దొరకబట్టి, వాళ్ల హస్తవాసి చూస్తూ, పిట్టకథలు చెప్పుకుంటూ శేషజీవితాన్నిలా లాగించేద్దామనుకుంటున్నా.

పేరు: షోమాన్ గజన్
ప్రదేశం: చెంచల్ గూడా జైలు
ప్రత్యేకత: కెరీర్ కౌన్సెలింగ్

మహానేత తుపాకీ గొట్టంలోంచి దూసుకొచ్చిన తూటాని నేను. మడమ తిప్పని, మాట తప్పని ఫ్యాక్షన్ చరిత్ర నాది. విలువల కోసం, విశ్వసనీయత కోసం ఎంతటి అఘాయిత్యానికైనా తెగించే పవిత్ర హృదయం నాది. ఓదార్పుమంత్రాన్ని నమ్ముకుని అధికారమే ఆశగా, శ్వాసగా జీవిస్తున్న చకోరపక్షిని నేను. నా బ్యాంకు బ్యాలెన్సు కోసం మా నాన్న ప్రజాసంక్షేమాన్ని తాకట్టు పెడితే, దానికి నేనా బాధ్యుణ్ని? తీసుకెళ్లి జైల్లో బందీ చేస్తారా? ఇదేనా న్యాయం, ఇదేనా ధర్మం అని నేను హడగదలచుకున్నా. చివరికి నానా గడ్డీ కరిచి, కనిపించిన ప్రతోడి కాళ్లావేళ్లా పడి దుర్భర జైలు జీవితం నుండి విముక్తి పొందాల్సి వచ్చింది. తర్వాత తిండీతిప్పలు మాని మరీ ముడుపులపాయలో దీక్షలు చేశా. అమ్మతో అర్చనలు చేయించా. బామ్మర్దితో ప్రార్థనలు జరిపించా. నేనొదిలిన బాణం చెల్లాయితో తీర్థయాత్రలు చేయించా. కోట్లు వెదజల్లా. మద్యాన్ని వదరలు పారించా. ఇంత చేసినా పదవి యోగం మాత్రం పట్టకనేపాయె. గ్రహాలన్నీ కట్టగట్టుకుని మరీ నామీద కుట్ర పన్నిన్టట్టున్నాయి. నమ్ముకున్న హైకమాండు నట్టేట మునిగిపాయె. నేనేమో (ఫ్యాన్) రెక్కలు తెగిన పక్షినయ్యా. థూ... దిక్కుమాలిన జీవితం! ఇక ముందున్నవన్నీ గడ్డుదినాలే. ఆ నమోవాలా, ఈ సైకిల్ వాలా కలసికట్టుగా నా తాట తీస్తారేమో. శ్రీకృష్ణజన్మస్థాన పునర్దర్శనం తప్పేట్టు లేదు. నేనూ దానికే డిసైడైపోయా. ఈ పదేళ్లలో చెత్తాచెదారం, గడ్డీగాదం తిన్న ప్రతోడు తప్పక చెంచల్ గూడాకే వస్తారు కదా. అక్కడే వాళ్లందరినీ ఓదార్చి, వాళ్లందరికో ఉపాధి మార్గం చూపించి శేషజీవితంలో ఊరట పొందేందుకు ప్రయత్నిస్తా.

పేరు: క్రేజీ భూత్ నాథ్
ప్రదేశం: ఢిల్లీ శ్మశానవాటిక
ప్రత్యేకత: భూత, ప్రేత, పిశాచాల్ని వదిలించడం.

అవినీతి హఠావో, సమచార చట్టం, తోటకూర కట్ట, కొబ్బరిమట్ట ఇట్టాంటివన్నీ ఒకప్పటి నా నినాదాలు. ఆ చెత్తతో పోగేసిన గాలి కబుర్లన్నీ విని జనం జేజేలు పలికారు. ఢిల్లీ పీఠం కట్టబెట్టారు. నాక్కొంచెం తిక్కుంది కదా. తర్వాతర్వాత తిక్క లెక్కలేసి, తింగరి వేషాలేసి, చీపురు పట్టుకుని, జనం నెత్తిన టోపీ పెట్టడం మొదలెట్టాను. ప్రత్యర్థుల్నందరినీ నువ్వు నమో తాలూకు నామాల కాకివా, అంబానీ పంపిన అక్కుపక్షివా అని ఏకి పారేశా. చీల్చి చెండాడా. జనం మంగళహారతులు పట్టి ప్రధాని పీఠం కట్టబెడతారనుకుంటే చీపురు తిరగేసి వీపు విమానం మోత మోగించారు. ఉన్నదీ పాయె, ఉంచుకున్నదీ పాయె అంటే ఇదేనేమో. ఒక్కటి మాత్రం నిజం. వందకోట్ల జనాభాకి నమో దెయ్యం పట్టింది. ఇక ఈ అయిదేళ్లూ ఖాళీనే కదా. చేతబడి, క్షుద్రపూజలు, భూతవైద్యం వగైరా విద్యలపై పూర్తి పట్టు సాధించి, చీపురు చేతబట్టి జనాలకి పట్టిన నమో దెయ్యాన్ని వదిలించి తరిమేయకపోతే నా పేరు గుజ్రీ, ఛీఛీ క్రేజీ భూత్ నాథే కాదు. హ్హా!!


4 comments:

  1. Replies
    1. ధన్యవాదాలండీ స్వర్ణమల్లిక గారు :-)

      Delete
  2. బాగుంది. ఇంకా బోలెడు మంది చకోర పక్షులు ఉన్నారు సార్!

    -Murali

    ReplyDelete
  3. నిజమేనండీ మురళి గారు.
    కానీ ఈనాడోళ్లు వీళ్ల గురించి రాస్తేనే వేసుకుంటారు మరి :-)

    ReplyDelete