Tuesday 31 December 2013

కొత్త నిర్ణయం!

Disclaimer: 

ఇటాలిక్ అక్షరాల్లో... నేను
బోల్డ్ అక్షరాల్లో ... నా అంతరాత్మ

నేను vs నా అంతరాత్మ!


యా..హూ..!
ఏం రోగం??
జాన్ ఫస్ట్ కమింగ్... 
హేవిటీ....?
జనవరి ఫస్ట్ వచ్చేస్తోంది!
ఆ... వస్తే...?
న్యూ ఇయర్  కదా....
ఆ... అయితే...?
ఫ్రెష్ ఇయర్, ఫ్రెష్ ఐడియాస్, ఫ్రెష్ రెజల్యూషన్స్, ఫ్రెష్ లైఫ్, ఫ్రెష్....
ఆగక్కడ... విసిగించక, విషయానికిరా...
కొత్త ఏడాది... కొత్త నిర్ణయాలు తీసుకోవాలి కదా...
తమరికలాంటి రక్త చరిత్ర లేదుగా... ఇప్పుడెందుకీ అఘాయిత్యం?
ఆ... అప్పుడంటే... ఇలాంటివి తెలీక పెద్దగా పట్టించుకోలా...
ఇప్పుడేమొచ్చింది... బుర్రలో జ్ఞానదీపం వెలిగిందా?
అంత సీను లేదు గానీ, అందరూ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారుగా...
అంటే... అందరూ చేస్తేనే చేస్తావా? నీకంటూ ఓన్ ఇండివిడ్యువాలిటీ లేదా...?
నలుగురితో పాటే నారాయణా, చైతన్యా, రాఘవులూ, నీవూ, నేనూ, అందరూనూ....
ఏంటా పిచ్చి వాగుడు? నీవూ నేనూ ఓకే. ఈ నారాయణా చైతన్యా రాఘవులూ ఎవరు?
పాత సామెతకు ఓ నాలుగు తోకలు తగిలించా, పడుంటాయని. బాగోలేదా?
ఏడ్సినట్టే ఉంది. నీలో రానురాను విషయం తక్కువ, వాగుడెక్కువైపోతోంది....
నువ్వు నా ఇమేజీని మరీ దారుణంగా డ్యామేజీ చేసిపారేస్తున్నావ్....
అబ్బ.. ఛ... నీదో పవన్ కళ్యాణ్ ఇమేజీ, దానికో డ్యామేజీ..?
బాబూ... అన్ సివిలైజ్డ్ అంతరాత్మా, నీకో దణ్ణం. నా మానాన నన్నొదిలెయ్? 
చాల్లే నిష్టూరం? నేను లేక నీవు లేవు... తెలుసా? 
సర్లే.... ప్రస్తుతానికి దయ చెయ్..
సరే, కాసేపలా పైరగాలి పీల్చుకొస్తా...
ప్లీజ్.....
బ్లాగుంది కదాని, అడిగేవాడు లేడు కదాని, అడ్డదిడ్డంగా పిచ్చి రాతలు రాయమాక...
యూ....
ఓకే ఓకే... బై...
థాంక్స్... 

*****

వీడేం అంతరాత్మండీ, బాబూ! హార్ట్ లెస్ ఆర్కేలాగా.. డెవిల్స్ అడ్వకేటులాగా... నాన్ స్టాపుగా, నాన్సెన్సుగా, న్యూసెన్సు ప్రశ్నలేసి దుంప తెంచుతున్నాడు. మాంచి భూతవైద్యుడితో చేతబడి చేయించి, పీక మీద పిన్నో, దబ్బునమో గుచ్చి, వీడి పీడ వదిలించుకుంటే గానీ జీవితానికి ప్రశాంతత ఉండదు. ఇతగాడి క్రాస్ క్వశ్చనింగ్ దెబ్బకు బుర్ర హీటెక్కి అసలు కంటెంట్ ఆవిరైపోయింది. రెండంటే రెండు నిమిషాల్లో... రాద్దామనుకున్న విషయాన్నే మర్చిపోయేలా చేసి, నన్ను వీర గజినీలా మార్చేశాడంటే, వీడు మామూలోడు కాదు బాబోయ్. ఇప్పుడేం చేయను? ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం.

*****

ఆ...
యురేకా...  Got it...
గుర్తొచ్చింది...
నేను న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకోవాలి.
మన, సారీ... నా అంతరాత్మారామ్ వచ్చేలోపే ఆ పనేదో కానిచ్చేయాలి. 
లేకపోతే కాల్చుకుతింటాడు. ఒకటే నస మేళం!

ఈ కొత్తేడాదిలో....
# ఏకువనే బ్రహ్మ ముహూర్తంలో ఠంచనుగా ఏడింటికే నిద్ర లేవాలి!
# రోజూ జాగింగు కెళ్లాలి, వీలైతే మినిమమ్ నాలుగు పలకలు ట్రై చేయాలి!!
# ఇకపై వారంలో కనీసం ఒక్కరోజన్నా ఆఫీసు పంచ్..  టైముకే కొట్టాలి!
# ‘డే ప్లాన్’ అంటూ ఒహటుండాలి! దాన్ని రాత్రంతా మేల్కొని రివ్యూ చేయాలి!
# వారానికి నాల్గు సిన్మాలకు మించి చూడరాదు. ఆరునూరైనా ఏడాదికో పుస్తకం చదివి తీరాల్సిందే!
# డెయిలీ డైరీ రాయాలి! అన్నీ నిజాలే రాయాలి! అబద్ధాలు అస్సలు రాయరాదు!!

ఛస్, వెధవ జీవితం! 
భూమి పుట్టినప్పట్నుంచీ ప్రతోడూ ఇవే పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకోవడం...
అటూఇటూగా ఓ వారం రోజులు పల్టీలు కొడుతూ ప్రయత్నించి, వాటికి పాతరేసి, మళ్లా మరుసటేడాది ఘోరీ తవ్వి అవే నిర్ణయాల్ని కొత్తగా తీసుకోవడం... ఓహో... బాగుంది వరస! చూల్లేక చస్తున్నామిక్కడ. ఏదైనా కొత్తగా చేయండి, బాబయ్యా!

ఓ గ్గాడ్! 
మళ్లీ తగలడ్డావా! 
వీడో పెద్ద ఫెవికాల్ అయిపోయాడే...
నీకిస్తానుండు... ఓ పవర్ ఫుల్ పంచింగు పలక్నామా!!

ఈ కొత్తేడాదిలో....
# రోజూ సిక్స్ ప్యాక్స్ సిగార్స్ ఉఫ్...మని ఊదేసేలా (గిరీశంలా) నన్ను నేను తీర్చిదిద్దుకోవలె!
# మా ప్రెస్ క్లబ్బులో చీపుగా లభించే విస్కీ, రమ్ము, జిన్, వైన్ వగైరా ఇకపై రోజూ తాగేలా సిద్ధమవ్వవలె!
# అర్జంటుగా బైక్ నేర్చుకుని, ఈ ఏడాదైనా చిత్రవిచిత్ర బైక్ విన్యాసాలతో కనీసం గిన్నీసన్నా ఎక్కవలె!

ఓల్డే... 
ఓల్డే... 
హల్లో బాస్! 
నువ్వేం రాస్తున్నావో / మాటాడుతున్నావో, కనీసం నీకన్నా అర్థమవుతోందా?
నీకంత దృశ్యం లేదు గానీ... ఏదన్నా జరిగే విషయాలు చెప్పబ్బా!

వీడికి 
నేను బాగుపట్టమూ ఇష్టం లేదు. 
అలాగని చెడిపోవడమూ ఇష్టం లేదూ. 
ఎట్టా చచ్చేదిరా భగమంతుడా. సరే... 

ఈ కొత్తేడాదిలో....
# బస్సులూ ,రైళ్లూ, ఇమానాలు అస్సలెక్కను!
# హాస్పిటల్లో చచ్చినా సరే అడ్మిట్ అవను!!
# నాకు పెళ్లై పిల్లలు పుట్టాక గవర్మెంటు బళ్లు, కాలేజీల్లో వాళ్లను కేజీ నుండి పీజీ దాకా ఫీజుల్లేకుండా చదివిస్తా!

ఓర్నీ బండబడా!
నీ అసాధ్యం తగలడా!
ఏం మాట్టాడుతున్నావయ్యా!
ఇంకొన్ని ఇట్టాంటి మాటలు వింటే నేను తిరిగిరాని లోకాలకో, కోమాలోకో ఎళ్లిపోతానేమో. అమంగళం ప్రతిహతమగుగాక! మనుషులు ఇట్టాంటి నిర్ణయాలు కూడా తీస్కొంటారా, నా నాయనే? నా తండ్రే! 

ఒరేయ్...!
అర్థం పర్థం లేకుండా వాగే అంతరాత్మా!
ఊరకే నోట్లో నరం లేకుండా , మెడపై మెదడు లేకుండా వాగడం కాదు...
నీవు నిజంగా నా అంతరాత్మవే అయితే...
నీకే గనక ఓ బుర్ర ఉంటే, అందులో బూడిద పదార్థం (గ్రే మేటర్) అనేదే ఉంటే...
ఓ నిర్ణయాల చిట్టా చెప్పవోయ్... చూద్దాం.
ఆఆ......... !

ఓయ్...
ఊర్కే తెగ ఇదైపోయి..
ఉట్టినే ఆవేశపడిపోమాక...
బీపీ పెరిగి బుర్రలో నరాలు చిట్లిపోగలవ్ జాగర్త..
సరే, నీ ఛాలెంజీని స్వీకరించి చెబుతున్నా...
వినుకో... రాజా!

ఈ కొత్తేడాదిలో...
# ఆ దిక్కు మాలిన ఫేస్ బుక్కు మూసేయాలబ్బా!
# ఆ పనికి మాలిన ప్లస్సుల జోలికి అస్సలు పోరాదబ్బా!
# అస్తమానూ ఆ బ్లాగుల్లో పడి ఊరేగడం అర్జంటుగా బందు చేయాలబ్బా!!


ఉరేయ్... 
ఉరేయ్...
ఉరేయ్...
ఆపరా....
నీ నాలుక పడిపోనూ. 
నీ గుండె కాయ ఆగిపోనూ..
నీ తలకాయ బద్దలవనూ.... 
అవేం ముదనష్టపు మాటలోయ్... 
కళ్లు పేలిపోతాయ్. పళ్లు రాలిపోతాయ్. గోళ్లు సాగిపోతాయ్. 

ఓహో...
నువ్వేగా ...
కాలరెగరేసి సవాళ్లు విసిరావ్...
నిన్ను ట్విట్టర్లో పెట్టి పిచ్చిపిచ్చిగా ట్వీట్ చేసి చంపేస్తానేమనుకున్నావో... ఆయ్.
అంతరాత్మలతో అణిగి మణిగి ఉండాలబ్బా... నువ్వన్నా చెప్పు సిద్ధప్పా!

అయ్యా...!
అంతరాత్మగారూ...!
బుద్ధొచ్చింది... ఇకపై అంతరాత్మలతో ఆలింగనాలే తప్ప అంతర్మథనాలు అస్సలు చేయను!
సివరాఖరగా... ఒకే ఒక్క నిర్ణయం తీసుకుని సెలవు తీసుకుంటా....

ఈ కొత్తేడాదిలో...
#  అస్సలు ఎలాంటి కొత్త నిర్ణయాలూ తీసుకోరాదని నిర్ణయించుకున్నా!

ఏయ్ స్టడీ....
ఏవైంది బాబయ్యా....
హర్ట్ అయ్యావా.... 
పోెన్లే... ఇక వేధించను.
అవునూ.. 
ఇది కొత్త నిర్ణయమా?
ఇదో..... చెత్త నిర్ణయం !! 
ఛీ... వ్యాక్... నాకు నచ్చలే. 

నాకు నచ్చింది...
చెత్త నిర్ణయమైనా...
ఇదే నా ‘కొత్త నిర్ణయం’!
ఈ జీవితానికి ఇదే నిర్ణయం!
ఇంతే సంగతులు. చిత్త గించవలెను!!

ఆగండాగండి....

వన్ మినిట్... మరచిపోయా...

అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు
కొత్త వసంతంలో మీరు తలపెట్టినవన్నీ సాకారం కావాలని మనసారా కాంక్షిస్తూ...

సెలవ్... మరి!!


7 comments:

  1. >>అస్సలు ఎలాంటి కొత్త నిర్ణయాలూ తీసుకోరాదని నిర్ణయించుకున్నా!

    అంతరాత్మ అభిప్రాయాల్ని పట్టించుకోనందుకు అభినందనలు. :)

    ReplyDelete
  2. రమణగారు,
    (అంతర్)ఆత్మ నాశనము లేనిది. దానిని శస్త్రము ఛేదించజాలదు. అగ్ని దహించజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. అయితే అంతరాత్మలను పట్టించుకోకుండా వదిలివేయవచ్చును అని గీతలో కృష్ణ భగవానుడు సెలవిచ్చాడు. నేను అమలు పరిచాను. అంతే. నేను నిమిత్తమాత్రుణ్ణి :-)

    ReplyDelete
  3. అందుకనే నేను ఎప్పుడూ ఆచరణ సాధ్యమైన నిర్ణయాలే తీసుకుంటాను.
    రోజుకి నాలుగు పాకెట్ల కన్నా ఎక్కువ సిగరెట్లు కాల్చను, శని ఆదివారాలు, పండగలు, పబ్బాలకి, మనసు బాగా లేకపోయినప్పుడు,తప్ప. అప్పుడు కూడా ఇంకో రెండు పాకెట్లు కన్నా ఎక్కువ కాల్చను.
    ఇత్యాదులు....దహా.

    ReplyDelete
    Replies
    1. హహ్హా... భలే చెప్పారండీ.
      మీలాగే ఆచరణ సాధ్యమైన వాటినే నేను శిరోధార్యంగా స్వీకరిస్తాను. ఏ సంవత్సరమూ ఏ నిర్ణయాలూ తీసుకోకపోవడం అన్నదే చాలాకాలంగా ఆచరణ సాధ్యంగా కనిపిస్తోంది కాబట్టి ఆనవాయితీని కంటిన్యూ చేసేనండీ ఈ దఫా కూడా.
      అన్నట్టు, గురువు గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. కావలిస్తే నిత్యం ఓ నాలుగు పోస్టులు ఎక్కువ రాయండి గానీ, అగరుబత్తుల పొగను తగ్గించగలరని హృదయపూర్వక విన్నపం. థాంక్యూ మీ ఛమత్కార వ్యాఖ్యకు :-)

      Delete
  4. అంటే నీకంటూ సొంత అంతరాత్మ లేదా...?బులుసు గారు చెప్పారని ఆచరించటమేనా.. ఓసారి ఆయనగారి వెనుక అప్పడాల కర్ర ఉంటుందేమో కదా చూసుకోవద్దా...?
    ఇకపోతే ఏమిటా నిర్నయాలు ,అంతరాత్మలంటే ఎవరనుకున్నావ్ ,మనలోనే ఉంటూ మనల్ని నడిపించే మన (యమ)పాశాలు.నీకిప్పుడే అర్దం కాదులే ,నిన్ను నడిపించే ఆ ...ఆ....ఆ...త్మ లేదు కదా.. అప్పటివరకూ, నా మాట వింటూ ఉండు. ఇట్లు అక్కాత్మ:-)).
    (బులుసు సుబ్రమణ్యం గారికి క్షమాపణలతో)

    ReplyDelete
    Replies
    1. ఆత్మను నాశనం చేయలేము...
      అలాగే సృష్టించనూ లేము....
      అయితే, ఆత్మను ఒకరూపం నుండి మరొక రూపంలోకి భేషుగ్గా మార్చవచ్చును. దీన్నే భూత-ప్రేత శాస్త్రంలో ‘ఆత్మ నిత్యత్వ నియమం’ అంటారు. అనివార్యమగు, అసాధ్యమగు ఈ విషయం తెలిసిన వాడే.. స్థిత ప్రజ్ఞుడని గీతలో నాచే చెప్పబడింది. ఇక్కడికి ఆత్మ-ప్రేతాత్మల పర్వము సమాప్తము. వావ్.. అక్కాత్మ = అక్క + ఆత్మ, ఇదేదో ‘కణాదేశ సంధి’లా కనిపిస్తోంది. ఏంటో ఈ సంధుల గోల ప్రేతాల్లా వేధిస్తున్నాయి 25 ఏళ్లుగా :-)

      Delete
    2. సందులు వదిలెయ్యాలి, రాజమార్గాలు (సమాసాలు ) ఉండగా మనకీ దేశసందులెందుకు .

      Delete