Friday 9 August 2013

బుడుగోపాఖ్యానం!

మడిషన్నాక కూసంత కళాపోసనుండాల! లేకపోతే మడిషికీ, మన్మోహనసింగుకీ తేడా ఏటుంటాది!! ఇలా అని నేనన్లేదు. బాబాయ్ అంటుంటాడు. ఈ సింగెవరో నాకూ తెలీదు. ఢిల్లీలో ఉంటాట్ట. నాకు మా గల్లీ వోళ్లు మాత్రమే తెల్సు. సింగుక్కూడా పెద్దగా బోల్డన్నీ మాటలూ గట్రా రావట. సరిగా నడవడం చేతగాదట. అచ్చం నాలాగే ప్రతీదానికీ అస్తమానం అమ్మా అమ్మా అని కొంగుపట్టుకు తిరుగుతుంటాట్ట. ఇలా అని బాబాయే చెప్పాడు. బాబాయికిలాంటివి బోల్డు తెలుసు. ఎందుకంటే వాడు పొద్దస్తమానం గుడ్లగూబలా కళ్లప్పగించి టీవీ చూస్తుంటాడు. అందుకే వాడిక్కుంచెం బుర్ర పాడైపోయి ఇలాంటి డైలాగులన్నీ చెప్పేస్తుంటాడు. డైలాగులంటే తలాతోక లేకండా ఎలా పడితే అలా వాగేసేవన్నమాట. ఇలా అని నేనన్లేదు. బామ్మ అంటుంది. బామ్మక్కొంచెం మతిమరుపు. పాపం,  వయసైపోయింది కద. బామ్మకిప్పుడు ప్ఫదో, అరవయ్యో వయసుంటుంది. నాకంటే కుంచెం ప్పెద్దన్నమాట. పెద్ద వయసేం కాదు, కానీ కళ్లద్దాలు, మతిమరపొచ్చే వయసన్నమాట. అందుకే బామ్మ, బాబాయిని బడుద్దాయనీ, నన్నేమో హారి... పిడుగా అంటుంటుంది. బడుద్దాయంటే తిట్టటవన్నమాట. కానీ హారి పిడుగా అంటే పొగట్టమన్నమాట. నన్ను చూస్తే బామ్మకు బోల్డంత భయం. అందుకే నన్ను బాగా పొగిడేస్తుంది. లేడీస్ పొగిడితే నాకు ఒకటే సిగ్గు. బామ్మ కూడా లేడీసు కిందకే వస్తుందిలే.


 నా చిన్నప్పుడు బస్సులు, రైళ్లు నడిచేవి. ఇప్పుడంతా బందులు నడుస్తున్నాయి. బందుల్ని ఎవరు నడిపిస్తారంటే... తెలంగాణ, సమైక్యాంధ్ర కలిసి నడిపిస్తాయట. ఎవరికోసం నడిపిస్తారంటే... ఢిల్లీ వాళ్ల కోసం నడిపిస్తారట. అలా అని అమ్మ అంటుంది. అమ్మక్కూడా కుంచెం బానే విషయాలు తెలుసు. నా అంత కాదనుకోండి. అమ్మ సీరియళ్లు చూసీచూసీ బోరు కొట్టేసినప్పుడు వార్తలు గట్రా చూస్తుందన్నమాట. వార్తలంటే తెలంగాణ, సమైక్యాంధ్ర అన్నమాట!! నాక్కొంచెం అవమానమొచ్చి, ఏమ్.... మన ఐదరాబాదు కోసం బందులు చేయరా? అంటే, నోర్మూసుకో, వేల్డంత లేవు, పెద్ద విషయాలు నీకెందుకోయ్ అని నెత్తినో మొట్టికాయేస్తుంది. అప్పుడు నాకేమో ఒళ్లు మండుకుపోయి బోల్డంత ఖోపమొచ్చేస్తుంది. నేనేమన్నా చిన్నా వాడినా, చితకా వాడినా? నా అంతటి వాణ్ని నేను. బుడుగు అనుమానాల్ని భరించేవాడు కాడు. అందుకే మళ్లీ అడిగా అమ్మని. ఏమ్... మన ఐదరాబాదు కోసం బందులు చేయరా? అని. ఛస్... పోకిరీ వెధవా, వాగుడుకాయలా విసిగించావంటే.. చ్ఛితక్కొట్టి బళ్లో పడేస్తానేమనుకున్నావో, యెళ్లు బయటికి అని అమాంతం తెగ ఖోప్పడిపోయింది. సీరియళ్లు చూసీచూసీ అమ్మక్కుంచెం కోపమెక్కువైపోతోంది రానురాను. నాన్నకు చెప్పి బాగా ప్రెవేటు చెప్పించాలి. లేకపోతే మన సీక్రెట్లన్నీ కనిపెట్టేసి అస్తమానం భయపెట్టేస్తది. బడులుండడం చాలా డేంజరు. ఇది అనుభవమ్మీద నేనే కనిపెట్టా. ఈ బందుల్మీద మనక్కూడా పెద్దగా అభిప్రాయాల్లేవు. అభిప్రాయాలంటే అవి బాబాయికి ఉండేవన్నమాట. అయితేగియితే బందుల వల్ల బోల్డు లాభాలుంటాయ్. బందులుంటే బడులుండవన్నమాట. రెంటికీ పడదు. ఒకటుంటే ఒకటుండదు. నేనైతే బందులుండాలనే అనుకుంటా. అప్పడైతే ఎంచక్కా క్రికెట్టు ఆడుకోవచ్చు. సీగానపెసూనాంబతో షికార్లు కూడా చేస్కోవచ్చు. బందులుంటే అందరికీ ఆడిందే ఆట, పాడిందే పాట!!




 ఓ రోజు, అంటే చాల్రోజుల క్రితం, మా ఇంటో టీవీలో, వాడిపేరేంటబ్బా - గబుక్కుని గుర్తు రావట్లేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తాలే - పొడుగాటి రింగుల జుట్టేస్కుని, ఎర్ర చొక్కాయేస్కుని, ముఖానికి నల్లరంగేస్కుని, కర్రపుల్లలా చిన్నబ్యాటుచ్చుకుని - వాడిసైజుకది చిన్నదే - అప్పుడు దొరకిన వాణ్ని దొరికినట్టుగ.. వందో, థౌజండో రన్స్ చితక బాదుతున్నాడా, నేనాట్టే గుడ్లప్పగించి చూస్తున్నానా.... ఇంతలో ఠకీమని పాలిటిక్సు పెట్టేశాడు నాన్న. పాలిటిక్సంటే వార్తలు. వార్తలంటే ఇందాకే చెప్పా కదా.. తెలంగాణ, సమైక్యాంధ్ర అని. టీవీలలో ఇవెప్పుడూ ఉంటాయ్. నాన్నకు చేస్కోవడానికి పనేం లేక పాలిటిక్సు చూస్తుంటాట్ట! పని లేకపోతే వంట చేయొచ్చుకదా అంటుందమ్మ. అది అమ్మ అభిప్రాయం. అమ్మ అభిప్రాయానికి పెద్ద విలువేం లేదనుకోండి. నాన్న పాలిటిక్సు పెట్టీగానే నాకప్పుడు బోల్డంత విపరీతమైన ఖోపమొచ్చేసింది. వెంటనే నాన్నను నా బ్యాటుతో అమాంతం కొఠేద్దామనుకున్నా. కానీ, నాన్న నాకంటే కుంచెం పెద్దవాడు కదా. పైగా, నాన్నను కొడితే అమ్మ మాత్రమే కొట్టాలట. ఎవరు పడితే వాళ్లు కొట్టరాదట. అలా అని బామ్మ అంటుంది. అది బామ్మ అభిప్రాయం. నా అభిప్రాయం వేరనుకోండి. పోన్లే నాన్నే కదా అని వదిలేశా. లేపోతే, ఆరోజు ఇండో-చైనా యుద్దవైపోయేదంతే. ఇండో-చైనా యుద్ధవంటే ఇప్పుడప్పుడే జరగనిదట. అలా అని బాబాయ్ చెప్పాడు. ఆ రోజు నా మనోభావాలు మొత్తం దెబ్బతినిపోయాయ్. ఎందుకంటే నా అంతటి వాణ్నినేను. నాన్న అంతటి వాడు, వాడు. నాక్కోపమొస్తే నాన్నను వాడు అంటాను. అది నాన్నకు వినిపించదనుకోండి. ఎప్పుడేనా, మనోభావాలు దెబ్బతింటే వెంటనే ఖండించాలట. తర్వాత క్షమాపణలు కోరమని డిమాండు చేయాలట. ధర్నా చేయాలట. చివరకు దాడికి దిగాలట. అవరసమైతే అన్నింటినీ బందు చేయాలట. మనోభావాలంటే ఇంత పెద్దగుంటాయట. ఇది కూడా బాబాయే చెప్పాడు. చెప్పా కదా, వాడు అస్తమానం టీవీ చూస్తుంటాడని. వాడికిలాంటివి చాలా తెలుసు. నాక్కూడా తెలుసనుకోండి. బాబాయ్ కూడా అప్పుడప్పుడు పాలిటిక్సు చేస్తుంటాడు. అందుకని పెళ్లీగిళ్లీ చేస్కోడట. పెళ్లి చేస్కుంటే పాలిటిక్సు సరిగా చేయలేమట. అది బాబాయ్ అభిప్రాయం. హైకమాండుకు వేరే అభిప్రాయముంది. హైకమాండంటే అమ్మ, నాన్న, బామ్మలన్నమాట. బాబాయికి పెళ్లి చేస్తేనే పిచ్చి కుదురుతుందట. పిచ్చి అంటే పాలిటిక్సనుకుంటూ అలా బలాదూర్ తిరగడమట. పెళ్లి మీద నాకూ ఓ అభిప్రాయముందనుకోండి. యేడిశావులే, నీ బోడి అభిప్రాయమెవడిక్కావాలోయ్ అంటారందరూనూ. నేను డ్యామింసల్ట్ అనేస్తా. బామ్మ తిట్టినప్పుడల్లా బాబాయ్ అలాగే అంటుంటాడు.


నా చదువు ఓ సమస్యట! సమస్యంటే బుక్కులుగిక్కులు, ఫీజులుగీజులు, బందులుగిందులూ బాగా పెరిగిపోయాయి కదా, అందుకన్నమాట. అలా అని బామ్మ, అమ్మతో అంటుంది. నేనందుకే బడికి రాజీనామా చేసిపారేస్తానన్నా. ఊర్కె, అస్తమానం బళ్లో కూచోటం నావల్లకాదు, నేను కూడా బాబాయిలా పాలిటిక్సులో చేరతానన్నా! బామ్మ, ఆ మాట విని బడవాఖానా అని తిడుతుంది. బామ్మకు కోపమొస్తే అలా అంటుంది. నాకు కోపమొస్తే జాటర్ ఢమాల్ అంటాను. ఈ మాటలకు అర్థాలుండవ్. అంటే అర్థం పర్థం లేని మాటలన్నమాట. అది వేరే సంగతి. యిందాక, రాజీనామాలంటే ఏంటో చెప్పలేదు కదూ. అయిందానికీ, కానిదానికీ చేసేవే రాజీనామాలట. అలా అని నాన్న టీవీ చూసేటప్పుడు పాలిటిక్సులో రాజీనామాలు చేసినోళ్లనీ, చేయనోళ్లనీ ఇద్దరికీ ప్రెవేట్ చెప్పేస్తుంటాడు. ప్రెవేట్ అంటే తిట్టడవన్నమాట. రాజీనామాలుంటాయ్ కాబట్టే పాలిటిక్సంటే నాకు బోల్డిష్టం. పాలిటిక్సులో చేరితే... బడికెళ్లి చదూకోవాల్సిన పనుండదట. ఎవరికైనా ప్రెవేటు చెప్పేయొచ్చట. మనల్నెవరూ అడిగేవాళ్లే ఉండరట. కావలిస్తే రాజీనామా చేసేసి ఇమానమొక్కేసి ఢిల్లీకెళ్లిపోవచ్చుట. బాబాయ్ చెప్పాడు. పాలిటిక్సులో బోల్డన్ని లాభాలు కాబట్టే, వాడు చదూగిదూ లేకుండా పాలిటిక్సులో బలాదూర్  తిరిగేస్తున్నాడు. మనం సీక్రెట్టుగా బాబాయిని కాకా పట్టి మెల్లిగా పాలిటిక్సులోకెళ్లిపోవాలి. ఈ విషయం నాన్నకు తెలీకూడదు. తెలిస్తే రౌడీ రాస్కిల్ అని తిడతాడు. రాస్కీల్ అనేది తెల్లొళ్ల భాష. రాజకీయాల్లో ఉన్నదంతా రౌడీలేనంటుంది బామ్మ. పక్కింటి పిన్నికీ, వాళ్ల మీసాల మొగుడుగారికీ ఈ విషయమసలే తెలీకూడదు. ఎందుకంటే వాళ్లసలే లోకులు. లోకులంటే కాకులన్నమాట. అలా అని బామ్మే అంటుంది. అర్జంటుగా యెళ్లిపోయి, సీగానపెసూనాంబకు పాలిటిక్సు విషయమై గాఠిగా ప్రెవేటు తీసుకోవాలి. ఆ పిల్లదసలే మట్టిబుర్ర! యెళ్లొస్తా. జై జాటర్ ఢమాల్!!! :)


[P.S: ఏదో సరదాకి రాసిందిది, ఎవరి మనోభావాలూ నొప్పించడానిక్కాదు :) ]

[Photos Courtesy: Google Images & Sridhar Cartoons!!]



5 comments:

  1. చాలా బావుంది. ముద్దుగా బుడుగులాగే..

    ReplyDelete
  2. Mee tapa chala comedy ga undi.daanikitho patu alocinsavalasina vishayalu teliparu.good.

    www.ahmedchowdary.blogspot.in

    ReplyDelete
  3. bale undi adbutaha. pada prayogalu acham mullapurdi varivi lagane unnai

    ReplyDelete
    Replies
    1. అచ్చు ముళ్లపూడి వారికి మల్లేనే ఉండడం ఏంటీ.... ఆ పదాలన్నీ ఆయనవే కదా, కిట్టీ :-)
      చదివి కామెంటినందుకు థాంక్సో :-)

      Delete