Thursday, 7 May 2020

గీత బోధ!

‘నమస్తే, డాక్టర్!’

‘నమస్తే. చెప్పండి.’

‘ఏం చెప్పమంటారు డాక్టర్. ఒకప్పుడు కృష్ణశాస్త్రి బాధను ప్రపంచం పట్టించుకునేది. అవసరమైతే ప్రపంచం బాధను శ్రీశ్రీ అక్కున చేర్చుకునేవాడు. ప్చ్! కథ మొత్తం అడ్డం తిరిగింది సార్. ఇప్పుడంతా ఒకే కథ. కరోనా వ్యథ. క్వారంటైన్ గాథ. లాక్ డౌన్ బాధ. ఈ కకావికలం... నెవ్వర్బిఫోరూ, ఎవ్వరాఫ్టరండీ.’

‘నీక్కొంచెం తిక్క, ఆ తిక్కకో లెక్క, ఆ లెక్కకో టైమింగు, ఆ టైమింగుకో రైమింగు... ఇలా చాలానే ఉన్నట్టున్నాయ్. ఇండస్ట్రీలో జెండా పాతకపోయావా?’

‘ఊరుకోండి మహానుభావా! నా క్వారంటైన్ ప్రసవ వేదనకే దిక్కు లేదు. ఇక సినీ కళాపోషణ మాట దేవుడెరుగు. జీవితం మరీ బిగ్ బాస్ హౌసులా తయారైంది. పూటకో కష్టం. రోజుకో గండం. ఇవన్నీ రాస్తే రామకోటిని దాటిపోతుంది. తీస్తే కార్తీకదీపం సీరియల్ని మించిపోతుంది. తట్టుకోలేకపోతున్నా సార్.’

‘సర్లేవోయ్. పాండవులకే తప్పలేదు అరణ్య అజ్ఞాతవాసాలు. రాముడంతటి వాడు సైతం వనవాసం తప్పించుకోగలిగాడా? బుద్ధుడైనా బోధిచెట్టు చెంత చిరదీక్షా తపస్సమీక్షణలో బందీ కాలేదా? వాటితో పోలిస్తే నీ క్వారంటైన్ గోడు అసలు ఓ లెక్కలోదేనా? ఊరికే నస కాకపోతే!’

‘ఏంటి సార్ ఈ వివక్ష? సీతమ్మ తల్లిని కాసేపలా పక్కన పెట్టండి. పీత కష్టాలు మాత్రం కష్టాలు కావా? నా కడగండ్లనలా ఆటలో అరటిపండులా, కూరలో కరివేపాకులా తీసిపారేస్తారా?’

‘సరేనయ్యా. చరిత్రలో ఇదేం కొత్త కాదని మాటవరసకి రెండు ఉదంతాలు చెప్పాలే. పోనివ్వు. తమరి బాదరబందీలేవో ఏకరవు పెట్టండిక.’

‘అదో చాంతాడంత చిట్టా సార్. ఇంటిపట్టునుండి ఉట్టినే తినితినీ, పొట్ట చుట్టుకొలత రెట్టింపైంది. ఫోన్లో వైరస్ వార్తలు చూసీచూసీ దగ్గరిచూపు దగ్ధమైంది. బయటి ప్రపంచంతో సంబంధాలు దూరమై దూరపుచూపు దుమ్ము కొట్టుకుపోయింది. సబ్బులేసి రుద్దీ రుద్దీ చేతులు కొలిమిలోంచి తీసిన చింతనిప్పులయ్యాయి. జుట్టు కీకారణ్యమవడంతో ఓ పక్క శిరోభారం, మరోపక్క వినికిడికి అవాంతరం. ముక్కును మాస్కుతో కప్పీ కప్పీ ఏ వాసనా తెలీట్లేదు. పొద్దస్తమానం పద్మాసనమేసి వెన్నులో పోటొచ్చింది. నడక దూరమై కాళ్లల్లో పట్టు తగ్గింది. శ్రమ కరవై ఒళ్లు గుల్లయ్యింది. అంతేనా, కొలెస్ట్రాల్ మేటలేస్తోంది. షుగర్ ఫ్యాక్టరీ మొదలైంది. రక్తపోటు రెండో నెంబరు హెచ్చరిక జారీ చేసింది. హార్టు బీటు కాస్త అపశృతి చేస్తోంది.  థైరాయిడ్ తకధిమి తోం నాట్యం చేస్తోంది. విటమిన్లు పాతాళానికి పడిపోయాయి. మొత్తంగా శరీరం లాక్ డౌనై, ఆరోగ్యం క్వారంటైన్ అయిపోయింది మహాప్రభో!! ’

‘వార్నీ బండబడా! చంపేశావుగా. క్వారంటైన్ మైండ్ ఈజ్ కాళకేయాస్ వర్క్ షాప్ అనే కొత్త సామెతను పుట్టించావు. ఇదంతా గూగుల్ తెచ్చిపెట్టిన తలనొప్పిలే. ఇప్పుడు అందరూ పట్టా లేని డాక్టర్లే. సమాచార సునామీలో చిక్కి సొంత శల్యపరీక్షలకు ఒడిగడుతున్నారు. మిథ్యను సత్యమనుకుంటారు. లేని జబ్బును ఉందనుకుంటారు. అణువంత సమస్యను భూతద్దంలో చూసి బ్రహ్మాండం చేసుకుంటారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అనే నానుడి అతికినట్టు సరిపోతుంది.’

‘ఓ మై గాడ్! టక్కున అంత మాటనేశారేంటి సార్. అసలివి సమస్యలే కావంటారా?’

‘పూర్తిగా కొట్టిపారేసే సమస్యలు కావనుకో. కానీ, అంతలా పట్టించుకోవాల్సినంత ఆరోగ్య విపత్తులైతే కావని నా గట్టి నమ్మకం.’

‘అలా కాదు, డాక్టర్. శరీరమనే కాదు. మనసు కూడా తీవ్రంగా గాయపడింది.  తనివితీరా తుమ్మలేం. ధైర్యంగా దగ్గలేం. అయినవాళ్లతోనూ ఆప్యాయంగా మాట్లాడలేం. మాస్కులేని మనిషిని నమ్మలేం. సాటి మనిషితో సరదాగా గడపలేం. టీవీ చూస్తే భయం. పేపర్ చదివితే ఆందోళన. వైరస్ లెక్కలు చూస్తే డిప్రెషన్. ఓవైపు ఓసిడీ. మరోవైపు వెంటాడే కోవిడ్ విభ్రాంతి. కన్ను తెరిస్తే కరోనా. కన్ను మూస్తే కరోనా. బతుకంతా కలగాపులగపు కరోనా అన్నట్టుంది. ఇప్పుడు చెప్పండి సార్. మానసిక బాధలకు శల్యసారధ్యం వహిస్తున్నానని వీటిని కూడా కొట్టిపారేస్తారా? ’

‘పరిస్థితి కాస్త శృతి మించిందయ్యా. నిజానికిది కరోనా తెచ్చిపెట్టిన క్వారంటైన్ సహిత లాక్ డౌన్ తాలూకు సోషల్ డిస్టెన్స్ వల్ల వచ్చిన సిండ్రొమ్. దీనిపేరు ‘కొవిడ్ ఇండ్యూస్డ్ డెల్యూజనరీ హైపోకాండ్రియాక్ సిండ్రొమ్!’

‘వామ్మో..! అంత పెద్ద జబ్బా? మరి ఇది తగ్గేదెలా, డాక్టర్? ’

‘ప్రస్తుతానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే గీత బోధ. ’

‘అదేంటి డాక్టర్. మనిషి పోయాక కదా, గీత సారం వినిపిస్తారు. జబ్బులకు కూడా గీత బోధ పనిచేస్తుందా?’ 

‘నో నో! నేను చెబుతున్న గీత, సంక్లిష్టమైన భగవద్గీత కాదు. సరళమైన, సూక్ష్మమైన గీత సూత్రం. తరతరాలుగా ఉన్నదే. అదే పెద్దగీత-చిన్నగీత థియరీ. కరోనా అనేది అతి పెద్ద గీత. నీవు ఏకరవు పెట్టిన గోడంతా కలిపి చాలా చిన్న గీత అన్నట్టు. కాబట్టి, అతి చిన్న గీతను మరిచిపో. కావలిస్తే ఆ గీతనే బుర్రలోంచి తుడిచెయ్. కర్కశ కరోనా బారిన పడనందుకు సంతోషించు. ఇక నోటికి మాస్కేసి క్వారంటైన్ చెెయ్. పిచ్చి ఆలోచనలకు తాళమేసి లాక్ డౌన్ చెయ్. నాకు ఫీజు కట్టి బయటకు దయ చెయ్.’ 

‘హ్మ్!’ 

Monday, 4 May 2020

అంజలీ మీనన్ దృశ్యకావ్యం... KOODE !!

నింగి కాన్వాస్ పై
హరివిల్లు రంగవల్లి వేస్తే;

నిశి కాగితంపై
మిణుగుర్లు సంతకం చేస్తే

నిశ్శబ్ద వీణపై
మాట సమ్మోహనరాగం మీటితే

నిర్వేద ఛాయల్ని
సంతోషాల సంజీవనేదో మాయం చేస్తే..

అది అంజలీ మీనన్ తీసిన దృశ్యకావ్యం ‘Koode’ (Together) సినిమా అవుతుంది!!

నిన్న రాత్రి నేను... ఫ్రెండ్ మురళీ ఇంట్లో ఉన్నా. ఇంకో ఫ్రెండ్ క్రాంతి కూడా అక్కడే ఉన్నాడు.  డిన్నర్ కి కూచునే ముందు ఏదైనా మంచి ఫీల్ గుడ్ మూవీ చూద్దామనిపించింది. అదే విషయం మురళీకి చెప్పా. మురళీ కాసేపు సెర్చ్ చేసి అంజలీ మీనన్ తీసిన ‘koode’ అనే మూవీ పెట్టాడు. హాట్ స్టార్ లో ఉందిది. తారాగణం పృథ్విరాజ్, నజ్రియా, పార్వతి వగైరా.

కథగా చెప్పుకుంటే.. సింపుల్ లైనే. అన్నాచెల్లెళ్ల మధ్య అల్లుకున్న భావోద్వేగాల ప్రయాణం. ఇంకాస్త సంక్షిప్తంగా విశదీకరించే ప్రయత్నం చేస్తా. అమ్మానాన్నా ఓ అబ్బాయి కలిగిన ఓ చిన్ని కుటుంబం. ఆ ఫ్యామిలీలోకి ఓ పాప నాలుగో వ్యక్తిగా ప్రవేశిస్తుంది. ఐతే, ప్రాణాంతక జబ్బుతో పుట్టిన ఆ పాప ఎక్కువకాలం బతకదని తెలుస్తుంది. నాన్నేమో మెకానిక్. తనకొచ్చే సంపాదన ఆ పాప మెడిసిన్స్ కి కూడా సరిపోని పరిస్థితి. ఈ సిచుయేషన్లో  చెల్లిని సాధ్యమైనంత ఎక్కువకాలం బతికించుకోవాలనే తపనతో అన్నయ్య (హీరో) చిన్నతనంలోనే గల్ఫ్ కెళతాడు. అలా ఏళ్లపాటు గల్ఫ్ లో పనిచేస్తున్న అన్నయ్యకు చెల్లి మరణవార్త తెలుస్తుంది. ఇండియా తిరిగొచ్చాక చెల్లి జ్ఞాపకాలతో, తనకు మాత్రమే కనిపించే చెల్లితో అన్నయ్య సాగించే ఎమోషనల్ జర్నీనే...  ఈ మూవీ.

ఈ మూవీలో బ్యూటీ ఏంటంటే... ప్రతీ పాత్ర కూడా...  ఇంకో పాత్ర తాలూకు హ్యాపీనెస్ కోసం పాటుపడడం. చెల్లి ఆరోగ్యం కోసం అన్నయ్య చదువు మానేసి గల్ఫ్ కెళతాడు. అన్నయ్య జీవితంలోంచి వేదనను తొలగించి సంతోషాన్ని నింపాలనే తాపత్రయం చెల్లిది. ప్రేమించిన వ్యక్తి జీవితంలో ఆనందం పంచాలని తాపత్రయపడే పాత్ర ఇంకోటి. కష్టాల్లో ఉన్న గురువును ఆదుకోవాలని ప్రయత్నించే పాత్ర మరొకటి. చిన్ననాటి కొడుకు కలకు ఓ అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చే నాన్న. ఉట్టి కాళ్లతో ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లలకు కొత్త షూ తొడిగే హీరో. ఇలా ప్రతీ పాత్రలోను ఎంత కొంత త్యాగం చేసి, పక్క వ్యక్తి హ్యాపీగా ఉండాలని కోరుకునే ఇంపర్సనల్ నేచర్ కనిపిస్తుంది. నిజానికి సినిమా ఆరంభంలోనే స్కూల్లో... ప్రార్థన గీతం కింద విశ్వకవి రవీంద్రుడి where the mind is without fear అనే పోయెంతో మొదలవుతుంది. డైరెక్టర్ తాలూకు అభిరుచి, బ్రాడ్ నెస్ కు ఆ సీన్ ఓ ప్రతీక. ఇక ప్రతీ సన్నివేశాన్ని ఓ దృశ్యకావ్యంగా మలచడంలో డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ తీసుకున్న శ్రమ, శ్రద్ధ వెలకట్టలేనివి. అలాగే ప్రతీ సన్నివేశాన్నీ ఎమోషనల్ గా ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ పాత్ర కూడా చెప్పుకోతగ్గదే.

ఈ మూవీలో చిన్నతనంలోనే కుటుంబానికి, అనుబంధాలకు దూరమై ఎక్కడో సుదూర దేశంలో ఏళ్ల తరబడి పెట్రోల్ బావుల్లో పనిచేసి ముభావిగా, ఏ ఫీలింగూ పైకి కనిపించని అంతుబట్టని వ్యక్తిగా పృథ్విరాజ్ చక్కగా నటించాడు. ఇక, తన ఆరోగ్యం కోసం ఎక్కడో శ్రమిస్తున్న ప్రత్యక్షంగా కనిపించని అన్న కోసం జ్ఞాపకాలను క్రియేట్ చేసి, భద్రపరచి, ఆ తర్వాత అన్నయ్య తిరిగొచ్చాక ఆయన ఆనందం కోసం, భవిష్యత్తుకోసం పరితపించే చెల్లిగా నజ్రియా నటనే ఈ మూవీకి ఆయువుపట్టు. ఇక, మ్యారిటల్ రిలేషన్ తెగదెంపులు చేసుకుని, అనేక అవమానాలను భరిస్తూ ప్రవాహానికి ఎదురీతే పాత్రలో పార్వతి నటన సింప్లీ సూపర్బ్. సినిమా ఆద్యంతం అద్భుతమైన భావోద్వేగాలను పండిస్తూ చివరకు పాజిటివ్ నోట్ తో మూవీని ముగించడం అభినందనీయం. చార్లీచాప్లిన్ మూవీస్ లో సినిమా ఆద్యంతం ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొన్నా చివరకి ఓ పాజిటివ్ నోట్ తో మూవీ ముగుస్తుంది. జీవితం పట్ల ఆ డైరెక్టర్ తాలూకు ఆశావహ దృక్పథాన్ని అది సూచిస్తుంది.  బాక్సాఫీస్ హిట్, ఫ్లాపులనే ఫార్ములాకు అతీతంగా కొందరు సినిమాల్ని చిత్రీకరిస్తారు. అంజలీ మీనన్ ఆ కోవలోకే వస్తారు. చూసినంత సేపు ఓ అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లి, చూశాక చాలాకాలం పాటు మనల్ని వెంటాడే మూవీ.. ఈ koode !