Monday, 4 May 2020

అంజలీ మీనన్ దృశ్యకావ్యం... KOODE !!

నింగి కాన్వాస్ పై
హరివిల్లు రంగవల్లి వేస్తే;

నిశి కాగితంపై
మిణుగుర్లు సంతకం చేస్తే

నిశ్శబ్ద వీణపై
మాట సమ్మోహనరాగం మీటితే

నిర్వేద ఛాయల్ని
సంతోషాల సంజీవనేదో మాయం చేస్తే..

అది అంజలీ మీనన్ తీసిన దృశ్యకావ్యం ‘Koode’ (Together) సినిమా అవుతుంది!!

నిన్న రాత్రి నేను... ఫ్రెండ్ మురళీ ఇంట్లో ఉన్నా. ఇంకో ఫ్రెండ్ క్రాంతి కూడా అక్కడే ఉన్నాడు.  డిన్నర్ కి కూచునే ముందు ఏదైనా మంచి ఫీల్ గుడ్ మూవీ చూద్దామనిపించింది. అదే విషయం మురళీకి చెప్పా. మురళీ కాసేపు సెర్చ్ చేసి అంజలీ మీనన్ తీసిన ‘koode’ అనే మూవీ పెట్టాడు. హాట్ స్టార్ లో ఉందిది. తారాగణం పృథ్విరాజ్, నజ్రియా, పార్వతి వగైరా.

కథగా చెప్పుకుంటే.. సింపుల్ లైనే. అన్నాచెల్లెళ్ల మధ్య అల్లుకున్న భావోద్వేగాల ప్రయాణం. ఇంకాస్త సంక్షిప్తంగా విశదీకరించే ప్రయత్నం చేస్తా. అమ్మానాన్నా ఓ అబ్బాయి కలిగిన ఓ చిన్ని కుటుంబం. ఆ ఫ్యామిలీలోకి ఓ పాప నాలుగో వ్యక్తిగా ప్రవేశిస్తుంది. ఐతే, ప్రాణాంతక జబ్బుతో పుట్టిన ఆ పాప ఎక్కువకాలం బతకదని తెలుస్తుంది. నాన్నేమో మెకానిక్. తనకొచ్చే సంపాదన ఆ పాప మెడిసిన్స్ కి కూడా సరిపోని పరిస్థితి. ఈ సిచుయేషన్లో  చెల్లిని సాధ్యమైనంత ఎక్కువకాలం బతికించుకోవాలనే తపనతో అన్నయ్య (హీరో) చిన్నతనంలోనే గల్ఫ్ కెళతాడు. అలా ఏళ్లపాటు గల్ఫ్ లో పనిచేస్తున్న అన్నయ్యకు చెల్లి మరణవార్త తెలుస్తుంది. ఇండియా తిరిగొచ్చాక చెల్లి జ్ఞాపకాలతో, తనకు మాత్రమే కనిపించే చెల్లితో అన్నయ్య సాగించే ఎమోషనల్ జర్నీనే...  ఈ మూవీ.

ఈ మూవీలో బ్యూటీ ఏంటంటే... ప్రతీ పాత్ర కూడా...  ఇంకో పాత్ర తాలూకు హ్యాపీనెస్ కోసం పాటుపడడం. చెల్లి ఆరోగ్యం కోసం అన్నయ్య చదువు మానేసి గల్ఫ్ కెళతాడు. అన్నయ్య జీవితంలోంచి వేదనను తొలగించి సంతోషాన్ని నింపాలనే తాపత్రయం చెల్లిది. ప్రేమించిన వ్యక్తి జీవితంలో ఆనందం పంచాలని తాపత్రయపడే పాత్ర ఇంకోటి. కష్టాల్లో ఉన్న గురువును ఆదుకోవాలని ప్రయత్నించే పాత్ర మరొకటి. చిన్ననాటి కొడుకు కలకు ఓ అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చే నాన్న. ఉట్టి కాళ్లతో ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లలకు కొత్త షూ తొడిగే హీరో. ఇలా ప్రతీ పాత్రలోను ఎంత కొంత త్యాగం చేసి, పక్క వ్యక్తి హ్యాపీగా ఉండాలని కోరుకునే ఇంపర్సనల్ నేచర్ కనిపిస్తుంది. నిజానికి సినిమా ఆరంభంలోనే స్కూల్లో... ప్రార్థన గీతం కింద విశ్వకవి రవీంద్రుడి where the mind is without fear అనే పోయెంతో మొదలవుతుంది. డైరెక్టర్ తాలూకు అభిరుచి, బ్రాడ్ నెస్ కు ఆ సీన్ ఓ ప్రతీక. ఇక ప్రతీ సన్నివేశాన్ని ఓ దృశ్యకావ్యంగా మలచడంలో డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ తీసుకున్న శ్రమ, శ్రద్ధ వెలకట్టలేనివి. అలాగే ప్రతీ సన్నివేశాన్నీ ఎమోషనల్ గా ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ పాత్ర కూడా చెప్పుకోతగ్గదే.

ఈ మూవీలో చిన్నతనంలోనే కుటుంబానికి, అనుబంధాలకు దూరమై ఎక్కడో సుదూర దేశంలో ఏళ్ల తరబడి పెట్రోల్ బావుల్లో పనిచేసి ముభావిగా, ఏ ఫీలింగూ పైకి కనిపించని అంతుబట్టని వ్యక్తిగా పృథ్విరాజ్ చక్కగా నటించాడు. ఇక, తన ఆరోగ్యం కోసం ఎక్కడో శ్రమిస్తున్న ప్రత్యక్షంగా కనిపించని అన్న కోసం జ్ఞాపకాలను క్రియేట్ చేసి, భద్రపరచి, ఆ తర్వాత అన్నయ్య తిరిగొచ్చాక ఆయన ఆనందం కోసం, భవిష్యత్తుకోసం పరితపించే చెల్లిగా నజ్రియా నటనే ఈ మూవీకి ఆయువుపట్టు. ఇక, మ్యారిటల్ రిలేషన్ తెగదెంపులు చేసుకుని, అనేక అవమానాలను భరిస్తూ ప్రవాహానికి ఎదురీతే పాత్రలో పార్వతి నటన సింప్లీ సూపర్బ్. సినిమా ఆద్యంతం అద్భుతమైన భావోద్వేగాలను పండిస్తూ చివరకు పాజిటివ్ నోట్ తో మూవీని ముగించడం అభినందనీయం. చార్లీచాప్లిన్ మూవీస్ లో సినిమా ఆద్యంతం ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొన్నా చివరకి ఓ పాజిటివ్ నోట్ తో మూవీ ముగుస్తుంది. జీవితం పట్ల ఆ డైరెక్టర్ తాలూకు ఆశావహ దృక్పథాన్ని అది సూచిస్తుంది.  బాక్సాఫీస్ హిట్, ఫ్లాపులనే ఫార్ములాకు అతీతంగా కొందరు సినిమాల్ని చిత్రీకరిస్తారు. అంజలీ మీనన్ ఆ కోవలోకే వస్తారు. చూసినంత సేపు ఓ అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లి, చూశాక చాలాకాలం పాటు మనల్ని వెంటాడే మూవీ.. ఈ koode !


కష్టజీవి క్వారంటైన్ వాసం!!

‘హాయ్, నా పేరు కరోనా! ’

‘నా పేరు కష్టజీవిలే! మా బాధల్ని వంద రెట్లు పెంచి, మా బతుకుల్ని భయాల బందీకానాలో బిగించిన దుష్టజీవివి నీవేనా? ’

‘ఊ. ఎలా ఉన్నారు?’

‘ఏవుంది?! రాళ్లూరప్పలున్నాయి. కొండలు గుట్టలున్నాయి. గొడ్డూ గోదా ఉంది. మేమూ ఉన్నాం. అంతే. పెద్ద తేడాయేం లేదు. మొన్నటిదాకా కనీసం నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేవి. నీవొచ్చాక ఆ పిడికెడు మెతుకులకీ కటకటే. దొరికితే అన్నంతోనో, అంబలితోనో సరిపెట్టుకుంటాం. దొరక్కపోతే పస్తులే. ఇంతకీ, నీవింకెంతకాలం ఉంటావిక్కడ?’

‘ఏమో! వాన రాకడ, వైరస్ పోకడ అగమ్యగోచరట కదా. నా పుట్టుక, మనుగడ, చావు.. ఇవేవీ నా చేతుల్లో లేవు. మీ క్వారంటైను, లాక్ డౌన్లే నా పాలిట రాహుకేతువులట కదా.’

‘ఖర్మ! పల్లెల్లో పొలం పనుల్లేవు. పట్నంలో కూలీనాలీ లేదు. కాలు గడప దాటే పరిస్థితి లేదు. ధరలేమో కొండెక్కాయి. దాచుకున్న కాస్త రొక్కం నెల తిరక్కుండానే ఆవిరైపోయింది. తల తాకట్టు పెడదామన్నా అప్పు పుట్టే దారి లేదు. ఏం కలికాలం వచ్చెరా భగవంతుడా! నీ రాక మా సావుకొచ్చింది.’

‘నా విలనిజం, అప్రదిష్ట గురించి కొత్తగా చెప్పేదేముందిలే గానీ, ఐనా, ఇలాంటి సంకటవేళ, మీ కష్టసుఖాల్ని పట్టించుకొనే నాథుడే లేడా?’

‘హ్మ్. అదో అంతులేని కథలే. తెల్లోళ్ల పాలన పోయి డెబ్భై ఏళ్లు  దాటిపాయే. మా బతుకు సిత్రం మాత్రం బండారయి చందమాయే. ఎన్ని ప్రభుత్వాలు మారిపోయే. పార్టీలు పుట్టగొడుగులాయే. కప్పదాటు రాజకీయాల కాలమాయే. ఊసరవెల్లి నేతలకు కొదవేలేదాయే. కొందరి నినాదమేమో గరీబీ హఠావో! కొందరిదేమో రోటీ, కప్డా ఔర్ మకాన్. ఇంకొందరిదేమో సబ్ కా వికాస్! ఇత్యాది హామీలకు లెక్కేలేదు. చేసిన వాగ్దానాలకు దిక్కు లేదు. కపటత్వానికి కొదవే లేదు. దరిద్ర రేఖేమో ఎవరెస్టులా పెరిగిపాయే. మా బతుకులేమో ఇట్టా పాతాళానికి పడిపాయె.’

‘అయ్యోరామా! ఎంత దారుణం? సేద్యం చేసేది మీరు. కాల్వలు తవ్వేది మీరు. డ్యాములు కట్టేది మీరే. భవంతుల్ని లేపేది మీరే. రహదారుల్ని వేసేది మీరే. రైల్వేల్ని నిర్మించేది మీరే. కార్మాగారాల్ని నడిపేదీ మీరే. మొత్తం నాగరికతా రథాచక్రాల ఇరుసులూ మీరే. దాన్ని లాగే కాడెద్దులూ మీరే. ఈ వ్యవస్థ ఆయువుపట్టే మీరు. మీరు లేనిదే, ఈ సమాజానికి దిక్కూ మొక్కంటూ ఉంటుందా అసలు? అలాంటి మీ జీవితాల్లో ఇన్నేళ్లైనా ఎదుగూబొదుగూ లేకపోవడం దారుణాతిదారుణం?’

‘ఏం చెప్పమంటావులే! మాది గొంతు దాటని గోడు. కంచికి చేరని కట్టుకథ. నాదీ, మా తాతముత్తాతలదీ, వాళ్ల తాతముత్తాతలదీ అందరిదీ.. అదే కథ. ఒకే వ్యథ. తరాలు మారినా మా వెతల తీరు మాత్రం మారలేదు. మహాభారత కాలంలో బానిసలై పశువులు మేపాం. రామాయణ కాలంలో బోయీలమై మేనాలు మోశాం. గుప్తులు, మొఘళ్ల కాలంలో సైన్యమై యుద్ధం చేశాం. ప్రజాస్వామ్యపు ఫ్యాక్టరీ గొట్టాల్లో పొగ చూరిపోతున్నాం. ఇకపై కూడా ఏదో ఓ శ్రమ తప్పక చేస్తాం. కాయకష్టం తీరు మారొచ్చేమో. అంతే. మా బతుకు దుస్థితి సిత్రంలో ఏ మార్పూ ఉండదనుకుంటా. మేము చరిత్రహీనులమేమో!’

‘ఎంతటి చోద్యం?! అసలు మీ చరిత్రను ఏ వాల్మీకో, వ్యాసుడో గ్రంథస్థం చేయలేదా? మీ గాథలకు ఏ బెంగాలీ రాయ్ బహదూర్ సాహెబో, పాశ్చాత్య చాప్లిన్ మహాశయుడో దృశ్యరూపం ఇవ్వలేదా?’

‘అయ్యో రాత! చేతికింత పని, నోటికింత తిండి, కంటికింత కునుకు... మా బతుకుచక్రానికదే నిత్య కృత్యం. మాకదే సత్యం. అదే శాశ్వతం. ఐనా, కష్టజీవులకు కథలు, కాకరకాయలేంటట? ఐనా, ఆ కళాపోషణంతా కడుపు నిండినోడి పని. ఆ రాణీ ప్రేమ పురాణం, ఈ ముట్టడి కైన ఖర్చులు, మతలబలుూ, కైఫీయతులూ చరిత్ర సారమింతేనని ఆ పెద్దమనిషెవరో బానే చెప్పారుగా.’

‘హతవిధీ! చరిత్ర రూపశిల్పులే మీరు. ఆ చారిత్రక ఇతిహాసపు పుటల్లో మీకంటూ ఓ పేజీ కూడా లేకపోవడం శోచనీయం. అన్నట్టు, నేడున్నది ప్రజాస్వామ్యమేగా. ప్రజలకోసం, ప్రజల చేత, ప్రజల యొక్క అంటూ ఏకంగా రాజ్యాంగమే రాశారుగా. మీ జీవితాల్లోకేమైనా వెలుగు రేఖ ప్రసరించిందా మరి?’

‘అయ్యోరామా! రాతలు వేరు. చేతలు వేరు. ఆ రాతలకి, చేతలకి మధ్య ఎప్పుడూ చైనాగోడంత ఎడం ఉంటుంది. మైసూరు బజ్జీలో మైసూరు ఎలాగైతే ఉండదో; ప్రజాస్వామ్యంలో కూడా మాబోటి జనాలెవ్వరూ ఉండరనుకుంటా. అలాగే, ఎండమావిలో నీళ్లెలా ఉండవో; ప్రభుత్వాల పథకాలు, కమీషన్లు, నిధులు, చట్టాల్లో పేదల ఊసే ఉండదు. ఓట్ల కోసమే మేం గుర్తొస్తాం. ఎన్నికలయ్యాక నేతలది అవినీతి భాగోతం. మాకేమో కటిక దరిద్ర భారతం. మా తలరాత ఎప్పుడు మారుద్దో?’

‘హ్మ్! ఏదోరోజున మీకూ మంచికాలం వచ్చి తీరుతుందన్నది నా ఆశ, ఆకాంక్ష.’

‘ఇంకెక్కడి మంచిరోజులు? నీవు మొదలెట్టిన రావణకాష్టంలో ఎక్కువగా సమిధలయ్యేది మాబోటి కష్టజీవులే. భూగోళంపై నీవు సాగిస్తున్న దారుణ మారణ హోమం తాలూకు సెగలు ఎప్పటికీ తగ్గుతాయో? ఈ క్వారంటైన్ వాసం ముగిసినా మా బతుకులు తిరిగి యథాస్థితికి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో? రానున్నదంతా ఆత్మహత్యలు, హాహాకారాల కాలమేనేమో?!’

‘భగవంతుడా! ఆ కూర్మావతారం ఉందో లేదో నాకైతే తెలీదు. కానీ, అనాదిగా ఈ భూమండలాన్ని మోస్తున్న ప్రత్యక్ష నరనారయణులు మాత్రం మీరే. మీలాంటి అభాగ్యుల, అసహాయుల ఉసురు పోసుకుంటున్న నాకు ఇక ఈ భూమ్మీద పుట్టగతులుంటాయో, లేదో తెలీదు. మన్నించు మిత్రమా! అన్నట్టు, కొంచెం శుచీ శుభ్రత పాటించండి. కాస్త బాధాకారమే ఐనా కొన్నాళ్లు క్వారంటైన్ వాసం చేయండి. దొరికితే కలో, గంజో తాగండి. అవీ దొరక్కపోతే, చివరకు బలసాకైనా తిని సరే బతకండి. మీరు బతకాలన్నదే నా కోరిక.’

‘మా తక్షణ కర్తవ్యం, తదేక దీక్ష మాత్రం, కరోనా రహిత సమాజమే!’