Tuesday, 31 December 2013

కొత్త నిర్ణయం!

Disclaimer: 

ఇటాలిక్ అక్షరాల్లో... నేను
బోల్డ్ అక్షరాల్లో ... నా అంతరాత్మ

నేను vs నా అంతరాత్మ!


యా..హూ..!
ఏం రోగం??
జాన్ ఫస్ట్ కమింగ్... 
హేవిటీ....?
జనవరి ఫస్ట్ వచ్చేస్తోంది!
ఆ... వస్తే...?
న్యూ ఇయర్  కదా....
ఆ... అయితే...?
ఫ్రెష్ ఇయర్, ఫ్రెష్ ఐడియాస్, ఫ్రెష్ రెజల్యూషన్స్, ఫ్రెష్ లైఫ్, ఫ్రెష్....
ఆగక్కడ... విసిగించక, విషయానికిరా...
కొత్త ఏడాది... కొత్త నిర్ణయాలు తీసుకోవాలి కదా...
తమరికలాంటి రక్త చరిత్ర లేదుగా... ఇప్పుడెందుకీ అఘాయిత్యం?
ఆ... అప్పుడంటే... ఇలాంటివి తెలీక పెద్దగా పట్టించుకోలా...
ఇప్పుడేమొచ్చింది... బుర్రలో జ్ఞానదీపం వెలిగిందా?
అంత సీను లేదు గానీ, అందరూ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారుగా...
అంటే... అందరూ చేస్తేనే చేస్తావా? నీకంటూ ఓన్ ఇండివిడ్యువాలిటీ లేదా...?
నలుగురితో పాటే నారాయణా, చైతన్యా, రాఘవులూ, నీవూ, నేనూ, అందరూనూ....
ఏంటా పిచ్చి వాగుడు? నీవూ నేనూ ఓకే. ఈ నారాయణా చైతన్యా రాఘవులూ ఎవరు?
పాత సామెతకు ఓ నాలుగు తోకలు తగిలించా, పడుంటాయని. బాగోలేదా?
ఏడ్సినట్టే ఉంది. నీలో రానురాను విషయం తక్కువ, వాగుడెక్కువైపోతోంది....
నువ్వు నా ఇమేజీని మరీ దారుణంగా డ్యామేజీ చేసిపారేస్తున్నావ్....
అబ్బ.. ఛ... నీదో పవన్ కళ్యాణ్ ఇమేజీ, దానికో డ్యామేజీ..?
బాబూ... అన్ సివిలైజ్డ్ అంతరాత్మా, నీకో దణ్ణం. నా మానాన నన్నొదిలెయ్? 
చాల్లే నిష్టూరం? నేను లేక నీవు లేవు... తెలుసా? 
సర్లే.... ప్రస్తుతానికి దయ చెయ్..
సరే, కాసేపలా పైరగాలి పీల్చుకొస్తా...
ప్లీజ్.....
బ్లాగుంది కదాని, అడిగేవాడు లేడు కదాని, అడ్డదిడ్డంగా పిచ్చి రాతలు రాయమాక...
యూ....
ఓకే ఓకే... బై...
థాంక్స్... 

*****

వీడేం అంతరాత్మండీ, బాబూ! హార్ట్ లెస్ ఆర్కేలాగా.. డెవిల్స్ అడ్వకేటులాగా... నాన్ స్టాపుగా, నాన్సెన్సుగా, న్యూసెన్సు ప్రశ్నలేసి దుంప తెంచుతున్నాడు. మాంచి భూతవైద్యుడితో చేతబడి చేయించి, పీక మీద పిన్నో, దబ్బునమో గుచ్చి, వీడి పీడ వదిలించుకుంటే గానీ జీవితానికి ప్రశాంతత ఉండదు. ఇతగాడి క్రాస్ క్వశ్చనింగ్ దెబ్బకు బుర్ర హీటెక్కి అసలు కంటెంట్ ఆవిరైపోయింది. రెండంటే రెండు నిమిషాల్లో... రాద్దామనుకున్న విషయాన్నే మర్చిపోయేలా చేసి, నన్ను వీర గజినీలా మార్చేశాడంటే, వీడు మామూలోడు కాదు బాబోయ్. ఇప్పుడేం చేయను? ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం.

*****

ఆ...
యురేకా...  Got it...
గుర్తొచ్చింది...
నేను న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకోవాలి.
మన, సారీ... నా అంతరాత్మారామ్ వచ్చేలోపే ఆ పనేదో కానిచ్చేయాలి. 
లేకపోతే కాల్చుకుతింటాడు. ఒకటే నస మేళం!

ఈ కొత్తేడాదిలో....
# ఏకువనే బ్రహ్మ ముహూర్తంలో ఠంచనుగా ఏడింటికే నిద్ర లేవాలి!
# రోజూ జాగింగు కెళ్లాలి, వీలైతే మినిమమ్ నాలుగు పలకలు ట్రై చేయాలి!!
# ఇకపై వారంలో కనీసం ఒక్కరోజన్నా ఆఫీసు పంచ్..  టైముకే కొట్టాలి!
# ‘డే ప్లాన్’ అంటూ ఒహటుండాలి! దాన్ని రాత్రంతా మేల్కొని రివ్యూ చేయాలి!
# వారానికి నాల్గు సిన్మాలకు మించి చూడరాదు. ఆరునూరైనా ఏడాదికో పుస్తకం చదివి తీరాల్సిందే!
# డెయిలీ డైరీ రాయాలి! అన్నీ నిజాలే రాయాలి! అబద్ధాలు అస్సలు రాయరాదు!!

ఛస్, వెధవ జీవితం! 
భూమి పుట్టినప్పట్నుంచీ ప్రతోడూ ఇవే పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకోవడం...
అటూఇటూగా ఓ వారం రోజులు పల్టీలు కొడుతూ ప్రయత్నించి, వాటికి పాతరేసి, మళ్లా మరుసటేడాది ఘోరీ తవ్వి అవే నిర్ణయాల్ని కొత్తగా తీసుకోవడం... ఓహో... బాగుంది వరస! చూల్లేక చస్తున్నామిక్కడ. ఏదైనా కొత్తగా చేయండి, బాబయ్యా!

ఓ గ్గాడ్! 
మళ్లీ తగలడ్డావా! 
వీడో పెద్ద ఫెవికాల్ అయిపోయాడే...
నీకిస్తానుండు... ఓ పవర్ ఫుల్ పంచింగు పలక్నామా!!

ఈ కొత్తేడాదిలో....
# రోజూ సిక్స్ ప్యాక్స్ సిగార్స్ ఉఫ్...మని ఊదేసేలా (గిరీశంలా) నన్ను నేను తీర్చిదిద్దుకోవలె!
# మా ప్రెస్ క్లబ్బులో చీపుగా లభించే విస్కీ, రమ్ము, జిన్, వైన్ వగైరా ఇకపై రోజూ తాగేలా సిద్ధమవ్వవలె!
# అర్జంటుగా బైక్ నేర్చుకుని, ఈ ఏడాదైనా చిత్రవిచిత్ర బైక్ విన్యాసాలతో కనీసం గిన్నీసన్నా ఎక్కవలె!

ఓల్డే... 
ఓల్డే... 
హల్లో బాస్! 
నువ్వేం రాస్తున్నావో / మాటాడుతున్నావో, కనీసం నీకన్నా అర్థమవుతోందా?
నీకంత దృశ్యం లేదు గానీ... ఏదన్నా జరిగే విషయాలు చెప్పబ్బా!

వీడికి 
నేను బాగుపట్టమూ ఇష్టం లేదు. 
అలాగని చెడిపోవడమూ ఇష్టం లేదూ. 
ఎట్టా చచ్చేదిరా భగమంతుడా. సరే... 

ఈ కొత్తేడాదిలో....
# బస్సులూ ,రైళ్లూ, ఇమానాలు అస్సలెక్కను!
# హాస్పిటల్లో చచ్చినా సరే అడ్మిట్ అవను!!
# నాకు పెళ్లై పిల్లలు పుట్టాక గవర్మెంటు బళ్లు, కాలేజీల్లో వాళ్లను కేజీ నుండి పీజీ దాకా ఫీజుల్లేకుండా చదివిస్తా!

ఓర్నీ బండబడా!
నీ అసాధ్యం తగలడా!
ఏం మాట్టాడుతున్నావయ్యా!
ఇంకొన్ని ఇట్టాంటి మాటలు వింటే నేను తిరిగిరాని లోకాలకో, కోమాలోకో ఎళ్లిపోతానేమో. అమంగళం ప్రతిహతమగుగాక! మనుషులు ఇట్టాంటి నిర్ణయాలు కూడా తీస్కొంటారా, నా నాయనే? నా తండ్రే! 

ఒరేయ్...!
అర్థం పర్థం లేకుండా వాగే అంతరాత్మా!
ఊరకే నోట్లో నరం లేకుండా , మెడపై మెదడు లేకుండా వాగడం కాదు...
నీవు నిజంగా నా అంతరాత్మవే అయితే...
నీకే గనక ఓ బుర్ర ఉంటే, అందులో బూడిద పదార్థం (గ్రే మేటర్) అనేదే ఉంటే...
ఓ నిర్ణయాల చిట్టా చెప్పవోయ్... చూద్దాం.
ఆఆ......... !

ఓయ్...
ఊర్కే తెగ ఇదైపోయి..
ఉట్టినే ఆవేశపడిపోమాక...
బీపీ పెరిగి బుర్రలో నరాలు చిట్లిపోగలవ్ జాగర్త..
సరే, నీ ఛాలెంజీని స్వీకరించి చెబుతున్నా...
వినుకో... రాజా!

ఈ కొత్తేడాదిలో...
# ఆ దిక్కు మాలిన ఫేస్ బుక్కు మూసేయాలబ్బా!
# ఆ పనికి మాలిన ప్లస్సుల జోలికి అస్సలు పోరాదబ్బా!
# అస్తమానూ ఆ బ్లాగుల్లో పడి ఊరేగడం అర్జంటుగా బందు చేయాలబ్బా!!


ఉరేయ్... 
ఉరేయ్...
ఉరేయ్...
ఆపరా....
నీ నాలుక పడిపోనూ. 
నీ గుండె కాయ ఆగిపోనూ..
నీ తలకాయ బద్దలవనూ.... 
అవేం ముదనష్టపు మాటలోయ్... 
కళ్లు పేలిపోతాయ్. పళ్లు రాలిపోతాయ్. గోళ్లు సాగిపోతాయ్. 

ఓహో...
నువ్వేగా ...
కాలరెగరేసి సవాళ్లు విసిరావ్...
నిన్ను ట్విట్టర్లో పెట్టి పిచ్చిపిచ్చిగా ట్వీట్ చేసి చంపేస్తానేమనుకున్నావో... ఆయ్.
అంతరాత్మలతో అణిగి మణిగి ఉండాలబ్బా... నువ్వన్నా చెప్పు సిద్ధప్పా!

అయ్యా...!
అంతరాత్మగారూ...!
బుద్ధొచ్చింది... ఇకపై అంతరాత్మలతో ఆలింగనాలే తప్ప అంతర్మథనాలు అస్సలు చేయను!
సివరాఖరగా... ఒకే ఒక్క నిర్ణయం తీసుకుని సెలవు తీసుకుంటా....

ఈ కొత్తేడాదిలో...
#  అస్సలు ఎలాంటి కొత్త నిర్ణయాలూ తీసుకోరాదని నిర్ణయించుకున్నా!

ఏయ్ స్టడీ....
ఏవైంది బాబయ్యా....
హర్ట్ అయ్యావా.... 
పోెన్లే... ఇక వేధించను.
అవునూ.. 
ఇది కొత్త నిర్ణయమా?
ఇదో..... చెత్త నిర్ణయం !! 
ఛీ... వ్యాక్... నాకు నచ్చలే. 

నాకు నచ్చింది...
చెత్త నిర్ణయమైనా...
ఇదే నా ‘కొత్త నిర్ణయం’!
ఈ జీవితానికి ఇదే నిర్ణయం!
ఇంతే సంగతులు. చిత్త గించవలెను!!

ఆగండాగండి....

వన్ మినిట్... మరచిపోయా...

అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు
కొత్త వసంతంలో మీరు తలపెట్టినవన్నీ సాకారం కావాలని మనసారా కాంక్షిస్తూ...

సెలవ్... మరి!!


మందులేని మాయరోగం!

రోగి: ‘కాంగీ’వాలా
వయసు: 65కు పైమాటే
జబ్బు: అంతుచిక్కని వ్యాధి
వదంతి: ‘చేత’బడి జరిగిందని
అందిన చికిత్స: చీపురు వైద్యం
ప్రస్తుత పరిస్థితి: కారుణ్య కోమా
ఇప్పుడెక్కడ: వెంటిలేషన్ మీద
వైద్యులు: డాక్టర్ సింగ్ & డాక్టర్ రాహుల్
‘కాంగీ’వాలా బతికి బట్టకట్టాడా? బాల్చీ తన్నేశాడా? 
గడ్డం నెరసిన కురువృద్ధ వైద్యుడు, గడ్డం గీయని కత్తిలాంటి కుర్ర డాక్టర్ల శ్రమ ఫలించిందా?
వివరాలకు ఇవాల్టి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో పబ్లిషైన ఈ లైటర్ వీన్ సెటైర్ చదవండోయ్. థాంక్యూ!



Thursday, 12 December 2013

అవినీతి పులిరాజా !!

Great Politics calls for noble feelings of heart!
ఈ వాక్యం ఎక్కడో చదివిన గుర్తు. సామాజిక గమ్యం, గమనాన్ని నిర్దేశించేవి పాలిటిక్సే. ప్రజాభ్యున్నతే పరమావధిగా మహోన్నత రాజకీయ జీవితం గడిపి చారిత్రక స్మృతిపథంలో చిరస్మరణీయులుగా నిలిచిన అబ్రహాం లింకన్, సుభాష్ బోస్ లాంటి మహనీయులు చాలామందే కనిపిస్తారు. కానీ నేటి పాలిటిక్సు దీనికి కంప్లీట్ రివర్స్. అవినీతి, అక్రమార్జనే నేటి రాజకీయాల తారకమంత్రం. భ్రష్ట రాజకీయాలు చేసి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న నేతలపై, అలాంటి నేతల బలహీనతల్ని క్యాష్ చేసుకునే గిరీశం లాంటి వారిపై ఒక సెటైర్ ‘‘అవినీతి పులిరాజా!’’ శీర్షికతో ఈ రోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో. Have an insight into it. Thank you :-)



Tuesday, 19 November 2013

కొత్తా దేవుడండీ!

ఫస్ట్ షాట్ (క్రికెట్ లాంగ్వేజీలో):
ప్రకృతిలో... గాలి మరియు వెలుతురు!
దేవలోకంలో... కామధేనువు మరియు అక్షయపాత్ర!
మన మధ్యలో... గూగుల్ మరియు సచిన్!
మ్యాథ్స్ లో ఇన్ఫినిటీ (ఇన్ ఫైనైట్) అనే ఓ పదం ఉంటుంది. అనంతమని అర్థమట! పైన చెప్పుకున్న గాలి-వెలుతురు; కామధేనువు-అక్షయపాత్ర; గూగుల్-సచిన్... ఈ ఆరింటికీ ఆ పదం అతికినట్టు సరిపోతుందేమో. హైట్, విడ్త్, డెప్త్ త్రీ డైైమెన్షనల్ గా ఏ డైరెక్షన్లో వెళ్లినా అవి అనంతగానే కనిపిస్తా(రు)యి. వీటి(వీరి)ని వాడుకున్నోళ్లకు వాడుకున్నంత మహదేవ అనుకోవచ్చు ఒక్కమాటలో. మన సచిన్ కూడా అట్టాంటి గొప్పోడే. ఎంత మంది రాసినా తరగని విషయం ఉంటుంది సచిన్ టాపిక్కులో. గాడ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా నా అభిమాన సచినుడికి నేనూ నా స్థాయిలో ఫేర్ వెల్ ఇద్దామనుకున్నా. రాయడమైతే మూడురోజుల క్రితమే రాశా. ఈనాడుకు ప్రయత్నిద్దామా? అమ్మో, వాళ్లిలాంటివి వేయరేమో? అని నాలో నేనే కిందామీదా పడి, హైకమాండులాగా ఏ డెసిషన్ తీసుకోలేక, చివరికి నా బ్లాగులోనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెడదామని ఇవాళ తీర్మానించాను.

 
దేవలోకంలో అత్యవసర సమావేశం. యుద్ధప్రాతిపదికన ఏర్పాటైంది. పుష్పక విమానాలెక్కి ముల్లోకాల్లోని దేవగణమంతా ఆగమేఘాల మీద వేంచేశారు. మీటింగ్ తాలూకు అజెండా అర్థంకాక దేవుళ్లంతా ఒకరి చెవుల్ని మరొకరు అదేపనిగా కొరుక్కున్నారు. ఇంతలో కాకితో కబురందుకున్న గిరీశం శ్రీహరికోటలో హడావుడిగా రాకెట్టెక్కేసి కాంతివేగంతో ఇంద్రలోకంలో వాలిపోయాడు. రభస సద్దుమణిగింది. సభ మొదలైంది. 

*****

"ఏమోయ్ గిరీశం! భూమండలంలో నరులెల్లరూ కుశలమే కదా. అన్నట్టు, మీ భారతీయులు ఇటీవలే అంగారకుడిపై అరంగేట్రానికై ఒక అద్భుత యంత్ర శకలాన్ని పంపారట. సెభాష్! అందుకోండి... మీ దేవలోక శుభదీవెనలు. అంతా బానే ఉంది, కానీ మీ భారతీయులు ఉఠ్ఠి బడుద్దాయిలోయ్. మీ వాళ్ల తింగరితనం చూస్తే కొన్నిసార్లు తెగ నవ్వొచ్చేస్తుందంటే నీవు కోపం తెచ్చుకోరాదు మరి. మచ్చుకు.... కణికట్టు బాబాలకు బ్రహ్మరథం పట్టి అభాసుపాలైనా; గారడీ సన్నాసుల కట్టుకథలు నమ్మి మందిరాల్ని మట్టిపాలు చేసుకున్నా; తళుకు బెళుకుల సినీతారలకు గుడులు కట్టి శఠగోపం పెట్టించుకున్నా; నయా పైసకు పనికిరాని నేతల్ని నెత్తిన పెట్టుకు పూజించినా... అబ్బబ్బబ్బా, ఏం చేసినా అది మీ వాళ్లకే చెల్లిందోయ్. మీ వాళ్లు... అబ్బో మహానుభావులోయ్. చూస్తోంటే, ఈమధ్య ఇంకో కొత్త దేవుణ్ణి పుట్టించినట్టున్నారు. దేశమంతా అతగాడి నామస్మరణమేనట. ఒక ఆటగాడికి అంత అందలమా? అవసరమంటావా? మానవమాత్రుల చేష్టలు కడు విచిత్రం సుమీ!"

"దేవేంద్రా! నా గెస్ మిస్ కాలేదండోయ్. మా ఢిల్లీ హైకమాండులాగా, దేవలోకంలో వార్ రూమ్ మీటింగ్ అనగానే బుర్రలో ఠకీమని జీరో బల్బు వెలిగి విషయం కొంతమేరకు అర్థమైంది. సో, ఇది దేవలోకపు అధిష్టానానికి తలెత్తిన తలనొప్పి అన్నమాట. భలే. భూలోకపు క్రికెట్ దేవుడి సెగ ఇంద్రలోకంలో కలకలం సృష్టిస్తోందన్నమాట. భేష్. ఎంత కమ్మటి కబురో. వీనుల విందుగా ఉందంటే నమ్మండి. అయినా, నాకో విషయం అర్థం కాలేదు. అందులో విచిత్రమేముంది, దేవరా?!  మార్పు అనివార్యం కదా. ఇంకా ఎంతకాలమని కాలం చెల్లిన మీ ముల్లోకాల దేవదేవతల్నే బల్లిలా పట్టుకు వేలాడమంటారు? మీరంతా బాగా బోర్ కొట్టేశారు. ఇక చాలు. మీ పెత్తందారీతనం ఇంకానా, ఇకపె చెల్లదు. మా బానిసత్వం ఇంకానా, ఇకపై ఉండదు. మాకంటూ ప్రత్యేకమైన ఆశలుంటాయి. అభిమతాలుంటాయి. మనోభావాలుంటాయి. సవాలక్ష ఉంటాయి. ఆ మాటకొస్తే మా దేవుళ్లను మేమేం సృష్టించుకుంటాం. కోపమొస్తే మళ్లీ మార్చేసుకుంటాం. క్వశ్చన్లతో కొర్రీలు వేయడానికి అసలు మీరెవరు? మానవజాతిలో దేవుళ్లు అవతరించకూడదని ఎక్కడైనా రాసి పెట్టారా, యేం? లేక మానవోత్తములు మీకు పోటీకొస్తారని భయమా? మేమంటే మీకెందుకింత కుళ్లు, కుతంత్రం, సందేహం, భయం, వగైరా వగైరా?"

"హతవిధీ! ఏమిటీ కర్ణ కఠోరమైన నిందారోపణలు? ఔరా! ఇది మరింత చిత్రముగా నున్నదే. నే పలికిన రెండంటే రెండు మాటల్ని పట్టుకు రంధ్రాన్వేషణ, చిత్రవధ, నానా భీభత్సం చేసి... ఇన్నేసి ద్వంద్వర్థాలు, అన్నేసి నిగూఢార్థాలు సృష్టిస్తావా? నీవు మా కలహభోజనుడు నారదుణ్ని మించిన మాటల మరాఠీవి, జగడాల మారివి, మహా తుంటరివోయ్, గిరీశం! అయిననూ, భూమండలం నుండి మాకు అందిన సంకేతాల (కేసీఆర్ సిగ్నల్సుకు వీటికి ఎలాంటి సంబంధం లేదు) ప్రకారం అతగాడు వఠ్ఠి అటగాడే కదా! అతడేమైనా అన్యాయాన్ని దునుమాడాడా? అధర్మాన్ని తెగనరికాడా? పోనీ, జాతి యావత్తూ హర్షించేలా సురాజ్యపాలనేమైనా అందించాడా? అసలేం చేశాడని, అతగాడికి దైవగుణాన్ని ఆపాదిస్తున్నారోయ్? మొదట, మీ మానవులంతా ఆటగాణ్ణి ఆటగాడిగా గౌరవించడం నేర్చుకోండి. మీ మూర్ఖత్వంతో అతగాడి ఖ్యాతినీ, మీ తెలివి తేటల్నీ దిగజార్చుకోకండి. అలాగే మా దేవలోకపు పరువు ప్రతిష్ఠల్నీ మంట గలపకండీ."

"భళా, దేవదేవా! మీ తర్కం అదరహో! మీరు లక్ష చెప్పండి. మా లాజిక్కులు మాకున్నాయిలెండి. అన్నట్టు, మా భారతావనిలో దేవుళ్లకేమన్నా కొదవా? 33 కోట్లకు పైమాటే. అలాగే నేతలూ తక్కువేం లేరు. కానీ ఏం లాభం? దేవుళ్ల పేరు చెప్పుకుని ప్రజలంతా ఎవరికి వాళ్లు సంకుచితం అయిపోయారు. అలా కుంచించుకుపోయిన ప్రజల్నీ రాజకీయ నేతలేమో మరింత విభజించి తమ పబ్బం గడుపుకుంటున్నారు. మీ గొప్ప దేవుళ్ల, మా ఘనమైన నాయకుల పరిస్థితే ఇలా ఉంటే, ఇంకెవరు అన్యాయాన్ని దునుమాడేది? అధర్మాన్ని తెగనరికేది? సుపరిపాలనను అందించేది? కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా, నానా రకాలుగా విడిపోయిన శతకోటి ప్రజానీకాన్ని తన క్రీడాపాటవంతో ఒక్కతాటిపైకి తెచ్చి సెక్యులరిజానికి కొత్త భాష్యం చెప్పినవాడు గొప్పవాడు కాదా? అవినీతి, అక్రమార్జన, ఆశ్రిత పక్షపాతం లాంటి ఊడలు దిగిన దిక్కుమాలిన వ్యవస్థలో నీటైన ఆటతో, నిఖార్సైన వ్యక్తిత్వంతో జనం మనస్సు గెలిచిన వాడు మహనీయుడు కాదా? అంతటి మేటి ఆటగాణ్ని అందలమెక్కిస్తే మీకెందుకంత ఆందోళన? అక్కున చేర్చుకుంటే మీకెందుకంత అక్కసు?"

"యముండ! చాలించు, నీ అధిక ప్రసంగం!  ఏమిటోయ్ అతగాడి గొప్పతనం? అంతా మీ బడాయి కాకపోతే!  మా నరకలోకపు నివేదికల ప్రకారం అతగాడొకసారి విదేశీయుడెవడో బహుమతిగా ఇచ్చిన ఫెరారీ కారుకు దిగుమతి సుంకం ఎగవేశాడనిన్నీ; ముంబయి లాబీయింగ్ సాయంతో భారత క్రికెట్టును ఏళ్ల తరబడిగా భేతాళుడిలా వదలకుండా పట్టుకువేలాడనిన్నీ; అలాగే, జెంటిల్మెన్ క్రీడకు పట్టిన చీడలాంటి బెట్టింగుకు వ్యతిరేకంగా సైతం ఏనాడూ నోరు విప్పిన పాపాన పోలేదనిన్నీ... అపవాదులూ, ఆరోపణలూ ఇలా బోల్డున్నాయి. ఆ మాత్రం దానికి అతగాడికి భారతరత్న బిరుదులూ, దేవుడని సత్కారాలూ? అబ్బో, మీ నీచ మానవుల వరస బహు బాగుందోయ్."

"భళారే, యమధర్మరాజా! శాంతించండి! అవనసరంగా బీపీ పెంచుకోకండి. మీరిలా గుడ్డు మీద ఈకలు పీకడం కడు విడ్డూరంగా ఉంది సుమీ. సరే, మీ లాజిక్కు ప్రకారమే, మీ ముల్లోకాల్ని గాలించి, ఏ మచ్చా లేనటువంటి, సర్వం సుగుణాలే కల్గిన సత్య సంధుణ్ణి ఒక్కడంటే ఒక్కణ్ని చూపించండి చూద్దాం. ఏదో చంద్రునికో నూలుపోగులా, నాలుగు మరకలు (మరక మంచిదేనా?) ఉన్నాయని, మీరిలా బూతద్దంలో చూసి మా దేవుణ్ని ఆడిపోసుకోవడం ఆశ్చర్యంగా ఉంది సుమా! పోనీ, ఓ పని చేద్దాం, యమరాజా! మీరు ఎంతకాలమని ఆ బూజు పట్టిన సింహాసనాల్ని అట్టి పెట్టుకు కూచుంటారు? కూసంత కొత్తదనం, వెరైటీ కోసం మీ ముల్లోకాల్నీ, మా భూలోకాన్ని కలగలపి కొత్త దేవుడి కోసం సరికొత్తగా ఓసారి ఓటింగు పెడదాం! ఆటగాడే మా అభ్యర్థి. గెలిచిన వాడే, గొప్ప దేవుడు!! ఛాలెంజీకి సిద్ధమేనా?"

*****

గిరీశం విసిరిన సవాల్ దేవలోకంలో చిన్నపాటి కల్లోలం సృష్టించింది. దేవగణమంతా మరోసారి తీరిగ్గా గుసగుసమంటూ చెవులు తెగ కొరికేసుకున్నారు. ఎందుకొచ్చిన గొడవని బతుకు జీవుడా అంటూ యముడు చల్లగా జారుకున్నాడు. కొత్త జగడానికి తెరలేవడంతో కడు సంతుష్టుడైన నారదుడు లోలోపల దేవేంద్రుడి తిక్క కుదిరిందని మహదానందభరితుడయ్యాడు. దేవేంద్రుడు ఖంగుతిని, బిక్కమొగమేసి, ఏం చేయాలో పాలుపోక, పరిస్థితి విషమించి చేయి దాటుతోందని గుర్తించి, సభను అర్ధారంతరంగా వాయిదా వేసి, సెల్ఫ్ వాకౌట్ చేసుకుని, ఎవరికి చెప్పా పెట్టకుండా నిష్క్రమించాడు. గిరీశం అక్కడే సింహాసనం మీద కూచుని చిద్విలాసంతో చుట్ట ముట్టించి రింగులు వదలడం మొదలెట్టాడు. భశుం!!!

[లాస్ట్ బాల్: క్రికెట్ దేవుడిపై యముడు, దేవేంద్రుడు చేసిన ఆరోపణలకూ, నాకూ ఏ విధమైన సంబంధమూ లేదు. అసలు దేవుళ్లంటేనే నాకు తగని మంట. నేను సైతం వారి వ్యాఖ్యలను స్వరంలో శృతి కొద్దీ, ఒంట్లో బలం కొద్దీ తీవ్రంగా ఖండిస్తున్నా. సచిన్ నిజంగానే క్రికెట్ దేవుడు. సచిన్ గొప్ప వైరస్ లాంటివాడు (పోలిక బాలేదా, ఈసారికి సర్దుకుందాం). అతగాడి వల్లే నేను క్రికెట్ ఫీవర్ అనబడే అంటువ్యాధికి గురయ్యా. దీనికి చికిత్స లేదట. జీవితాంతం ఇలా బాధపడాల్సిందే. తప్పదు మరి. ఇక, ఈ రెండు దశాబ్దాల్లో... సచిన్ క్రీజులో ఉన్నంతసేపూ నా బీపీ ఎప్పుడూ 140పైనే ఉండేది, హార్టుబీటు 200 మీద కొట్టుకునేది. ఆరోగ్యపరంగా ఇంత నష్టం జరిగినా సచినుడిని ఆరాధించడం మాత్రం నేనెప్పుడూ మానలేదు. చివరకు, టెండూల్కరుకి భారతరత్న ఏంట్రా, జోక్ కాకపోతే, అని క్లోజు ఫ్రెండ్సు కూడా నానా మాటలు ఆడిపోసుకున్నారు, కేవలం నన్ను ఏడిపించాలని. బ్యాటుచ్చుకు కొఠేద్దామంటే, వాళ్లేమో షోయబ్ అక్తర్ లాగా నాకంటే బలంగా ఉంటారు. అందుకే పోన్లే అని వదిలేశా. ఏం చేయాలో తెలీక ఈ పోస్టు రాశా. ఎందుకొచ్చిన గొడవ అని, నా ఫ్రెండ్సు మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ల వెర్షన్ కూడా ఇందులో జతచేశా. నిజ్జంగానే సచిన్ అంటే నాకు బోల్డంత ఇష్టం, ఆయ్. దేవుడి మీదొట్టు! నమ్మాలి మరి :-)]

Saturday, 9 November 2013

ఎన్ని కలలో...!

కలలు
పీడ కలలు
పగటి కలలు
మెరుపు కలలు
అబ్బో... ఎన్ని రకాల కలలో!
అంతేనా...?
ఒబామా కల, రాజమాత కల,
వృద్ధ రాజు కల, యువరాజా వారి కల,
దీదీ కల, బీహారీ బాబు కల, బుల్లి యాదవ్ కల,
ఇలా నేతల కలలు ఎన్నో, ఎన్నెన్నో...!!
కలలన్నవి ఫిలసాఫికల్ కేటగిరి అనుకుంటా!
ఎందుకంటే.. దుష్ట రాజకీయ నేతల కలలు మొత్తం సామాజిక గతినే చిందరవందర చేసి మార్చేస్తుంటాయి కాబట్టి!
ఇటీవలి పొలిటికల్ డెవలప్ మెంట్స్ పై చిరు సెటైర్ ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, ‘‘దుష్ట సంహార స్వప్నం’’ పేరిట. థాంక్యూ!!



Thursday, 31 October 2013

ఉత్తర ప్రగల్భాలు!

నాడు...
చెవులు చిల్లులు పడగొట్టారు
నల్లసూరీడొచ్చాడు, ఇక అగ్రరాజ్య ప్రగతిని అంగారక గ్రహందాకా తీసుకెళ్తాడని!
నేడు...
విమర్శల జడివాన కురిపిస్తున్నారు
ఒబామా హెల్త్ కేర్ ప్రవేశపెట్టి బొక్కబోర్లా పడి అమెరికాను షట్ డౌన్ చేసేశాడని!!

నాడు...
ఆహా, ఓహో అని ఊదరగొట్టారు
మన్మోహనుడు అపర చాణక్యుడని, ఇండియాను ఏదేదో చేసేస్తాడని!
నేడు...
వామ్మో, వాయ్యో అని గుండెలు బాదుకుంటున్నారు
మౌనమోహనుడు కుంభకోణాలతో కొంపలు కొల్లేరు చేసేస్తున్నాడని..!!

నేతలు
ఏ పార్టీకి చెందినా
ఏ దేశానికి చెందినా
అందరివీ ఉత్తర ప్రగల్భాలే!
అందరూ ఆ తానులోని ముక్కలే!
అందరూ ప్రజల్ని మోసం చేసేవారే!!

ఏ దేశమును పరికించినా
ఏమున్నది గర్వకారణం...
పాలకుల పన్నాగాలన్నీ
వ్యవస్థను భ్రష్టుపట్టించుటకే!
నేతల కుయుక్తులన్నీ
సామాన్యుని అథోగతి పాల్జేయుటకే!

ఇటీవలి పొలిటికల్ డెవలప్ మెంట్స్ పై బ్రీఫ్ సెటైర్ ఇవాళ్టి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో.  


Tuesday, 8 October 2013

అధిష్ఠాన జగన్నాటకం!!

ఇవాళ్రేపు
ఎక్కడ ఏ స్కాం జరిగినా..
ఎక్కడ సీబీఐ రైడ్ జరిగినా...
ఏ రాజకీయ నాయకుడు జైలుకెళ్లినా....
ఏ నేరపూరిత నేతకు బైయిల్ లభించినా...
ఎక్కడ ప్రజల మధ్య ఏ చిచ్చు రగులుకొన్నా...
ఈ ఘనకార్యాలన్నీ కాంగ్రెస్ అధిష్ఠానం కనుసన్నల్లోనే....
లోకకళ్యాణార్థం యువరాజా వారిని హస్తిన పీఠంపై పట్టాభిషిక్తుణ్ణి చేసే సదుద్దేశ్యంతోనే జరుగుతున్నాయని ఇందుమూలంగా యావజ్జాతి జనులందరూ గుర్తించగలరని ఢంకా భజాయిస్తున్నాడు మా సెగెట్రీ! దుష్ట హైకమాండు రాజకీయ చదరంగంపై ఓ సెటైర్ ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో పబ్లిషైంది. థాంక్యూ!!


Saturday, 28 September 2013

రగిలే నిప్పు కణిక! నిత్య స్ఫూర్తి జ్వాల!!


నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను..!
 
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను...!!

మహాకవి శ్రీశ్రీ ఈ వాక్యాల్ని... దేశ స్వేచ్ఛ కోసం 23 ఏళ్ల చిరుప్రాయంలో ఉరికంబమెక్కి తృణప్రాయంగా ప్రాణాలర్పించిన ‘స్వాతంత్ర్య సమర సేనాని’ భగత్ సింగ్ కోసమే రాశారా అనిపిస్తుంది. భగత్ సింగ్ జన్మించి నేటికి 106 ఏళ్లవుతోంది. భగత్ సింగ్ అమరవీరుడా? కాదా? అన్న విషయం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ఆ యోధుడికి ఒక చిరు నివాళి అర్పించే ప్రయత్నమే ఈ చిన్ని రైటప్. 

భగత్ సింగ్!
అసాధారణ సంకల్పం... 
అంతులేని సాహసం...
అబ్బురపరిచే త్యాగనిరతి...
అనన్యసామాన్యమైన మేధాసంపత్తి...
ఇలాంటి అత్యద్భుత లక్షణాల్ని కలగలిపి పోతపోసి ‘మర ఫిరంగి’లా పేలే మనిషిని తయారుచేయాలనుకుంటే అతడు భగత్ సింగ్ రూపం ధరించి మనకు సాక్షాత్కారమవుతాడు. తెల్లవాడి గుండెల్లో శతఘ్నిలా పేలి... భారతీయుల గుండె చప్పుడుగా అజరామరంగా నిలిచిపోయిన వాడు భగత్ సింగ్! భగత్ సింగ్ పేరు స్మృతిపథంలో కదలగానే అన్యాయం-అధర్మాలపై కదన శంఖారావం పూరించే ఉప్పెనలాంటి ఉద్వేగం గుండెల నిండుగా ఉప్పొంగుతుంది. ఇంతటి అపూర్వ చరిత్ర కలిగిన భగత్ సింగ్ పేరుకు ప్రభుత్వ రికార్డుల్లో అమరవీరుడిగా గుర్తింపు లేకపోవడం నిజంగా విడ్డూరం కలిగించే విషయం. భగత్ సింగ్ అమరత్వం చర్చనీయాంశమై ఇటీవల పత్రికల పతాక శీర్షికలనెక్కింది. భగత్ సింగ్ విషయంలో ప్రభుత్వాల దారుణ, నిర్లక్ష్య పూరిత వైఖరికి జాతి యావత్తూ నివ్వెరపోయింది. 


భగత్ సింగ్ అమరవీరుడు కాదట!

బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి భరతజాతిని విముక్తి చేయడానికి ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ ను అమరవీరునిగా గుర్తించడానికి తమ వద్ద ఎలాంటి రికార్డులూ లేవని ఇటీవల కేంద్ర హోంశాఖ వెల్లడించడం, ఆ మేరకు సమాచార హక్కు కింద దాఖలైన పిటిషన్ కు అధికారులు విడ్డూరమైన వివరణలివ్వడం విని, ఆ తతంగాన్ని మీడియాలో వీక్షించి యావద్భారతం విస్తుపోయింది. రాజ్యసభలో ఈ విషయమై పెద్ద దుమారం రేగినప్పుడు కూడా హోంశాఖ అధికారులు ఎప్పట్లాగే కప్పదాటు వైఖరి అవలంబించారు. ఇక భారత ప్రధాని తీరిగ్గా మౌనవ్రతం వీడి... ‘భగత్ సింగ్ అమరత్వం రికార్డులకు అతీతమైంది’ అని నాలుగు కంటితుడుపు మాటలు మీడియాలో ప్రకటించి చేతులు దులిపేసుకున్నాడు. ఇంతా జరిగాక కూడా భగత్ సింగ్ ను అమరవీరుడిగా ప్రకటించడానికి చర్యలు తీసుకుంటామన్న హామీ అటు ప్రధాని గానీ, ఇటు ప్రభుత్వం కానీ ఇవ్వకపోవడం గర్హనీయం! నిజానికి ఆనాడు 1931 మార్చి 23న, అనుకున్న తేదీకంటే ఒక రోజు ముందుగానే, బ్రిటిష్ ప్రభుత్వం అన్నిరకాల న్యాయ నిబంధనల్ని తుంగలో తొక్కి భగత్ సింగ్ ను ఉరితీసిన రోజున, జాతి మొత్తం నిద్రా హారాల్ని మానుకుని కన్నీటి సంద్రమైంది.  జన జీవితం స్తంబించిపోయింది. అప్పటినుండే భారత ప్రజానీకం భగత్ సింగ్ ను ‘అమరువీరుల్లో శ్రేష్ఠుని’ (షహీద్ ఏ ఆజమ్)గా గౌరవించుకుంటోంది. సామాజికాభ్యుదయాన్ని ప్రతిఫలించే ఆశయ సాధన కోసం ప్రాణాలు వదిలిన గొప్ప వ్యక్తుల్ని అమరవీరులుగా గుర్తించి గౌరవించడం ఏ దేశంలోనైనా పరిపాటిగా జరిగే విషయమే. కానీ అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే మనదేశంలో దేశ స్వేచ్ఛ కోసం చిరునవ్వుతో ప్రాణాల్ని బలిదానం చేసిన భగత్ సింగ్ కు లభించిన ఘన సత్కారం ఇది! 


భగత్ సింగ్ టెర్రరిస్ట్ అట! 

భారతీయుల బానిస సంకెళ్లను బదాబదలు చేసే సదాశయంతో ఉరికంబమెక్కిన స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను టెర్రరిస్టులుగా చిత్రించిన ఘన ఖ్యాతి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే, అపర మేధావి కపిల్ సిబల్ నేతృత్వంలోని హెచ్.ఆర్.డి విభాగం ఐ.సి.ఎస్.సి పదో తరగతి పుస్తకాల్లో భగత్ సింగ్ ను టెర్రరిస్టు అని ముద్రించేశారు. అంతేకాదు, ఐఏఎస్ పరీక్షా పత్రంలో భగత్ సింగ్ నేతృత్వం వహించిన ‘రెవల్యూషనరీ టెర్రరిజం’ గురించి విశ్లేషించండనే ప్రశ్నను ఇవ్వడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిజానికి ఆనాడు సాతంత్ర్యోద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసే దురుద్దేశ్యంతో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా, భగత్ సింగ్ తన సహచరుడు బీకే దత్ తో కలసి 1929 ఏప్రిల్ 8న ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు వేసి స్వచ్ఛందంగా అరెస్టయ్యాడు. ఈ సంఘటనలో ఎవ్వరూ చనిపోలేదు. ఎవ్వరూ గాయపడలేదు కూడా. ఆ బాంబులు మనుషుల్ని చంపడానికి ఉద్దేశించినవి కావని బ్రిటిష్ ఫొరెన్సిక్ విభాగమే ధ్రువీకరించి స్వయంగా నివేదిక సమర్పించింది. భారతీయుల నిరసన వాణిని బ్రహ్మ చెవుడు ఆవహించిన బ్రిటిష్ వాళ్ల కర్ణభేరి బద్ధలయ్యేలా వినిపించేందుకు ప్రజలెవ్వరూ లేనిచోట బాంబులు వేశామని, తమ ఆశయాలను కోర్టు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడానికే స్వచ్ఛందంగా లొంగిపోయామని భగత్ సింగ్ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు, బాంబులు, పిస్తోళ్ల సంస్కృతికి తాను వ్యతిరేకిననీ; ఉన్నత భావాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మాత్రమే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వాలు సాధించగలమని లిఖితపూర్వకంగా భగత్ సింగే ప్రకటించాడు. అలాంటి భగత్ సింగ్... మన కాంగ్రెస్ ప్రభుత్వం పండితులకు, మేధావులకు టెర్రరిస్టుగా కనిపించడం దేశం చేసుకున్న దురదృష్టం అనాలా? లేక జాతికి పట్టిన దౌర్భాగ్యం అనాలా? ఏమనాలి?

 



భగత్ సింగ్... ఒక ధ్రువతార!


నిజానికి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో శాంతియుత ధోరణి, సాయుధ ధోరణి అని రెండు ప్రవాహాలు కనిపిస్తాయి. శాంతియుత పంథాకు గాంధీజీ నేతృత్వం వహిస్తే; సాయుధ పోరాటానికి భగత్ సింగ్ నాయకత్వం వహించాడు. ఈ రెండు ప్రవాహాల్లో కొనసాగిన సుదీర్ఘ పోరాటాల అంతిమ ఫలితంగా మాత్రమే మనదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అందుకే ప్రజలు కూడా భారత జాతిపితగా గాంధీజీని ఎంతగా అభిమానిస్తారో; అత్యున్నత అమరవీరునిగా భగత్ సింగ్ ను కూడా అంతేస్థాయిలో ప్రేమిస్తారు. స్వాతంత్ర్య సముపార్జనే లక్ష్యంగా మృత్యువునే పరిహసిస్తూ ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ జాతి జనుల గుండెల్లో సదా అమరవీరునిగా నిలిచిపోతారు. ఆనాడు భగత్ సింగ్ ఎలుగెత్తి నినదించిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే రణన్నినాదం అరాజకీయం, అన్యాయం, అధర్మం రాజ్యమేలినంత కాలం భారతీయుల హృదయ స్పందనగా మార్మోగుతూనే ఉంటుంది.

ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ప్రచురితమైన చిన్న రైటప్!!


Tuesday, 24 September 2013

భలే మంచి రోజు!!

యువనేతకు బెయిల్ మంజూరు!
సోమవారం ఇదే శిఖర వార్త!
కాదు కాదు, అదొక వైరస్ వార్త!
ఈ వార్తా వైరస్ సృష్టించిన కల్లోలం ముందు మొత్తం వైరస్ జాతంతా సిగ్గుతో తలదించుకుంది!
మొదట తెలుగు మీడియా కోడై కూసింది!
ఆపై జాతీయ మీడియా జోరీగై జనం చెవుల్లో చిల్లులు పెట్టింది !!
ఆపై ప్రపంచ మీడియా.. ఎలా స్పందించిందో వీక్షించలేకపోయినందుకు రాత్రంతా నిద్ర పట్టలేదు!!
ఆమధ్య ఉట్టి పుణ్యానికే ప్రపంచాన్ని గగ్గోలు పెట్టించిన ఎయిడ్స్ మహమ్మారికి మందు కనిపెట్టేశానని ఎవడన్నా ప్రకటించినా సరే, ఈ లెవెల్లో మీడియా స్పందిస్తుందో, లేదో? నాకైతే డౌటే! రాష్ట్ర ఆశాజ్యోతి యువనేత విషయంలో మీడియా నిష్పక్షపాత విశృంఖల విలయతాండవ వైఖరి చూసి ముచ్చటేసింది. మీడియా సృష్టించిన 24 గంటల దావానల వైరస్ వార్తా స్రవంతిలో మొదట హైదరాబాదు, పిమ్మట రాష్ట్రమ్మొత్తం, తదుపరి దేశం యావత్తూ  తడిసి ముద్దైపోయి, తరించిపోయింది. పాపం, ప్రజలకే ఈ వార్తను చూసి సంబురాలు జరుపుకోవాలా? లేక ముక్కున వేలేసుకోవాలా? లేక బిక్కమొగమేస్కుని మిన్నకుండిపోవాలా? అసలేం చేయాలో అర్థం కాక సైలెంటుగా ఉండిపోయారు. జనం ఖర్మ కాకపోతే, అదేంటో, మీడియా ఎప్పుడూ ప్రజల భావోద్వేగాలకు పెను సవాళ్లను విసురుతుంటుంది. సర్లే, ఈ బెయిల్ విషయమై కవులు, కళాకారులు, పండితులు, ఆర్థికవేత్తలు, మేధావులు ఎలా స్పందిస్తారో చూసి, ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దామని ప్రజలు డిసైడైపోయి జడత్వంలోకి జారుకున్నారు. ఈలోగా ఏం జరిగిందంటే.... 


‘‘ఇదొక శుభదినం.
రాష్ట్ర చరిత్రలోనే, కాదు కాదు, దేశ చరిత్రలో ఒక పర్వదినం.
మన యువనేత రాజకీయాలకే తలమానికమై నిలిచాడు. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా; అస్సాం నుండి గుజరాత్ దాకా ఎవ్వడూ సాధించలేని ఘనతను మనవాడు సాధించాడు. రికార్డులన్నీ మన యువనేతవే. ఆస్తులు కూడబెట్టడంలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయాడు. కారాగారవాసంలో సైతం కొత్త పోకడలు సృష్టించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా బెయిల్ సాధించాడు. కొమ్ములు తిరిగిన హైకమాండునే ప్రసన్నం చేసుకున్నాడు. ఇంత జరిగినా ఏమాత్రం ఆదరణ తగ్గకుండా మ్యాజిక్ చేస్తున్నాడు. భేష్!  ఇకపై నేతలెవ్వరూ అవినీతికి, అక్రమార్జనకు పాల్పడేందుకు ఏమాత్రం మొహమాట పడక్కర్లేదు. జైళ్లకెళ్లేందుకు అస్సలు సిగ్గు పడక్కర్లేదు. బెయిల్ దక్కదేమో అన్న బెంగను ఇహ తుంగలో తొక్కవచ్చు. ఇకపై అన్నింటికీ, మనందరికీ యువనేతే మార్గదర్శి!! పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం (అ)రాజకీయాల్ని వెలగబెట్టేందుకు. ప్రజాధనం కొల్లగొట్టేందుకు... ’’ అంటూ చెంచల్ గూడ జైలు ముందు ఓ మీటింగు పెట్టేసి మాటల తూటాలతో మైకును విరగ్గొడుతున్నాడు ఓ గల్లీ లెవెల్ లీడర్... మిగతా గల్లీ లెవెల్ అమెచ్యూర్ లీడర్లనుద్దేశించి!

‘‘ఇక ప్రజలంతా నిశ్చింతగా ఉండొచ్చు. గుండె మీద చేయేసుకుని నిద్రపోవచ్చు. జన గర్జనలు అక్కర్లేదు. సాగర ఘోషలు అవసరం లేదు. మిలియన్ మార్చులు చేయాల్సిన పనిలేదు. ఉద్యోగులు ముష్టియుద్ధాలు చేసుకోనక్కర్లేదు. యువకులు ఆత్మహత్యలు పాల్పడనక్కర్లేదు. దుష్టచతుష్టయం హైకమాండు బారిన పడి రాష్ట్రం రెండుగా విడిపోతుందా లేక మూడు ముక్కలైపోతుందా అన్న ఆందోళనలు అసలే అక్కర్లేదు. ఏది ఏమైనా, ఏది ఏమీ కాకపోయినా, తెలుగుజాతిని భుజం తట్టి, వెన్ను చరచి, ఆలింగనం చేసుకుని, ఓదార్చి, సాంత్వన చేకూర్చడానికి యువనేత జైలు గోడల్ని బద్ధలు కొట్టుకుని మళ్లీ మనమధ్యకు వచ్చేశాడు. ఇక భయం ఎంతమాత్రం అవసరం లేదు. వచ్చేశాయ్ వచ్చేశాయ్, జగన్మాథ జగన్నాథ, జగన్ నాథుడి రథ చక్రాల్... ’’ అంటూ తెలుగుజాతి ఆత్మశాంతి సభలో అవిరళంగా ఓదార్పు వచనాలు పలుకుతున్నాడు ఓ ప్రవక్త. 

‘‘ఈ రోజు... భలే మంచిరోజు. యావద్భారతానికి అభయహస్తం లభించిన రోజు. ఇకపై ఉల్లి ధర గురించి లొల్లి చేయాల్సిన పనిలేదు. పాతాళానికి పడిపోయిన రూపాయి బూస్ట్ తాగి రివర్స్ బంగీ జంప్ చేసి ఆకాశానికి ఎగురుతుంది. స్టాక్ మార్కెట్లో ఇక మీదట రోజూ బుల్ రన్ కొనసాగుతుంది. ఐసీయులో స్ట్రెచర్ మీదున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇక నిషేధిత స్టెరాయిడ్స్ తీసుకున్న రన్నర్ లా దూసుకుపోతుంది. వ్యాపారం కోసం, పెట్టుబడుల కోసం ఇకపై అమెరికోడి ముందు బాంచన్ కాల్మొక్త అని వెంపర్లాడిన అవసరం లేదు. జాతి యావత్తూ ఇకపై సుభిక్షంగా ఉంటుంది. యువనేత పునరాగమనంతో గత ఏడాదికాలంగా త్రిశంకుస్వర్గంలో, చీకట్లో మగ్గిపోయిన అపార ధనరాశులు ఇకపై నిప్పులు చిమ్ముకుంటూ బయటకొచ్చి పెట్టుబడులుగా ప్రవహించి అటు వ్యవసాయాన్ని, ఇటు పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించి జాతిని సుభిక్షం చేస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఉందిలే మంచికాలం ముందుముందునా... అందరూ సుఖపడాలి నంద నందనా...  ’’ అంటూ ఢిల్లీలోని వార్ రూమ్ అధిష్ఠాన సమావేశంలో మౌనవ్రతాన్ని వీడిన మన్మోహన్ సింగు మాంచి మెలోడి పాడుకుంటూ మెడిటేషన్ లోకి వెళ్లిపోయాడు. 


మళ్లీ మీడియా విశ్వరూప సందర్శనానికొద్దాం. మర్నాడు రాజధానిలో అంగుళమంగుళం కెమెరాల మోహరింపులు జరిగిపోయాయి. గల్లీగల్లీ చివర ఓ రిపోర్టరు నిరంతర వార్తా స్రవంతిని అందజేస్తున్నాడు. చెంచల్ గూడ దగ్గర మీడియా తొక్కిసలాట... మునుపటి తొక్కిసలాటల రికార్డుల్ని బద్ధలుకొట్టింది. టీవీల్లో స్టూడియాల్లో పండితుల, మేధావుల అపూర్వమైన, అద్భుతమైన చర్చోపచర్చలు నిరంతరాయంగా కొనసా...గుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఇంత జరిగినా, జరుగుతున్నా... యువనేత బెయిల్ విషయమై ఇంకా ఎలాంటి భావోద్వేగంతో స్పందించాలో తెలీక జనం తికమకపడుతూనే, గందరగోళపడుతూనే ఉన్నారు. పాపం... జగన్ కష్టాలు, ఇప్పడు జనానికొచ్చినట్టున్నాయ్! హతవిధీ!!

Tuesday, 17 September 2013

మూషికోపాఖ్యానం!

కాదేదీ కవిత కనర్హం - అన్నది మహాకవి ఉవాచ!
రాజకీయాల్ని చీల్చి చెండాడానిక్కూడా ఈ సూత్రాన్నే అనుసరించవచ్చునేమో!
నీచ, నికృష్ట, భ్రష్ట, తుచ్ఛ (ఎలుక భాష) రాజకీయాలపై సరదాగా ఎక్కుపెట్టిన మూషికాస్త్రమే ఈ రైటప్.
ఇవాళ్టి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ప్రచురితం! ఎప్పట్లాగే శ్రీధర్ కార్టూన్ ఇక్కడ అదనపు హంగు!!!


Thursday, 5 September 2013

ఇవాళ టీచర్స్ డే!


విద్య కన్నా
వినయం గొప్పది!
పుస్తక పాండిత్యం కన్నా
జీవితానుభవ సారం గొప్పది!!
అనే చిన్ని సత్యాన్ని నేర్పిన గురువులందరినీ స్మరించుకుంటూ....
నాకు బాగా నచ్చిన అబ్రహాం లింకన్ లెటర్ ను మరోసారి చదవాలనిపించింది!
గురు పూజోత్సవ శుభాకాంక్షలతో....!!!!

 

Respected Teacher,


My son will have to learn that all men are not just, all men are not true. But teach him also that for every scoundrel there is a hero; that for every selfish politician, there is a dedicated leader. Teach him that for every enemy there is a friend.

I know, it will take time, but teach him, if you can, that a dollar earned is far more valuable than five found. Teach him to learn to lose and also to enjoy winning. Steer him away from envy, if you can. Teach him the secret of quite laughter. Let him learn early that the bullies are the easiest to tick. Teach him, if you can, the wonder of books.. but also give him quiet time to ponder over the eternal mystery of birds in the sky, bees in the sun, and flowers on a green hill –side.

In school, teach him it is far more honourable to fail than to cheat. Teach him to have faith in his own ideas, even if every one tells him they are wrong. Teach him to be gentle with gentle people and tough with the tough. Try to give my son the strength not to follow the crowd when every one is getting on the bandwagon.

Teach him to listen to all men but teach him also to filter all he hears on a screen of truth and take only the good that comes through.Teach him, if you can, how to laugh when he is sad. Teach him there is no shame in tears. Teach him to scoff at cynics and to beware of too much sweetness.

Teach him to sell his brawn and brain to the highest bidders; but never to put a price tag on his heart and soul. Teach him to close his ears to a howling mob… and to stand and fight if he thinks he’s right.Treat him gently; but do not cuddle him because only the test of fire makes fine steel.

Let him have the courage to be impatient, let him have the patience to be brave. Teach him always to have sublime faith in himself because then he will always have sublime faith in mankind.

Abraham Lincoln.



Saturday, 17 August 2013

అధిష్ఠాన దుషట చతుషటయం!!


‘ఏంటోయ్ వెంకటేశం! మరీ నల్లపూసైపోయావ్! కొంపదీసి నీవు కూడా ఢిల్లీలో పాగా వేయడానికి రహస్యంగా  రోడ్డుమ్యాపులేమైనా వేసుకుంటున్నావా యేం?’
‘చాల్లెద్దురూ, మీ ఛమత్కారం! నా మట్టిబుర్రకంత సిత్రం ఉందంటారా? మా గల్లీ రోడ్లే సరిగా అర్థంగాక చస్తున్నాన్నేను. మీరేమో ఏకంగా ఢిల్లీకే రోడ్డుమ్యాపంటున్నారు. అబ్బెబ్బే... ఢిల్లీ గిల్లీ అయ్యే పన్లు కావులెండి.’
‘భలేవాడివటోయ్! ఇదేనా బుద్ధిమంతుల పద్ధతి? రాజకీయం చేయడం తెలుగువాడి జన్మహక్కని శాస్త్రాలు ఘోషిస్తున్నాయ్. పాలిటిక్స్ మన రక్తంలో ఉన్నాయిష! పైగా, అభినవ రాజకీయ దురంధరుడైన గిరీశం వద్ద శిష్యరికం వెలగబెట్టి ఆ మాత్రం లోకకళ్యాణానికి నడుం కట్టకపోతే చరిత్ర మనల్ని క్షమించదోయ్. అపర కమ్యూనిస్టుల్లాగా అంతులేని చారిత్రక తప్పిదాలు మనమూ చేద్దామంటావా? ఇకపోతే, ఇవాళ్రేపు రోడ్డుమ్యాపు రచించిన వాడెపో... అసలు సిసలు పొలిటీషియన్ అనిన్నీ; వాడికే సర్వోత్కృష్ట అధిష్ఠాన యోగం పడుతుందనిన్నీ మీడియా రేయింబవళ్లూ కోడై కూస్తోంది.’
‘చిత్తం మహాప్రభో! చారిత్రక తప్పిదం చేసేంత గొప్పోణ్ని కానులెండి నేను. తమరు కాస్త ఈ రోడ్డుమ్యాపు రాజకీయాల గురించి టూకీగానైనా జ్ఞానోదయం కల్పించి పుణ్యం కట్టుకోండి.’
‘చూడవోయ్ కుర్ర చాణక్యా! మచ్చుకు, మన సిగార్సు ఖర్చుల నిమిత్తం మీ నాన్న ఖజానా నుండి కాసులు కచ్చితంగా రాలగొట్టేగా కట్టుదిట్టమైన కుట్రపూరిత పథకమొకటి రచించావనుకో, అదో తరహా రోడ్డుమ్యాపన్నమాట. సింపుల్!’
‘హహ్హహ్హా! చూస్తోంటే, సూక్ష్మంలో మోక్షం సాక్షాత్కారం చేసే విద్య మీకు చుట్టతో పెట్టిన విద్యలాగుందే. అన్నట్టు, మా బాబు జేబుకు చిల్లు పెట్టి చిల్లర రాల్చటమన్నది అంత సులువు కాదండోయ్! ఆయన కూడా హస్తిన అధిష్ఠానంలా మహా ఘటికుడండీ బాబూ!’
‘చుట్ట ముట్టనివాడు మట్టి కొట్టుకుపోతాడన్నది శాస్త్రకారుడి ఉవాచ! దమ్ము లాగబట్టే కాదటోయ్ మన బుర్రలో దేశాన్ని ఉద్ధరించే ఐడియాలు కుప్పలుతెప్పలుగా తన్నుకొస్తున్నాయ్. ఏవన్నావ్... మీ నాన్నొక అధిష్ఠానమా? ఈ కురువృద్ధులొట్టి వెధవాయిలోయ్! వారొక పట్టాన మనకు పట్టుబడరు. దానిగ్గానూ వశీకరణ మంత్రం వేయాలోయ్.  ఓం ప్రథమం తాటిని తన్నేవాడి తలను తంతేనే మనకీ భూమ్మీద నూకలు చెల్లుబాటయ్యేది. ఆపై అధిష్ఠానం నాడిని దొరకబట్టి, దాని ఆయువుపట్టుపై పట్టు సాధించడమే అసలైన రాజకీయమోయ్!’
‘ఏమాటకామాటే చెప్పుకోవాలి గురూజీ! రాజకీయాలు రానురాను భ్రష్టు పట్టిపోతున్నాయి సుమండీ. సంస్కరణలు చేపట్టి కిష్కింధకాండ రాజకీయాల్ని జరూరుగా మరామత్తు చేయాల్సిన బాధ్యత మీదేనండోయ్. అన్నట్టు, హైకమాండు రాజకీయాల్ని ఔపోసన పట్టే ఆ వశీకరణ మంత్రం గురించి కాస్త వివరిద్దురూ... ?’
‘రాజకీయం చేయడం ఓ కళ! అందునా, అధిష్ఠాన రాజకీయాలు చేయడం అత్యున్నత మర్మకళ! అందుగ్గాను, తిమ్మిని బమ్మిని చేసే తాంత్రికకళలో ఆరితేరాలి. తాము చెప్పిందే వేదమని ఒప్పించే గోబెల్స్ నీతిని నమిలి జీర్ణం చేసుకోవాలి. జనాల్లో, పార్టీ శ్రేణుల్లో ఐక్యతను ఘోరీలాగా చీల్చి చెండాడాలి. ముఠాల్ని రెచ్చగొట్టాలి. కలహాల్ని సృష్టించాలి. మనోభావాలకు మంటబెట్టాలి. చిత్రవిచిత్ర సంకేతాల్ని ఎల్లెడలా వ్యాప్తిజేయాలి. అదేపనిగా అర్థంపర్థం లేని ప్రకటనలు చేయాలి. అయిందానికీ కానిదానికీ గల్లీ నేతలందర్నీ అస్తమానం ఢిల్లీ చుట్టూరా ప్రదక్షిణలు చేయించాలి. క్లూ ఇవ్వకుండా నేతల్ని అమ్మ ఇంటి ముందు క్యూ గట్టించాలి. డ్రెస్సుల్ని చేంజి చేసినట్టు ముఖ్యమంత్రుల్ని మార్చిపారేస్తుండాలి. తెల్లదొరలు నేర్పిన విభజించి పాలించడమనే కుట్రను నిరంతర కార్యాచరణగా పెట్టుకోవాలి. బుల్లి పార్టీల జెండాల్ని పీకేయించి గుటకాయస్వాహా చేయాలి. ప్రతిపక్షాల్ని కుటిల నీతితో చావుదెబ్బ తీయాలి. ఎవరేనా తోక జాడిస్తే ఉస్కో... అంటూ సీబీఐని ఉసిగొల్పాలి. దేశం నలుమూలలా రావణకాష్ఠం రాజేయాలి. ఆ రీతిన, రగిలే రావణకాష్ఠం మీద అధికార పీఠం వెలగబెట్టాలి. అద్గదీ సంగతి! అధిష్ఠానమా, మజాకా! ఆ విధముగ, అధిష్ఠాన రాజకీయాలు అత్యంత ప్రశస్థమైనవనే దర్మసూక్ష్మాన్ని గ్రహించడం అతి ముఖ్యమోయ్!’
‘అయ్యబాబోయ్! అరాచక రాజకీయాలన్నవి అధిష్ఠానానికి ఉగ్గుపాలతో పెట్టిన విద్యలాగున్నాయే. ఆ అఘాయిత్యాలు వింటేనే ఒళ్లు జలధరిస్తోంది. నేటి (అ)రాజకీయ పద్మవ్యూహంలో మనం నెగ్గుకురాగలమంటావా, గురూజీ?’
‘హార్నీ! నీ భయం బజార్న పడా! ఉట్టినే అలా జడుసుకుంటే ఎలాగోయ్! ధైర్యే సాహసే ఢిల్లీపీఠం హస్తగతం అని నవీన నానుడి. అధిష్ఠానయోగానికి ఉపకరించే ఓ డజను పుస్తకాల జాబితా రాస్కో! ‘డిగ్గీరాజా వారి ఢిల్లీ రోడ్డుమ్యాపు’, ‘అధిష్ఠాన విషవృక్షం’, ‘అమ్మనోట అంతిమతీర్పు’, ‘మన్మోహనబాబా మౌనవ్రతం’, యువరాజా పట్టాభిషేకం’, ‘ఢిల్లీ టాకిస్ వారి ముఖ్యమంత్రుల తోలుబొమ్మలాట’,  ‘సీబీఐపై సవారీ’, ‘మనోభావాలు దెబ్బతీయుటెట్లు?’, ‘సంకేతాలు, ప్రకటనలు, ఒక లోతైన పరిశీలన’. ఈ ఉద్గ్రంథాలన్నింటినీ నమిలి మింగేసి రాజకీయ కురుక్షేత్రంలోకి అభినవ అభిమన్యుడిలా లంఘించవోయ్! హైకమాండు సైతం డంగైపోయే రాజకీయాలు నీకెలాగ వంటబట్టవో నేనూ చూస్తా. అన్నట్టు, ఈ మారు కలిసినప్పుడు మన సిగార్సుకు మీ నాన్న పర్సు నుండి కొన్ని పచ్చనోట్లు పట్టుకొచ్చే మాట మాత్రం మరువకు సుమీ! సరే మరి, నాక్కొంచెం రాచకార్యాలున్నాయి. ‘రూపాయికి గుండెకోత - స్టాక్ మార్కెట్టుకు ఊచకోత’ అనే విషయమై ఇంగ్లండ్ బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఏకబిగిన ఏడుగంటలు పాటు తెల్లోళ్లకి లెక్చరివ్వాల్సి ఉంది. నే వస్తా!!!



[Note: పత్రిక కోసం రాసిన ఈ రైటప్ ను అనివార్య కారణాల వల్ల కాస్త లేటుగా ఇక్కడ పబ్లిష్ చేస్తున్నా]

Thursday, 15 August 2013

గిరీశం గీతోపదేశం!


భారత రాజకీయ నాయకుల అవినీతి అఘాయిత్యాలు విని దేవలోకంలో కలకలం చెలరేగిన వైనంబెట్టిదనిన.... భారత రాజకీయ విశ్వరూప సందర్శనం అను గిరీశం గీతోపదేశం ఈ రోజు ఈనాడు సంపాదకీయం పేజీలో....




Friday, 9 August 2013

బుడుగోపాఖ్యానం!

మడిషన్నాక కూసంత కళాపోసనుండాల! లేకపోతే మడిషికీ, మన్మోహనసింగుకీ తేడా ఏటుంటాది!! ఇలా అని నేనన్లేదు. బాబాయ్ అంటుంటాడు. ఈ సింగెవరో నాకూ తెలీదు. ఢిల్లీలో ఉంటాట్ట. నాకు మా గల్లీ వోళ్లు మాత్రమే తెల్సు. సింగుక్కూడా పెద్దగా బోల్డన్నీ మాటలూ గట్రా రావట. సరిగా నడవడం చేతగాదట. అచ్చం నాలాగే ప్రతీదానికీ అస్తమానం అమ్మా అమ్మా అని కొంగుపట్టుకు తిరుగుతుంటాట్ట. ఇలా అని బాబాయే చెప్పాడు. బాబాయికిలాంటివి బోల్డు తెలుసు. ఎందుకంటే వాడు పొద్దస్తమానం గుడ్లగూబలా కళ్లప్పగించి టీవీ చూస్తుంటాడు. అందుకే వాడిక్కుంచెం బుర్ర పాడైపోయి ఇలాంటి డైలాగులన్నీ చెప్పేస్తుంటాడు. డైలాగులంటే తలాతోక లేకండా ఎలా పడితే అలా వాగేసేవన్నమాట. ఇలా అని నేనన్లేదు. బామ్మ అంటుంది. బామ్మక్కొంచెం మతిమరుపు. పాపం,  వయసైపోయింది కద. బామ్మకిప్పుడు ప్ఫదో, అరవయ్యో వయసుంటుంది. నాకంటే కుంచెం ప్పెద్దన్నమాట. పెద్ద వయసేం కాదు, కానీ కళ్లద్దాలు, మతిమరపొచ్చే వయసన్నమాట. అందుకే బామ్మ, బాబాయిని బడుద్దాయనీ, నన్నేమో హారి... పిడుగా అంటుంటుంది. బడుద్దాయంటే తిట్టటవన్నమాట. కానీ హారి పిడుగా అంటే పొగట్టమన్నమాట. నన్ను చూస్తే బామ్మకు బోల్డంత భయం. అందుకే నన్ను బాగా పొగిడేస్తుంది. లేడీస్ పొగిడితే నాకు ఒకటే సిగ్గు. బామ్మ కూడా లేడీసు కిందకే వస్తుందిలే.


 నా చిన్నప్పుడు బస్సులు, రైళ్లు నడిచేవి. ఇప్పుడంతా బందులు నడుస్తున్నాయి. బందుల్ని ఎవరు నడిపిస్తారంటే... తెలంగాణ, సమైక్యాంధ్ర కలిసి నడిపిస్తాయట. ఎవరికోసం నడిపిస్తారంటే... ఢిల్లీ వాళ్ల కోసం నడిపిస్తారట. అలా అని అమ్మ అంటుంది. అమ్మక్కూడా కుంచెం బానే విషయాలు తెలుసు. నా అంత కాదనుకోండి. అమ్మ సీరియళ్లు చూసీచూసీ బోరు కొట్టేసినప్పుడు వార్తలు గట్రా చూస్తుందన్నమాట. వార్తలంటే తెలంగాణ, సమైక్యాంధ్ర అన్నమాట!! నాక్కొంచెం అవమానమొచ్చి, ఏమ్.... మన ఐదరాబాదు కోసం బందులు చేయరా? అంటే, నోర్మూసుకో, వేల్డంత లేవు, పెద్ద విషయాలు నీకెందుకోయ్ అని నెత్తినో మొట్టికాయేస్తుంది. అప్పుడు నాకేమో ఒళ్లు మండుకుపోయి బోల్డంత ఖోపమొచ్చేస్తుంది. నేనేమన్నా చిన్నా వాడినా, చితకా వాడినా? నా అంతటి వాణ్ని నేను. బుడుగు అనుమానాల్ని భరించేవాడు కాడు. అందుకే మళ్లీ అడిగా అమ్మని. ఏమ్... మన ఐదరాబాదు కోసం బందులు చేయరా? అని. ఛస్... పోకిరీ వెధవా, వాగుడుకాయలా విసిగించావంటే.. చ్ఛితక్కొట్టి బళ్లో పడేస్తానేమనుకున్నావో, యెళ్లు బయటికి అని అమాంతం తెగ ఖోప్పడిపోయింది. సీరియళ్లు చూసీచూసీ అమ్మక్కుంచెం కోపమెక్కువైపోతోంది రానురాను. నాన్నకు చెప్పి బాగా ప్రెవేటు చెప్పించాలి. లేకపోతే మన సీక్రెట్లన్నీ కనిపెట్టేసి అస్తమానం భయపెట్టేస్తది. బడులుండడం చాలా డేంజరు. ఇది అనుభవమ్మీద నేనే కనిపెట్టా. ఈ బందుల్మీద మనక్కూడా పెద్దగా అభిప్రాయాల్లేవు. అభిప్రాయాలంటే అవి బాబాయికి ఉండేవన్నమాట. అయితేగియితే బందుల వల్ల బోల్డు లాభాలుంటాయ్. బందులుంటే బడులుండవన్నమాట. రెంటికీ పడదు. ఒకటుంటే ఒకటుండదు. నేనైతే బందులుండాలనే అనుకుంటా. అప్పడైతే ఎంచక్కా క్రికెట్టు ఆడుకోవచ్చు. సీగానపెసూనాంబతో షికార్లు కూడా చేస్కోవచ్చు. బందులుంటే అందరికీ ఆడిందే ఆట, పాడిందే పాట!!




 ఓ రోజు, అంటే చాల్రోజుల క్రితం, మా ఇంటో టీవీలో, వాడిపేరేంటబ్బా - గబుక్కుని గుర్తు రావట్లేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తాలే - పొడుగాటి రింగుల జుట్టేస్కుని, ఎర్ర చొక్కాయేస్కుని, ముఖానికి నల్లరంగేస్కుని, కర్రపుల్లలా చిన్నబ్యాటుచ్చుకుని - వాడిసైజుకది చిన్నదే - అప్పుడు దొరకిన వాణ్ని దొరికినట్టుగ.. వందో, థౌజండో రన్స్ చితక బాదుతున్నాడా, నేనాట్టే గుడ్లప్పగించి చూస్తున్నానా.... ఇంతలో ఠకీమని పాలిటిక్సు పెట్టేశాడు నాన్న. పాలిటిక్సంటే వార్తలు. వార్తలంటే ఇందాకే చెప్పా కదా.. తెలంగాణ, సమైక్యాంధ్ర అని. టీవీలలో ఇవెప్పుడూ ఉంటాయ్. నాన్నకు చేస్కోవడానికి పనేం లేక పాలిటిక్సు చూస్తుంటాట్ట! పని లేకపోతే వంట చేయొచ్చుకదా అంటుందమ్మ. అది అమ్మ అభిప్రాయం. అమ్మ అభిప్రాయానికి పెద్ద విలువేం లేదనుకోండి. నాన్న పాలిటిక్సు పెట్టీగానే నాకప్పుడు బోల్డంత విపరీతమైన ఖోపమొచ్చేసింది. వెంటనే నాన్నను నా బ్యాటుతో అమాంతం కొఠేద్దామనుకున్నా. కానీ, నాన్న నాకంటే కుంచెం పెద్దవాడు కదా. పైగా, నాన్నను కొడితే అమ్మ మాత్రమే కొట్టాలట. ఎవరు పడితే వాళ్లు కొట్టరాదట. అలా అని బామ్మ అంటుంది. అది బామ్మ అభిప్రాయం. నా అభిప్రాయం వేరనుకోండి. పోన్లే నాన్నే కదా అని వదిలేశా. లేపోతే, ఆరోజు ఇండో-చైనా యుద్దవైపోయేదంతే. ఇండో-చైనా యుద్ధవంటే ఇప్పుడప్పుడే జరగనిదట. అలా అని బాబాయ్ చెప్పాడు. ఆ రోజు నా మనోభావాలు మొత్తం దెబ్బతినిపోయాయ్. ఎందుకంటే నా అంతటి వాణ్నినేను. నాన్న అంతటి వాడు, వాడు. నాక్కోపమొస్తే నాన్నను వాడు అంటాను. అది నాన్నకు వినిపించదనుకోండి. ఎప్పుడేనా, మనోభావాలు దెబ్బతింటే వెంటనే ఖండించాలట. తర్వాత క్షమాపణలు కోరమని డిమాండు చేయాలట. ధర్నా చేయాలట. చివరకు దాడికి దిగాలట. అవరసమైతే అన్నింటినీ బందు చేయాలట. మనోభావాలంటే ఇంత పెద్దగుంటాయట. ఇది కూడా బాబాయే చెప్పాడు. చెప్పా కదా, వాడు అస్తమానం టీవీ చూస్తుంటాడని. వాడికిలాంటివి చాలా తెలుసు. నాక్కూడా తెలుసనుకోండి. బాబాయ్ కూడా అప్పుడప్పుడు పాలిటిక్సు చేస్తుంటాడు. అందుకని పెళ్లీగిళ్లీ చేస్కోడట. పెళ్లి చేస్కుంటే పాలిటిక్సు సరిగా చేయలేమట. అది బాబాయ్ అభిప్రాయం. హైకమాండుకు వేరే అభిప్రాయముంది. హైకమాండంటే అమ్మ, నాన్న, బామ్మలన్నమాట. బాబాయికి పెళ్లి చేస్తేనే పిచ్చి కుదురుతుందట. పిచ్చి అంటే పాలిటిక్సనుకుంటూ అలా బలాదూర్ తిరగడమట. పెళ్లి మీద నాకూ ఓ అభిప్రాయముందనుకోండి. యేడిశావులే, నీ బోడి అభిప్రాయమెవడిక్కావాలోయ్ అంటారందరూనూ. నేను డ్యామింసల్ట్ అనేస్తా. బామ్మ తిట్టినప్పుడల్లా బాబాయ్ అలాగే అంటుంటాడు.


నా చదువు ఓ సమస్యట! సమస్యంటే బుక్కులుగిక్కులు, ఫీజులుగీజులు, బందులుగిందులూ బాగా పెరిగిపోయాయి కదా, అందుకన్నమాట. అలా అని బామ్మ, అమ్మతో అంటుంది. నేనందుకే బడికి రాజీనామా చేసిపారేస్తానన్నా. ఊర్కె, అస్తమానం బళ్లో కూచోటం నావల్లకాదు, నేను కూడా బాబాయిలా పాలిటిక్సులో చేరతానన్నా! బామ్మ, ఆ మాట విని బడవాఖానా అని తిడుతుంది. బామ్మకు కోపమొస్తే అలా అంటుంది. నాకు కోపమొస్తే జాటర్ ఢమాల్ అంటాను. ఈ మాటలకు అర్థాలుండవ్. అంటే అర్థం పర్థం లేని మాటలన్నమాట. అది వేరే సంగతి. యిందాక, రాజీనామాలంటే ఏంటో చెప్పలేదు కదూ. అయిందానికీ, కానిదానికీ చేసేవే రాజీనామాలట. అలా అని నాన్న టీవీ చూసేటప్పుడు పాలిటిక్సులో రాజీనామాలు చేసినోళ్లనీ, చేయనోళ్లనీ ఇద్దరికీ ప్రెవేట్ చెప్పేస్తుంటాడు. ప్రెవేట్ అంటే తిట్టడవన్నమాట. రాజీనామాలుంటాయ్ కాబట్టే పాలిటిక్సంటే నాకు బోల్డిష్టం. పాలిటిక్సులో చేరితే... బడికెళ్లి చదూకోవాల్సిన పనుండదట. ఎవరికైనా ప్రెవేటు చెప్పేయొచ్చట. మనల్నెవరూ అడిగేవాళ్లే ఉండరట. కావలిస్తే రాజీనామా చేసేసి ఇమానమొక్కేసి ఢిల్లీకెళ్లిపోవచ్చుట. బాబాయ్ చెప్పాడు. పాలిటిక్సులో బోల్డన్ని లాభాలు కాబట్టే, వాడు చదూగిదూ లేకుండా పాలిటిక్సులో బలాదూర్  తిరిగేస్తున్నాడు. మనం సీక్రెట్టుగా బాబాయిని కాకా పట్టి మెల్లిగా పాలిటిక్సులోకెళ్లిపోవాలి. ఈ విషయం నాన్నకు తెలీకూడదు. తెలిస్తే రౌడీ రాస్కిల్ అని తిడతాడు. రాస్కీల్ అనేది తెల్లొళ్ల భాష. రాజకీయాల్లో ఉన్నదంతా రౌడీలేనంటుంది బామ్మ. పక్కింటి పిన్నికీ, వాళ్ల మీసాల మొగుడుగారికీ ఈ విషయమసలే తెలీకూడదు. ఎందుకంటే వాళ్లసలే లోకులు. లోకులంటే కాకులన్నమాట. అలా అని బామ్మే అంటుంది. అర్జంటుగా యెళ్లిపోయి, సీగానపెసూనాంబకు పాలిటిక్సు విషయమై గాఠిగా ప్రెవేటు తీసుకోవాలి. ఆ పిల్లదసలే మట్టిబుర్ర! యెళ్లొస్తా. జై జాటర్ ఢమాల్!!! :)


[P.S: ఏదో సరదాకి రాసిందిది, ఎవరి మనోభావాలూ నొప్పించడానిక్కాదు :) ]

[Photos Courtesy: Google Images & Sridhar Cartoons!!]



Tuesday, 23 July 2013

బతుకంతా భయం..

విషయం: ప్రజల్ని జడిపిస్తున్న విపత్తుల భయం గురించి, అంతకుమించి రాజకీయ నాయకుల భయం గురించి
శైలి: డాక్టర్ - పేషెంట్ సంభాషణా స్టైల్...
ప్రచురణ: ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, 2013 జులై 20న...
మై కామెంట్: ఇటీవల సంభవించిన కేదార్ నాథ్ ప్రకృతి విపత్తు, హైదరాబాద్ లో కూలిన సిటీ లైట్ హోటల్, ఇంకా బాంబు పేలుళ్లు ఇలాటివాటన్నింటినీ కలగలపి, వాటితో పాటు ఈ సమయాల్లో రాజకీయ నాయకులు చేపట్టే పరామర్శకాండల గురించి రాసిన రైటప్ ఇది. 
కొరత: శ్రీధర్ కార్టూన్ లేకపోవడం...


ఏ వెల్గులకీ ప్రస్థానం...!

విషయం: డాక్టర్స్ డే సందర్భంగా డాక్టరు-పేషెంట్ల రిలేషన్ గురించి...
శైలి: జస్ట్ రిపోర్టింగ్ స్టైల్
ప్రచురణ: ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, 2013 జులై ఒకటిన....
మై కామెంట్: సుఖీభవ రిపోర్టర్ గా, ఒక సగటు వ్యక్తిగా స్టడీ చేసిన విషయాలను గుదిగుచ్చి వైద్యరంగంలో పెరిగిపోతున్న వ్యాపార సంస్కృతి గురించి, డాక్టరు-పేషెంట్ల రిలేషన్ లో తగ్గిపోతున్న నమ్మకం, సహృద్భావాల గురించి విశ్లేషించే కథనం. నాకు నచ్చిన కథనమిది.


సన్యాసయోగం!

విషయం: రాజకీయాల్లో పెరిగిపోతున్న కాంపిటీషన్ సంగతి...
శైలి: సాధూజీ - రాజకీయ నాయకుడి మధ్య సంభాషణ స్టైల్
ప్రచురణ: ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, 2013 జూన్ నెలలో...
మై కామెంట్: బీజేపీలో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో అద్వానీ అస్త్ర సన్యాసం చేసిన నేపథ్యంలో... పాలిటిక్స్ లో కూడా పీకలు తెగ్గోసుకునే కాంపిటీషన్ పెరిగిందనీ, సదరు నేతలు సన్యాసయోగానికి పాల్పడుతున్నారని వ్యంగ్యంగా చెప్పే ప్రయత్నమే ఈ సన్యాసయోగం.
అదనపు ఆకర్షణ:  శ్రీధర్ కార్టూన్


సంతలో సరకులు!!

విషయం: పొలిటికల్ పార్టీల్లో నేతల ఫిరాయింపుల సంగతి.
శైలి: మళ్లీ అందరికీ ఇష్టమైన గిరీశం - వెంకటేశం సంభాషణా స్టైలే...
ప్రచురణ:
ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, 2013 మే నెలలో ప్రచురితం
మై కామెంట్: ఆమధ్య కడియం శ్రీహరి, దాడి వీరభద్రరావు, ఇంకా మరికొందరు నేతలు పార్టీల్లో కప్పదాట్లకు పాల్పడుతుండడంతో, దానిని IPL వేలానికి లంకెపెట్టి రాసిన రైటప్ ఇది.
అదనపు ఆకర్షణ:  శ్రీధర్ కార్టూన్
 

రాజయోగ మార్గం !!

విషయం: రాజకీయాల్లోని సకల చరాచర విషయాలపై ఒక విద్యాలయం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందనే విషయమై..
శైలి: బాబాయ్ - అబ్బాయ్ సంభాషణా స్టైల్
ప్రచురణ: ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, 2013 మే నెలలో...
మై కామెంట్: అన్నీ వేదాల్లో ఉన్నాయిష... అనడం మనవాళ్లకు పరిపాటే. ఈ కామెంటును ఆధారంగా తీసుకుని అన్నీ రాజకీయాల్లోనే ఉన్నాయని వ్యంగ్యరూపకంగా చెప్పే ప్రయత్నానికి అక్షరీకరణే ఇది.
అదనపు ఆకర్షణ:  శ్రీధర్ కార్టూన్

తెలుగువాడి జీవనాడి... కూచిపూడి !!

విషయం: తెలుగువాడి శాస్త్రీయ నృత్య రీతి ‘‘కూచిపూడి’’ గురించి
ప్రచురణ: తెలుగు వెలుగు మ్యాగజైన్ ఏప్రిల్ సంచికలో....
మై కామెంట్: తెలుగు వెలుగు మ్యాగజైన్ కోసం నేను బాగా అభిమానించే క్లాసికల్ నృత్య రీతుల్లో ఒకటైన, మనదైన కూచిపూడి గురించి కొంత స్టడీ చేసి, ముందు తరాలకు, ఈతరానికి చెందిన 8 మంది కూచిపూడి గురువులు, కళాకారులతో ఇంటర్వ్యూ చేసి రాసిన కథనం ఇది. బాగా సంతృప్తినిచ్చిన ఆర్టికల్ ఇది.

 

మూర్ఖోపనిషత్ !!

విషయం: రాజకీయ నాయకుల్లో కనిపించే మూర్ఖత్వం
శైలి: బాబాయ్ - అబ్బాయ్ సంభాషణ స్టైల్
ప్రచురణ: ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, 2013 మార్చి నెలలో...
మై కామెంట్: ఈ రైటప్ కు ఆధారం ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన... భారతీయుల్లో 99 శాతం మంది మూర్ఖులే’ అన్న వ్యాఖ్యలు. నిజానికి కట్జూ ఏ సందర్భంలో, ఎందుకన్నాడో గానీ, మీడియా రాద్ధాంతం కారణంగా పెద్ద దూమారమే రేగింది అప్పట్లో. కట్జూ వ్యాఖ్యల ఆధారంగా పొలిటికల్ లీడర్ల మూర్ఖత్వాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ సెటైర్.
అదనపు ఆకర్షణ:  శ్రీధర్ కార్టూన్

రాజకీయ రాచపుండు !!

విషయం: రాజకీయ నాయకుల్లో మాత్రమే కనిపించే రెండు ప్రత్యేక రోగాలు
శైలి: డాక్టరు - పేషెంట్ సంభాషణ స్టైల్.
ప్రచురణ: 2013 మార్చి నెలలో, ఈనాడు ఎడిటోరియల్ పేజీలో...
మై కామెంట్: మీడియా కనిపిస్తే మైకం పూనడం; పదవులు-స్కాముల తాలూకు కలలు, భయాలను ఒక రాజకీయ నాయకుడు తనకు తానుగా డాక్టరు దగ్గరకు వెళ్లి చెప్పుకునే నేపథ్యంతో ప్రయత్నించిన సరదా సెటైర్ ఇది.
అదనపు ఆకర్షణ:  శ్రీధర్ కార్టూన్


రాజకీయ బాలశిక్ష!

విషయం: రాజకీయాల్లో రాటుతేలడం ఎలా?
శైలి: అందరూ ఇష్టపడే ‘‘గిరీశం - వెంకటేశం’’ స్టైల్
ప్రచురణ: 2013, ఫిబ్రవరిలో, ఈనాడు ఎడిటోరియల్ పేజీలో
మై కామెంట్: ఈనాడు సంపాదకీయం పేజీలో సెటైర్ రూపేణా పబ్లిష్ అయిన మొదటి రైటప్ ఇది. అంతకుముందు రెండుసార్లు ప్రయత్నించినా... అవి కరెంట్ ఇష్యూస్ మీద రాసినవి కావడం, అంత బాగా పండకపోవడం వల్లనేమో ప్రచురితమవలేదు. మూడో ప్రయత్నంలో సక్సెస్  అవడం సంతోషాన్నిచ్చిన విషయం.
అదనపు ఆకర్షణ:  శ్రీధర్ కార్టూన్