Saturday 17 August 2013

అధిష్ఠాన దుషట చతుషటయం!!


‘ఏంటోయ్ వెంకటేశం! మరీ నల్లపూసైపోయావ్! కొంపదీసి నీవు కూడా ఢిల్లీలో పాగా వేయడానికి రహస్యంగా  రోడ్డుమ్యాపులేమైనా వేసుకుంటున్నావా యేం?’
‘చాల్లెద్దురూ, మీ ఛమత్కారం! నా మట్టిబుర్రకంత సిత్రం ఉందంటారా? మా గల్లీ రోడ్లే సరిగా అర్థంగాక చస్తున్నాన్నేను. మీరేమో ఏకంగా ఢిల్లీకే రోడ్డుమ్యాపంటున్నారు. అబ్బెబ్బే... ఢిల్లీ గిల్లీ అయ్యే పన్లు కావులెండి.’
‘భలేవాడివటోయ్! ఇదేనా బుద్ధిమంతుల పద్ధతి? రాజకీయం చేయడం తెలుగువాడి జన్మహక్కని శాస్త్రాలు ఘోషిస్తున్నాయ్. పాలిటిక్స్ మన రక్తంలో ఉన్నాయిష! పైగా, అభినవ రాజకీయ దురంధరుడైన గిరీశం వద్ద శిష్యరికం వెలగబెట్టి ఆ మాత్రం లోకకళ్యాణానికి నడుం కట్టకపోతే చరిత్ర మనల్ని క్షమించదోయ్. అపర కమ్యూనిస్టుల్లాగా అంతులేని చారిత్రక తప్పిదాలు మనమూ చేద్దామంటావా? ఇకపోతే, ఇవాళ్రేపు రోడ్డుమ్యాపు రచించిన వాడెపో... అసలు సిసలు పొలిటీషియన్ అనిన్నీ; వాడికే సర్వోత్కృష్ట అధిష్ఠాన యోగం పడుతుందనిన్నీ మీడియా రేయింబవళ్లూ కోడై కూస్తోంది.’
‘చిత్తం మహాప్రభో! చారిత్రక తప్పిదం చేసేంత గొప్పోణ్ని కానులెండి నేను. తమరు కాస్త ఈ రోడ్డుమ్యాపు రాజకీయాల గురించి టూకీగానైనా జ్ఞానోదయం కల్పించి పుణ్యం కట్టుకోండి.’
‘చూడవోయ్ కుర్ర చాణక్యా! మచ్చుకు, మన సిగార్సు ఖర్చుల నిమిత్తం మీ నాన్న ఖజానా నుండి కాసులు కచ్చితంగా రాలగొట్టేగా కట్టుదిట్టమైన కుట్రపూరిత పథకమొకటి రచించావనుకో, అదో తరహా రోడ్డుమ్యాపన్నమాట. సింపుల్!’
‘హహ్హహ్హా! చూస్తోంటే, సూక్ష్మంలో మోక్షం సాక్షాత్కారం చేసే విద్య మీకు చుట్టతో పెట్టిన విద్యలాగుందే. అన్నట్టు, మా బాబు జేబుకు చిల్లు పెట్టి చిల్లర రాల్చటమన్నది అంత సులువు కాదండోయ్! ఆయన కూడా హస్తిన అధిష్ఠానంలా మహా ఘటికుడండీ బాబూ!’
‘చుట్ట ముట్టనివాడు మట్టి కొట్టుకుపోతాడన్నది శాస్త్రకారుడి ఉవాచ! దమ్ము లాగబట్టే కాదటోయ్ మన బుర్రలో దేశాన్ని ఉద్ధరించే ఐడియాలు కుప్పలుతెప్పలుగా తన్నుకొస్తున్నాయ్. ఏవన్నావ్... మీ నాన్నొక అధిష్ఠానమా? ఈ కురువృద్ధులొట్టి వెధవాయిలోయ్! వారొక పట్టాన మనకు పట్టుబడరు. దానిగ్గానూ వశీకరణ మంత్రం వేయాలోయ్.  ఓం ప్రథమం తాటిని తన్నేవాడి తలను తంతేనే మనకీ భూమ్మీద నూకలు చెల్లుబాటయ్యేది. ఆపై అధిష్ఠానం నాడిని దొరకబట్టి, దాని ఆయువుపట్టుపై పట్టు సాధించడమే అసలైన రాజకీయమోయ్!’
‘ఏమాటకామాటే చెప్పుకోవాలి గురూజీ! రాజకీయాలు రానురాను భ్రష్టు పట్టిపోతున్నాయి సుమండీ. సంస్కరణలు చేపట్టి కిష్కింధకాండ రాజకీయాల్ని జరూరుగా మరామత్తు చేయాల్సిన బాధ్యత మీదేనండోయ్. అన్నట్టు, హైకమాండు రాజకీయాల్ని ఔపోసన పట్టే ఆ వశీకరణ మంత్రం గురించి కాస్త వివరిద్దురూ... ?’
‘రాజకీయం చేయడం ఓ కళ! అందునా, అధిష్ఠాన రాజకీయాలు చేయడం అత్యున్నత మర్మకళ! అందుగ్గాను, తిమ్మిని బమ్మిని చేసే తాంత్రికకళలో ఆరితేరాలి. తాము చెప్పిందే వేదమని ఒప్పించే గోబెల్స్ నీతిని నమిలి జీర్ణం చేసుకోవాలి. జనాల్లో, పార్టీ శ్రేణుల్లో ఐక్యతను ఘోరీలాగా చీల్చి చెండాడాలి. ముఠాల్ని రెచ్చగొట్టాలి. కలహాల్ని సృష్టించాలి. మనోభావాలకు మంటబెట్టాలి. చిత్రవిచిత్ర సంకేతాల్ని ఎల్లెడలా వ్యాప్తిజేయాలి. అదేపనిగా అర్థంపర్థం లేని ప్రకటనలు చేయాలి. అయిందానికీ కానిదానికీ గల్లీ నేతలందర్నీ అస్తమానం ఢిల్లీ చుట్టూరా ప్రదక్షిణలు చేయించాలి. క్లూ ఇవ్వకుండా నేతల్ని అమ్మ ఇంటి ముందు క్యూ గట్టించాలి. డ్రెస్సుల్ని చేంజి చేసినట్టు ముఖ్యమంత్రుల్ని మార్చిపారేస్తుండాలి. తెల్లదొరలు నేర్పిన విభజించి పాలించడమనే కుట్రను నిరంతర కార్యాచరణగా పెట్టుకోవాలి. బుల్లి పార్టీల జెండాల్ని పీకేయించి గుటకాయస్వాహా చేయాలి. ప్రతిపక్షాల్ని కుటిల నీతితో చావుదెబ్బ తీయాలి. ఎవరేనా తోక జాడిస్తే ఉస్కో... అంటూ సీబీఐని ఉసిగొల్పాలి. దేశం నలుమూలలా రావణకాష్ఠం రాజేయాలి. ఆ రీతిన, రగిలే రావణకాష్ఠం మీద అధికార పీఠం వెలగబెట్టాలి. అద్గదీ సంగతి! అధిష్ఠానమా, మజాకా! ఆ విధముగ, అధిష్ఠాన రాజకీయాలు అత్యంత ప్రశస్థమైనవనే దర్మసూక్ష్మాన్ని గ్రహించడం అతి ముఖ్యమోయ్!’
‘అయ్యబాబోయ్! అరాచక రాజకీయాలన్నవి అధిష్ఠానానికి ఉగ్గుపాలతో పెట్టిన విద్యలాగున్నాయే. ఆ అఘాయిత్యాలు వింటేనే ఒళ్లు జలధరిస్తోంది. నేటి (అ)రాజకీయ పద్మవ్యూహంలో మనం నెగ్గుకురాగలమంటావా, గురూజీ?’
‘హార్నీ! నీ భయం బజార్న పడా! ఉట్టినే అలా జడుసుకుంటే ఎలాగోయ్! ధైర్యే సాహసే ఢిల్లీపీఠం హస్తగతం అని నవీన నానుడి. అధిష్ఠానయోగానికి ఉపకరించే ఓ డజను పుస్తకాల జాబితా రాస్కో! ‘డిగ్గీరాజా వారి ఢిల్లీ రోడ్డుమ్యాపు’, ‘అధిష్ఠాన విషవృక్షం’, ‘అమ్మనోట అంతిమతీర్పు’, ‘మన్మోహనబాబా మౌనవ్రతం’, యువరాజా పట్టాభిషేకం’, ‘ఢిల్లీ టాకిస్ వారి ముఖ్యమంత్రుల తోలుబొమ్మలాట’,  ‘సీబీఐపై సవారీ’, ‘మనోభావాలు దెబ్బతీయుటెట్లు?’, ‘సంకేతాలు, ప్రకటనలు, ఒక లోతైన పరిశీలన’. ఈ ఉద్గ్రంథాలన్నింటినీ నమిలి మింగేసి రాజకీయ కురుక్షేత్రంలోకి అభినవ అభిమన్యుడిలా లంఘించవోయ్! హైకమాండు సైతం డంగైపోయే రాజకీయాలు నీకెలాగ వంటబట్టవో నేనూ చూస్తా. అన్నట్టు, ఈ మారు కలిసినప్పుడు మన సిగార్సుకు మీ నాన్న పర్సు నుండి కొన్ని పచ్చనోట్లు పట్టుకొచ్చే మాట మాత్రం మరువకు సుమీ! సరే మరి, నాక్కొంచెం రాచకార్యాలున్నాయి. ‘రూపాయికి గుండెకోత - స్టాక్ మార్కెట్టుకు ఊచకోత’ అనే విషయమై ఇంగ్లండ్ బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఏకబిగిన ఏడుగంటలు పాటు తెల్లోళ్లకి లెక్చరివ్వాల్సి ఉంది. నే వస్తా!!!



[Note: పత్రిక కోసం రాసిన ఈ రైటప్ ను అనివార్య కారణాల వల్ల కాస్త లేటుగా ఇక్కడ పబ్లిష్ చేస్తున్నా]

No comments:

Post a Comment