Tuesday 7 July 2015

సెల్ఫీ ఇన్ శ్మశానమ్!!



అశుభమా అని... శ్మశానంతో పోస్ట్ మొదలెట్టాల్సొచ్చిందేవిటో.. ఖర్మ కాకపోతే! ఎవరి ఖర్మ అంటారా?? ఎవరిదైతే ఏముంది డూడ్స్... ఈ పోస్టు రాయాల్సి రావడం నా ఖర్మ! దాన్ని పబ్లిష్ చేయాల్సి రావడం గూగులోడి ఖర్మ!! చివరకి దాన్ని చదవాల్సి రావడం మీ  అందరి ఖర్మ!!! సో, ఖర్మ మాత్రం కామన్! ఎంతైనా మనది ఖర్మభూమి కదా!! యోవ్... నీ దుంపతెగా, అది ‘ఖ’ కాదు, ‘క’ అంటారా, ఏదో ఒకట్లెండీ, సర్దుకుపోండీసారికి. ఎనీవే, ఈ పోస్టు ఎన్ని మెలికలు తిరిగి, ఎక్కడికి పోయి, ఎలా ముగుస్తుందో ఆ దేవుడికే... సారీ, ఆ భూత ప్రేతాలకే తెలియాలి. పోస్టులో ఎక్కడైనా పిచ్చి ప్రేలాపనలాంటి పదాలు, వాక్యాలు అసందర్భంగా మిమ్మల్ని కించిత్ దిగ్భ్రాంతికి గురిచేస్తే... అది నా తప్పు ఎంతమాత్రమూ కాదనీ, అన్యదా భావించవలదనీ, అది కేవలం నన్ను ఆవహించిన చిలిపి దెయ్యాల అఘాయిత్యమేనని భావించి సర్దుకోగలరు. అలాగే, పోస్టు చదివేటప్పుడు ఎక్కడైనా కంటెంట్ మింగుడుపడక హార్టులో నొప్పి, వాపు లాంటివేవైనా వస్తే... ఎందుకైనా మంచిది ముందే ఝండూబామో, టైగర్ బామో పక్కనే పెట్టుకోండి, కాస్త మర్దన చేసుకుని ముందుకెళ్లడానికన్నమాట. ఓ మై గాడ్! చూశారా... అప్పుడే, ఏదేదో రాసేస్తున్నా. ఇక్కడికి ఆపేస్తానీ డిస్క్లెయిమర్..!

మా ఊళ్లో నదికెళ్లే దార్లో ఓ శ్మశానం ఉంటుంది. శ్మశానం అన్నాక దెయ్యాలు; దెయ్యాలన్నాక భయాలు; భయాలన్నాక కట్టుకథలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. సందర్భం వచ్చింది కాబట్టి చిన్నతనంలో విన్న ఓ కట్టుకథను క్లుప్తంగా చెబుతానుండండి. మా వీధికి ఒకవైపు రెడ్డిగార్ల కొంప ఒకటుండేదిట. అది నిజంగానే లంకంత కొంప. ఆ కొంపలో ఒకే ఒక్క జేజమ్మని తప్ప మిగతావాళ్లని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పన్లేదు. ఆ జేజమ్మ నామధేయమే...రెడ్డి గారి నర్సమ్మ!! రెడ్డి గారి నర్సమ్మ అంటే అటేపు ఓ వందూళ్లు; ఇటేపు ఓ వందూళ్లలో హడల్! హడల్ ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నా. ఎప్పుడూ వదులుగా వేలాడేసి చివర్న జారు ముడేసిన పొడుగాటి బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ జుట్టు; నుదుటన గుండ్రటి రూపాయి బిళ్లంత కుంకుం బొట్టు; చేతులకు అటేపు ఓ డజను, ఇటేపు ఓ డజను వెండి కడియాలు; నోట్లో ఎప్పుడూ నమలబడుతూ ఉండే ఎర్రటి తాంబూలం; ఆరు గజాల జరీ అంచు నేత చీరలో ధగధగా మెరిసిపోయే రెడ్డి గారి నర్సమ్మకు ఎనలేని అతీతశక్తులుండేవని భోగట్టా. అవేంటంటే... ఆవిడ రాత్రిళ్లు మా ఊరి శ్మశానంలో ఇన్ సోమ్నియాతో బాధపడుతూ నేలపై పడి దొర్లుతూ ఉండే దెయ్యాలను నిద్రలేపి, వాటిని వశీకరణం చేసుకుని, వాళ్ల లంకంత కొంపకి తీసుకొచ్చి, రాత్రంతా వెట్టి చాకిరి చేయించి, నిత్యం గద్వాల్, బెంగళూర్ పట్టుచీరల్ని నేయించేదట. వాళ్ల బిజినెస్ అదే. అలాగే, మా చుట్టుపక్కల ఊళ్లలో ఎవరికి దెయ్యం పట్టినా, ఈవిడ మంత్రం వెేస్తే దెబ్బకు దెయ్యాలు హాహాకారాలు పెట్టి, సదరు వ్యక్తుల్ని విడిచిపెట్టి, మా ఇంటి చివరున్న ఆంజనేయుడి గుడి దగ్గరి చింతచెట్టుకు శీర్షాసనాలు వేసేవట. ఓసారి పక్కజిల్లా మంత్రగాళ్ల బ్యాచ్... రెడ్డిగారి నర్సమ్మతో మంత్రతంత్ర విద్యల్లో తాడోపేడో తేల్చుకుందామని వస్తే, వాళ్లందరినీ కట్టగట్టి తేళ్లను, పాముల్ని చేసిపారేసి, గోడలకు, మిద్దెలకు అతుక్కునేలా విసిరి కొట్టిందట. అదీ ఆవిడ టెంపర్. మా పిల్ల బ్యాచ్ తాలూకు తిరుగులేని ఐకన్... రెడ్డిగారి నర్సమ్మ పరమపదించాక ఆవిడ తాలూకు మంత్రతంత్రాల తాళపత్రాలను ఓ మూటలో గట్టి ఎవరికీ తెలీకుండా మా గుడి దగ్గరి బావిలో విసిరేశార్ట. దాంతో యాభై అడుగుల లోతు నీటితో అలరారే ఆ బావి... దెబ్బకు వఠ్ఠిపోయిందట. అదీ ఆవిడ తాటాకు తాళ పత్రాల పవర్. ఇలా చెప్పుకుంటూ పోతే, ‘‘నీకేమైనా దెయ్యం పట్టిందా, ఏది పడితే అది రాస్తున్నావ్’’ అని ఫ్రస్ట్రేషన్ తో మీరు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. ఐనా, నేను ముందే చెప్పాగా... ఈ పోస్టు శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులా ఎన్ని మెలికలు తిరుగుతుందో నాకే తెలీదు, నన్ను ఆవహించిన దెయ్యాలకే తెలియాలి అని. ఏదేమైనా మళ్లీ మా ఊరి శ్మశానం దగ్గరికొద్దాం.

మా ఊరి శ్మశానం పక్కగా ఎప్పుడు నదికెళ్లినా... ఓ రకమైన విచిత్రమైన భయం ఆవహించి ఉండేది. శ్మశానంలోని దెయ్యాల తాలూకు బలమైన చేతులు బబుల్ గమ్ లా అలా సాగిపోయి నావైపుగా వచ్చి కాళ్లను పట్టేసుకుని, బరబరా సమాధుల్లోకి లాక్కెళ్లిపోతాయేమో అని. అఫ్ కోర్స్, ఎప్పుడూ అలా జరగలేదనుకోండి. అలా జరక్కపోవడానికి కూడా ఓ బలమైన కారణముంది. నేనే మంత్రించి నా కుడి చేతికి కట్టుకున్న కాశీదారం రక్షరేఖ వల్ల చాలా భయంకరమైన శాకినీ, ఢాకినీ, మోహినీ పిశాచాలు, కొరివి దెయ్యాలు సైతం నా చుట్టుూ ప్రదక్షిణలు చేసి పారిపోయాయే తప్ప, నాతో బాహాబాహీ తలపడలేకపోయాయ్. వింటానికి నేనేదో శివమణి డ్రమ్స్ వాయిస్తున్నట్టు అనిపించొచ్చు కానీ, అదొక చారిత్రక చేదునిజం! ఇక, హయ్యర్ స్టడీస్ కోసమని సిటీకొచ్చాక.. ఇక్కడ దెయ్యాలుండవని తేలిపోయింది. ఎందుకంటే, సిటీలో రోడ్ల మీద నడుద్దామంటే వెహికిల్స్ కింద పడో; పోనీ, గాల్లో ఎగురుదామంటే ఎలక్ట్రిక్ వైర్ల బారిన పడో.. కుక్కచావు ఛస్తయ్ కాబట్టి దెయ్యాలు నగరాల్ని వదిలేసి పల్లెల్లోనే సెటిలైపోయాయని నా స్టడీలో తేలింది. అందుకే, ఓసారి హాలీడేస్ లో ఊరెళ్లినప్పుడు నా చేతికున్న కాశీదారం తీసి చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ ఈశ్వర్ గాడికి గిఫ్ట్ కింద ఇచ్చేశా, ఉంచుకొమ్మని. అన్నట్టు ఎక్కడున్నాం మనం? శ్మశానం, భయాల దగ్గర కదా. రైట్..! ఇక అసలు పోస్టులోకి వెళ్దాం.

మొన్న సండే పొద్దున్నే క్రికెట్టాడొచ్చి చేతులు సచ్చుబడిపోయి, కాలి పిక్కలు వాచిపోయి, కళ్లు పీక్కుపోయి... నా మానాన నేను వెంటిలేషన్ మీదున్న పేషెంటులా... కాళ్లూ వేలాడేసుకుని, కళ్లు తేలేసుకుని పడుంటే, సరిగ్గా ఆ దుర్ముహూర్తాన్నే, ఉజ్వలుడనే మిత్రదుర్మార్గుడొకడు గబ్బిలంలా నా పక్కన వాలిపోయాడు. నా ఖర్మకి... కొత్తగా వాడొక లెన్స్ కేమెరా కొన్నాట్ట. DSLRఓ, BSLNఓ ఏదో పేరు చెప్పాడు. సో... వాడేదో, ‘‘My Weird Experiments with New Lens Camera Along with Nagaraj’’ అనే ముదనష్టపు పుస్తకమొకటి రాయాలని కంకణం కట్టుకున్నాట్ట. ఆ విధంగా నా ఖర్మ కాలిపోయిందన్నమాట ఆ దినాన. సన్నాసి అన్నాక అడవులు పట్టుకు తిరగడం; సంసారి అన్నాక శ్రీమతి కొంగుపట్టుకు తిరగటం; బ్రహ్మచారి అన్నాక బలాదూర్ తిరుగుళ్లు తిరగడం... క్వైట్ కామన్, అలా చేయకపోతేనే వీడు కొంచెం తేడా అనుకుంటార్రా అబ్బాయ్, అసలే పాడులోకం... అని ఓ తింగరి సామెత చెప్పి; చలనం లేని శాల్తీని అర్థాత్ నన్ను పిలియన్ రైడర్ (బైకుపై వెనక్కూచునేటోళ్లని పిలియన్ రైడర్స్ అంటార్ట)గా వెనకేసుకుని టోలీచౌకి దిశగా దారితీశాడు. శాల్తీలోని నాగరాజ్ నిద్రలేచి, ఒళ్లు విరుచుకుని ‘‘చూడబ్బాయ్ లేత విక్రమార్కా... ఇంతకీ మనమెక్కడికి ఊరేగుతున్నాం’’ అని భేతాళ ప్రశ్న వేయగా; ‘‘సెవెన్ వండర్స్ ఆప్ హైదరాబాద్.... సెవెన్ టూంబ్స్ ఉరఫ్ సాథ్ గుమ్మజ్ అలియాస్ కుతుబ్ షాహీ సమాధుల’’ దగ్గరికెళుతున్నామని బాంబు పేల్చాడు.

నేను: ఏమిరా బాలరాజు, ఏమి ఈ అఘాయిత్యం!! మన ఖైరతాబాదులో ఉన్న ఖైరతున్నిసా బేగం యొక్క తుప్పుపట్టిన టూంబును నిత్యం చూస్తూనే ఉన్నాం కదరా. దానిపైన తరతరాలుగా నివాసం ఉండే పావురాల గుంపుతో రోజూ రెట్టలు వేయించుకుంటూనే ఉన్నాం కదరా. అది చాలదా??? ఇప్పుడు మళ్లీ కొత్తగా ఈ సెవెన్ టూంబ్స్, సెవెన్ థౌజండ్ డోవ్స్ (సబ్బులు కాదు, పావురాలు) ఎందుకురా బుజ్జే... !!

ఫ్రెండు: ఛస్ నోర్మూయ్. మన రాజరిక చారిత్రక వారసత్వ పురాతత్వ సంపద గురించి కనీసం ఐడియా కలిగి ఉండకపోతే కళ్లు పోతాయ్. పద ఇవాళ నీ కళ్లు తెరిపిస్తా.

నేను: నీ తలకాయ్. ముందు ఆ కళ్లజోడు సరిగ్గా పెట్టుకుని బండి నడుపు. అసలే టోలీచౌకీ తలాతోకా లేని ట్రాఫిక్కులో ఊరేగుతున్నావ్, ఎవడికన్నా గుద్దావంటే, తోలు తీసి డోలు కడతారు. ఎధవ నస!!

అక్కడికెళ్తే... ఒక్ఖ తెలుగు ప్రాణి లేదు. అంతా తెల్లోళ్లే. అదే లోకల్ చంటిగాళ్లు తరహా ఎవరూ కనిపించట్లా. అందరూ ఐ.ఎస్.డీలే. అదే ఫారినర్స్.

ఫ్రెండు: ఆహా... వీళ్లు కదా ఆర్కియలాజికల్ ప్రేమికులు! వీళ్లురా నిజమైన చారిత్రక వారసులు!!.. వీళ్లురా నిజమైన దేశభక్తులు... వీళ్లురా...

నేను: ఆపరా బాబూ నీ సుత్తి విదేశీ స్థుతి! ముందా టికెట్ తీసుకుని తగలడు, కెమెరాకేమీ టికెట్ తగలెట్టకు. లోపల ఏ ఏప్రాసీ ఉండడు. అసలే ఇదో భారీ శ్మశానం, ఉండేవన్నీ సమాధులు. ఎన్ని ఫొటోలు తీసుకున్నా అడిగే దిక్కుండదిక్కడ. అధవా, ఎవడన్నా అడిగితే ఫదో ఫరకో పారేద్దాంలే. టికెట్టు తీస్తే ఊరికే వంద బొక్క. ఐనా ఇంత బతుకూ బతికి చివరికి సమాధులు చూడాల్సి వచ్చింది చూడూ, పొద్దున్నే లేచి ఎవడి మొహం చూసి తగలడ్డానో...!!

ఫ్రెండు: ఎవడిదో ఏంటి, సెల్ ఫోన్లో నీ దరిద్రపు సెల్ఫీనే చూసుకుని తగలడుంటావ్. అనుభవించు రాజా! లోపలికి పద... కుతుబ్ షాహీ కాందాన్ గురించి వాళ్ల చేతే నీకు జ్ఞానోదయం గావిస్తా..!

నేను: ఏడిశావ్...లే! అవున్రా... వచ్చేప్పుడు వెంటబెట్టుకొచ్చిందేమీ లేదు; పోయేప్పుడు కట్టగట్టుకు తీసుకుపోయేదేమీ లేదు, ఆ మాత్రం దానికి ఆరడుగుల నేల చాలదట్రా?! వీళ్లేంట్రా... అదేదో అప్పనంగా వచ్చిందని చెప్పి, ఎకరాలకి ఎకరాలు పోగేసి, చక్కా సమాధులు కట్టించుకున్నారు. ఇదేం చోద్యంరా బాబూ!! ప్రశ్నించే వాడే లేడనా???

ఇంతలో... నింగిలో నిశ్శబ్దం బద్ధలైంది. గాలి సుళ్లు తిరిగింది. ఎండుటాకులు ఎగిరిపోయాయ్. చెట్లపై కాకులు పారిపోయాయ్. భూమి నెర్రలు విచ్చుకుంది. సమాధిలోంచి కుతుబ్ షాహీ మహాశయుని ఆత్మ లేచి కూర్చుంది. గొంతు సవరించుకుంది.

కుతుబ్ షాహీ ఆత్మ: నాయనా నాగ్రాజ్! నువ్వు సైన్సు వాడివేగా. సత్యం సాపేక్షమైందనే విషయం తెల్సా. నిన్న ఉన్నట్టు నేడుండదు. నేడున్నట్టు రేపుండదు. రేపున్నట్టు మర్నాడుండదు. నీ నవీన డెమోక్రటిక్ కళ్లద్దాలతో, మా ప్రాచీన రాజరికపు విషయాలను తరచి చూడరాదు నాయనా. రాజు సర్వశక్తిసంపన్నుడు. వాడు తలచుకుంటే పన్నులు, తన్నులకే కాదు.... మెడకాయల మీద తలకాయలని ఎగరేసి టెన్నిస్ ఆడేయగలడు. కనుచూపు మేర జమీన్ ని పాదాక్రాంతం చేసుకోగలడు. రాజు ఖడ్గానికీ, ఆదేశానికీ అడ్డూ అదుపూ ఏదీ ఉండదబ్బాయ్. రాజు ఆడిందే నేషనల్ గేమ్స్. పాడిందే క్లాసికల్ కచేరీ. ఆ లెక్కన ఆ కాలంలో మేమేం చేసినా రైటో రైట్. అదే అప్పటి సత్యం. ఐనా ఈజిప్షియన్లు కట్టిన భారీ పిరమిడ్స్ చూశావటోయ్... అవీ సమాధుల్లాంటివే, అయితేనేం! అదెంతటి ఘనకార్యమనీ, ఘనతనీ, అద్భుతమనీ, వింతనీ, విడ్డూరమనీ!!! చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను కళా హృదయంతో చూసి ఆనందించాలి గానీ.... పోతే ఆరడుగులనీ... పడితే అరటికాయ తొక్కనీ... హాఫ్ నాలెడ్జితో అంచనా కట్టే ప్రయత్నం చేయరాదు సుమీ...!

నేను: వామ్మో! మొత్తానికి అర్థమయ్యీ, కానట్టూ క్లాసేదో పీకినట్టు అర్థమైంది జహాపనా! దణ్ణం దేవరా. క్షమించుడి. మరే, ఆ కవి గారెవరో... ఓయీ నిజాం పిశాచమా, కానరాడు, నిన్నుబోలిన రాజు మాకెన్నడేని... అని తీవ్రంగా మండిపడ్డాట్ట కదా. ఆ లెక్కన మీ రాజుల జాతంతా అట్టాంటి బాపతేనా???

కు.షా ఆత్మ: ఛస్, నీవూ అదేపనిగా చారిత్రక తప్పిదాలు చేసే మన కుహనా కమ్యూనిస్టుల్లాగే అడ్డంగా మాటాడేస్తున్నావ్ సుమీ! కాస్త చరిత్రా చట్టుబండలూ స్టడీ చేసి చావచ్చుగా. పెన్ను పట్టిన ప్రతోడూ చరిత్రంతా చెత్త, హిస్టరీ అంతా ట్రాష్ అని రాసిపారేస్తే పోలోమని గొర్రెదాటులా గుడ్డిగా నమ్మేయడమేనా? ప్రశ్నించేది లేదా? పోస్టుమార్టం చేసేది లేదా?? ఆ రాజెవడు? వాడి వంశమేది? వాడు పాలించిన కాలమేది? వాడు చేసిన పనులేంటి? అప్పటి ప్రజల స్థితిగతులేంటి? ఇవన్నీ బేరీజు వేయాలా లేదా? ఉట్టినే చెంఘిజ్ ఖానో, నాదిర్షానో, ఎవడైతేనేం ఒక్కొక్కడు ఒక నరహంతకుడని అందరినీ ఒకే గాటన కట్టేస్తే ఎలా సామీ??? అప్పటి కాలమాన స్థితిగతులను, రాజు పాలనా తీరుతెన్నులను బట్టి.. వాడు గొప్పోడా, దరిద్రుడా అని అంచనా వేయాలి గానీ; నిజాం & రజాకార్లు కలిసి జనాన్ని కాల్చుకుతిన్నారు కాబట్టి, రాజులందరూ నియంతలే అని గాలివాటం మాటలు మాటాడితే ఎట్టా అంట?? అసలు నీకో విషయం తెల్సా? మా హయాంలోనే ఇక్కడ భాషా సాంస్కృతిక వికాసం జరిగింది. మేమేమీ ప్రజల్ని కష్టపెట్టలేదు. పోయి చరిత్ర చదువుకో, ఫో!

నేను: ఓహ్హో... మా ఊరి శ్మశానం, సమాధుల్ని చూసిన కళ్లతో, బుర్రతో... మీ సమాధుల్ని కూడా  చూట్టం వల్ల వచ్చిన తంటా అనుకుంటా ఇది. శ్మశానంలోని సమాధుల కింద శవాలకు సంబంధించి ఇంత చరిత్ర ఉందని తెలీలేదు సుమీ. క్షమించండి సుల్తాన్ జీ!!

కు.షా ఆత్మ: ఫర్వా నై, బేటా నాగ్రాజ్! ఈ గోల్కోండ ప్రాంతం... ఒకప్పటి గొల్లకొండ. అంటే గొర్ల కాపర్ల కొండ. అది కాకతీయుల అధీనంలో ఉండేది. ఆ తర్వాత ఇరాన్ వంశీయులైన బహుమని సుల్తాన్ల పాలనలోకి, ఆపై మా కుతుబ్ షాహీల పాలనలోకి, ఆ తర్వాత మొఘల్స్ పాలనలోకి, అనంతరం నిజాం అధీనంలోకి, ఇప్పుడు మీ కేసీఆర్ దొర హయాంలోకి వచ్చింది. అదన్నమాట సంగతి. ఇంతకూ మా కళాపోసన, సమాధుల సౌందర్యం గురించి ఏమంటావోయ్...?

నేను: ఏమంటాను. ఆ సమాధి ప్రేత పురాణం / ఈ పక్షలు వేసిన రెట్టలు / మతలబులూ, మన్నూ మశానం / ఇవి కావోయ్ చరిత్ర సారం... అంటాను, హ్హా!!

కు.షా ఆత్మ: ఓయీ మూర్ఖ శిఖామణి! నేనింతగా గొంతుచించుకున్నా మళ్లీ మొదటికే వస్తావా! నువ్వు మనిషివా??? మీడియావాడివా??? ఎవరక్కడ!! ఇతగాణ్ని తీసుకెళ్లి ఆ కారాగారంలో బంధించి, కుళ్లి కృషించిన తర్వాత, కాకులకు, గద్దలకు విసిరేయండి!!

నేను: హిహ్హిహ్హీ! మీరింకా పురాతత్వ ఫ్యూడలిజం భ్రమల్లోనే బతికేస్తున్నట్టున్నారు సుమీ. ఇది నిఖార్సైన డెమోక్రసీ. మీరు చప్పట్లు కొడితే ఎగేసుకుని రావడానికి నేను, నా ఫ్రెండు తప్ప ఈ చుట్టుపక్కల అయిదారు కిలోమీటర్ల దాకా మానవమాత్రడనేవాడు లేడు మహాశయా. ఐనా అదంతా ఉట్టి హాస్యంలే. జోక్ చేశా జహాపనా! శాంతించి సమాధి స్థితిలోకెళ్లి విశ్రాంతి తీసుకోండి సుల్తాన్ జీ!! నేను హలీమ్ తినే టైమైంది. మరి వస్తా. గుడ్ బై!!

[PS: అదన్నమాట సంగతి. ఎక్కడ మొదలెట్టానో, ఏం రాశానో, ఏం చెప్పాలనుకున్నానో, అసలేమన్నా చెప్పానో లేదో.. నాకస్సల్ తెలీదు. ఏదో ఊకదంపుడు పోస్టు ఇది. సరదాకి చదువుకోండి. మనోభావాల్ని గాయపరచుకోమాకండి ;)) ]















చివరి తోక: చాలారోజులైంది కదా... బ్లాగ్ ముఖం చూసి... అందుకే ఈ ఊకదంపుడు పోస్ట్!! ;)

8 comments:

  1. ఊకదంపుడే ఇంట బావుంటే, ఒళ్ళు దగ్గరపెట్టుకుని వ్రాస్తే ఇంకెంత బావుంటుందో. సబాష్..

    ReplyDelete
    Replies
    1. ఊకదంపుడు కావడం వల్లే విచ్చలవిడిగా చెలరేగిపోయావన్నమాట. అదే ఒళ్లు దగ్గర పెట్టుకుంటే అది రాయొచ్చో లేదో, రాస్తే ఎవరి మనోభావాలు ఎట్టా మట్టికొట్టుకుపోతాయోనని జుట్టు పీక్కుంటూ కూచోడం తప్ప పోస్టు పూర్తయ్యుండేది కాదని నా ప్రగాఢ విశ్వాసం. Anyway, Thank you so much for your COMPlAN like energetic compliment :)

      Delete
  2. ఇద్దరు పెళ్ళాల మధ్య నలిగిపోయి గెలవలేక రాయిలా మారిన శ్రీనివాసుడి నివాసాన్ని ఆలయం అంటారా ? శ్మశానం అని అంటారా ?
    సరదాకే అడుగుతున్నాను( మీ మనోభావాలను గాయపరుచుకోరని భావిస్తున్నాను.)నాకు తెలవదు మహాప్రభో అని అనకండి, చేయితిరిగిన ఆదిశేషుడి(నాగరాజు గారి)కి తెలియకుండా ఉండదు.

    ReplyDelete
    Replies
    1. నాకు నిజ్జంగానంటే నిజ్జంగా తెలీదు మహాప్రభో, నన్నొగ్గీయండీ :)

      Delete

    2. టపా చాలా బాగుంది. ఇందులో సంవాదన కూడా చాలా బాగుంది .
      మీకు ఈ విషయం మీద మంచి అవగాహన ఉంది.

      జిలేబి

      Delete
    3. థ్యాంక్సండీ!!

      Delete
  3. ఎంతైనా హైదరాబాదు, దిల్లీ నగరాలు మన దేశంలో సమాధులకి వరల్డ్ ఫేమస్సు.
    ఈ సారి మీ ఫ్రెండుతో దిల్లీ సమాధుల విహారం కూడ చెయ్యండి. ఏ మొఘల్ చక్రవర్తో ఇంకొంచెం తలంటుతాడు.

    ReplyDelete
    Replies
    1. ఢిల్లీ, ఆగ్రా చూశానండీ, ఐతే అప్పటికి నాకీ బ్లాగ్ లేదు. మరోసారెప్పుడైనా కుదిరితే టూర్ ప్లాన్ చెయ్యాలి, మొఘల్ చక్రవర్తులతో తాడోపేడో తేల్చుకోవాలి. థ్యాంక్యూ!! :)

      Delete