Tuesday 19 November 2013

కొత్తా దేవుడండీ!

ఫస్ట్ షాట్ (క్రికెట్ లాంగ్వేజీలో):
ప్రకృతిలో... గాలి మరియు వెలుతురు!
దేవలోకంలో... కామధేనువు మరియు అక్షయపాత్ర!
మన మధ్యలో... గూగుల్ మరియు సచిన్!
మ్యాథ్స్ లో ఇన్ఫినిటీ (ఇన్ ఫైనైట్) అనే ఓ పదం ఉంటుంది. అనంతమని అర్థమట! పైన చెప్పుకున్న గాలి-వెలుతురు; కామధేనువు-అక్షయపాత్ర; గూగుల్-సచిన్... ఈ ఆరింటికీ ఆ పదం అతికినట్టు సరిపోతుందేమో. హైట్, విడ్త్, డెప్త్ త్రీ డైైమెన్షనల్ గా ఏ డైరెక్షన్లో వెళ్లినా అవి అనంతగానే కనిపిస్తా(రు)యి. వీటి(వీరి)ని వాడుకున్నోళ్లకు వాడుకున్నంత మహదేవ అనుకోవచ్చు ఒక్కమాటలో. మన సచిన్ కూడా అట్టాంటి గొప్పోడే. ఎంత మంది రాసినా తరగని విషయం ఉంటుంది సచిన్ టాపిక్కులో. గాడ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా నా అభిమాన సచినుడికి నేనూ నా స్థాయిలో ఫేర్ వెల్ ఇద్దామనుకున్నా. రాయడమైతే మూడురోజుల క్రితమే రాశా. ఈనాడుకు ప్రయత్నిద్దామా? అమ్మో, వాళ్లిలాంటివి వేయరేమో? అని నాలో నేనే కిందామీదా పడి, హైకమాండులాగా ఏ డెసిషన్ తీసుకోలేక, చివరికి నా బ్లాగులోనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెడదామని ఇవాళ తీర్మానించాను.

 
దేవలోకంలో అత్యవసర సమావేశం. యుద్ధప్రాతిపదికన ఏర్పాటైంది. పుష్పక విమానాలెక్కి ముల్లోకాల్లోని దేవగణమంతా ఆగమేఘాల మీద వేంచేశారు. మీటింగ్ తాలూకు అజెండా అర్థంకాక దేవుళ్లంతా ఒకరి చెవుల్ని మరొకరు అదేపనిగా కొరుక్కున్నారు. ఇంతలో కాకితో కబురందుకున్న గిరీశం శ్రీహరికోటలో హడావుడిగా రాకెట్టెక్కేసి కాంతివేగంతో ఇంద్రలోకంలో వాలిపోయాడు. రభస సద్దుమణిగింది. సభ మొదలైంది. 

*****

"ఏమోయ్ గిరీశం! భూమండలంలో నరులెల్లరూ కుశలమే కదా. అన్నట్టు, మీ భారతీయులు ఇటీవలే అంగారకుడిపై అరంగేట్రానికై ఒక అద్భుత యంత్ర శకలాన్ని పంపారట. సెభాష్! అందుకోండి... మీ దేవలోక శుభదీవెనలు. అంతా బానే ఉంది, కానీ మీ భారతీయులు ఉఠ్ఠి బడుద్దాయిలోయ్. మీ వాళ్ల తింగరితనం చూస్తే కొన్నిసార్లు తెగ నవ్వొచ్చేస్తుందంటే నీవు కోపం తెచ్చుకోరాదు మరి. మచ్చుకు.... కణికట్టు బాబాలకు బ్రహ్మరథం పట్టి అభాసుపాలైనా; గారడీ సన్నాసుల కట్టుకథలు నమ్మి మందిరాల్ని మట్టిపాలు చేసుకున్నా; తళుకు బెళుకుల సినీతారలకు గుడులు కట్టి శఠగోపం పెట్టించుకున్నా; నయా పైసకు పనికిరాని నేతల్ని నెత్తిన పెట్టుకు పూజించినా... అబ్బబ్బబ్బా, ఏం చేసినా అది మీ వాళ్లకే చెల్లిందోయ్. మీ వాళ్లు... అబ్బో మహానుభావులోయ్. చూస్తోంటే, ఈమధ్య ఇంకో కొత్త దేవుణ్ణి పుట్టించినట్టున్నారు. దేశమంతా అతగాడి నామస్మరణమేనట. ఒక ఆటగాడికి అంత అందలమా? అవసరమంటావా? మానవమాత్రుల చేష్టలు కడు విచిత్రం సుమీ!"

"దేవేంద్రా! నా గెస్ మిస్ కాలేదండోయ్. మా ఢిల్లీ హైకమాండులాగా, దేవలోకంలో వార్ రూమ్ మీటింగ్ అనగానే బుర్రలో ఠకీమని జీరో బల్బు వెలిగి విషయం కొంతమేరకు అర్థమైంది. సో, ఇది దేవలోకపు అధిష్టానానికి తలెత్తిన తలనొప్పి అన్నమాట. భలే. భూలోకపు క్రికెట్ దేవుడి సెగ ఇంద్రలోకంలో కలకలం సృష్టిస్తోందన్నమాట. భేష్. ఎంత కమ్మటి కబురో. వీనుల విందుగా ఉందంటే నమ్మండి. అయినా, నాకో విషయం అర్థం కాలేదు. అందులో విచిత్రమేముంది, దేవరా?!  మార్పు అనివార్యం కదా. ఇంకా ఎంతకాలమని కాలం చెల్లిన మీ ముల్లోకాల దేవదేవతల్నే బల్లిలా పట్టుకు వేలాడమంటారు? మీరంతా బాగా బోర్ కొట్టేశారు. ఇక చాలు. మీ పెత్తందారీతనం ఇంకానా, ఇకపె చెల్లదు. మా బానిసత్వం ఇంకానా, ఇకపై ఉండదు. మాకంటూ ప్రత్యేకమైన ఆశలుంటాయి. అభిమతాలుంటాయి. మనోభావాలుంటాయి. సవాలక్ష ఉంటాయి. ఆ మాటకొస్తే మా దేవుళ్లను మేమేం సృష్టించుకుంటాం. కోపమొస్తే మళ్లీ మార్చేసుకుంటాం. క్వశ్చన్లతో కొర్రీలు వేయడానికి అసలు మీరెవరు? మానవజాతిలో దేవుళ్లు అవతరించకూడదని ఎక్కడైనా రాసి పెట్టారా, యేం? లేక మానవోత్తములు మీకు పోటీకొస్తారని భయమా? మేమంటే మీకెందుకింత కుళ్లు, కుతంత్రం, సందేహం, భయం, వగైరా వగైరా?"

"హతవిధీ! ఏమిటీ కర్ణ కఠోరమైన నిందారోపణలు? ఔరా! ఇది మరింత చిత్రముగా నున్నదే. నే పలికిన రెండంటే రెండు మాటల్ని పట్టుకు రంధ్రాన్వేషణ, చిత్రవధ, నానా భీభత్సం చేసి... ఇన్నేసి ద్వంద్వర్థాలు, అన్నేసి నిగూఢార్థాలు సృష్టిస్తావా? నీవు మా కలహభోజనుడు నారదుణ్ని మించిన మాటల మరాఠీవి, జగడాల మారివి, మహా తుంటరివోయ్, గిరీశం! అయిననూ, భూమండలం నుండి మాకు అందిన సంకేతాల (కేసీఆర్ సిగ్నల్సుకు వీటికి ఎలాంటి సంబంధం లేదు) ప్రకారం అతగాడు వఠ్ఠి అటగాడే కదా! అతడేమైనా అన్యాయాన్ని దునుమాడాడా? అధర్మాన్ని తెగనరికాడా? పోనీ, జాతి యావత్తూ హర్షించేలా సురాజ్యపాలనేమైనా అందించాడా? అసలేం చేశాడని, అతగాడికి దైవగుణాన్ని ఆపాదిస్తున్నారోయ్? మొదట, మీ మానవులంతా ఆటగాణ్ణి ఆటగాడిగా గౌరవించడం నేర్చుకోండి. మీ మూర్ఖత్వంతో అతగాడి ఖ్యాతినీ, మీ తెలివి తేటల్నీ దిగజార్చుకోకండి. అలాగే మా దేవలోకపు పరువు ప్రతిష్ఠల్నీ మంట గలపకండీ."

"భళా, దేవదేవా! మీ తర్కం అదరహో! మీరు లక్ష చెప్పండి. మా లాజిక్కులు మాకున్నాయిలెండి. అన్నట్టు, మా భారతావనిలో దేవుళ్లకేమన్నా కొదవా? 33 కోట్లకు పైమాటే. అలాగే నేతలూ తక్కువేం లేరు. కానీ ఏం లాభం? దేవుళ్ల పేరు చెప్పుకుని ప్రజలంతా ఎవరికి వాళ్లు సంకుచితం అయిపోయారు. అలా కుంచించుకుపోయిన ప్రజల్నీ రాజకీయ నేతలేమో మరింత విభజించి తమ పబ్బం గడుపుకుంటున్నారు. మీ గొప్ప దేవుళ్ల, మా ఘనమైన నాయకుల పరిస్థితే ఇలా ఉంటే, ఇంకెవరు అన్యాయాన్ని దునుమాడేది? అధర్మాన్ని తెగనరికేది? సుపరిపాలనను అందించేది? కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా, నానా రకాలుగా విడిపోయిన శతకోటి ప్రజానీకాన్ని తన క్రీడాపాటవంతో ఒక్కతాటిపైకి తెచ్చి సెక్యులరిజానికి కొత్త భాష్యం చెప్పినవాడు గొప్పవాడు కాదా? అవినీతి, అక్రమార్జన, ఆశ్రిత పక్షపాతం లాంటి ఊడలు దిగిన దిక్కుమాలిన వ్యవస్థలో నీటైన ఆటతో, నిఖార్సైన వ్యక్తిత్వంతో జనం మనస్సు గెలిచిన వాడు మహనీయుడు కాదా? అంతటి మేటి ఆటగాణ్ని అందలమెక్కిస్తే మీకెందుకంత ఆందోళన? అక్కున చేర్చుకుంటే మీకెందుకంత అక్కసు?"

"యముండ! చాలించు, నీ అధిక ప్రసంగం!  ఏమిటోయ్ అతగాడి గొప్పతనం? అంతా మీ బడాయి కాకపోతే!  మా నరకలోకపు నివేదికల ప్రకారం అతగాడొకసారి విదేశీయుడెవడో బహుమతిగా ఇచ్చిన ఫెరారీ కారుకు దిగుమతి సుంకం ఎగవేశాడనిన్నీ; ముంబయి లాబీయింగ్ సాయంతో భారత క్రికెట్టును ఏళ్ల తరబడిగా భేతాళుడిలా వదలకుండా పట్టుకువేలాడనిన్నీ; అలాగే, జెంటిల్మెన్ క్రీడకు పట్టిన చీడలాంటి బెట్టింగుకు వ్యతిరేకంగా సైతం ఏనాడూ నోరు విప్పిన పాపాన పోలేదనిన్నీ... అపవాదులూ, ఆరోపణలూ ఇలా బోల్డున్నాయి. ఆ మాత్రం దానికి అతగాడికి భారతరత్న బిరుదులూ, దేవుడని సత్కారాలూ? అబ్బో, మీ నీచ మానవుల వరస బహు బాగుందోయ్."

"భళారే, యమధర్మరాజా! శాంతించండి! అవనసరంగా బీపీ పెంచుకోకండి. మీరిలా గుడ్డు మీద ఈకలు పీకడం కడు విడ్డూరంగా ఉంది సుమీ. సరే, మీ లాజిక్కు ప్రకారమే, మీ ముల్లోకాల్ని గాలించి, ఏ మచ్చా లేనటువంటి, సర్వం సుగుణాలే కల్గిన సత్య సంధుణ్ణి ఒక్కడంటే ఒక్కణ్ని చూపించండి చూద్దాం. ఏదో చంద్రునికో నూలుపోగులా, నాలుగు మరకలు (మరక మంచిదేనా?) ఉన్నాయని, మీరిలా బూతద్దంలో చూసి మా దేవుణ్ని ఆడిపోసుకోవడం ఆశ్చర్యంగా ఉంది సుమా! పోనీ, ఓ పని చేద్దాం, యమరాజా! మీరు ఎంతకాలమని ఆ బూజు పట్టిన సింహాసనాల్ని అట్టి పెట్టుకు కూచుంటారు? కూసంత కొత్తదనం, వెరైటీ కోసం మీ ముల్లోకాల్నీ, మా భూలోకాన్ని కలగలపి కొత్త దేవుడి కోసం సరికొత్తగా ఓసారి ఓటింగు పెడదాం! ఆటగాడే మా అభ్యర్థి. గెలిచిన వాడే, గొప్ప దేవుడు!! ఛాలెంజీకి సిద్ధమేనా?"

*****

గిరీశం విసిరిన సవాల్ దేవలోకంలో చిన్నపాటి కల్లోలం సృష్టించింది. దేవగణమంతా మరోసారి తీరిగ్గా గుసగుసమంటూ చెవులు తెగ కొరికేసుకున్నారు. ఎందుకొచ్చిన గొడవని బతుకు జీవుడా అంటూ యముడు చల్లగా జారుకున్నాడు. కొత్త జగడానికి తెరలేవడంతో కడు సంతుష్టుడైన నారదుడు లోలోపల దేవేంద్రుడి తిక్క కుదిరిందని మహదానందభరితుడయ్యాడు. దేవేంద్రుడు ఖంగుతిని, బిక్కమొగమేసి, ఏం చేయాలో పాలుపోక, పరిస్థితి విషమించి చేయి దాటుతోందని గుర్తించి, సభను అర్ధారంతరంగా వాయిదా వేసి, సెల్ఫ్ వాకౌట్ చేసుకుని, ఎవరికి చెప్పా పెట్టకుండా నిష్క్రమించాడు. గిరీశం అక్కడే సింహాసనం మీద కూచుని చిద్విలాసంతో చుట్ట ముట్టించి రింగులు వదలడం మొదలెట్టాడు. భశుం!!!

[లాస్ట్ బాల్: క్రికెట్ దేవుడిపై యముడు, దేవేంద్రుడు చేసిన ఆరోపణలకూ, నాకూ ఏ విధమైన సంబంధమూ లేదు. అసలు దేవుళ్లంటేనే నాకు తగని మంట. నేను సైతం వారి వ్యాఖ్యలను స్వరంలో శృతి కొద్దీ, ఒంట్లో బలం కొద్దీ తీవ్రంగా ఖండిస్తున్నా. సచిన్ నిజంగానే క్రికెట్ దేవుడు. సచిన్ గొప్ప వైరస్ లాంటివాడు (పోలిక బాలేదా, ఈసారికి సర్దుకుందాం). అతగాడి వల్లే నేను క్రికెట్ ఫీవర్ అనబడే అంటువ్యాధికి గురయ్యా. దీనికి చికిత్స లేదట. జీవితాంతం ఇలా బాధపడాల్సిందే. తప్పదు మరి. ఇక, ఈ రెండు దశాబ్దాల్లో... సచిన్ క్రీజులో ఉన్నంతసేపూ నా బీపీ ఎప్పుడూ 140పైనే ఉండేది, హార్టుబీటు 200 మీద కొట్టుకునేది. ఆరోగ్యపరంగా ఇంత నష్టం జరిగినా సచినుడిని ఆరాధించడం మాత్రం నేనెప్పుడూ మానలేదు. చివరకు, టెండూల్కరుకి భారతరత్న ఏంట్రా, జోక్ కాకపోతే, అని క్లోజు ఫ్రెండ్సు కూడా నానా మాటలు ఆడిపోసుకున్నారు, కేవలం నన్ను ఏడిపించాలని. బ్యాటుచ్చుకు కొఠేద్దామంటే, వాళ్లేమో షోయబ్ అక్తర్ లాగా నాకంటే బలంగా ఉంటారు. అందుకే పోన్లే అని వదిలేశా. ఏం చేయాలో తెలీక ఈ పోస్టు రాశా. ఎందుకొచ్చిన గొడవ అని, నా ఫ్రెండ్సు మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ల వెర్షన్ కూడా ఇందులో జతచేశా. నిజ్జంగానే సచిన్ అంటే నాకు బోల్డంత ఇష్టం, ఆయ్. దేవుడి మీదొట్టు! నమ్మాలి మరి :-)]

Saturday 9 November 2013

ఎన్ని కలలో...!

కలలు
పీడ కలలు
పగటి కలలు
మెరుపు కలలు
అబ్బో... ఎన్ని రకాల కలలో!
అంతేనా...?
ఒబామా కల, రాజమాత కల,
వృద్ధ రాజు కల, యువరాజా వారి కల,
దీదీ కల, బీహారీ బాబు కల, బుల్లి యాదవ్ కల,
ఇలా నేతల కలలు ఎన్నో, ఎన్నెన్నో...!!
కలలన్నవి ఫిలసాఫికల్ కేటగిరి అనుకుంటా!
ఎందుకంటే.. దుష్ట రాజకీయ నేతల కలలు మొత్తం సామాజిక గతినే చిందరవందర చేసి మార్చేస్తుంటాయి కాబట్టి!
ఇటీవలి పొలిటికల్ డెవలప్ మెంట్స్ పై చిరు సెటైర్ ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, ‘‘దుష్ట సంహార స్వప్నం’’ పేరిట. థాంక్యూ!!