Showing posts with label పుస్తక సమీక్ష. Show all posts
Showing posts with label పుస్తక సమీక్ష. Show all posts

Thursday 23 April 2020

మహాప్రస్థానం... మంత్రనగరిలోకి!

ఇవాళ వరల్డ్ బుక్ డేను పురస్కరించుకుని, నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం... ‘మహాప్రస్థానం’ గురించి నాలుగు మాటలు రాద్దామనిపించింది. 

కర్నూల్లో డిగ్రీ పూర్తయ్యాక ఓ ఏడాది ఖాళీగా ఉన్నా.  కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న రోజులవి. ఆ ఫ్రీటైంలోనే ఒకటి, స్టేడియంకెళ్లి జాగ్ చేయడం; రెండు, సెంట్రల్ లైబ్రరీకెళ్లి చదూకోవడం.. ఈ రెండు అలవాట్లకు పునాది పడింది. అప్పటికీ నాకు లైబ్రరీ అంటే, అన్ని పేపర్లలో స్పోర్ట్స్ పేజీ వార్తల్ని చదవడానికి ఓ అనువైన ప్లేసనే సంకుచిత అభిప్రాయం ఉండేది. కొన్ని రోజుల్లోనే అదే లైబ్రరీలోనే పుస్తకాలుంటాయనీ, అక్కడ నామినల్ మెంబర్ షిప్ ఉంటుందనీ, అది తీసుకుంటే పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి చదూకోవచ్చనీ మెలమెల్లగా తెలిసింది. అలా పేపర్లను దాటుకుని పుస్తక ప్రపంచంలోకి ప్రవేశించాను. 

అలా ఆ లైబ్రరీలోనే కృష్ణశాస్త్రి, తిలక్, చలం, సినారే, దాశరథి, పఠాభి, ఆరుద్ర, అరవిందుడు, రవీంద్రుడు, శ్రీశ్రీ ఇలా అందరినీ పలకరించి పరిచయం చేసుకున్నా. నా కాంపిటీటివ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ని పక్కనపారేసి మరీ ఈ సాహిత్యంలో మునిగిపోయా. ఆ ఎర్లీ యంగేజీలో ఆ కవిత్వాలు, సాహిత్యాలు ఏ మేరకు బుర్రకెక్కాయో ఇప్పటికీ సరిగా గుర్తు లేదు కానీ, ఒక్క పుస్తకం మాత్రం చదువుతుంటే శరీరంలో ఆపాదమస్తకాన్ని ఊపేసింది. అదే మహాప్రస్థానం!! అప్పటికి ఆ పుస్తకంలోని కాన్సెప్టులు పెద్దగా అర్థం కాకపోయినా అదేదో ఉరకలెత్తే జలపాతం హోరులో కొట్టుకుపోయిన ఫీలింగ్ మాత్రం ఇప్పటికీ గుర్తు. అది మొదలు, ఏ పుస్తకం చదివినా ఈ మహాప్రస్థానం ముందు ఎందుకో తేలిపోయేది. ఏం తోచకపోయినా కూడా ఓసారి మహాప్రస్థానాన్ని తిరగేస్తే తెలీని ఉద్వేగం ఆవహించేది. ఆ పుస్తకానికేదో మంత్రశక్తి ఉందనిపించేది అప్పట్లో నాకు. 

ఇక, ఆ తర్వాత కర్నూల్లో ఈనాడులో కాంట్రిబ్యూటర్ గా చేసే రోజుల్లో కూడా అడపాదడపా అవకాశం దొరికిన ప్రతీ వార్తలో శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ఒకటో రెండో లైన్లు కోట్ చేద్దామా అనిపించేదెప్పుడూ. 2002 సెప్టెంబర్లో ఈనాడు జర్నలిజం స్కూలుకి సెలెక్టై వచ్చాక, ఇక్కడ ప్రతీ వారం ఓ పుస్తకం చదివి సమీక్ష రాయాల్సిన నిబంధన ఒకడుంటేది. అలా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 52 పుస్తకాల జాబితా ఆ ఏడాది జర్నలిజం చేస్తున్న సమయంలో ఉండేది. ఆ అన్ని పుస్తకాల్లోకి, నేను మరోసారి లీనమైపోయి చదివి, అనుభవించి రివ్యూ రాసిన పుస్తకం.. మహాప్రస్థానమే. ఇక ఆ తర్వాత ఇదే మహాప్రస్థానాన్ని ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు. 

అక్షరానికీ అణుబాంబుంత శక్తి ఉంటుందనీ; ఒక్కో కవిత ఒక్కో మిసైల్ లా దూసుకెళుతుందని మహాప్రస్థానంలోని ఏ కవితను చదివినా ఇట్టే అర్థమైపోతుంది. మనలో జడత్వాన్ని, బద్ధకాన్ని బద్ధలుకొట్టి ఉరుకులు పరుగులు పెట్టించగల చోదకశక్తేదో ఈ పుస్తకంలో ప్రతీ కవితకూ ఉంటుంది. ఈ పుస్తకంలో ఏ కవితను చదివినా దానికే సొంతమైన ఓ శృతీ, లయా కనిపిస్తాయి. రౌద్రంతో ఉరకలెత్తించినా, కరుణలో ఓలలాడించినా, హాస్య ఛమత్కారంలో ముంచెత్తినా, బీభత్స భయానకంలోకి తోసేసినా, అద్భుతంతో వహ్వా అనిపించినా, శాంతమై సేదతీర్చినా అది ఒక్క మహాప్రస్థానం కవితలకే సాధ్యం. కవితా వస్తువు (కంటెంట్)లోనూ, దాని రూపం(ఫాం)లోనూ ఇంత అత్యద్భుతమైన బ్యాలెన్స్ సాధించిన పుస్తకం మరోటి కనిపించదు. తెలుగులో సాహితీ సముద్రాన్ని మధించి, అమృతకలశాన్నిఈ పుస్తకం రూపంలో మనకందించాాడా శ్రీశ్రీ అనిపిస్తుంది. ప్రపంచ సాహిత్యాన్ని, రాజకీయాల్ని, ఆర్థిక స్థితిగతులను, మానవ ఆలోచనను, సామాజిక పరిణామాన్ని, ప్రకృతి నియమాల్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటే, ఓ మనిషి... ఇంతటి అద్భుతాల్ని ఆవిష్కరించగలడా; ఎంతో సంక్లిష్టమైన విషయాల్ని ఇంత సరళంగా, రసస్పోరకంగా చెప్పగలడా అనిపిస్తుంది. అన్నింటికీ మించి జనసామాన్యంతో ఎంతగా మమేకమైపోతే తప్ప ఓ కవి, ఇంతగా మనల్ని ఉత్సాహంలో, ఉద్రేకంలో, ఉద్వేగంలో ఓలలూగించగలడు. మహాప్రస్థానం కవితల్లో చూసిన విద్వత్తు, విద్యుత్తు ఇప్పటిదాకా నాకెక్కడా కనిపించలేదు. శ్రీశ్రీని.. మహాకవిగా ఆవిష్కరించిన పుస్తకమిది; శ్రీశ్రీ... ఈ శతాబ్దం నాది అని ఎలుగెత్తి చాటగలిగేంత తెగువను ఇచ్చిన పుస్తకమిది. తెలుగు సాహిత్యానికంతా రాజ్యాంగం లాంటి పుస్తకం ఈ మహాప్రస్థానం. (ఈ చివరి లైన్, మా జర్నలిజం మాష్టారు, సమ్మెట నాగ మల్లేశ్వరరావు గారు అన్నమాట!) 


#worldBOOKday 
#మహాప్రస్థానం!

Thursday 26 March 2020

కరోనా - కొండపొలం - బ్లాగ్ పునఃసందర్శన!!


హిరోషిమా, నాగసాకి ఉదంతాల్ని తలచుకున్నప్పుడు అనిపిస్తుంది... బ్రహ్మాండంలోనే కాదు, అణువులోనూ అంతే బలముందని! అలాగే, ప్లేగు, కలరా, మశూచి, కరోనా లాంటివి ప్రబలినప్పుడు అనిపిస్తుంది... ఆలోచన అనే ఆయుధం కలిగిన మనిషే కాదు, అస్సలు కంటికి కూడా కనిపించని సూక్ష్మజీవులు కూడా అంతే బలమైనవని!! ఏదైతేనేం, కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయి, మనుషులంతా ఇళ్లకే పరిమితమైన కాలంలో; ఎవరి తాహతు మేరకు వాళ్లు ప్రస్తుత ఈ డిజడ్వాంటేజ్ సమయాన్ని అడ్వాంటేజ్ కింద మార్చుకోక తప్పదు. అలాంటి ఎందరి తాలూకు, ఎన్నో ప్రయత్నాల్లో భాగంగానే నేనూ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాల్ని చదవడం, అలా చదివిన దాని గురించి బ్లాగ్ రాయడమనే పనికి ఒడిగట్టాల్సి వచ్చింది. 

ఈ ఏడాది (2020) ఆరంభంలో ఓ తీర్మానం తీసుకున్నా. ఈ పన్నెండు నెలలూ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిద్దామని. అందులో భాగంగానే జనవరిలో సైక్లింగ్ చేశా. ఆ నెలలో దాదాపు 1000 కిలోమీటర్ల దాకా సైక్లింగ్ చేశా. పాండిచ్చెరి నుండి కొడైకెనాల్ దాకా ఓ అయిదు రోజుల పాటు 400 కిలోమీటర్ల సైక్లింగ్ ఈవెంట్ కూడా విజయవంతంగానే పూర్తి చేశాను. మొత్తానికి జనవరి నెల... నా ఫిట్ నెస్ ఫర్వాలేదని ఓ సర్టిఫికెట్ ఇచ్చింది. తర్వాత ఫిబ్రవరి నెలంతా షుగర్, మిల్క్ మానేశా. నిజానికి నేను ‘టీ’ అడిక్ట్ ని. అయిదానికీ కానిదానికీ టీ తాగే అలవాటు చిన్నప్పటి నుండే రావడంతో దాన్ని మానడం అంటే నా మటుకు నాకు ఓ యజ్ఞమే. అయినప్పటికీ నా మీద నాకు ఎంత కంట్రోల్ ఉందో పరీక్షించుకోవడానికే ఈ మిల్క్ + షుగర్ మానే ప్రయత్నం చేశా. అదీ సక్సెస్ ఫుల్ గానే ముగిసింది. ఆ రకంగా ఫిబ్రవరి.. నా మైండ్ కంట్రోల్ ఫర్వాలేదని భుజం తట్టి సెభాష్ అంది.  

ఇక మార్చి నెల వంతు. మార్చి నెలలో వీలైనన్ని బుక్స్ చదవాలని ప్లాన్. నిజానికి నా బుక్ రీడింగ్ హ్యాబిట్ కర్నూల్లో మొదలైంది. డిగ్రీ పూర్తయ్యాక, ఓ ఏడాదిపాటు చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ, చాలా టైం ఖాళీగా మిగిలేది. నిజానికి Empty mind is a devil's workshop అనంటారు కదా. లక్కీగా నాకెలా అలవడిందో డిగ్రీ నుండే పేపర్లో స్పోర్ట్స్ వార్తలు చదవడమొక హ్యాబిట్ గా ఉండేది. దాంతో బతికిపోయానేమో. రోజు పొద్దున్నే గ్రౌండుకెళ్లడం, అదయ్యాక కర్నూల్లో సెంట్రల్ లైబ్రరీకెళ్లడం, ఆపై అక్కడే మెంబర్ షిప్ తీసుకుని బుక్స్ చదవడం అలవాటైంది. ఇదంతా ఇష్టం కొద్దీ చేసిన పని. ఆ తర్వాత ఈనాడు జర్నలిజం స్కూలుకి సెలెక్ట్ అయి హైదరాబాద్  వచ్చాక ఇక్కడ ఏడాది శిక్షణా టైంలో ప్రతీవారం ఓ పుస్తకం చదవాల్సి వచ్చింది. ఇక్కడ బుక్ రీడింగ్ అన్నది బలవంతంగా చేయాల్సి వచ్చిన పని. ఏదైతేనేం బుక్స్ చదవడం అన్నది అలవాటైంది. ఆ రకంగా నా థింకింగ్ తాలూకు కాన్వాస్ ఈ బుక్ రీడింగ్ వల్ల ఎంతో కొంత పెరిగిందనే చెప్పాలి. 2002-03 ఈనాడు జర్నలిజంలో ట్రైనింగ్ పూర్తయి, రెగ్యులర్ జాబులో పడ్డాక, అప్పుడప్పుడు ఒకటి అరా పుస్తకాలు చదవడం తప్ప, రెగ్యులర్ బుక్ రీడింగ్ అలవాటు ఆల్మోస్ట్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే దాన్ని తిరగదోడుదామని అనిపించింది.

అందుకే మార్చ్ నెలని బుక్ రీడింగ్ కి కేటాయించా. మొదట్లో డాక్టర్ కేశవరెడ్డి బుక్స్ కొన్ని ఆన్  లైన్లో చదివేశా. నిజానికవి అంతకుముందు చదివినవే. అంతకుముందెప్పుడో - ఈ బుక్ నీకు నచ్చుతుంది చూడు, చదువమని ‘ఒంటరి’ అనే పుస్తకాన్ని - ఇచ్చారు సమ్మెట  నాగమల్లేశ్వరరావు సర్ (ఆలిండియా రేడియో). ఆ ఒంటరి పుస్తకాన్ని చదువుదామనుకుంటుండగానే మురళీ (బ్లాగర్) దగ్గర ‘కొండపొలం’ పుస్తకం తీసుకున్నా. ఈ రెండు పుస్తకాల్ని రాసింది సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారే. ఐతే ‘ఒంటరి’ కన్నా ముందుగా ‘కొండపొలమే’ చదివేశా. అదయ్యాక ‘ఒంటరి’ కూడా చదివేశా. ఈ ‘కొండపొలం’ చదివాకా నేను ఫీలైన విషయాలను గుదిగుచ్చి ఏదైనా చిన్న రైటప్ రాద్దామనిపించింది. ఈ క్రమంలోనే మూలనపడ్డ బ్లాగును దుమ్ము దులపాల్సి వచ్చింది. దాని ఫలితమే ఈ పోస్టు.

ఇక ‘కొండపొలం’ నవల విషయానికొద్దాం. కథ గురించి టూకీగా చెప్పాలంటే, దాదాపు 50 రోజుల పాటు నల్లమల అడవుల్లో గొర్ల కాపరిగా ‘రవి’ అనే యువకుడు సాగించిన ప్రయాణం ఈ నవల! అడవిలో పిరికివాడుగా మొదలై ధైర్యవంతునిగా తననుతాను మలచుకున్న యువకుడి ప్రయాణమది. నల్లమలలోని చెట్టూ చేమలతో, కొండాకోనలతో, పక్షులతో, జంతువులతో, అడవి పుత్రులతో బంధాల్ని పెనవేసుకుంటూ రవి సాగించిన పయనమది. నగరం దెబ్బకు కుదేలైపోతున్న ప్రకృతి, పల్లెల తాలూకు మౌనరోదనను మననం చేసుకుంటూ ఓ యువకుడు చేసిన జర్నీ అది. మనిషి మనుగడకోసం ఈ అడవి ఎన్నో సమకూర్చింది, అలాంటి అడవికి మనవంతుగా తిరిగి ఏదైనా ఇవ్వాలని సంకల్పించిన ఓ యువకుడి ఆరాటమిది. అందరిలాగే ఇంజినీరింగ్ చేసి ఏ సాఫ్ట్ వేర్ జాబులోనో సెటిలైపోవాలని తలపెట్టి, చివరికి పల్లెలకు, ప్రకృతికి తనవంతు బాధ్యతగా మంచి చేయాలని అటవీశాఖాధికారిగా మార్పు చెందిన ఓ యువకుడి మార్పు ప్రస్థానమది.

జనరల్ గా మనం కొన్నింటికి/కొందరికి కనెక్ట్ అయినట్టుగా; ఇంకొన్నిటి/ఇంకొందరి విషయంలో అంతగా కనెక్ట్ అవలేము. బహుశా, అది మనం పుట్టి పెరిగే క్రమంలో అలవడిన అలవాట్ల, అబ్బిన సంస్కారాల వల్ల కావచ్చు. ఈ రకంగానే మనకు కొన్ని నిర్దిష్టమైన ఇష్టాయిష్టాలు ఏర్పడతాయనిపిస్తుంది. అఫ్ కోర్స్, ఇలా సంక్రమించిన అలవాట్ల/సంస్కారాల బంధనాలను దాటుకుని కొత్తవాటికి కనెక్ట్ అయ్యే ‘అడాప్షన్’ అనే గొప్ప ప్రక్రియ గురించి కూడా డార్విన్ మహాశయుడు ఏనాడో చెప్పాడనుకోండి. అదింకో విషయం. నా వరకు - సాహిత్యానికి సంబంధించినంత వరకు - శ్రీశ్రీకి కనెక్ట్ అయినంతగా కృష్ణశాస్త్రికి కనెక్ట్ అవలేకపోయా; శరత్ నచ్చినంతగా చలం నచ్చలేదు; రియలిజానికి కనెక్ట్ అయినంతగా ఫిక్షన్ కు కనెక్ట్ అవలేకపోయా. అడపాదడపా నా కంఫర్టబుల్ జోన్ ని నుండి బయటకొచ్చి చదివిన సాహిత్యం కూడా కొంత ఉందనుకోండి. అది అడాప్షన్ కిందకు వస్తుందేమో! ఇక, కొన్ని సందర్భాల్లో చాలామంది ఆహా.. ఓహో.. అని మెచ్చుకున్న కవుల/కథకుల సాహిత్యానికి ఎంతగా దగ్గరవుదామని ప్రయత్నించినా... అబ్బే, అస్సలంటే అస్సలు కుదర్లేదు. అడాప్షన్ ఇక్కడ ఏమాత్రం పనిచేయలేదు. బహుశా, ప్రకృతిలో ‘అలర్జీ’ అనే ఇంకో ప్రక్రియ దాన్ని అడ్డుకుంటుందేమో! పోన్లే, ఈ టాపిక్ ని ఇక్కడికి ఆపేద్దాం.

ఇక, నా స్టడీస్ అండ్ జాబ్ రీత్యా కర్నూలుతో ఏర్పడిన బంధం వల్ల కావచ్చు, అలాగే నల్లమలలోని దాదాపు అన్నిక్షేత్రాలను సందర్శించి ఉండడం వల్ల కావచ్చు, మరీ ముఖ్యంగా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూరా ఆకాశాన్నంటి నిలుచున్న కొండలన్నింటినీ ట్రెక్కింగ్ చేసి ఉండడం వల్ల కావచ్చు,  ఈ ‘కొండపొలం’ పుస్తకం నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే, రైతు కుటంబ నేపథ్యం ఒకటి ఉండడం, మా ఊళ్లో గొర్ల కాపర్ల జీవితాల్ని దగ్గరినుండి చూడడం వల్ల కూడా ఈ పుస్తకానికి నేను బాగా కనెక్ట్ అయ్యానేమో. అలాగే, ప్రతీ ప్రాంతానికీ భాషలో, సంప్రదాయాల్లో, మనుషుల జీవనవిధానంలో దానికే సొంతమైన ఓ ‘ఫ్లేవర్’ ఉంటుంది. రాయలసీమకు కూడా అలాంటి ఫ్లేవర్ ఒకటుంటుంది. కొండపొలం నవలకు కూడా సీమ ఫ్లేవర్ ఉండడం వల్లో, ఏమో నాకు బాగా నచ్చిందిది. ఐతే, ఈ భాషల/యాసల/ప్రాంతాల/ జీవన విధానాల పరిధిని దాటి అందరికీ నచ్చే ‘యూనివర్శల్ అపీల్’ కొన్ని పుస్తకాలకు ఉంటుంది. అలాంటి యూనివర్శల్ అపీల్ కూడా ఈ ‘కొండపొలం’ పుస్తకానికి తగినంత ఉందని చెప్పొచ్చు.

అనంతమైన పరిణామ క్రమంలో, ఈ విశాలవిశ్వంలోని ఒకానొక పాలపుంతలో, ఒకానొక గ్రహంపై, ఇనార్గానిక్ (కార్బన్ రహిత) పదార్థం... ఆర్గానిక్ (కార్బన్ కలిగిన) పదార్థంగా పరిణామం చెంది, ఆపై జీవం (లైఫ్) ఉనికిలోకి వచ్చి, ఆపై ఏకకణ- తర్వాత బహుకణ - అనంతరం వెన్నెముక కలిగిన - దాని తర్వాత సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ కలిగిన జీవులు గా పరిణామం చెంది, ఆపై సెరెబ్రల్ కార్టెక్స్ కలిగి ‘ఆలోచన’ చేయగలిగిన మనిషి ఆవిర్భావం దాకా ఎన్ని లక్షల ఏళ్లు గడిచాయో లెక్కగట్టడం కష్టసాధ్యమేనేమో. ప్రారంభదశలో అంటే - పళ్లు ఫలాలను తిని, జంతువులను వేటాడినంత కాలం - మనిషి సంచారజీవిగానే ఉన్నాడు. ఎప్పుడైతే, వ్యవసాయం కనిపెట్టాడో అప్పుడే స్థిర నివాసం అవసరమైంది. ఆ క్రమంలోనే అనేక సివిలైజేషన్లు పుట్టుకొచ్చాయి. ఐతే, ఈ వ్యవయాానికి సంబంధించి, నాటి అనాగరిక దశ నుండి నేటి ఆధునిక దశ దాకా కూడా ‘కరవు’ అనేది మనిషికి అనంతంగా సవాల్ విసరుతూనే ఉంది. ఈ ‘కరవే’ ఈ ‘కొండపొలం’ నవలకు కథా వస్తువు.

ఈ ‘మనిషి’ అనే వాడొక అద్భుతం అనిపిస్తుంటుంది. ఈ సమస్త ప్రకృతి అంతా ఒకవైపు నిలిస్తే, ఆ ప్రకృతిలోంచే పుట్టుకొచ్చి, దానికి ఎదురుగా ఇంకోవైపున నిలవగలిగిన దమ్ము, ధైర్యం, చైతన్యం ఒక్క ‘మనిషి’కే ఉన్నాయనిపిస్తుంది. ప్రకృతిలోని నింగీ నీరూ నిప్పూ నేలా లాంటి వాటి ధర్మాలను తెలుసుకుని, వాటిని వశపరచుకుని, అగ్రికల్చరనీ, చేతివృత్తులనీ, హస్తకళలనీ, కళలనీ, సాహిత్యమనీ, డ్యాములనీ, స్టీము ఇంజెన్లనీ, పవర్ లూమ్స్ అనీ, భారీ పరిశ్రమలనీ, నౌకాయానమనీ, విమానయానమనీ, రోదసీ పయనాలనీ ఇలా ఒకటా రెండా కొన్ని వందల, వేల, లక్షల అద్భుతాలు చేశాడీ ‘మనిషి’. కేవలం ఈ ‘మనిషి’ సాంగత్యం వల్లనే, ఈ ‘మనిషి’ కి టచ్ లోకి వచ్చిన కారణంగానే తమతమ క్రూడ్ క్వాలిటీలను సైతం ఫైనెస్ట్ గా మెరుగుపరచుకున్న Parrot, Eagle, Dog, Horse లాంటి పక్షులు, జంతువులకైతే లెక్కేలేదు. ఈ క్రమంలోనే ప్రకృతితో, ప్రకృతిలోని చెట్టూచేమతో, కొండాకోనతో, పక్షులతో, జంతువులతో, సకల ప్రాణులతో ఒక రకమైన ఆర్గానిక్ సంబంధ బాంధవ్యాల్ని ఏర్పరచుకున్నాడీ ‘మనిషి’. మరీ ముఖ్యంగా వ్యవసాయంతో పాటే మరొక అనుబంధ ఆహార వనరుగా ‘పశుపోషణ’ను అనాదిగా అక్కున చేర్చుకున్నాడీ మనిషి. అందుకే మనిషికి నేలతో పాటే, ఎద్దులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, కోళ్లతో ఇప్పటికీ అలవికాని బంధం. ఈ కొండపొలంలో నవల్లో కూడా ‘కరవు’ కోరలు చాచిన సమయంలో తనతో పాటే, తమనే నమ్ముకుని బతికే జీవాలైన ‘గొర్ల’ను ఎలాగైనా బతికి బట్ట కట్టించాలనే ‘మనిషి’ తాలూకు తపనే ఈ నవలకు ఆయువుపట్టు. (ఈ పేరాలో కేవలం మనిషి సాధించిన ‘మంచి’నే హైలైట్ చేశా. ఈ క్రమంలో మనిషి కలుగజేసిన ‘చెడు’ తాలూకు నెగెటివ్ పార్శ్వాన్ని నేను ఇక్కడ స్పృశించలేదు.)

మనిషి ప్రస్థానం ఎక్కడో అడవుల్లోని గూడెం, తాండాలు దాటుకుని గ్రామాలు, పట్టణాలు, నగరాల దాకా; ఆటవిక సంచార జీవితం నుండి ఆధునిక సివిలైజేషన్ల దాకా; ఆదిమ-బానిస-రాజరిక-ప్రజాస్వామ్య వ్యవస్థల దాకా అనేక రూపాల్లో విలసిల్లుతూ పరిణామం చెందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మనం ప్రపంచీకరణ దాకా వచ్చాం. ఇదొక సంధి దశ. ఈ దశలోనే నగరాలు పల్లెటూళ్లను మింగేస్తున్నాయి. పరిశ్రమలు వ్యవసాయాన్ని కబళించేస్తున్నాయి. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని ముడిపడ్డ వృత్తుల ఉనికికే ప్రమాదం ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో జీవిస్తున్నాం మనం. ఈ విపత్కర పరిస్థితుల్నే ఆలోచనాత్మకంగా, మానవీయంగా డిస్కస్ చేస్తుంది... ఈ కొండపొలం.

రచయిత సన్నపురెడ్డి వెంకట్రా మిరెడ్డి తన ఒంటరి, కొండపొలం నవలల్లో చర్చకు లేవనెత్తిన విషయాలైన.... పరిశ్రమలు Vs వ్యవసాయం; నగరాలు Vs పల్లెటూళ్ల మధ్య నెలకొన్న శత్రుపూరితమైన వైరుధ్యాన్ని తొలగించి, ఒకదానికొకటి చేదోడువాదోడుగా నిలిచే వాతావరణం నెలకొనే మంచి కాలం ఎప్పుడొస్తుందో మరి! 

Thursday 23 January 2014

మనసును మెలిపెట్టే దోస్తవోయిస్కీ తిరస్కృతులు!!

పుస్తకం హస్తభూషణం ఐతే... మరి,
పుస్తక పఠనాన్ని బుద్ధి వికాసానికి సాయపడే ఉత్ప్రేరకం అనాలేమో!
కాస్త క్యాచీగా రాద్దామని ప్రయత్నించా గానీ... లాభం లేకపోయింది. ప్చ్... రెండో వాక్యం బాగా పొడుగైపోయింది. Economy Of Words పాటించని వాణ్ణి నేనస్సలు క్షమించనంటాడు మహాకవి శ్రీశ్రీ. వ్యక్తీకరణలో పొడిమాటలు, చిట్టి వాక్యాలు రాయలేని నేను... శ్రీశ్రీ క్షమకు నోచుకోని అభాగ్యుల జాబితాలో ముందుంటానేమో! చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, సూక్ష్మంగా చెప్పలేకపోవడానికి కారణం... నాకు పుస్తక పఠనం అలవాటు లేకపోవడమేనేమో. చెబితే కాస్త చోద్యంగా అనిపిస్తుందేమో. చిన్నతనంలో అదృష్టవశాత్తూ ఎక్కడైనా చందమామ, బాలమిత్ర దొరికితే అపురూపంగా చదవడం తప్పిస్తే, డిగ్రీ దాకా పుస్తకాలు చదవాలనే స్పృహే లేకపోయింది. పైగా, దానినెవరూ అలవాటు చేయలేదు కూడా. పోనీ, కనీసం పాఠ్యపుస్తకాలైనా ఒద్దికగా, బుద్ధిగా చదివామా...అంటే అదీ లేదాయె. అన్నీ రాలుగాయి తిరుగుళ్లు. గాలి చదువులే. వీటిన్నింటి పాప పరిహారమే అనుకుంటా... ఏదైనా రాద్దామని కూచుంటే, ఆలోచనలు మొరాయిస్తుంటాయి. అక్షరాలు సహాయ నిరాకరణ చేస్తుంటాయి. అలాంటప్పుడు మన్మోహన్ సింగులా మౌనముద్ర దాల్చడం తప్ప వేరే చేసేదేముంటుంది. నా జీవితంలో ఓ 25 ఏళ్లు అలా వృథాగా గడిచిపోయాయి. పోనీయండి... గతాన్ని తవ్వుకుని బావురుమని బావుకునేదేమీ ఉండదని అనుభవం మీద తెలిసిన విషయం. జీవితానుభవాలకు మించిన జ్ఞానం ఏముంటుంది చెప్పండి?!

కొన్నేళ్ల క్రితం అనుకుంటా. పుస్తకాల అవసరం పెద్దగా లేకుండానే సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో ఒక భయంకరమైన కుదుపు, మలుపు, అలజడి చోటుచేసుకున్నాయని చెప్పడానికి చింతిస్తున్నా. ఈనాడు జర్నలిజం కోర్సుకు సెలెక్ట్ అవడంతో... పుస్తకాల్ని పురుగుల్లా చిన్నచూపు చూసిన నా నిర్వాకానికి తగిన ప్రతీకారమే జరిగింది. జర్నలిస్టు అనేవాడు ‘‘జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్’’గా ఉండాలనిన్నీ; ప్రపంచంలో ముద్రితమైన గొప్పగొప్ప పుస్తకాలన్నిటినీ కట్టగట్టి రోల్ చేసి నమిలి మింగేసి జీర్ణం చేసుకోవాలనిన్నీ; ఇలాంటివే ఇంకో ఐదో, ఆరో బాగా కిక్కిచ్చే సూక్తులు చెప్పి, ఆ ఏడాది ట్రైనింగులో చదవాల్సిన ఓ 53 పుస్తకాల జాబితాను చేతిలో పెట్టారు. అనగా... వారానికో పుస్తకం చదివి దాని మీద పోస్టుమార్టం రివ్యూ నిర్వహించాల్సిన బృహత్తర బాధ్యత అన్నమాట. అస్సలు ఏమాత్రం అలవాటు లేని పని కావడంతో చుక్కలు కనిపించాయి. మొత్తానికి కిందామీదా పడి, చచ్చీచెడీ, ఎలాగోలా తంతు ముగించాను. గుడ్ న్యూస్ ఏంటంటే, నేను కూడా కొన్ని పుస్తకాలు చదివానని కాలరెగరేసే స్టేటస్ కల్పించారు ఈనాడు వాళ్లు. ఇప్పుడొకసారి ఆ గడ్డుకాలాన్ని గుర్తు చేసుకుంటే, చెల్లాచెదురుగా అలెక్స్ హేలీ- ఏడు తరాలు; మ్యాక్సిం గోర్కీ- అమ్మ; శ్రీశ్రీ- మహాప్రస్థానం; తిలక్- అమృతం కురిసిన రాత్రి; నండూరి- విశ్వదర్శనం; ముళ్లపూడి- బుడుగు; గురజాడ- కన్యాశుల్కం... ఇలా కొన్ని పుస్తకాలు లీలగా స్మృతిపథంలో కదలాడుతుంటాయి. ఈనాడు ట్రైనింగు బందీఖానా నుండి బయటపడి జాబులో జాయినవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పుస్తక పఠనం అటకెక్కింది. ఏదో మధ్యమధ్యలో ఇష్టపడి శరత్ చంద్రుడి సమగ్ర సాహిత్యాన్ని కాస్త దీక్షతో చదవడం తప్ప పెద్దగా పుస్తకాలు చదివిన పాపాన పోలేదు. ఇదిగో మళ్లీ ఇంతకాలానికి ఓ పుస్తకం చదివాను. అది సుప్రసిద్ధ రష్యన్ నవలా రచయిత దోస్తవోయిస్కీ రాసిన ‘‘తిరస్కృతులు’’. 


‘‘క్లాసిక్’’ అనే మాట మనం తరచుగా వింటుంటాం. క్లాసికల్ ఎకానమీ అనీ; క్లాసికల్ ఫిజిక్స్ అనీ; క్లాసికల్ మ్యూజిక్ అనీ; క్లాసికల్ మూవీస్ అనీ... ఇలాంటివి. ఈ క్లాసిక్ అంటే... భాషకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అప్లై అయ్యేవనీ, ప్రజలకు అప్పీల్ చేసి, ఆకర్షించేవనే సత్యం చాలా ఆలస్యంగా, ఎక్కడో చదివాక గానీ తెలీలేదు. సాహిత్యంలో కూడా క్లాసిక్స్ ఉంటాయి. షేక్ స్పియర్, మిల్టన్, రూసో, వాల్టేర్, డికెన్స్, టాల్ స్టాయ్, చెహోవ్, దోస్తవోయిస్కీ, రవీంద్రుడు... ఇలా ఎందరో గొప్ప రచయితలు అన్నిరకాల ఎల్లలకు అతీతంగా మానవాళిని ఆకర్షించి, ప్రభావితం చేసి, మార్పును తీసుకొచ్చే క్లాసికల్ సాహిత్యాన్ని సృష్టించారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి క్లాసికల్ లిటరేచర్ కోవకు చెందిందే... దోస్తవోయిస్కీ నవల The Insulted & Injured కూడా. ఆ నవలకు తెలుగు రూపమే ఈ తిరస్కృతులు! పుస్తకం చిన్నదే. ఓ 200 పేజీలదాకా ఉంటాయి. పీకాక్ క్లాసిక్స్ ముద్రణ. అనువాదం చేసింది... జంపాల ఉమామహేశ్వరారావు. ఈయనెవరో కాదు... సహవాసి గారే. అది ఆయన అసలు పేరట. సహవాసిగా మారకముందు, ఇంకా చెప్పాలంటే ఆయన మొట్టమొదటి అనువాదం ఈ తిరస్కృతులు. సహవాసి చక్కటి చిక్కటి అనువాదం ఈ పుస్తకానికో పెద్ద ప్లస్ పాయింట్. కేవలం అనువాదాలు సరిగా లేకపోవడం వల్లే మనం చాలా మంచి పుస్తకాల్ని సైతం చదువుదామని మొదలెట్టి, తీరా ముందుకు సాగక, పక్కన పెట్టేస్తుంటాం. ముద్రా రాక్షసాలు ఎక్కడా కనిపించకపోవడం కూడా ఈ పుస్తకం పూర్తి చేయడానికి సహకరించే మరో అంశం. ఇక అసలు విషయానికొద్దాం. 

Time & Space!!
తెలుగులో స్థల కాలాలని అంటుంటారు. ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫిలసాఫికల్ కొనసాగింపు ప్రకారం... ఏ దృగ్విషయమైనా నిర్దిష్టంగా, అదేసమయంలో సాపేక్షంగా కూడా ఉంటుందనే సత్యం తెలిసిందే. ఇక్కడ సాహిత్యంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో. ఒక రచనను అర్థం చేసుకునేటప్పుడు గానీ, అంచనా వేసేటప్పుడు గానీ... దాని కాలమాన పరిస్థితుల్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలనుకుంటాను. లేదంటే ఆ రచన, రచనలో చర్చించిన ఇథివృత్తం కాలం చెల్లిందింగానో, లోపాలు కలిగినదిగానో, తప్పుల తడకగానో కనిపించే ప్రమాదముంటుంది. ఇక, తిరస్కృతులు నవలలో కథా నేపథ్యం 19వ శతాబ్దం నాటి రష్యన్ సామాజిక పరిస్థితులు. ఒకరకంగా ఫ్యూడల్ నేపథ్యమని చెప్పొచ్చు. అంటే, పారిశ్రామిక ప్రగతికి పూర్తిస్థాయిలో బీజాలు పడని రోజులవి. అంటే, ప్రజాస్వామిక భావనలు ఇంకా వెల్లివిరియని రోజులవి. అంటే, స్వేచ్ఛా జీవితం, స్త్రీ-పురుషుల మధ్య సమానత్వం, ప్రజల మధ్య సౌభ్రాతృత్వ భావనలు ఇంకా బలంగా వేళ్లూనుకోని కాలమది. కథా గమనం ఆ నేపథ్యంలోనే సాగుతుంది. ఈ నవలలో గట్టిగా ఏడెనిమిది పాత్రలకు మించి ఉండవు. వాటినొకసారి క్లుప్తంగా పరిచయం చేయాల్సి వస్తే...
ఇవాన్ పెట్రోవిచ్: హీరో. నవలలో రచయిత. అందరికీ తల్లో నాలుకలా ఉండే వ్యక్తి. ఇతనే కథంతా చెబుతుంటాడు.
నతాషా: నాయిక. ప్రేమ కారణంగా అటు ప్రియుడి వంచనకు, ఇటు తల్లిదండ్రుల నిరాదరణకు గురైన ప్రౌఢ.
ప్రిన్స్: విలన్. ధనవంతుడు. ఆస్తి కోసం, డబ్బు కోసం ఎంతటి వంచనకైనా పాల్పడే మేక వన్నె పులి. 
నికొలాయ్, అన్నా: నతాషా తల్లిదండ్రులు. ప్రిన్స్ దాష్టీకానికి బలైన చిన్నపాటి ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ.
అలెక్సీ ఆయేషా: ప్రిన్స్ కుమారుడు. నతాషా ప్రియుడు. అమాయకుడు. మాటలో, నడవడిలో నిలకడ లేని యువకుడు.
నీలి: ప్రిన్స్ వంచనకు గురైన ఓ అభాగ్యురాలి కూతురు. శారీరకంగా, మానసికంగా చిత్రవధకు గురైన అమ్మాయి.
మాస్లో: ప్రిన్స్ కుట్రలకు, కుతంత్రాలకు సాయపడే వ్యక్తి. ఇవాన్ పెట్రోవిచ్ కు క్లాస్ మేట్ మరియు మిత్రుడు.
క్యాథరీనా: ప్రిన్స్ కుమారుడు అలెక్సీ ఇష్టపడే మరో ధనవంతురాలైన అందమైన, అద్భుతమైన యువతి.


నవలలో కథాంశాన్ని గురించి క్లుప్తంగా చెప్పాల్సి వస్తే... ప్రిన్స్ అనే ధనవంతుడు ఒక ప్రాంతంలో తన ఎస్టేట్ వ్యవహారాల్ని చూసే బాధ్యతను నికొలాయ్ అనేవ్యక్తికి అప్పగిస్తాడు. వ్యవహారం కొంతకాలం పాటు సాఫీగానే నడుస్తుంది. అయితే ఈ క్రమంలో నికోలాయ్ కూతరు నతాషా, ప్రిన్స్ కొడుకు అలెక్సీ ఆయోషా ఇద్దరూ ప్రేమించుకుంటారు. డబ్బుకు, ఆస్తి విషయాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రిన్స్... ఈ ప్రేమ వ్యవహారాన్ని ఎలాగైనా తెగదెంపులు చేయాలనుకుంటాడు. ఓ కుట్ర పన్ని, తన ఎస్టేట్ వ్యవహారాలో అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి నికొలాయ్ ను కోర్టుకీడుస్తాడు. ప్రిన్స్ ను గుడ్డిగా విశ్వసించిన అత్యంత నిజాయితీ పరుడైన నికొలాయికి ఇది అతి పెద్ద షాక్. ఈ క్రమంలో నతాషా... ప్రేమ కోసం ఇల్లొదిలి వెళ్లిపోతుంది. తండ్రి నికొలాయికి ఇది రెండో అతి పెద్ద షాక్. ఈ రెండు వ్యవహారాల కారణంగా నికొలాయ్ దాదాపు ఆర్థికంగా దివాళా తీసి, కుంగిపోతాడు. ఈ క్రమంలో కూతురు నతాషాపై ఉన్న ప్రేమానురాగాలు సైతం తీవ్ర ద్వేషంగా పరిణమిస్తాయి. ప్రిన్స్ కుమారుడు అలెక్సీ అయేషా అనే యువకుడు... అత్యంత అమాయకుడు, నిలకడ లేని వ్యక్తి కావడం చేత, వాళ్ల నాన్న (ప్రిన్స్ పన్నాగం) కారణంగా... నతాషా-అలెక్సీల ప్రేమకథ కొంతకాలానికే విషాదాంతంగా ముగుస్తుంది. ఇక, నవలలో జరిగే కథనంతా ఇవాన్ అనే రచయిత మనకు చెబుతుంటాడు. ఇతనే ఇందులో హీరో. నికొలాయ్ కుటుంబానికి ఆప్తుడు. ఇవాన్ కూడా నతాషాను ప్రేమిస్తాడు. అయితే నతాషా వేరొకరిని ప్రేమిస్తోందని తెలిసాక; తన ప్రేమను త్యాగం చేసి; నతాషాకు, ఆమె కుటుంబానికి అన్ని విధాలా సాయపడే గొప్ప వ్యక్తిత్వం కల్గిన వ్యక్తి. ఈ కథలోనే ఇంకొక సబ్ ట్రాక్ ఏంటంటే... ప్రిన్స్ ధనదాహానికి బలై, వంచనకు గురైన ఒక మహిళకు పుట్టిన అమ్మాయి (నీలి), ఓ వృద్ధుడు (నీలి తాత) కనిపిస్తారు. వృద్ధుడు ఆరంభంలోనే మరణిస్తాడు. అయితే నీలిని మాత్రం ఇవాన్ చేరదీసి బాసటగా నిలుస్తాడు. చిన్నతనం నుండే అత్యంత అవమానాలను, ఛీత్కారాలను ఎదుర్కొంటూ ఎక్కడెక్కడో అనాథలా పెరిగిన నీలి... అంతులేని మానసిక ఆటుపోట్లకు గురైన అబలగా కనిపించి, ఆఖరుకు కన్నుమూస్తుంది. ప్రేమలో విఫలమైన నతాషా... చివరకు తన తల్లిదండ్రుల (నికొలాయ్, అన్నా) చెంతకు చేరుతుంది. అంతిమంగా ఇవాన్ - నతాషా కలసి పార్కులో అడుగులు వేస్తూ ముందుకు కదలడంతో కథ ముగుస్తుంది.


నేటి దృక్కోణంలోంచి చూస్తే... ఇది రోటీన్ కథ, కథనం కల్గిన నవలలాగే కనిపించొచ్చు. కానీ, 1850లకు ముందు నాటి రష్యన్ కాలమాన పరిస్థితుల దృష్ట్యా చూస్తే, ఆ కథాంశాన్ని ఎన్నుకోవడం; ఆనాటి సామాజిక గమ్యం, గమనాన్ని ప్రభావితం చేసే విధంగా నవలను నడిపించడం ఎంతమాత్రం ఆర్డినరీ విషయం కాదేమో అనిపిస్తుంది. నిజానికి 150 ఏళ్ల క్రితం నాటి జారిస్టు రష్యాలో... అప్పటికింకా ఒక యువతి- తనకు నచ్చిన గుణగణాలున్న యువకుణ్ణి ఎంచుకుని- ప్రేమించి, పెళ్లి చేసుకునే స్వేచ్ఛ, స్వతంత్రత తక్కువే. ఒకవేళ అలాంటిదేదైనా సంభవించినా ఆ ప్రేమలకు తల్లిదండ్రుల అంగీకారం ససేమిరా లభించని రోజులవి. అలాంటి స్థితిలో తల్లిదండ్రుల్ని ధిక్కరించి, ఇంట్లోంచి వెళ్లిపోతే... ఇక ఆ యువతికి - తల్లిదండ్రులకు సంబంధాలు దాదాపు కట్ అయినట్టే. అనాదిగా వస్తున్న పరువు-ప్రతిష్టల కోసం కన్నకూతురనైనా చూడకుండా విద్వేషం చిమ్మే రోజులవి. (మనదగ్గర అమ్మాయిలపై హానర్ కిల్గింగ్స్ అనేవి ఇప్పటికీ జరుగుతున్నాయి). దురదృష్టవశాత్తూ, ఆ యువతి ప్రేమలో కానీ, వివాహానంతరం కానీ వంచనకు గురైతే... ఇక, ఇటు తల్లిదండ్రుల విద్వేషానికి, అటు సామాజిక నిరాదరణకు గురై... తదుపరి జీవితం సింప్లీ నరకప్రాయమే. ఈ రకంగా అన్నిరకాల తిరస్కరణకు గురైన ‘‘తిరస్కృతులు’’ బలవంతంగా జీవితాన్ని అంతమొందించుకోవడం అన్నది ఆ వ్యవస్థకు కళంకంగా భావించొచ్చు. సరిగ్గా... ఈ తిరస్కృతులకే దన్నుగా నిలిచాడు దోస్తవోయిస్కీ. నవలలో సరిగ్గా ఇలాంటి ఉదంతాల్నే రెండింటినీ చిత్రీకరిస్తాడు దోస్తవోయిస్కీ. మొదటి  ఉదంతంలో ఓ యువతి- ప్రేమ వివాహం తర్వాత వంచనకు గురై, ఎక్కడా ఏ తీరం దొరక్క, చివరకు తండ్రి దగ్గర సైతం ఛీత్కారాన్నే ఎదుర్కొని, విధిలేని పరిస్థితుల్లో జీవితాన్ని కడతేర్చుకుంటుంది. ఆమెకు పుట్టిన కూతురు (నీలి) సొసైటీలో అత్యంత నిరాదరణకు గురై, ఎలాంటి మానసిన వ్యథను అనుభవిస్తుందో హృదయవిదారకంగా చిత్రీకరిస్తాడు. నాటి సామాజిక కట్టుబాట్లకు తలొగ్గి, కూతురిని, మనవరాలిని చెంతకు తీసుకోలేని దైన్య స్థితిలో తనువు చాలించే తండ్రి (వృద్ధుడు) పాత్ర మరొకటి ఇందులో కనిపిస్తుంది. రెండో ఉదంతంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నతాషా విషయంలో కూడా రిపీట్ అవుతుంది. తండ్రీ కూతుళ్లిద్దరికీ సేమ్ టార్చర్. అయితే, అన్నిరకాలా తిరస్కరణకు గురైన నిస్సహాయ నతాషాను, ఆమె తండ్రి నికోలాయ్ తిరిగి చేరదీసేలా పాత్రల్ని, సన్నివేశాల్ని మలిచిన తీరు నిజంగా అద్భుతం. నవలను చదివే పాఠకుడికి సైతం నతాషాను, ఆమె తండ్రి దగ్గరకు తీస్తే బాగుణ్ణు అని అనిపించేలా చేయడంలోనే రచయిత గొప్పతనం దాగుంటుంది. అలాంటి రసావిష్కరణతో పాఠకుల హృదయాల్ని గెలవడంలో దోస్తవోయిస్కీ 100 శాతం సఫలీకృతమయ్యాడనే చెప్పాలి.


నిజానికి ఏ బంధానికైనా mutual appreciation of values and qualities అన్నది బేసిస్ గా ఉండాలి. అప్పుడే ఆ బంధం స్థిరంగా, సజీవంగా ముందుకు కొనసాగే అవకాశముంటుంది. ప్రేమ బంధానికైనా ఇదే బేసిస్. ఈ కొలమానంతో చూస్తే... నతాషాది పరిణతి కల్గిన ప్రేమగా కనిపించదు. అఫ్ కోర్స్, ఆ యుక్త వయసులో ఆకర్షణ తాలూకు ప్రేమలే ఎక్కువ. ఈ నవలలో కూడా దోస్తవోయిస్కీ అలాంటి ప్రేమనే చిత్రించాడు. పెద్దగా బేస్ లేకపోవడంతో, సహజంగానే ఆ ప్రేమ అట్టే ఎక్కువకాలం నిలవదు. ఏ ప్రేమ కోసమైతే తల్లిదండ్రుల్ని సైతం ధిక్కురించి ఇంటి నుండి వచ్చేస్తారో, ఆ ప్రేమే విఫలమైతే లేదా ఆ ప్రేమలో వంచనకు గురయితే... అనంతరం ఆ యువతి పరిస్థితి ఏంటనే విషయంలో సరైన పరిష్కార మార్గాల్ని అన్వేషించి, సామాజిక పురోగమనానికి సరైన దారి చూపడంలోనే రచయిత ఔన్నత్యం దాగుంటుంది. ఈ విషయంలో రకరకాల ట్రెండ్స్ కనిపిస్తుంటాయి. ఒక ట్రెండ్- ప్రేమ కోసం అందరినీ వదిలేసి లేచిపోవడం, ఆ ప్రేమ (ఆకర్షణ) ఉన్నంతకాలం అతనితో గడపడం, ఈ సమయంలో తన నగలు-నట్రా, డబ్బూదస్కం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం, ఆ ప్రేమ (ఆకర్షణ) ఆవిరైపోగానే మరొకరితో లేచిపోవడం, వగైరా వగైరా ఇలాంటి (విలువలు లేని) విశృంఖల పరిష్కారాలను సూచించిన (గొప్ప) రచయితలు చాలామందే కనిపిస్తారు. మరో ట్రెండ్- అసలు ఈ ప్రేమలే తప్పు అని చిత్రించే విధంగానో; లేదంటే ప్రేమలో లేక ప్రేమ తాలూకు వివాహ బంధాల్లో వైఫల్యమో, వంచనో సంభవిస్తే, ఆ యువతిని కడతేర్చడమో చేసే నైరాష్యపు పరిష్కారాన్ని సూచించే రచయితలు కూడా కోకొల్లలు. అయితే, దోస్తవోయిస్కీ మాత్రం... యవ్వనం తాలూకు ఆకర్షణలో, తెలిసీ తెలీని తనంతో జీవితంలో తప్పటడుగు వేసి, విధి వంచితులుగా మారిన నతాషా లాంటి అపురూపమైన యువతులు... సామాజిక కట్టుబాట్ల పదఘట్టనల కింద పడి ఛిద్రమైపోకుండా... తమ తప్పును సరిదిద్దుకుని కొత్త జీవితం ప్రారంభించేందుకు గాను తల్లిదండ్రులు, సమాజం కచ్చితంగా అవకాశమివ్వాలని కోరతాడు. ఉన్నత భావాలు, ఆదర్శాలు కల్గిన ఇవాన్ ను, జీవితంలో అనేక ఒడిదుడుకుల, అనుభవాల సారంతో మెచ్యూరిటీ సాధించిన నతాషాను కలిపి ముందుకు నడపి నవలను ముగించడం ద్వారా దోస్తవోయిస్కీ... సమాజంలో ఒక ఉన్నత ఆదర్శానికి దారి చూపించాడని చెప్పవచ్చు. నవలలో ప్రిన్స్, మాస్లో ప్రవర్తనను, సైకాలజీని చిత్రించిన తీరు; సమాజంలో తిరస్కృతులుగా మిగిలి, అత్యంత దయనీయ స్థితిలో కడతేరే నీలి, నీలి మదర్, గ్రాండ్ ఫాదర్ లను దోస్తవోయిస్కీ చిత్రించిన తీరు కూడా సింప్లీ సూపర్బ్!!!


(ఉపసంహారం: ఈ నవల చదివి, ఫ్రెండ్సుతో డిస్కస్ చేశాక, కలిగిన కలగాపులగపు ఫీలింగ్సు అన్నింటినీ ఈ బ్లాగులో ఒక్కచోటకు చేర్చే ప్రయత్నం చేశా. అలా రాస్తూ పోతే కొంత పొడగాటి రైటపే తయారైంది. ఎకానమీ ఆఫ్ సెంటెన్సెస్ సాధించి, చిన్నదిగా రాయలేకపోయినందుకు మరోసారి చింతిస్తున్నా. థాంక్యూ!!)