ఇవాళ వరల్డ్ బుక్ డేను పురస్కరించుకుని, నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం... ‘మహాప్రస్థానం’ గురించి నాలుగు మాటలు రాద్దామనిపించింది.
కర్నూల్లో డిగ్రీ పూర్తయ్యాక ఓ ఏడాది ఖాళీగా ఉన్నా. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న రోజులవి. ఆ ఫ్రీటైంలోనే ఒకటి, స్టేడియంకెళ్లి జాగ్ చేయడం; రెండు, సెంట్రల్ లైబ్రరీకెళ్లి చదూకోవడం.. ఈ రెండు అలవాట్లకు పునాది పడింది. అప్పటికీ నాకు లైబ్రరీ అంటే, అన్ని పేపర్లలో స్పోర్ట్స్ పేజీ వార్తల్ని చదవడానికి ఓ అనువైన ప్లేసనే సంకుచిత అభిప్రాయం ఉండేది. కొన్ని రోజుల్లోనే అదే లైబ్రరీలోనే పుస్తకాలుంటాయనీ, అక్కడ నామినల్ మెంబర్ షిప్ ఉంటుందనీ, అది తీసుకుంటే పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి చదూకోవచ్చనీ మెలమెల్లగా తెలిసింది. అలా పేపర్లను దాటుకుని పుస్తక ప్రపంచంలోకి ప్రవేశించాను.
అలా ఆ లైబ్రరీలోనే కృష్ణశాస్త్రి, తిలక్, చలం, సినారే, దాశరథి, పఠాభి, ఆరుద్ర, అరవిందుడు, రవీంద్రుడు, శ్రీశ్రీ ఇలా అందరినీ పలకరించి పరిచయం చేసుకున్నా. నా కాంపిటీటివ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ని పక్కనపారేసి మరీ ఈ సాహిత్యంలో మునిగిపోయా. ఆ ఎర్లీ యంగేజీలో ఆ కవిత్వాలు, సాహిత్యాలు ఏ మేరకు బుర్రకెక్కాయో ఇప్పటికీ సరిగా గుర్తు లేదు కానీ, ఒక్క పుస్తకం మాత్రం చదువుతుంటే శరీరంలో ఆపాదమస్తకాన్ని ఊపేసింది. అదే మహాప్రస్థానం!! అప్పటికి ఆ పుస్తకంలోని కాన్సెప్టులు పెద్దగా అర్థం కాకపోయినా అదేదో ఉరకలెత్తే జలపాతం హోరులో కొట్టుకుపోయిన ఫీలింగ్ మాత్రం ఇప్పటికీ గుర్తు. అది మొదలు, ఏ పుస్తకం చదివినా ఈ మహాప్రస్థానం ముందు ఎందుకో తేలిపోయేది. ఏం తోచకపోయినా కూడా ఓసారి మహాప్రస్థానాన్ని తిరగేస్తే తెలీని ఉద్వేగం ఆవహించేది. ఆ పుస్తకానికేదో మంత్రశక్తి ఉందనిపించేది అప్పట్లో నాకు.
ఇక, ఆ తర్వాత కర్నూల్లో ఈనాడులో కాంట్రిబ్యూటర్ గా చేసే రోజుల్లో కూడా అడపాదడపా అవకాశం దొరికిన ప్రతీ వార్తలో శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ఒకటో రెండో లైన్లు కోట్ చేద్దామా అనిపించేదెప్పుడూ. 2002 సెప్టెంబర్లో ఈనాడు జర్నలిజం స్కూలుకి సెలెక్టై వచ్చాక, ఇక్కడ ప్రతీ వారం ఓ పుస్తకం చదివి సమీక్ష రాయాల్సిన నిబంధన ఒకడుంటేది. అలా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 52 పుస్తకాల జాబితా ఆ ఏడాది జర్నలిజం చేస్తున్న సమయంలో ఉండేది. ఆ అన్ని పుస్తకాల్లోకి, నేను మరోసారి లీనమైపోయి చదివి, అనుభవించి రివ్యూ రాసిన పుస్తకం.. మహాప్రస్థానమే. ఇక ఆ తర్వాత ఇదే మహాప్రస్థానాన్ని ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు.
అక్షరానికీ అణుబాంబుంత శక్తి ఉంటుందనీ; ఒక్కో కవిత ఒక్కో మిసైల్ లా దూసుకెళుతుందని మహాప్రస్థానంలోని ఏ కవితను చదివినా ఇట్టే అర్థమైపోతుంది. మనలో జడత్వాన్ని, బద్ధకాన్ని బద్ధలుకొట్టి ఉరుకులు పరుగులు పెట్టించగల చోదకశక్తేదో ఈ పుస్తకంలో ప్రతీ కవితకూ ఉంటుంది. ఈ పుస్తకంలో ఏ కవితను చదివినా దానికే సొంతమైన ఓ శృతీ, లయా కనిపిస్తాయి. రౌద్రంతో ఉరకలెత్తించినా, కరుణలో ఓలలాడించినా, హాస్య ఛమత్కారంలో ముంచెత్తినా, బీభత్స భయానకంలోకి తోసేసినా, అద్భుతంతో వహ్వా అనిపించినా, శాంతమై సేదతీర్చినా అది ఒక్క మహాప్రస్థానం కవితలకే సాధ్యం. కవితా వస్తువు (కంటెంట్)లోనూ, దాని రూపం(ఫాం)లోనూ ఇంత అత్యద్భుతమైన బ్యాలెన్స్ సాధించిన పుస్తకం మరోటి కనిపించదు. తెలుగులో సాహితీ సముద్రాన్ని మధించి, అమృతకలశాన్నిఈ పుస్తకం రూపంలో మనకందించాాడా శ్రీశ్రీ అనిపిస్తుంది. ప్రపంచ సాహిత్యాన్ని, రాజకీయాల్ని, ఆర్థిక స్థితిగతులను, మానవ ఆలోచనను, సామాజిక పరిణామాన్ని, ప్రకృతి నియమాల్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటే, ఓ మనిషి... ఇంతటి అద్భుతాల్ని ఆవిష్కరించగలడా; ఎంతో సంక్లిష్టమైన విషయాల్ని ఇంత సరళంగా, రసస్పోరకంగా చెప్పగలడా అనిపిస్తుంది. అన్నింటికీ మించి జనసామాన్యంతో ఎంతగా మమేకమైపోతే తప్ప ఓ కవి, ఇంతగా మనల్ని ఉత్సాహంలో, ఉద్రేకంలో, ఉద్వేగంలో ఓలలూగించగలడు. మహాప్రస్థానం కవితల్లో చూసిన విద్వత్తు, విద్యుత్తు ఇప్పటిదాకా నాకెక్కడా కనిపించలేదు. శ్రీశ్రీని.. మహాకవిగా ఆవిష్కరించిన పుస్తకమిది; శ్రీశ్రీ... ఈ శతాబ్దం నాది అని ఎలుగెత్తి చాటగలిగేంత తెగువను ఇచ్చిన పుస్తకమిది. తెలుగు సాహిత్యానికంతా రాజ్యాంగం లాంటి పుస్తకం ఈ మహాప్రస్థానం. (ఈ చివరి లైన్, మా జర్నలిజం మాష్టారు, సమ్మెట నాగ మల్లేశ్వరరావు గారు అన్నమాట!)
#worldBOOKday
#మహాప్రస్థానం!
No comments:
Post a Comment