Wednesday, 2 December 2020

The Motorcycle Diaries... కొండపోచమ్మ సాగర్!!

మన బ్రెయిన్... ఓ చిత్రమైన పదార్థం! బాగా వాడితే ఎస్వీయార్ పాతాళభైరవిలానో, అరబ్ అల్లావుద్దీన్ లానో అద్భుతంగా పనిచేస్తుంది. వాడకపోతే మాత్రం బద్ధకపు బకాసురుడిలా తిని, కుంభకర్ణునిలా గుర్రుపెట్టి ముసుగుతన్ని మూడంకె వేస్తుంది. ఎంత వాడితే అంత రాటుతేలుతుంది అన్నట్టు!  అందుకే బ్రెయిన్ కి ఎప్పటికప్పుడు కొత్తకొత్త టాస్కులు ఇస్తూ ఉండాలి. ఓ పదేళ్లకు సరిపడా భవిష్యత్ ప్రణాళికలిచ్చేస్తే, అదింక దాని పనిలో అది ప్లాన్స్ వేసి రాక్షసుడిలానో, భూతంలానో పనిచేయడం మొదలెడుతుంది. దానికి టాస్కులివ్వడంలో మనం బద్ధకిస్తే మాత్రం, అది కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, మనం రెగ్యలర్ గా చేసే యాక్టివిటీస్ తాలూకు అరల్ని కూడా మూసేసి, మెల్లగా హైబర్నేషన్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. బ్రెయిన్ మహాశయుణ్ని సరిగా వాడకపోవడం మూలాన్నే, ఇవాళ్రేపు పెద్దగా వయసు మీదపడకుండానే, మతిమరుపు మొదలుకుని అల్జీమర్స్ దాకా ఎన్నో సమస్యలు. అందుకే, ఆఁ, ఏవుంది, వయసు మీద పడుతోందనో,  రిటైరవుతున్నాం కదానో, ఇంకా ఇలాంటివేవో సాకుల్ని వెదుక్కుని, అప్పటిదాకా చేసే పనుల్ని ఆపడమో, ఫ్యూచర్ ప్లాన్లేవీ పెట్టుకోకపోతే మాత్రం... అసలుకు ఎసరుతో పాటే, మొదటికే మోసం కూడా వస్తుంది. ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి, కోటానుకోట్ల సూపర్ కంప్యూటర్ల కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే సత్తా ఉన్న మన బ్రెయిన్ గారిని జీవితంలో చివరి నిమిషం దాకా ఎఫెక్టివ్ గా వాడేసి, మానవాళికి మనవంతుగా ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసి నిష్క్రమించడమే... జీవితానికి ఏకైక అర్థం, పరమార్థం! ఇదేదో సాదాసీదా టైటిల్ తో మొదలై, సైంటిఫిక్ పోస్టుగా పరిణమించి, చివరకు ఫిలసాఫికల్ గా తయారైంది, ప్చ్! 

సరే, ఈ ఇంట్రో ఎందుకంటే, నిన్న కొండపోచమ్మసాగర్ కి బైక్ డ్రైవ్ వేశాం. దానికీ దీనికి ఏంటి లింకు అంటారా? అక్కడికే వస్తున్నా. 40 క్లబ్బులోకి ఫ్రెష్ గా ఎంట్రీ ఇచ్చాం , ఈ ఏజ్ లో Bicycle Diaries అవసరమా అనే ప్రశ్న రావచ్చు. చెప్పాగా, ఏదో ఓ సాకుగా మనం చేసే యాక్టివిటీస్ ని దూరం పెడితే, మన మెదడు మరీ స్మార్ట్ గా, ఆ యాక్టివిటీస్ తాలూకు అరల్ని షట్ డౌన్ చేసి, డస్ట్ బిన్ లోకి విసిరేస్తుందని!! చెప్పుకోవడానికి సింపుల్ బైక్ డ్రైవ్ లానే అనిపించొచ్చు, కానీ.. డ్రైవ్ చేసేప్పుడు ఉండే ఓవరాల్ అలర్ట్ నెస్, దూర ప్రయాణంలో తట్టుకోలిగే ఎండ్యూరెన్స్, జర్నీకి ముందు చేసే ప్రీ ప్లానింగ్ ఇలా ఓ సవాలక్ష అంశాలు ముడిపడి ఉంటాయి, దీనితో. అంటే, మనం ఏ చిన్న యాక్టివిటీ చేసినా, దానితో ముడిపడిన అనే అంశాలను సమన్వయం చేసుకుని మన బ్రెయిన్ శతావధానమో, కుదిరితే సహస్రావధానం చేస్తుందన్నమాట! అంత వండర్ ఫుల్ యాక్టివిటీ మన మెదడుది! అందుకే మనం చేయగలిగిన పనుల్ని మనకు మనమే సాకుల్ని కల్పించుకుని నిలిపేయకపోవడమే బెటర్. సరే, కొండపోచమ్మ తల్లి దగ్గరికొద్దాం. 

అసలేంటీ కొండపోచమ్మ సాగర్ అంటారా? ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఓ రాతికొండను తవ్వి, చుట్టూ పోసి కట్టగట్టి, చెరువును కాస్త సముద్రంలా మారిస్తే... అదే కొండ పోశమ్మ సాగర్! సింపుల్. అప్పుడప్పుడు కొన్నింటిని మనమే డిఫైన్ చేయాలి. తప్పదు. తప్పు కూడా కాదు! పెద్ద దూరమేం కాదు. మొన్నామాధ్యే మన దొర దీన్ని ధూంధాంగా షురూ జేసిండు. సికింద్రాబాద్ నుండి మంచిర్యాాల్ (కరీంనగర్-రామగుండం హైవే కూడా ఇదే) హైవేలో వెళితే 60కిమీ ఉంటుంది. సికింద్రాబద్, కార్ఖానా దాటి, ఆర్మీ ఏరియా మీదుగా శామీర్ పేట్ దాటంగానే గౌరారం దగ్గర రైట్ టర్న్ తీసుకుంటే గమ్యం చేరుకుంటాం. ఇవాళ్రేపు అందరి ఫోన్లలో జీపీఎస్ ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్లిపోవచ్చు. ఈ రిజర్వాయర్ ఎంత పెద్దదంటే, ఓ 50 మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియాలంత విస్తీర్ణంతో, దాదాపు 16కి.మీ చుట్టుకొలతతో నిజంగానే సముద్రాన్ని తలపిస్తుంది. కనుచూపు మేరా నీళ్లే. చుట్టూ ఆ రాతి కట్టడం, ఒక్కో బ్లాకులో ఒక టైప్ ఆఫ్ కలర్ రాళ్లను మాత్రమే పేర్చడం నిజంగా ఫినామినల్ వర్క్. ఒకేసారి ఓ లక్ష మంది వెళ్లినా.. అందరూ చక్కగా వాక్ చేసుకోవచ్చు, స్విమ్ చేసుకోవచ్చు, బైకో, కారో రైడ్ చేసుకోవచ్చు, ట్రెక్కింగ్ చేసుకోవచ్చు, కూచుని వన భోజనాల్లాంటివి చేసుకోవచ్చు, ఫొటోగ్రఫీ సెషన్లు పెట్టుకోవచ్చు... ఇలా సవాలక్ష చేసుకోవచ్చు. ఈ మధ్యే టూరిస్ట్ అట్రాక్షన్ కింద ప్యారా గ్లైడర్, చోపర్  రైడ్స్ కూడా పెట్టారు. ఇంకా ఓపికుంటే, మొత్తం చెరువు చుట్టూ ఓ రౌండ్ వాకింగో, జాగింగో కూడా చేసుకోవచ్చు. కావలసినంత ఎక్స్ ప్లోర్ చేసుకోవచ్చు, బోనస్ గా ఒళ్లు హూనం చేసుకోవచ్చు. నిజానికి అలా అలసిపోతేేనే కదా, ఇంటికొచ్చాక కావలసినంత నిద్ర పట్టేది, మన ట్రిప్ కలకాలం గుర్తుండిపోయేది. అన్నట్టు, కొత్త కదా, కొండపోచమ్మ సాగర్ చుట్టుపక్కల ఇంకా తింటానికేవీ దొరకవు కాబట్టి ఫుడ్ తీసుకెళితే బెటర్. నిన్న గౌరారం ముందే గ్రీన్ అరోమా అనే ఓ మంచి రెస్టారెంట్ ని ఎక్స్ ప్లోర్ చేశాం. వీడి ఈస్థటిక్స్ కి మెచ్చుకోవాలి. ప్రకృతిలో పూలచెట్లు, పక్షుల కిలకిలరావాల మధ్య భలే డిజైన్సుతో కట్టుకున్నాడు. ఫుడ్ (నాన్ వెజ్) సూపర్ చేస్తున్నాడు. అన్నట్టు, ఈ రెస్టారెంటోడికీ, నాకూ ఏ సంబంధమూ లేదు. ఉట్టినే బాగుందని చెప్పా. యూట్యూబ్ వీడియోల్లో చేసే ప్రచారం లాగా ఏదో సిండికేట్ ఉందనుకునేరు. మనమేది చేసినా లోకకళ్యాణార్థమే తప్ప, స్వలాభాన్ని పెద్దగా పట్టించుకోమన్నట్టు, అది మీరు నమ్మక తప్పదన్నట్టు, ఇక ఈ స్వోత్కర్ష ఆపేస్తానన్నట్టు!

జనరల్ గా మనిషనేవాడు హయ్యెస్ట్ ప్రాడక్ట్ ఆఫ్ నేచర్ కాబట్టి, ప్రకృతికి దగ్గరగా జీవించాలి, అది సాధ్యం కానప్పుడు అప్పుడప్పుడైనా ప్రకృతిలోకి వెళ్లి ఎక్స్ ప్లోర్ చేయాలి. అప్పుడే రిక్రియేషన్, రీ-క్రియేషన్ తో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అవుతుంది. ఎక్కడికైనా వెళితే ఏదో హడావుడిగా పరిగెత్తామా, నాలుగు ఫొటోలు తీసుకన్నామా, అమ్మో అమ్మో టైమైపోతోందని, చీకటి పడిపోతోందని, ట్రాఫిక్ పెరిగిపోద్దేమోనని హడావుడిగా వెనక్కి తిరిగొచ్చామా అన్నట్టు కాకుండా; నింపాదిగా జర్నీని, మనం వెళుతున్న డెస్టినేషన్ని, అక్కడి ప్రకృతిని, మనం తీసుకెళ్లిన ఫుడ్డుని, నేచర్ అండ్ సెల్ఫ్ ఫొటోగ్రఫీని ఇలా ప్రతీదాన్ని కూడా ఎంజాయ్ చేయగలిగితేనే బెటర్ అన్నది నా థియరీ! ఏదైనా వెళ్లొస్తే అదొక చిరకాల జ్ఞాపకంగా మన మెదడులో తిష్టవేసుకు కూచోవాలి. మా విజిట్లో కొండపోచమ్మ దగ్గరున్న నీటిని, నేలను, నింగిని ఇలా పంచభూతాల్ని మేం అలానే ఎంజాయ్ చేశాం. ఎవరు వెళ్లని కొన్ని ఏరియాల్ని అన్వేషించాం. చేపల్ని, పక్షుల్ని, పరికరాల్ని, పరిసరాల్ని పలకరించాం. పాములొస్తే పారిపోయాం! 

చేతిలో ఓ లెన్స్ కెమెరా, ఒంట్లో ఓపిక... ఉండాలే గానీ, కొండపోచమ్మ సాగర్ వద్ద సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం దాకా అనేక అద్భుతమైన దృశ్యాల్ని (ప్రకృతికి, మనవి) ఒడిసిపట్టుకోవచ్చు. నిజానికి ఆ కెమెరా ఐ ఉండి, మన సూరీడి లైటింగుని చక్కగా వాడుకుంటే వండర్ ఫుల్ ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. ఇక అంబరాన్ని చుంభించడం, సూర్యుణ్ని గోళీకాయలా పట్టుకోవడం లాంటి టెక్నికల్ ఫీట్స్ లాంటివేమైనా చేసి, వాటిని క్యాప్చర్ చేసుకోవాలంటే మాత్రం... మనతో వచ్చిన ఫ్రెండుకి, కదులుతున్న చేపను గురిచూసిన కొట్టగలిగిన అర్జునుడి కంటే కొంచెం ఎక్కువ షార్ప్ నెస్ అవసరమేమో! ఫొటోలు తీసుకునే ఓపికుంటే స్లోమోషన్, క్లౌడ్ బర్స్ట్, టైమ్ లాప్స్, పనోరమాలు ఎన్నైనా తీసుకోవచ్చు, ఈ కొండపోచమ్మ దగ్గర అంత డెప్త్ ఉంటుంది మరి. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత! వీకెండులో వన్డే ట్రిప్ కి సూపర్ ప్లేస్... ఈ కొండపోచమ్మ సాగర్!! 

(నిజానికి యూనికార్న్ బైక్ కొన్నాక, చాలానే లాంగ్ రైడ్స్ వేశా. చాలా మెమొరీసే ఉన్నాయి. కొన్ని ట్రిప్స్ కార్లో.  అన్నింటినీ మెల్లగా అక్షరబద్ధం చేస్తే పడుంటాయేమో, చూడాలి!) 😄 


















Thursday, 26 November 2020

అమృతం = టీ + కాఫీ; హాలాహలం = గ్రీన్ టీ!

 దేవ, దానవులు కలిసి పాల కడలిని చిలుకుతున్నారు. మొదట హాలాహలం వెలువడింది. దీంతో కోలాహలం బయలుదేరింది. లోకకళ్యాణార్థం ఆ విషాన్ని ‘ఆదిమ కమ్యూనిస్టు’ శివుడు మింగేశాడు. తర్వాత మథనం కొనసాగింది. ఈసారి సురాభాండం ఉద్భవించింది. దాన్ని గంపగుత్తగా దానవులకు ధారాదత్తం చేసేశారు. ఆ కల్లును ఫుల్లుగా తాగి దానవులు మత్తులో మునిగిపోయారు. తిరిగి మథనం మొదలైంది. ఈలోపు ఉద్భవించిన ఉచ్ఛైశ్రవాన్ని బలి చక్రవర్తికి గిఫ్టుగా ఇచ్చేశారు. తర్వాత పుట్టిన కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, అప్సరసలను ఇంద్రుడు తస్కరించేశాడు. దానవులింకా మత్తులోనే మధిస్తున్నారు. తర్వాత పుట్టిన కౌస్తుభమణితో సహా లక్ష్మీదేవిని మహా విష్ణువు చేపడతాడు. అనంతరం వచ్చిన పారిజాత వృక్షాన్ని అక్కడే నాటేసి, చంద్రుణ్ణి పైకి విసిరేశారు. మథనం కొనసాగింది. చివరగా, ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవించాడు. అమృతం కోసం గొడవ మొదలైంది. దీంతో విష్ణుమూర్తి జగన్మోహిని అవతారమెత్తాడు. దేవ, దానవుల్ని రెండు ఫంక్తుల్లో కూచోబెట్టాడు. మొదట దేవతలకు అమృతం పంపిణీ మొదలెట్టాడు. చూడగా, అమృతం దానవుల ఫంక్తిదాకా వచ్చే సూచనలు కనిపించలేదు. ఈ మోసాన్ని ఓ యువ రాక్షసుడు పసిగట్టాడు. అంతే. అమృత కలశాన్ని దొంగలించి పరుగు తీశాడు. వాణ్ని ఇంకో యువ రాక్షసుడు అనుసరించాడు. కొంతదూరం వెళ్లాక అమృతాన్ని ఇద్దరూ చెరి సగం పంచుకున్నారు. దేవతలకు దొరక్కుండా ఒకడు కర్నాటక వైపు; మరొకడు బెంగాల్ వైపు పారిపోయారు. ఒకడు చిక్ మగళూర్ కొండల్లోకి వెళ్లి విశ్రమించాడు. మరొకడు డార్జిలింగ్ లోయల్లోకి వెళ్లి సేదతీరాడు. అలా ఇద్దరు నిద్రిస్తున్న టైంలోనే, గాలికి ఆకులు రాలి, ఇద్దరి అమృత కలశాల్లో రాలిపడ్డాయి. పొద్దున నిద్ర లేచి చూస్తే, చిక్ మగళూర్ రాక్షసుడి చెంబులో ‘కాఫీ’, డార్జిలింగ్ రాక్షసుడి మగ్గులో ‘టీ’ తయారైంది. ఆ విధంగా అమృతం తాలూకు రెండు అంశలుగా టీ, కాఫీలు ఈ భూమ్మీద ఉద్భవించాయి. మొదట్లో, శివుడు విధిలేక మింగిన హాలాహలమే... ‘గ్రీన్ టీ’!!

Saturday, 23 May 2020

లాక్డౌన్ క్రియేటివిటీ!

లాక్డౌన్ క్రియేటివిటీకి కొత్త రెక్కలు తొడిగింది. ఒకప్పుడు మగాళ్లు వంటింటికి భౌతికదూరం పాటించేవారు. కరోనా పుణ్యమాని ఇప్పుడు కిచెన్ తో క్యారమ్స్ ఆడేసుకున్నారు. వేళ్లూ కాళ్లూ చేతులూ ఒళ్లూ అన్నీ కాల్చేసుకుని వంటల్లో నలభీముల్ని మించిపోయారు. ఒకప్పుడు సెలవుల్లో పిల్లకాయలు పందిరేయడానికి ఇల్లు పీకి పాతరేసేవాళ్లు. ఇప్పుడు ఎంచక్కా సెల్లు పీకి ప్లే స్టేషన్లూ, ప్రపంచ యుద్ధాలు చేస్తున్నారు. సాగదీత సీరియళ్లు, అమ్మలక్కల ముచ్చట్లూ గట్రా లేకపోయినా ప్రశాంతంగా ఉండగలిగే స్థితప్రజ్ఞతను ఆడాళ్లు సాధించేశారు. ఐటీ కుర్రాళ్లు వీకెండ్ పార్టీల్లేకుండానే బతికేయడం నేర్చుకున్నారు. ఒకప్పుడు సెలెబ్రిటీలు మేకప్, ప్యాకప్ లతో మాత్రమే సహజీవనం చేసేవారు. ఇప్పుడు సెలెబ్రిటీల్లో కొందరు అంట్లు తోమారు. కొందరు బట్టలుతికారు. కొందరు దోశలేసారు. కొందరేమో సొంతంగా గుండు కూడా గీసుకున్నారు. ఇక, కొందరు లేడీసేమో భర్తల నెత్తి పైభాగాన తమ చేతికందేంత జుట్టు మాత్రం వదిలి, చుట్టూరా డిప్ప కటింగు కొట్టే నేర్పు సాధించారు. సంప్రదాయ మాస్కులు, సరసమైన శానిటైజర్లు, వినూత్నమైన వెంటిలేటర్లు... ఇలా కొత్తరకం కుటీర పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. కొందరు మొబైల్లోనే పూజలు, వ్రతాలు చేయించారు. కొందరైతే ఫోనుకే తాళితో మూడు ముళ్లేసి పెళ్లి కానిచ్చేశారు. ఇలా లాక్డౌన్ క్రియేటివిటీని ఏకరవు పెడితే ఏకంగా ఉద్గ్రంధమవుతుంది. 

నిజానికి, సామాన్యులు ఎంత ఘనకార్యం చేసినా పెద్దగా లెక్కలోకి రాదు. కానీ సెలెబ్రిటీలు చిన్న రిబ్బను ముక్క కట్ చేసినా జనాల్లో అదో ఆసక్తి. అయితే, సెలెబ్రిటీలకు మించిన లెజెండ్స్ కొందరుంటారు. వారేం చేసినా అది ట్రెండ్ సెట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అలాంటి కొందరు లెజెండ్స్ లాక్డౌన్ వేళ ఏం చేశారో వారి మాటల్లోనే చూద్దాం. 

‘ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట... మేడిన్ చైనా! వాళ్లేంటో, వాళ్ల తిండి తీర్థాలేంటో, వాళ్ల విచిత్ర వేషధారణేంటో, అబ్బే, అసలు చైనా అంటేనే ఎలర్జీ నాకు. ఇప్పటికే అర్థమయ్యుండాలి నేనెవరో? యెస్, నేనే...అమెరికా ట్రంప్ కార్డ్, డోనాల్డ్ ట్రంప్! పోయినేడాది నా ఎడంకన్ను అదో మాదిరిగా అదిరినప్పుడే అనిపించింది. చైనా ఇట్టాంటి కొంపముంచే పనేదో చేస్తుందని. నిజానికి ఈ భూమ్మీద కొంపలు ముంచినా, ఆర్పినా అది మేమే చేయాలి. అది అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారానికి ఇటీవల చైనా గండికొడుతోంది. అందుకే మాకు చైనా అంటే అంత కడుపుమంట. ఇప్పుడీ చైనీస్ కరోనా దెబ్బకు మా దేశం కకావికలమైంది. అందుకే ఈ లాక్డౌన్ వేళ నా శ్వాస, ధ్యాస అన్నీ ఒక్క చైనాపైనే కేంద్రీకరించా. కరోనా సృష్టి చైనాపనేనని రుజువు చేయడమే నా ధ్యేయం. ప్రపంచంలో అల్లకల్లోలానికి, ఆర్థిక మాంద్యానికి కారణం చైనాయేనని దుమ్మెత్తిపోస్తా. నా శత్రువును ప్రపంచానికే శత్రువును చేస్తా. ఇదే నా శపథం. నా ఈ లాక్డౌన్ మిషన్ పేరు... ఆపరేషన్- డ్రాగన్ పరేషాన్!’ 

‘మోడీ, ట్రంపు, పుతిన్, మోర్కెల్ ఎవ్వరైతేనేం? వీరి కుర్చీ కాలం అయిదేళ్లే. మహా అయితే పదేళ్లు. కానీ, నా కుర్చీకి కాలం చెల్లడమనే మాటే లేదు. చైనాకు నేనే జీవితకాల చక్రవర్తిని! మోనార్కులకే మోనార్కుని! నియంతలకే మహానియంతను! నేనే జిన్ పింగ్! డ్రాగన్ స్వైరవిహారాన్ని ఎవ్వరూ ఆపలేరు. కరోనా - మేడిన్ చైనా అంటూ ఈ కాకుల గోలేంటో?! వీళ్లకసలు బుద్ధీ జ్ఞానం ఏమైనా ఉందా? పదార్థాన్నెవ్వరూ సృష్టించలేరు, నాశనం చెయ్యలేరు. కరోనా కూడా అంతే. కాకపోతే ఈ లాక్డౌన్లో నేనొకటే ఆలోచించా. ఖర్మకొద్దీ కరోనా వచ్చింది. దాన్ని చైనాకి అనుకూలంగా వాడుకుంటే పోలా? కరోనా కల్లోలాన్ని వాడుకుని అమెరికా ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతా. ప్రపంచమంతా మేడిన్ చైనా మంత్రం జపించేలా చేస్తా. నా లాక్డౌన్ మిషన్ పేరు.. ఎంటర్ ది డ్రాగన్!’ 

‘ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది ఇంకోదారి. ఊరు, ఉలిపికట్టె ఇవేవీ నడవని దారే... ఉత్తరకొరియాది! మాదో చీకటిదేశమని ఊరికే ఆడిపోసుకుంటారు కదా. నిజమే. ఉట్టినే పనీపాడూ లేకుండా వేరే  దేశాలతో రాసుకుపూసుకు తిరిగే రకం కాదు మేం. అందుకే మా దేశంలో కరోనా కేసుల సంఖ్య.. జీరో! కాబట్టే, మాకు క్వారంటైన్లు లేవు, లాక్డౌన్లు అసలే లేవు. ఇక ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్నవేళ, ఉబుసు పోక ఊబకాయాన్ని తగ్గించే ప్రయత్నాలేవో చేశా. నేను నాల్రోజులు కనబడకపోతే అమెరికాకు నిద్రపట్టదు. ఒకటే పుకార్లు. ఏంటో వీళ్ల పిచ్చి ప్రేమ. అన్నట్టు, పనిలో పనిగా కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేశా. ట్రంప్ మామ కోసం ఓ న్యూక్లియర్ మిస్సైల్ కూడా రెడీ చేశా. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనితరసాధ్యం నా కుటుంబ మార్గం.. నేనే కిమ్ జంగ్ ఉన్!’నా లాక్డౌన్ మిషన్ ఎప్పటికీ.. నార్త్ కొరియా నెవ్వర్ డైస్!’

‘అఖండ భారత్, స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా,  స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా... రామనామ జపంలాగా, ఇండియా జపం చేసేదెవరు? ఇంకెవరు? నేనే, నమో అలియాస్ నరేంద్రమోడీ! లాక్డౌన్ చిత్రానికి 1.O నుంచి 4.O దాకా సీక్వెల్స్ తీశా. కరోనా వేళ అందరు సీఎంలతో మన్ కీ బాత్ నిర్వహించా. బిగ్ బాస్ అవతారమెత్తి దేశ ప్రజానీకానికి ఎన్నో టాస్కులిచ్చి ముందుకు నడిపించా. కరోనాపై కదనశంఖానికి యోగాలో ప్రయోగాలెన్నో చేశా. అనాదిగా ఉన్నదే, దేశానికి మరోసారి ఆత్మ నిర్బర మంత్రం నేర్పా. విదేశీయాత్రలు చేయలేకపోయాననే ఒకే ఒక్క బాధ తప్ప, లాక్డౌన్ ని పూర్తిగా ఎంజాయ్ చేశా. నా లాక్డౌన్ మిషన్ పేరు- కరోనా... భారత్ ఛోడోనా?’

‘బొమ్మ పక్కన బొరుసు ఉండాల్సిందే. నిశి చెంత శశి ఉండాల్సిందే. రాహువు జోడీగా కేతువు ఉండాల్సిందే. మోడీ మాటెత్తితే రాహుల్ ప్రస్తావన రావాల్సిందే. ఏంటీ, ఎంట్రీనే తిక్కతిక్కగా ఉందనుకుంటున్నారా? నేనంతే! అముల్ బేబీ అనీ; సొట్ట బుగ్గ సిన్నోడనీ; ఆజన్మ బ్రహ్మచారనీ మీరెన్నైనా జోకులేసుకోండి. నాకవేమీ పట్టవు. నేనెప్పుడో స్థితప్రజ్ఞత సాధించేశా. లాక్డౌన్లో యావత్ప్రపంచాన్ని ఆవాహనం చేసుకుని మరీ దీర్ఘంగా ఆలోచించా. ఆర్థికమాంద్యం భూతంలా కమ్ముకొస్తోంది. ఇప్పుడీ ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను కాంగ్రెస్ చేతుల్లో పెట్టకపోతే మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తర్వాత మీ ఇష్టం. ఓకే. రెణ్నెళ్లుగా ప్రయత్నిస్తున్నా... కరోనా బొమ్మకి కొమ్ములు సరిగా రావట్లేదు. పోయి స్కెచ్ ప్రాక్టీస్ చేసుకుంటా, వస్తా. బై! అన్నట్టు నాకే మిషనూ లేదు, ఉండదు, ఉండబోదు.’  


Friday, 15 May 2020

జీవితానికో లేఖ!!

డియర్ జిందగీ, 

పూర్వం కవులు మేఘసందేశం పంపేవారట. అంత స్థోమత లేని వాళ్లు కాకితో కబురంపేవారట. కాకి నలుపు నచ్చనివారు ఎంచక్కా కపోత సందేశాలు నడిపారేమో. ఇవన్నీ సాదాసీదా వ్యవహారాలు. రాజరిక ప్రాభవం వేరు. రాజు తలచుకుంటే రాయబారులకు కొదువా? పాండవులైతే ఏకంగా శ్రీకృష్ణుడినే దూతగా పంపారు. ఆపై కలం, కాగితం రాకతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఇప్పుడంతా డిజిటల్ పలకరింపుల శకం. ఇలా లేఖో భిన్న కాలమానస్థితిః! 

చరిత్రలో లింకన్ లేఖ ప్రశస్థమైంది. అది బోధనకు దిశానిర్దేశం చేసింది. అంతెందుకు నెహ్రూ, ఇందిరకు రాసిన లేఖలు సైతం పేరెన్నికగన్నవే. అవి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి సోపానాలు వేశాయి. అంతమాత్రమేనా? ప్రపంచయుద్ధ నియంత్రణకై గాంధీజీ, హిట్లరుకు రాసిన ఉత్తరం; అణ్వాయుధాల విషయమై ఐన్ స్టీన్, రూజ్ వెల్ట్ కి రాసిన లెటర్; సైన్స్,  ఫిలాసఫీ రంగాల్లో ఏంగెల్స్, మార్క్సుకి రాసిన లెటర్స్.. ఇవన్నీ కూడా విశ్వవిఖ్యాతమైనవే. అంతెందుకు, మన విశ్వకవి రవీంద్రుడు సైతం ఆ సర్వేశ్వరుడికి అర్జీ పెట్టుకున్న లేఖలే కదా... గీతాంజలి! ఇలా లేఖల తీరుతెన్నులెన్నెన్నో. లేఖలు కేవలం బంధుమిత్రులు, సన్నిహితులు, అధికారులకేనా? చంద్రునికో నూలుపోగులా, జీవితానికో లేఖ రాయకూడదా? ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ! పైగా, జిందగీ న మిలేగీ దొబారా కూడా!! 

కాలం గమ్మత్తైంది. చిత్రమైంది కూడా. ఎన్నో జ్ఞాపకాల్నిమోసుకొస్తుంది. ఇంకెన్నో స్మృతుల్ని చెరిపేస్తుంది. అది సంజీవనిలా అద్భుతాలు చేయగలదు. వామనపాదమై అధఃపాతాళానికి తొక్కేయనూగలదు. పరుసవేదియై పసిడిరెక్కల్ని విప్పార్చగలదు. కాలకూటవిషయమై యమపాశాన్ని విసరనూగలదు. కురుక్షేత్రమై వినాశనం సృష్టించగలదు. గీతాసారమై విశ్వరూపసందర్శనం చేయించనూగలదు. అంతేనా? ఎంత సారూప్యం. ఇంకెంత వైవిధ్యం. ఎన్ని ఆవిష్కరణలు. ఇంకెన్ని అంతర్ధానాలు. ఎంతటి పురోగతి. ఇంకెంతటి తిరోగమనం. ఇవన్నీ కాలం తాలూకు ఇంద్రజాల మహేంద్రజాలాలే. కరవులు, వరదలు,  భూకంపాలు, సునామీలు, మహమ్మారులు, యుద్ధాలు, మారణహోమాలు...  ఇలా ఎన్నెన్నో! ఈ అనంత పరిణామ క్రమానికి తిరుగులేని సాక్షిభూతం.. కాలచక్రమే!

ఈ కాలగమనంలోనే కరోనా పుట్టుకొచ్చింది. వామనావతారంలా అప్రతిహతంగా పెరిగిపోయింది. దావానలమై ఖండాల్ని చుట్టబెట్టింది. భూగోళాన్ని లాక్డౌన్ చేసింది. ప్రపంచాన్ని క్వారంటైన్ చేసింది. మానవాళిని చిగురుటాకులా వణికించింది. భౌతికదూరం, సహజీవనం అనే రెండు కొత్త తారకమంత్రాలకు పురుడుపోసింది. మహా మహిమాన్విత కాలగ్రంథంలో కరోనా తనకంటూ ఓ పేజీని కేటాయించుకుంది. 

జీవితమనేది చీకటి వెలుగుల రంగేళి - అంటాడో సినీ కవి. కరోనా కూడా జీవితానికి రెండు దృక్కోణాల్ని పరిచయం చేసింది. ఒకటి విమర్శ. రెండోది ఆత్మవిమర్శ. విమర్శలు కోకొల్లలు. కరోనా సృష్టి చైనా పనేనని అమెరికా దుమ్మెత్తిపోసింది. కరోనాను కట్టడి విషయమై ట్రంప్, ప్రపంచ ఆరోగ్యసంస్థను చెడామడా చెడుగుడు ఆడేసుకున్నాడు. కోవిడ్ కల్లోలంపై తాను జనవరిలోనే హెచ్చరిక చేసినా మోడీ పెడచెవిన పెట్టాడని రాహుల్ శాపనార్థాలు పెట్టాడు. కరోనా ఉధృతి తగ్గకముందే మద్యానికి పచ్చజెండా ఊపడమేంటని ప్రతిపక్షాలు కన్నెర్ర చేశాయి. నిజానికి విమర్శ కంటే ఆత్మవిమర్శ శ్రేష్ఠమైంది. ఎందుకంటే, విమర్శ పలాయనవాదాన్ని నేర్పిస్తుంది. ఆత్మవిమర్శ గుణపాఠాన్ని స్వీకరిస్తుంది. ఈ లేఖకు ఆధారం.. ఆత్మపరిశీలనే. 

కరోనా నేర్పిన భౌతిక దూరానికి నవ్య భాష్యం చెప్పి కొత్తపుంతలు తొక్కించాలి. మద్యపానంతో అంటరానితనం పాటించాలి. ధూమపానానికో దణ్ణం పెట్టాలి. గుట్కా వ్యసనానికి గుడ్ బై చెప్పాలి. జంక్ ఫుడ్  జోలికి పోరాదు. కాఫీ, టీల ప్రవాహానికి చెక్ పెట్టాలి. ఫోన్ అతివాాడకానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సోషల్  మీడియాతో సోషల్ డిస్టెన్స్ పాటించాలి. దుబారా ఖర్చులకు కళ్లెం వేయాలి. ఆడంబరాలను ఆమడదూరం పెట్టాలి. ఎడాపెడా ఉమ్మే నోటికి మాస్కు వేయాలి. చీటికీ మాటికీ ఆస్పత్రుల చుట్టు పరిభ్రమించే అలవాటుకు చెల్లుచీటి పాడాలి.  కాలుష్య కారకాలను వెదజల్లే వాహనాల్ని లాక్డౌన్ చేయాలి. నెగెటివ్ థింకింగుకో నమస్కారం పెట్టాలి. బద్ధకాన్ని క్వారంటైన్లో బందీ చేయాలి. అతినిద్రను ఐసోలేషన్లో పెట్టాలి. ఇలా సరికొత్త జీవనశైలితో భౌతిక, భౌద్ధిక ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలి. 

కరోనా కనువిప్పుతో సహజీవనానికి సరికొత్త సూక్తి ముక్తావళి రచించుకోవాలి. ఫ్యామిలీ టైంని పెంచాలి. బంధాల్ని బలోపేతం చేయాలి. స్నేహ మాధుర్యానికి పెద్దపీట వేయాలి. అభిరుచులకు కొత్త రెక్కలు తొడగాలి. పుస్తకాలతో దోస్తీ చేయాలి. కళాపోషణ, క్రీడారాధనల్ని ద్విగుణం బహుళం చేయాలి. ఐకమత్యమే మహాబలమని చాటాలి. తోటి జీవరాశిపై సఖ్యత చూపాలి. నేల, నింగి, నీరు, నిప్పు, గాలిని చైతన్యంతో వాడుకోవాలి. ప్రకృతిలో లీనమై పరవశించాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలి. సామాజిక ఎరుక కలిగి మెలగాలి. 

ఈ కొంగొత్త భౌతిక దూరం, సహజీనవ తారకమంత్రాలే జీవితానికి శ్రీరామరక్షగా నిలుస్తాయని కాంక్షిస్తూ...

ఇట్లు
మనిషి!!

Monday, 11 May 2020

కరోనా తత్వం!!

‘స్వామిజీ, ఒకప్పుడు ఒక ఐడియా జీవితాన్ని మార్చేది. అదేం చిత్రమో, ఒక్క వైరస్ నా జీవితాన్ని తలకిందులు చేసింది. భవబంధాల్ని తెంచేసుకుని, ఆశ్రమ జీవితంలోకి అరంగేట్రం చేయించింది. ఐతే, నాదో ధర్మ సందేహం. కరోనా వస్తే క్వారంటైను, లాక్డౌనులేవో వచ్చాయి. మరి, తపస్సు చేస్తే ఏమొస్తుందంటారు?’

‘ఏముందోయ్. ఎడాపెడా చేస్తే నిద్ర. ఏకాగ్రతతో చేస్తే జ్ఞానం. నిద్ర స్థితి తుచ్ఛమైంది. జ్ఞాన సిద్ధి ఉత్కృష్టమైంది. స్థూలంగా, తపఃఫలాలు ఈ రెండే, నాయనా.’

‘లాక్డౌన్ కాలంలో నిద్ర మత్తు నిత్యం అనుభవైకవేద్యమే. ఐనా, సగం జీవితాన్ని నిద్రకే అర్పించా. ఈ క్వారంటైన్ బద్ధక జీవితపు విముక్తి కోసమే మిమ్మల్ని ఆశ్రయించా. కానీ, స్వామీజీ, ధ్యానంలో జ్ఞానోదయమైందని తెలిసేదెలా? న్యూాటన్ మహాశయునిలాగా, ఏ యాపిల్ పండో నెత్తిన పడితేనేగానీ జ్ఞానబల్బు వెలిగిందనే విషయం తెలీదంటారా? లేక,  ముఖంలో తేజస్సు, శిరస్సు వెనక కాంతిపుంజంలాంటివేమైనా దర్శనమిస్తాయంటారా?’

‘హహ్హా! తలపై యాపిల్ పడ్డప్పుడో; తొట్టెలో నీళ్లు ఒలికినప్పుడో మెరుపులా తట్టేవి ఐడియాలోయ్. జ్ఞానజ్యోతి కథ వేరులే. ఈ సమస్త విశ్వం తాలూకు సమగ్ర తత్వం బోధపడితేనే జ్ఞానోదయం. ఆ తత్వం అంతుచిక్కనంతవరకు బతుకంతా అజ్ఞానాంధకార బంధురమే.’

‘అజ్ఞానంతో నాది దశాబ్దాల బంధంలే, స్వామీజీ. ఇక కరోనా రాకతో జీవితంలో నిర్వేదం అలముకుంది. అందుకే, బుద్ధిని కప్పేసిన తమస్సును తొలగించే  తత్వాన్ని ఒడిసిపట్టే మార్గం చూపి పుణ్యం కట్టుకోండి.’

‘అసతోమా సద్గమయా! అంటే, సత్యమార్గాన్ని చూపే తత్వశాస్త్రాన్ని ఔపోశన పట్టాలి. చీకట్లో నడిచే మనిషికి తత్వశాస్త్రమనేది టార్చిలైటుగా దారి చూపుతుంది, నాయనా.’

‘కానీ గురూజీ, ఫిలాసఫీ అనేది బూజు పట్టిన కాలజ్ఞానమనీ; ఫిలాసఫర్ అనే మాటొక వెటకారపు తిట్టు అనుకునే రోజులివి. అసలీ తత్వశాస్త్రానికి సరైన భాషణమేంటంటారు?’

‘గొప్ప సందేహాన్నే సంధించావోయ్! ప్రకృతి అనంతమైంది, పైగా విశిష్టమైంది. అన్నట్టు, ప్రకృతి నిండా పదార్థమే. ఆ పాదార్థిక భౌతిక ధర్మాలను శోధించేదే ఫిజిక్స్. రసాయనిక నియమాలను నిగ్గుతేల్చేదే కెమిస్ట్రీ. జీవ ధర్మాలను అధ్యయనం చేసేదే బయాలజీ. ఇలా పదార్థం తాలూకు అనేక నిగూఢ రహస్యాలను శోధించే శాస్రాలెన్నో. ఆ శాస్త్రాలు  వెల్లడించే సత్యాలెన్నో. ఐతే, అవన్నీ కూడా ప్రకృతి తాలూకు నిర్దిష్ట సత్యాలు మాత్రమే. ఆ నిర్దిష్ట సత్యాలను వెల్లడించే శాస్త్రాలన్నింటినీ దండగా గుదిగుచ్చి పరిపూర్ణ సత్యాన్ని బోధించి, జీవితానికి మార్గదర్శకం చేసేదే తత్వశాస్త్రమోయ్. నిర్దిష్ట సత్యాన్ని శోధించి, సాధించేవాడు శాస్త్రవేత్త. పరిపూర్ణ సత్యాన్ని ఆవిష్కరించేవాడు తత్వవేత్త.’

‘ఆహా..! మన జీవిత కురుక్షేత్ర సంగ్రామంలో తత్వశాస్త్రమొక బ్రహ్మాస్త్రమంటారైతే. సరే, ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడే విధివిధానాలేంంటో సెలవీయండి, స్వామీ.’

‘ఈ సృష్టిలో శాశ్వతమైంది ఏదీ లేదోయ్. ప్రతిదీ చలనంలో ఉంటుందన్నట్టు. ఇక, మంచీచెడూ, కష్టసుఖాలు, పగలూరేయీ, బొమ్మాబొరుసూ, ఆటుపోటు, చావుపుట్టుకలు.. ఇలా ప్రతీదీ ద్వంద్వాత్మకమే. మార్పు, ద్వంద్వం.. ఈ రెండే ఫిలాసఫీ తాలూకు మౌలిక ధర్మాలు. ఈ ధర్మసూక్ష్మం పట్టుబడితే చాలు, ఫిలాసఫీ దన్నుతో ప్రకృతిలో దేన్నైనా తూర్పారబట్టి, అసలు సారాన్ని అట్టే గ్రహించవచ్చునోయ్.’

‘ఔరా, నిజమా?! ఐతే, కరోనా మహమ్మారికి సైతం ఫిలసాఫికల్ భాష్యం చెప్పవచ్చునా, గురూజీ?’

‘ఓహ్, భేషుగ్గా. ఒకప్పుడు ప్లేగు. ఆపై మశూచి. అటు పిమ్మట కలరా. నేడు కరోనా. ఇదీ మహమ్మారీ క్రిముల మార్పు తాలూకు పరిణామక్రమ చిత్రపటం. ఏదీ శాశ్వతం కాదు, మార్పు తప్పదని రూఢీ చేసే ఘటనలివి. ఇక కరోనా దేశాదేశానికీ కొత్త రూపురేఖలతో ప్రత్యక్షమవుతోంది. నిత్య పరివర్తనమే కరోనా తత్వం. బ్రహ్మాండానికే కాదు, అణువుకూ మహత్తరశక్తి కలదని ఆటంబాంబు చూపింది. రాక్షసబల్లులకే కాదు, వైరస్సకూ అంతే అఖండ శక్తి కలదని కరోనాతో రుజువైంది. ప్రకృతిలోని అంతర్లీన ద్వంద్వ స్వభావమిది. కరోనా రాకతో... మానవాళికి క్వారంటైన్ వాసం దక్కింది. ప్రకృతికి స్వేచ్ఛ లభించింది. మనుషుల్లో అహంకారం తగ్గింది. అప్రమత్తత పెరిగింది. జీవితంలో విశృంఖలత్వం-విలాసాలే కాదు, ఒద్దిక-విలాపాలు కూడా ఉంటాయనే నిష్టురసత్యం ప్రపంచానికి ఎరుకలోకి వచ్చింది. కరోనాకు పేదా పెద్దా తేడాలుండవనీ; మహమ్మారి దేశాల ఎల్లలు చూడదనీ తెలిసొచ్చింది. ప్రకతిలో సమస్థితి వచ్చింది. మనిషికి స్థితప్రజ్ఞత అలవడింది.’

‘ఆహా... సూక్ష్మంలో మోక్షం దర్శనం చేయించారు, స్వామీజీ. చివరాఖరుగా, ఈ కరోనాతో మానవాళి గమ్యం గమనం ఏ సుదూర తీరాలకు దారితీయనుందో భవిష్యద్ధర్శనం చేసి, కాస్త తత్వబోధ చేయండి.’

‘ఏముందోయ్. మార్పు తథ్యం. మార్పే సత్యం. ఒకనాటి ప్లేగు, మశూచి, పోలియోలు ఈనాడు లేవు. కరోనాకైనా అదే సూత్రం. కాకపోతే, కొంతకాలం సహజీనవ సూత్రం తప్పదేమో. శక్తియుక్తుల కన్నా, పరిస్థితులకు తగ్గట్టు ఒదిగిపోయే గుణమే ఏ ప్రాణికైనా శ్రీరామరక్ష అంటాడు డార్విన్ మహాశయుడు. ఈ విషయంలో మనిషి ఓ మెట్టు పైనే ఉంటాడాయే. ఎక్కడ తగ్గాలో, ఎలా నెగ్గాలో రెండూ తెలిసినవాడే మనిషి. కాబట్టి, ఇప్పటికిప్పుడు మానవాళికొచ్చిన ముప్పేమీ లేదోయ్.’

‘హమ్మయ్యా! ధన్యోస్మి గురూజీ!!’

Thursday, 7 May 2020

గీత బోధ!

‘నమస్తే, డాక్టర్!’

‘నమస్తే. చెప్పండి.’

‘ఏం చెప్పమంటారు డాక్టర్. ఒకప్పుడు కృష్ణశాస్త్రి బాధను ప్రపంచం పట్టించుకునేది. అవసరమైతే ప్రపంచం బాధను శ్రీశ్రీ అక్కున చేర్చుకునేవాడు. ప్చ్! కథ మొత్తం అడ్డం తిరిగింది సార్. ఇప్పుడంతా ఒకే కథ. కరోనా వ్యథ. క్వారంటైన్ గాథ. లాక్ డౌన్ బాధ. ఈ కకావికలం... నెవ్వర్బిఫోరూ, ఎవ్వరాఫ్టరండీ.’

‘నీక్కొంచెం తిక్క, ఆ తిక్కకో లెక్క, ఆ లెక్కకో టైమింగు, ఆ టైమింగుకో రైమింగు... ఇలా చాలానే ఉన్నట్టున్నాయ్. ఇండస్ట్రీలో జెండా పాతకపోయావా?’

‘ఊరుకోండి మహానుభావా! నా క్వారంటైన్ ప్రసవ వేదనకే దిక్కు లేదు. ఇక సినీ కళాపోషణ మాట దేవుడెరుగు. జీవితం మరీ బిగ్ బాస్ హౌసులా తయారైంది. పూటకో కష్టం. రోజుకో గండం. ఇవన్నీ రాస్తే రామకోటిని దాటిపోతుంది. తీస్తే కార్తీకదీపం సీరియల్ని మించిపోతుంది. తట్టుకోలేకపోతున్నా సార్.’

‘సర్లేవోయ్. పాండవులకే తప్పలేదు అరణ్య అజ్ఞాతవాసాలు. రాముడంతటి వాడు సైతం వనవాసం తప్పించుకోగలిగాడా? బుద్ధుడైనా బోధిచెట్టు చెంత చిరదీక్షా తపస్సమీక్షణలో బందీ కాలేదా? వాటితో పోలిస్తే నీ క్వారంటైన్ గోడు అసలు ఓ లెక్కలోదేనా? ఊరికే నస కాకపోతే!’

‘ఏంటి సార్ ఈ వివక్ష? సీతమ్మ తల్లిని కాసేపలా పక్కన పెట్టండి. పీత కష్టాలు మాత్రం కష్టాలు కావా? నా కడగండ్లనలా ఆటలో అరటిపండులా, కూరలో కరివేపాకులా తీసిపారేస్తారా?’

‘సరేనయ్యా. చరిత్రలో ఇదేం కొత్త కాదని మాటవరసకి రెండు ఉదంతాలు చెప్పాలే. పోనివ్వు. తమరి బాదరబందీలేవో ఏకరవు పెట్టండిక.’

‘అదో చాంతాడంత చిట్టా సార్. ఇంటిపట్టునుండి ఉట్టినే తినితినీ, పొట్ట చుట్టుకొలత రెట్టింపైంది. ఫోన్లో వైరస్ వార్తలు చూసీచూసీ దగ్గరిచూపు దగ్ధమైంది. బయటి ప్రపంచంతో సంబంధాలు దూరమై దూరపుచూపు దుమ్ము కొట్టుకుపోయింది. సబ్బులేసి రుద్దీ రుద్దీ చేతులు కొలిమిలోంచి తీసిన చింతనిప్పులయ్యాయి. జుట్టు కీకారణ్యమవడంతో ఓ పక్క శిరోభారం, మరోపక్క వినికిడికి అవాంతరం. ముక్కును మాస్కుతో కప్పీ కప్పీ ఏ వాసనా తెలీట్లేదు. పొద్దస్తమానం పద్మాసనమేసి వెన్నులో పోటొచ్చింది. నడక దూరమై కాళ్లల్లో పట్టు తగ్గింది. శ్రమ కరవై ఒళ్లు గుల్లయ్యింది. అంతేనా, కొలెస్ట్రాల్ మేటలేస్తోంది. షుగర్ ఫ్యాక్టరీ మొదలైంది. రక్తపోటు రెండో నెంబరు హెచ్చరిక జారీ చేసింది. హార్టు బీటు కాస్త అపశృతి చేస్తోంది.  థైరాయిడ్ తకధిమి తోం నాట్యం చేస్తోంది. విటమిన్లు పాతాళానికి పడిపోయాయి. మొత్తంగా శరీరం లాక్ డౌనై, ఆరోగ్యం క్వారంటైన్ అయిపోయింది మహాప్రభో!! ’

‘వార్నీ బండబడా! చంపేశావుగా. క్వారంటైన్ మైండ్ ఈజ్ కాళకేయాస్ వర్క్ షాప్ అనే కొత్త సామెతను పుట్టించావు. ఇదంతా గూగుల్ తెచ్చిపెట్టిన తలనొప్పిలే. ఇప్పుడు అందరూ పట్టా లేని డాక్టర్లే. సమాచార సునామీలో చిక్కి సొంత శల్యపరీక్షలకు ఒడిగడుతున్నారు. మిథ్యను సత్యమనుకుంటారు. లేని జబ్బును ఉందనుకుంటారు. అణువంత సమస్యను భూతద్దంలో చూసి బ్రహ్మాండం చేసుకుంటారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అనే నానుడి అతికినట్టు సరిపోతుంది.’

‘ఓ మై గాడ్! టక్కున అంత మాటనేశారేంటి సార్. అసలివి సమస్యలే కావంటారా?’

‘పూర్తిగా కొట్టిపారేసే సమస్యలు కావనుకో. కానీ, అంతలా పట్టించుకోవాల్సినంత ఆరోగ్య విపత్తులైతే కావని నా గట్టి నమ్మకం.’

‘అలా కాదు, డాక్టర్. శరీరమనే కాదు. మనసు కూడా తీవ్రంగా గాయపడింది.  తనివితీరా తుమ్మలేం. ధైర్యంగా దగ్గలేం. అయినవాళ్లతోనూ ఆప్యాయంగా మాట్లాడలేం. మాస్కులేని మనిషిని నమ్మలేం. సాటి మనిషితో సరదాగా గడపలేం. టీవీ చూస్తే భయం. పేపర్ చదివితే ఆందోళన. వైరస్ లెక్కలు చూస్తే డిప్రెషన్. ఓవైపు ఓసిడీ. మరోవైపు వెంటాడే కోవిడ్ విభ్రాంతి. కన్ను తెరిస్తే కరోనా. కన్ను మూస్తే కరోనా. బతుకంతా కలగాపులగపు కరోనా అన్నట్టుంది. ఇప్పుడు చెప్పండి సార్. మానసిక బాధలకు శల్యసారధ్యం వహిస్తున్నానని వీటిని కూడా కొట్టిపారేస్తారా? ’

‘పరిస్థితి కాస్త శృతి మించిందయ్యా. నిజానికిది కరోనా తెచ్చిపెట్టిన క్వారంటైన్ సహిత లాక్ డౌన్ తాలూకు సోషల్ డిస్టెన్స్ వల్ల వచ్చిన సిండ్రొమ్. దీనిపేరు ‘కొవిడ్ ఇండ్యూస్డ్ డెల్యూజనరీ హైపోకాండ్రియాక్ సిండ్రొమ్!’

‘వామ్మో..! అంత పెద్ద జబ్బా? మరి ఇది తగ్గేదెలా, డాక్టర్? ’

‘ప్రస్తుతానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే గీత బోధ. ’

‘అదేంటి డాక్టర్. మనిషి పోయాక కదా, గీత సారం వినిపిస్తారు. జబ్బులకు కూడా గీత బోధ పనిచేస్తుందా?’ 

‘నో నో! నేను చెబుతున్న గీత, సంక్లిష్టమైన భగవద్గీత కాదు. సరళమైన, సూక్ష్మమైన గీత సూత్రం. తరతరాలుగా ఉన్నదే. అదే పెద్దగీత-చిన్నగీత థియరీ. కరోనా అనేది అతి పెద్ద గీత. నీవు ఏకరవు పెట్టిన గోడంతా కలిపి చాలా చిన్న గీత అన్నట్టు. కాబట్టి, అతి చిన్న గీతను మరిచిపో. కావలిస్తే ఆ గీతనే బుర్రలోంచి తుడిచెయ్. కర్కశ కరోనా బారిన పడనందుకు సంతోషించు. ఇక నోటికి మాస్కేసి క్వారంటైన్ చెెయ్. పిచ్చి ఆలోచనలకు తాళమేసి లాక్ డౌన్ చెయ్. నాకు ఫీజు కట్టి బయటకు దయ చెయ్.’ 

‘హ్మ్!’ 

Monday, 4 May 2020

అంజలీ మీనన్ దృశ్యకావ్యం... KOODE !!

నింగి కాన్వాస్ పై
హరివిల్లు రంగవల్లి వేస్తే;

నిశి కాగితంపై
మిణుగుర్లు సంతకం చేస్తే

నిశ్శబ్ద వీణపై
మాట సమ్మోహనరాగం మీటితే

నిర్వేద ఛాయల్ని
సంతోషాల సంజీవనేదో మాయం చేస్తే..

అది అంజలీ మీనన్ తీసిన దృశ్యకావ్యం ‘Koode’ (Together) సినిమా అవుతుంది!!

నిన్న రాత్రి నేను... ఫ్రెండ్ మురళీ ఇంట్లో ఉన్నా. ఇంకో ఫ్రెండ్ క్రాంతి కూడా అక్కడే ఉన్నాడు.  డిన్నర్ కి కూచునే ముందు ఏదైనా మంచి ఫీల్ గుడ్ మూవీ చూద్దామనిపించింది. అదే విషయం మురళీకి చెప్పా. మురళీ కాసేపు సెర్చ్ చేసి అంజలీ మీనన్ తీసిన ‘koode’ అనే మూవీ పెట్టాడు. హాట్ స్టార్ లో ఉందిది. తారాగణం పృథ్విరాజ్, నజ్రియా, పార్వతి వగైరా.

కథగా చెప్పుకుంటే.. సింపుల్ లైనే. అన్నాచెల్లెళ్ల మధ్య అల్లుకున్న భావోద్వేగాల ప్రయాణం. ఇంకాస్త సంక్షిప్తంగా విశదీకరించే ప్రయత్నం చేస్తా. అమ్మానాన్నా ఓ అబ్బాయి కలిగిన ఓ చిన్ని కుటుంబం. ఆ ఫ్యామిలీలోకి ఓ పాప నాలుగో వ్యక్తిగా ప్రవేశిస్తుంది. ఐతే, ప్రాణాంతక జబ్బుతో పుట్టిన ఆ పాప ఎక్కువకాలం బతకదని తెలుస్తుంది. నాన్నేమో మెకానిక్. తనకొచ్చే సంపాదన ఆ పాప మెడిసిన్స్ కి కూడా సరిపోని పరిస్థితి. ఈ సిచుయేషన్లో  చెల్లిని సాధ్యమైనంత ఎక్కువకాలం బతికించుకోవాలనే తపనతో అన్నయ్య (హీరో) చిన్నతనంలోనే గల్ఫ్ కెళతాడు. అలా ఏళ్లపాటు గల్ఫ్ లో పనిచేస్తున్న అన్నయ్యకు చెల్లి మరణవార్త తెలుస్తుంది. ఇండియా తిరిగొచ్చాక చెల్లి జ్ఞాపకాలతో, తనకు మాత్రమే కనిపించే చెల్లితో అన్నయ్య సాగించే ఎమోషనల్ జర్నీనే...  ఈ మూవీ.

ఈ మూవీలో బ్యూటీ ఏంటంటే... ప్రతీ పాత్ర కూడా...  ఇంకో పాత్ర తాలూకు హ్యాపీనెస్ కోసం పాటుపడడం. చెల్లి ఆరోగ్యం కోసం అన్నయ్య చదువు మానేసి గల్ఫ్ కెళతాడు. అన్నయ్య జీవితంలోంచి వేదనను తొలగించి సంతోషాన్ని నింపాలనే తాపత్రయం చెల్లిది. ప్రేమించిన వ్యక్తి జీవితంలో ఆనందం పంచాలని తాపత్రయపడే పాత్ర ఇంకోటి. కష్టాల్లో ఉన్న గురువును ఆదుకోవాలని ప్రయత్నించే పాత్ర మరొకటి. చిన్ననాటి కొడుకు కలకు ఓ అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చే నాన్న. ఉట్టి కాళ్లతో ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లలకు కొత్త షూ తొడిగే హీరో. ఇలా ప్రతీ పాత్రలోను ఎంత కొంత త్యాగం చేసి, పక్క వ్యక్తి హ్యాపీగా ఉండాలని కోరుకునే ఇంపర్సనల్ నేచర్ కనిపిస్తుంది. నిజానికి సినిమా ఆరంభంలోనే స్కూల్లో... ప్రార్థన గీతం కింద విశ్వకవి రవీంద్రుడి where the mind is without fear అనే పోయెంతో మొదలవుతుంది. డైరెక్టర్ తాలూకు అభిరుచి, బ్రాడ్ నెస్ కు ఆ సీన్ ఓ ప్రతీక. ఇక ప్రతీ సన్నివేశాన్ని ఓ దృశ్యకావ్యంగా మలచడంలో డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ తీసుకున్న శ్రమ, శ్రద్ధ వెలకట్టలేనివి. అలాగే ప్రతీ సన్నివేశాన్నీ ఎమోషనల్ గా ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ పాత్ర కూడా చెప్పుకోతగ్గదే.

ఈ మూవీలో చిన్నతనంలోనే కుటుంబానికి, అనుబంధాలకు దూరమై ఎక్కడో సుదూర దేశంలో ఏళ్ల తరబడి పెట్రోల్ బావుల్లో పనిచేసి ముభావిగా, ఏ ఫీలింగూ పైకి కనిపించని అంతుబట్టని వ్యక్తిగా పృథ్విరాజ్ చక్కగా నటించాడు. ఇక, తన ఆరోగ్యం కోసం ఎక్కడో శ్రమిస్తున్న ప్రత్యక్షంగా కనిపించని అన్న కోసం జ్ఞాపకాలను క్రియేట్ చేసి, భద్రపరచి, ఆ తర్వాత అన్నయ్య తిరిగొచ్చాక ఆయన ఆనందం కోసం, భవిష్యత్తుకోసం పరితపించే చెల్లిగా నజ్రియా నటనే ఈ మూవీకి ఆయువుపట్టు. ఇక, మ్యారిటల్ రిలేషన్ తెగదెంపులు చేసుకుని, అనేక అవమానాలను భరిస్తూ ప్రవాహానికి ఎదురీతే పాత్రలో పార్వతి నటన సింప్లీ సూపర్బ్. సినిమా ఆద్యంతం అద్భుతమైన భావోద్వేగాలను పండిస్తూ చివరకు పాజిటివ్ నోట్ తో మూవీని ముగించడం అభినందనీయం. చార్లీచాప్లిన్ మూవీస్ లో సినిమా ఆద్యంతం ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొన్నా చివరకి ఓ పాజిటివ్ నోట్ తో మూవీ ముగుస్తుంది. జీవితం పట్ల ఆ డైరెక్టర్ తాలూకు ఆశావహ దృక్పథాన్ని అది సూచిస్తుంది.  బాక్సాఫీస్ హిట్, ఫ్లాపులనే ఫార్ములాకు అతీతంగా కొందరు సినిమాల్ని చిత్రీకరిస్తారు. అంజలీ మీనన్ ఆ కోవలోకే వస్తారు. చూసినంత సేపు ఓ అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లి, చూశాక చాలాకాలం పాటు మనల్ని వెంటాడే మూవీ.. ఈ koode !


కష్టజీవి క్వారంటైన్ వాసం!!

‘హాయ్, నా పేరు కరోనా! ’

‘నా పేరు కష్టజీవిలే! మా బాధల్ని వంద రెట్లు పెంచి, మా బతుకుల్ని భయాల బందీకానాలో బిగించిన దుష్టజీవివి నీవేనా? ’

‘ఊ. ఎలా ఉన్నారు?’

‘ఏవుంది?! రాళ్లూరప్పలున్నాయి. కొండలు గుట్టలున్నాయి. గొడ్డూ గోదా ఉంది. మేమూ ఉన్నాం. అంతే. పెద్ద తేడాయేం లేదు. మొన్నటిదాకా కనీసం నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేవి. నీవొచ్చాక ఆ పిడికెడు మెతుకులకీ కటకటే. దొరికితే అన్నంతోనో, అంబలితోనో సరిపెట్టుకుంటాం. దొరక్కపోతే పస్తులే. ఇంతకీ, నీవింకెంతకాలం ఉంటావిక్కడ?’

‘ఏమో! వాన రాకడ, వైరస్ పోకడ అగమ్యగోచరట కదా. నా పుట్టుక, మనుగడ, చావు.. ఇవేవీ నా చేతుల్లో లేవు. మీ క్వారంటైను, లాక్ డౌన్లే నా పాలిట రాహుకేతువులట కదా.’

‘ఖర్మ! పల్లెల్లో పొలం పనుల్లేవు. పట్నంలో కూలీనాలీ లేదు. కాలు గడప దాటే పరిస్థితి లేదు. ధరలేమో కొండెక్కాయి. దాచుకున్న కాస్త రొక్కం నెల తిరక్కుండానే ఆవిరైపోయింది. తల తాకట్టు పెడదామన్నా అప్పు పుట్టే దారి లేదు. ఏం కలికాలం వచ్చెరా భగవంతుడా! నీ రాక మా సావుకొచ్చింది.’

‘నా విలనిజం, అప్రదిష్ట గురించి కొత్తగా చెప్పేదేముందిలే గానీ, ఐనా, ఇలాంటి సంకటవేళ, మీ కష్టసుఖాల్ని పట్టించుకొనే నాథుడే లేడా?’

‘హ్మ్. అదో అంతులేని కథలే. తెల్లోళ్ల పాలన పోయి డెబ్భై ఏళ్లు  దాటిపాయే. మా బతుకు సిత్రం మాత్రం బండారయి చందమాయే. ఎన్ని ప్రభుత్వాలు మారిపోయే. పార్టీలు పుట్టగొడుగులాయే. కప్పదాటు రాజకీయాల కాలమాయే. ఊసరవెల్లి నేతలకు కొదవేలేదాయే. కొందరి నినాదమేమో గరీబీ హఠావో! కొందరిదేమో రోటీ, కప్డా ఔర్ మకాన్. ఇంకొందరిదేమో సబ్ కా వికాస్! ఇత్యాది హామీలకు లెక్కేలేదు. చేసిన వాగ్దానాలకు దిక్కు లేదు. కపటత్వానికి కొదవే లేదు. దరిద్ర రేఖేమో ఎవరెస్టులా పెరిగిపాయే. మా బతుకులేమో ఇట్టా పాతాళానికి పడిపాయె.’

‘అయ్యోరామా! ఎంత దారుణం? సేద్యం చేసేది మీరు. కాల్వలు తవ్వేది మీరు. డ్యాములు కట్టేది మీరే. భవంతుల్ని లేపేది మీరే. రహదారుల్ని వేసేది మీరే. రైల్వేల్ని నిర్మించేది మీరే. కార్మాగారాల్ని నడిపేదీ మీరే. మొత్తం నాగరికతా రథాచక్రాల ఇరుసులూ మీరే. దాన్ని లాగే కాడెద్దులూ మీరే. ఈ వ్యవస్థ ఆయువుపట్టే మీరు. మీరు లేనిదే, ఈ సమాజానికి దిక్కూ మొక్కంటూ ఉంటుందా అసలు? అలాంటి మీ జీవితాల్లో ఇన్నేళ్లైనా ఎదుగూబొదుగూ లేకపోవడం దారుణాతిదారుణం?’

‘ఏం చెప్పమంటావులే! మాది గొంతు దాటని గోడు. కంచికి చేరని కట్టుకథ. నాదీ, మా తాతముత్తాతలదీ, వాళ్ల తాతముత్తాతలదీ అందరిదీ.. అదే కథ. ఒకే వ్యథ. తరాలు మారినా మా వెతల తీరు మాత్రం మారలేదు. మహాభారత కాలంలో బానిసలై పశువులు మేపాం. రామాయణ కాలంలో బోయీలమై మేనాలు మోశాం. గుప్తులు, మొఘళ్ల కాలంలో సైన్యమై యుద్ధం చేశాం. ప్రజాస్వామ్యపు ఫ్యాక్టరీ గొట్టాల్లో పొగ చూరిపోతున్నాం. ఇకపై కూడా ఏదో ఓ శ్రమ తప్పక చేస్తాం. కాయకష్టం తీరు మారొచ్చేమో. అంతే. మా బతుకు దుస్థితి సిత్రంలో ఏ మార్పూ ఉండదనుకుంటా. మేము చరిత్రహీనులమేమో!’

‘ఎంతటి చోద్యం?! అసలు మీ చరిత్రను ఏ వాల్మీకో, వ్యాసుడో గ్రంథస్థం చేయలేదా? మీ గాథలకు ఏ బెంగాలీ రాయ్ బహదూర్ సాహెబో, పాశ్చాత్య చాప్లిన్ మహాశయుడో దృశ్యరూపం ఇవ్వలేదా?’

‘అయ్యో రాత! చేతికింత పని, నోటికింత తిండి, కంటికింత కునుకు... మా బతుకుచక్రానికదే నిత్య కృత్యం. మాకదే సత్యం. అదే శాశ్వతం. ఐనా, కష్టజీవులకు కథలు, కాకరకాయలేంటట? ఐనా, ఆ కళాపోషణంతా కడుపు నిండినోడి పని. ఆ రాణీ ప్రేమ పురాణం, ఈ ముట్టడి కైన ఖర్చులు, మతలబలుూ, కైఫీయతులూ చరిత్ర సారమింతేనని ఆ పెద్దమనిషెవరో బానే చెప్పారుగా.’

‘హతవిధీ! చరిత్ర రూపశిల్పులే మీరు. ఆ చారిత్రక ఇతిహాసపు పుటల్లో మీకంటూ ఓ పేజీ కూడా లేకపోవడం శోచనీయం. అన్నట్టు, నేడున్నది ప్రజాస్వామ్యమేగా. ప్రజలకోసం, ప్రజల చేత, ప్రజల యొక్క అంటూ ఏకంగా రాజ్యాంగమే రాశారుగా. మీ జీవితాల్లోకేమైనా వెలుగు రేఖ ప్రసరించిందా మరి?’

‘అయ్యోరామా! రాతలు వేరు. చేతలు వేరు. ఆ రాతలకి, చేతలకి మధ్య ఎప్పుడూ చైనాగోడంత ఎడం ఉంటుంది. మైసూరు బజ్జీలో మైసూరు ఎలాగైతే ఉండదో; ప్రజాస్వామ్యంలో కూడా మాబోటి జనాలెవ్వరూ ఉండరనుకుంటా. అలాగే, ఎండమావిలో నీళ్లెలా ఉండవో; ప్రభుత్వాల పథకాలు, కమీషన్లు, నిధులు, చట్టాల్లో పేదల ఊసే ఉండదు. ఓట్ల కోసమే మేం గుర్తొస్తాం. ఎన్నికలయ్యాక నేతలది అవినీతి భాగోతం. మాకేమో కటిక దరిద్ర భారతం. మా తలరాత ఎప్పుడు మారుద్దో?’

‘హ్మ్! ఏదోరోజున మీకూ మంచికాలం వచ్చి తీరుతుందన్నది నా ఆశ, ఆకాంక్ష.’

‘ఇంకెక్కడి మంచిరోజులు? నీవు మొదలెట్టిన రావణకాష్టంలో ఎక్కువగా సమిధలయ్యేది మాబోటి కష్టజీవులే. భూగోళంపై నీవు సాగిస్తున్న దారుణ మారణ హోమం తాలూకు సెగలు ఎప్పటికీ తగ్గుతాయో? ఈ క్వారంటైన్ వాసం ముగిసినా మా బతుకులు తిరిగి యథాస్థితికి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో? రానున్నదంతా ఆత్మహత్యలు, హాహాకారాల కాలమేనేమో?!’

‘భగవంతుడా! ఆ కూర్మావతారం ఉందో లేదో నాకైతే తెలీదు. కానీ, అనాదిగా ఈ భూమండలాన్ని మోస్తున్న ప్రత్యక్ష నరనారయణులు మాత్రం మీరే. మీలాంటి అభాగ్యుల, అసహాయుల ఉసురు పోసుకుంటున్న నాకు ఇక ఈ భూమ్మీద పుట్టగతులుంటాయో, లేదో తెలీదు. మన్నించు మిత్రమా! అన్నట్టు, కొంచెం శుచీ శుభ్రత పాటించండి. కాస్త బాధాకారమే ఐనా కొన్నాళ్లు క్వారంటైన్ వాసం చేయండి. దొరికితే కలో, గంజో తాగండి. అవీ దొరక్కపోతే, చివరకు బలసాకైనా తిని సరే బతకండి. మీరు బతకాలన్నదే నా కోరిక.’

‘మా తక్షణ కర్తవ్యం, తదేక దీక్ష మాత్రం, కరోనా రహిత సమాజమే!’


Thursday, 23 April 2020

మహాప్రస్థానం... మంత్రనగరిలోకి!

ఇవాళ వరల్డ్ బుక్ డేను పురస్కరించుకుని, నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం... ‘మహాప్రస్థానం’ గురించి నాలుగు మాటలు రాద్దామనిపించింది. 

కర్నూల్లో డిగ్రీ పూర్తయ్యాక ఓ ఏడాది ఖాళీగా ఉన్నా.  కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న రోజులవి. ఆ ఫ్రీటైంలోనే ఒకటి, స్టేడియంకెళ్లి జాగ్ చేయడం; రెండు, సెంట్రల్ లైబ్రరీకెళ్లి చదూకోవడం.. ఈ రెండు అలవాట్లకు పునాది పడింది. అప్పటికీ నాకు లైబ్రరీ అంటే, అన్ని పేపర్లలో స్పోర్ట్స్ పేజీ వార్తల్ని చదవడానికి ఓ అనువైన ప్లేసనే సంకుచిత అభిప్రాయం ఉండేది. కొన్ని రోజుల్లోనే అదే లైబ్రరీలోనే పుస్తకాలుంటాయనీ, అక్కడ నామినల్ మెంబర్ షిప్ ఉంటుందనీ, అది తీసుకుంటే పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి చదూకోవచ్చనీ మెలమెల్లగా తెలిసింది. అలా పేపర్లను దాటుకుని పుస్తక ప్రపంచంలోకి ప్రవేశించాను. 

అలా ఆ లైబ్రరీలోనే కృష్ణశాస్త్రి, తిలక్, చలం, సినారే, దాశరథి, పఠాభి, ఆరుద్ర, అరవిందుడు, రవీంద్రుడు, శ్రీశ్రీ ఇలా అందరినీ పలకరించి పరిచయం చేసుకున్నా. నా కాంపిటీటివ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ని పక్కనపారేసి మరీ ఈ సాహిత్యంలో మునిగిపోయా. ఆ ఎర్లీ యంగేజీలో ఆ కవిత్వాలు, సాహిత్యాలు ఏ మేరకు బుర్రకెక్కాయో ఇప్పటికీ సరిగా గుర్తు లేదు కానీ, ఒక్క పుస్తకం మాత్రం చదువుతుంటే శరీరంలో ఆపాదమస్తకాన్ని ఊపేసింది. అదే మహాప్రస్థానం!! అప్పటికి ఆ పుస్తకంలోని కాన్సెప్టులు పెద్దగా అర్థం కాకపోయినా అదేదో ఉరకలెత్తే జలపాతం హోరులో కొట్టుకుపోయిన ఫీలింగ్ మాత్రం ఇప్పటికీ గుర్తు. అది మొదలు, ఏ పుస్తకం చదివినా ఈ మహాప్రస్థానం ముందు ఎందుకో తేలిపోయేది. ఏం తోచకపోయినా కూడా ఓసారి మహాప్రస్థానాన్ని తిరగేస్తే తెలీని ఉద్వేగం ఆవహించేది. ఆ పుస్తకానికేదో మంత్రశక్తి ఉందనిపించేది అప్పట్లో నాకు. 

ఇక, ఆ తర్వాత కర్నూల్లో ఈనాడులో కాంట్రిబ్యూటర్ గా చేసే రోజుల్లో కూడా అడపాదడపా అవకాశం దొరికిన ప్రతీ వార్తలో శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ఒకటో రెండో లైన్లు కోట్ చేద్దామా అనిపించేదెప్పుడూ. 2002 సెప్టెంబర్లో ఈనాడు జర్నలిజం స్కూలుకి సెలెక్టై వచ్చాక, ఇక్కడ ప్రతీ వారం ఓ పుస్తకం చదివి సమీక్ష రాయాల్సిన నిబంధన ఒకడుంటేది. అలా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 52 పుస్తకాల జాబితా ఆ ఏడాది జర్నలిజం చేస్తున్న సమయంలో ఉండేది. ఆ అన్ని పుస్తకాల్లోకి, నేను మరోసారి లీనమైపోయి చదివి, అనుభవించి రివ్యూ రాసిన పుస్తకం.. మహాప్రస్థానమే. ఇక ఆ తర్వాత ఇదే మహాప్రస్థానాన్ని ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు. 

అక్షరానికీ అణుబాంబుంత శక్తి ఉంటుందనీ; ఒక్కో కవిత ఒక్కో మిసైల్ లా దూసుకెళుతుందని మహాప్రస్థానంలోని ఏ కవితను చదివినా ఇట్టే అర్థమైపోతుంది. మనలో జడత్వాన్ని, బద్ధకాన్ని బద్ధలుకొట్టి ఉరుకులు పరుగులు పెట్టించగల చోదకశక్తేదో ఈ పుస్తకంలో ప్రతీ కవితకూ ఉంటుంది. ఈ పుస్తకంలో ఏ కవితను చదివినా దానికే సొంతమైన ఓ శృతీ, లయా కనిపిస్తాయి. రౌద్రంతో ఉరకలెత్తించినా, కరుణలో ఓలలాడించినా, హాస్య ఛమత్కారంలో ముంచెత్తినా, బీభత్స భయానకంలోకి తోసేసినా, అద్భుతంతో వహ్వా అనిపించినా, శాంతమై సేదతీర్చినా అది ఒక్క మహాప్రస్థానం కవితలకే సాధ్యం. కవితా వస్తువు (కంటెంట్)లోనూ, దాని రూపం(ఫాం)లోనూ ఇంత అత్యద్భుతమైన బ్యాలెన్స్ సాధించిన పుస్తకం మరోటి కనిపించదు. తెలుగులో సాహితీ సముద్రాన్ని మధించి, అమృతకలశాన్నిఈ పుస్తకం రూపంలో మనకందించాాడా శ్రీశ్రీ అనిపిస్తుంది. ప్రపంచ సాహిత్యాన్ని, రాజకీయాల్ని, ఆర్థిక స్థితిగతులను, మానవ ఆలోచనను, సామాజిక పరిణామాన్ని, ప్రకృతి నియమాల్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటే, ఓ మనిషి... ఇంతటి అద్భుతాల్ని ఆవిష్కరించగలడా; ఎంతో సంక్లిష్టమైన విషయాల్ని ఇంత సరళంగా, రసస్పోరకంగా చెప్పగలడా అనిపిస్తుంది. అన్నింటికీ మించి జనసామాన్యంతో ఎంతగా మమేకమైపోతే తప్ప ఓ కవి, ఇంతగా మనల్ని ఉత్సాహంలో, ఉద్రేకంలో, ఉద్వేగంలో ఓలలూగించగలడు. మహాప్రస్థానం కవితల్లో చూసిన విద్వత్తు, విద్యుత్తు ఇప్పటిదాకా నాకెక్కడా కనిపించలేదు. శ్రీశ్రీని.. మహాకవిగా ఆవిష్కరించిన పుస్తకమిది; శ్రీశ్రీ... ఈ శతాబ్దం నాది అని ఎలుగెత్తి చాటగలిగేంత తెగువను ఇచ్చిన పుస్తకమిది. తెలుగు సాహిత్యానికంతా రాజ్యాంగం లాంటి పుస్తకం ఈ మహాప్రస్థానం. (ఈ చివరి లైన్, మా జర్నలిజం మాష్టారు, సమ్మెట నాగ మల్లేశ్వరరావు గారు అన్నమాట!) 


#worldBOOKday 
#మహాప్రస్థానం!

Tuesday, 21 April 2020

కరోనా శరణం గచ్ఛామి!!

‘కామ్రేడ్స్!  అందరికీ లాల్ సలాం. సకల జీవరాశుల ఐక్యత వర్ధిల్లాలి! ప్రకృతి మాతా జిందాబాద్!! అన్నట్టు, అందరూ  కుశలమే కదా?’

‘కుశలమే మృగరాజా. కరోనా కరాళ నృత్యం చేస్తోంది కదా. దీంతో ఆల్చిప్పకు మల్లే, మనిషి స్వగృహ కారాగారవాసం విధించుకున్నాడుగా. ఇళ్లల్లో బందీలైన మనుషుల్ని ఏడవకండేడవకండంటూ ఓదార్పు యాత్ర చేస్తూ పాదయాత్రలో వస్తున్నా.’

‘హహ్హా. భళా గజరాజా! చూస్తోంటే, కాలగమనంలో ఈ ఏడాది తన విశిష్ఠతను ఘనంగానే చాటుకునేలా ఉందోయ్. ప్రకృతికి కొత్త ఊపిరిలూదింది. భూగోళానికి కొంగొత్త సొబగులద్దింది. సకల చరాచర జీవరాశికి నవ్య స్వేచ్ఛనేదో ప్రసాదించింది. ఇక, ఈ భూగోళాన్నే ఎత్తి భుజమ్మీద మోసేంత ఘనులైన మనుషులకు, కరోనాకు మధ్య కురుక్షేత్ర సంగ్రామానికి తెరలేపింది. అందుకే 2020.. ఈ అంకెలోనే ఏదో మ్యాజిక్కుందనిపిస్తోంది.’

’ఊర్కోండి, మహారాజా! మానవాళికి మీరింకే భుజకీర్తులు తొడగకండి. ఈ మనిషికి విశ్వాసమనేది ఏ కోశానా లేదు. ఆకాలంలోనే అప్పుల బాధ తాళలేక ఓ పెద్దాయన , జూదంలో మరో పెద్దాయన స్త్రీమూర్తుల్నే తాకట్టు పెట్టారట. హవ్వ, ఎంతటి చోద్యం! ఇక, ఈ ఘోర కలియుగంలో,  బంధాల్నీ, బంధువుల్నీ, భూముల్నీ, బ్యాంకుల్నీ, దేశాన్నీ కూడా తాకట్టు పెట్టే మహానుభావులు బయలుదేరారు.  వీరికి స్వప్రయోజనమే సర్వస్వం. స్వార్థ చింతనే తారకమంత్రం. ఛఛ, ఇంతటి నీచ మానవులతోనా నేను తరతరాలుగా విశ్వసనీయ స్నేహం చేసింది. తలచుకుంటేనే సిగ్గేస్తోంది.’

‘నీ ఆవేదనను నేనర్థం చేసుకోగలను శునకమిత్రమా. కర్మఫలం ఎవ్వరినీ వదలదు. ఆ మనిషి బోడి పెత్తనానికి బలికాని ప్రాణి అంటూ ఈ భూగోళం మీద ఉందా అసలు? మనబోటి జీవరాశి సరేసరి. తోటి మనుషుల్నే బానిసల్ని చేసి రాచి రంపాన పెట్టిన ఘనచరిత్ర వారిది. బానిస, భూస్వామ్య, పెత్తందారీ, జమీందారీ లాంటి వివక్షాపూరిత వ్యవస్థల్ని మనమెరుగుదుమా? పేరుకే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క అంటూ ఊకదంపుడు. కాస్త తరచి చూస్తే కులమనీ, మతమనీ, ప్రాంతమనీ, జాతి అనీ, దేశమనీ... ఈ మానవుల చరిత్రంతా వివక్ష, విభజన, విద్వేషాలమయమే. ఈ మనిషనే వాడే కాస్త వింతజీవి, గురూ!’

‘నిజమే ప్రభూ! ఆకలేసో, ఉబుసు పోకో, దంతాలకు దురదపెట్టో... ఏవో చిన్నచిన్న కన్నాలేస్తేనే పొగబెట్టో,  బోన్లో బంధించో, మందు పెట్టో చిత్రహింసలు పెట్టి మరీ మమ్మల్ని చంపుతాడే. మరి, ఈ మనిషి ఏకంగా ఓజోన్ పొరకే కన్నమేశాడు. ఇక భూగోళాన్నైతే విచక్షణారహితంగా  కుళ్లబొడుస్తున్నాడు. మాకేనా శిక్షలు? ఈ మానవులకేమీ వర్తించవా? ’
‘నీ ఆక్రోషాన్ని ప్రకృతి ఆలకించిందేమో, మూషికమిత్రమా. ఈ మనుషుల కోరలు పీకి, తోకలు కత్తిరించే క్షురఖర్మకు శ్రీకారం చుట్టిన్నట్టే ఉంది. లేకపోతే, ఎంత బడాయి జాతో, ఈ మనుషులది! చెప్పేవేమో జీవకారుణ్యం, పర్యావరణ సమతుల్యతలాంటి శ్రీరంగనీతులు. చేసేవన్నీ కల్తీ, కాలుష్య, కాసారపు, కసాయి పనులు. నింగీ నీరూ నేలా నిప్పూ ఇలా పంచభూతాలపై ఈ మనిషి సాగిస్తున్న విధ్వంస రచనకు అంతర్థానమైపోయిన జీవరాశికి లెక్కాపత్రం ఏమైనా ఉందా? ఈ భూమండలమంతా వీళ్ల బాబు సొత్తైనట్టు, వీళ్ల అజమాయిషీ ఏంటో. ఇది ఒక రకంగా ఈ ధరిత్రిపై మానవులు సాగిస్తున్న నియంతృత్వమే.’

‘నిజమే మహారాజా! నేను కళ్లు మూసుకుని పాలు తాగే జీవినే కావచ్చు. కానీ, నేను కళ్లారా వీక్షించిన వీరి ఆగడాలకు అంతేలేదు. అశ్వమేథ యాాగాలు చేస్తాడు. కాకితో కబురంపుతాడు. చిలుకలతో జ్యోతిషాలు చెప్పిస్తాడు. మైనాతో పాడిస్తాడు. కోళ్లతో కత్తియుద్ధాలు చేయిస్తాడు. ఎద్దులతో జల్లికట్టు ఆడతాడు. పశువుల తోలు వలచి చెప్పులు కుట్టించుకుంటాడు. గొర్రెల కేశాలతో బట్టలు కుట్టించుకుంటాడు. పులిచర్మం కిందేసుకుని ధ్యానం చేస్తాడు. ఏనుగు దంతాలు పీకి బొమ్మలు చేస్తాడు. పాము కోరల్లో విషం తీసి వైద్యం చేస్తాడు. జంతువుల్ని జూలలో బంధించి, సర్కసుల్లో ఆడించి వికృతానందం పొందుతాడు. ఈ మనిషి దాష్టీకాలకు, దురాగతాలకు లెక్కేలేదు. మ్యావ్!’

‘లెస్సపలికితివి మార్జాలమా! పిల్లికి బిచ్చం కూడా పెట్టనివాడు సమసమాజం నిర్మిస్తాడట. సామ్యవాదం సంగతేంటో గానీ, ఉగ్రవాదం మాత్రం సృష్టించాడు. రెండు ప్రపంచయుద్దాలతో ఎనలేని విధ్వంసం సృష్టించాడు. హిరోషిమా, నాగసాకి వినాశనాల్ని మరవగలరా? ఇంత జరిగినా, ఇంకా అణ్వాయుధాలతో కయ్యాలకు సయ్యంటూ భూమాత ఉనికికే విఘాతం తెచ్చేలా ఉన్నాడు.’

‘ముమ్మాటికి వాస్తవం మహారాజా! చైతన్యశీలిననీ, నాగరికతా నిర్మాతననీ ఉత్తర ప్రగల్భాలు పోతాడే. కరవులు, కాటకాలు, మహమ్మారులు, పేదరికం, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, ఆకలిచావులు, హాహాకారాలు ఇదేనా వీరి బోడి నాగరికత? ఇదేనా వీరి చైతన్యం? చివరాఖరికి వీరి సాంగత్య ఫలితాన నాక్కూడా కరోనాను అంటించారు, రెండు వారాల క్వారెంటైన్ మీదట ఈ సమావేశానికి హాజరవుతున్నా.  హతవిధీ!’

‘ఎంతటి దుర్గతి దాపురించింది వ్యాఘ్రోత్తమా! ఈ మానవజాతి చేసిన చారిత్రక తప్పిదాల లెక్కను సరిచేసేందుకే ప్రకృతి కరోనావతారం దాల్చిందేమో. చూస్తున్నాంగా, ఈ నాగరిక జీవి ముక్కూచెవులూ పిండి, నోటికి తాళమేసి, కాళ్లూ చేతులు కట్టేసి క్వారంటైన్ చేసింది. ఈ కుహనా సాంఘిక జీవిని సామాజిక జీవనానికి దూరం చేసి లాక్ డౌన్ చేసింది. పోన్లెండి, అత్యంత విషమ పరీక్షా కాలమిది. మానవాళి ఆత్మావలోకం చేసుకోవాల్సిన సమయమిది. మనిషి తన తప్పుల్నుండి గుణపాఠం నేర్చుకుని ఈ మహాగండాన్ని దాటుతాడని ఆశిద్దాం. అన్నట్టు, కరోనాకు స్త్రీ-పురుష, చిన్న-పెద్దా, నీగ్రో-శ్వేత జాతీయులనే కాక, చివరికి మానవ-పశుపక్ష్యాదులునే వివక్ష కూడా లేదనే విషయాన్ని గుర్తెరగాలి. మనం కూడా ఎంతో జాగరూకతతో మెలగాల్సిన తరుణమిది. అందుకే నేటి మన సర్వసభ్యసమావేశం.’

‘నిజమే, మహారాజా! ఈ ఆపద గడియల్లో మీ దిశానిర్దేశానికై  మా వృక్షజాతి తరఫున కూడా వేడుకుంటున్నాం!’

‘కామ్రేడ్స్! యధాయధాహి ధర్మస్య.. అన్నట్టు, అరాచకం పెచ్చరిల్లినప్పుడల్లా ప్రకృతి కూడా కొత్త అవతారమెత్తి సమస్థితిని తీసుకొస్తుందేమో. కరోనా అవతారం అదే కావచ్చు. మానవజాతిలా మనకు మందులూ మాస్కులూ లేవు; శానిటైజర్లూ వెంటిలేటర్లూ అసలే లేవు. కాబట్టి, ప్రస్తుతానికి మనం హ్యూమన్ డిస్టెన్స్ పాటిద్దాం. అదే మనకు శ్రీరామరక్ష. రెండోది కీలకమైన బుద్ధుడి మార్గం. యుద్ధం వ్యర్థమని రుజువైంది కాబట్టి మనం శరణాగతి మార్గం అనుసరిద్దాం.  ఇకపై కరోనాను మన ఇలవేల్పుగా కొలుద్దాం. సకల జీవరాశిపై చల్లని దయ చూపమని వేడుకుందాం. కరోనా సంహిత అనే వైద్యగ్రంథాన్ని రాసుకుందాం.  ఈ ఏడాదిని కరోనా నామ సంవత్సరంగా ప్రకటిద్దాం. కరోనాపై కొత్త కథల్ని, పాటల్ని, నాట్యాల్ని, నాటకాల్ని, సినిమాల్ని, క్రీడల్ని విరచించి కొండాకోనా హోరెత్తేలా చేద్దాం. ప్రస్తుత ప్రపంచ ఏడువింతల్ని పోలిన కరోనా మహల్, కరోనా పిరమిడ్లు, కోవిడ్ గోడ, కోవిడ్ కలోసియం లాంటి కొత్త వింతల్ని సృష్టిద్దాం. మయసభను మించిన కరోనా మ్యూజియాన్ని అమెజాన్ అడవుల్లో నిర్మిద్దాం. చివరగా నైలూనదీ ఒడ్డున నింగినంటేలా స్టాచ్యూ ఆఫ్ కరోనాను ఆవిష్కరించి, జీవరాశికి విముక్తి ప్రసాదించమని సామూహిక అంజలి ఘటిద్దాం. స్వస్తి!’

’కరోనా శరణం గచ్ఛామీ!’


Friday, 17 April 2020

మాడిన దోశ... మసాలా పోస్టు!

నేను: ఒరేయ్ అంతరాత్మ, ఎక్కడ సచ్చావ్? 

అంతరాత్మ: ఎప్పుడెలా వాగాలో తెలీనోడివి నువ్వు. ఎక్కడెలా ఆగాలో తెలిసినోణ్ని నేను. నేను సస్తే, నాతో పాటే నువ్వూ అనంత వాయువుల్లో కలిసిపోతావ్, తెల్సా? 

నేను: ఏడిశావ్ లే! రివర్స్ ఈజ్ కరెక్ట్. నేను పోతే తప్ప నీకు మోక్షం లేదురరేయ్! అదీ రూల్. వెధవ్వేషాలేస్తే, తోలు వలచి, మాస్క్ కుట్టించుకుంటాన్రారేయ్. 

అంతరాత్మ: అంటే,  vice versa ఉండదా గురూ? ఎంతన్యాయం! 

నేను: ఇంపాజిబుల్! బూర్జువావర్గం పోతేనే కార్మికవర్గానికి విముక్తి. 

అంతరాత్మ: ఏం మాట్టాడుతున్నావ్ బాస్. సడెన్ గా పైథాన్ లాంగ్వేజ్ లోకి షిఫ్ట్ అయిపోయావ్? 

నేను: పైథాన్, సైతాన్ ఏంట్రా సిల్లీ ఫెలో. అది పీడిత వర్గ భాష. నువ్వో పరాన్నభుక్కువి. నీ బుర్ర డెవలప్మెంట్ ఇంకా ఫ్యూడల్ కాలంలోనే ఆగిపోయిందిలే.’ 

అంతరాత్మ: తమరితో లివి-ఇన్ రిలేషన్ షిప్ మహత్తు బాబుగోరూ. ఏం చేస్తాం, పొద్దుపొద్దున్నే లేచి ఎవరి... సారీ, తమరి ముఖారవిందమే చూసి తరించితిని కదా... నాకిలా శాస్తి జరుగుతోందన్నమాట. కానివ్వండి. 

నేను: ఈ సచ్చు సెటైర్లకేం తక్కువ లేదు, సన్నాసికి. 

అంతరాత్మ: సర్లే, ఎందుకో పిలిచారు, తగలెట్టండి, సారీ సెలవివ్వండి. 

నేను: ఊ, ఏమైపోయావ్. లాంగ్ టైం, నో సీ? 

అంతరాత్మ: తెలిసిందేగా బాస్. గతంలో ఫాగ్ నడిచేది. ఆజ్ కల్, కరోనా చల్ రహా హై నా? అందుకే, హైబర్నేషన్ మోడ్ లోకి వెళ్లిపోయా. నీతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నా, బాస్. 

నేను: ఓరీడి ఇంటర్ స్టెల్లార్ డైలాగులు కాకులెత్తుకెళ్లనని. ప్రాణమే లేని శాల్తీవి, ఇంత ప్యానిక్కేంటోయ్, నీకు?

అంతరాత్మ: లోకమంతా వణికిపోతున్నారుగా. మాస్ హిస్టీరియాలో పడి నేను కొట్టుకుపోయా గురూ. నలుగురితో నారాయణ, రాఘవులే కాదు, చాడా, తమ్మినేని అన్నది నా థియరీ. పోన్లేండి. నిద్రలో లేపితే నేనిలాగే వాగుతా కానీ, అసలు విషయమేంటో చెప్పనేలేదు. 

నేను: ఏం లేదోయ్. పొద్దున్నే దోశలేస్తుంటే, అదేంటో, ఫస్టు దోశ పెనానికి బల్లిలా అతుక్కుపోయిందబ్బా. పెనానికి, దోశకి అయానిక్ బాండ్ కి మించిన ఫెవికాల్ బంధమేదో ఏర్పడింది. వెధవది. ఎంత గింజుకున్నా రాదే. చివరకి, పెనాన్ని సింకులోకి తోసి, సింగరేణి గనుల్లో గునపంతో బొగ్గును తవ్వినట్టు తవ్వి తీయాల్సొచ్చింది. ప్రతీసారీ ఇదే తంతు. ‘ఫస్టు దోశ దోషం’ ఏదో నన్ను వెంటాడుతుందోయ్. నాకే ఎందుకిలా జరుగుతోంది? పోయిన జన్మలో ఎవరైనా శాపం పెట్టారంటావా? 

అంతరాత్మ: దీన్నే ఊరందరిదీ ఓ మతమైతే, ఉలిపికట్టెది అంటే, నీలాంటోడిది రెటమతం అంటారులే. లోకమంతా కరోనా, క్వారంటైన్, లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ అని డిస్కస్ చేస్తుంటే, తమరు మాత్రం మాడిన మసాలా దోశ గురించి తెగ ఇదైపోతున్నారు. ఖర్మండీ ఖర్మ!! 

నేను: నీ బొందరా నీ బొంద! లోకానికి కరోనా గురించి తెలిసిందే నాలుగు ముక్కలు. ఎవరి నోట్లోంచి వచ్చినా, ఏ రోట్లో వేసినా ఆ నాలుగు ముక్కలే చర్వితచర్వణం, ఊకదంపుడు అన్నట్టు! భయంతోనే సగం జనం పోయేట్టున్నారు. నేనూ భయపెట్టడం అవసరమంటావా? పైగా, నేేనేమైనా డాక్టర్నా కరోనాపై థీసిస్సులు రాయడానికి? సర్లే గానీ, ఇంతకీ నా ఫస్టు దోశ ఎందుకు మాడిపోతోందో చెప్పు? 

అంతరాత్మ: సింపుల్ గురూ. పంట కోత కొస్తే, పంటలో తొలి పిడికిలి ధాన్యం భూమాతకీ; పండగపూట చేసే వంటల్లో తొలి నైవేద్యం దేవుళ్లకీ పెట్టి శాంతి చేయడం ఆనవాయితే కదా. ఇదీ అంతే. నీ రెగ్యులర్ ఫస్ట్ డీప్ రోస్టెడ్ దోశను ఏ దెయ్యమో నైవేద్యంగా తీసుకుంటోంది. ఇవాళ ఫస్టు మాడిన మసాలా దోశను మాత్రం కరోనా దేవత నైవేద్యంగా తీసుకున్నట్టుంది. శాంతిపూజ సజావుగా జరుగుతోందిలే. డోంట్ వర్రీ! నీవలా పద్మాసనమేసి కుంభాలకు కుంభాలు దోశలు, పకోడీలు, డల్గోనాలు నిర్విరామంగా ఆరగిస్తానే ఉండు, జపాన్ లో ఈ మధ్య సుమోల సంఖ్య బాగా తగ్గిపోతోందట. మాంఛి డిమాండుంది. ట్రై చేద్దాం, బాస్. మరీ రోటీన్ జీవితం బోర్ కొట్టేసింది. నీతో పాటు నేనూ అలా దేశాలు తిరిగొస్తా. ఏమంటావ్?

నేను: ఒరేయ్ తింగరోడా. నువ్విలా తిక్కతిక్కగా వాగకు. అసలే ఈ తథాస్థు దేవతలకు పనీ పాడూ ఏం ఉండవు. పరమశివుడి కంటే ఫుల్లు బోళా టైపు.  పైగా నాతో ఎప్పుడూ 5జీ వైఫై కనెక్షన్లో ఉండి ఛస్తారు వాళ్లు. నీవు త అంటే, వాళ్లు తకధిమి తోం అని నెత్తినెక్తి తారంగం ఆడే రకం. అవసరమా? తమరిక తిరిగి హైబర్నేషన్ మోడ్ లోకి దయచేయండి. 

అంతరాత్మ: ఓకే బాస్. ఓ మాట చెప్పండి. ఈ కరోనా శకం ఆరంభమైన తర్వాత...  జీవితంలో ఏం నేర్చుకున్నారో, ఒక్క ముక్కలో చెప్పండి? విని తరిస్తా. 

నేను: ఏవుందిలేవోయ్! గాడిద గుడ్డూ, కంకరపీసూ అన్నట్టు; జీవితంలో చివరకు మిగిలేది... ‘మూతికి మాస్కు, చేతిలో శానిటైజర్’. అంతే.  దట్సాల్! 

అంతరాత్మ: @#$%&!#$&%#

Tuesday, 14 April 2020

కరోనోపాఖ్యానం!

రాశి చక్రగతులలో
రాత్రిందివాల పరిణామాలలో,
బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో,
కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన
పరమాణువు సంకల్పంలో,
ప్రభవం పొందినవాడా!
మానవుడా! మానవుడా!

ఆలోచనలు పోయేవాడా!
అనునిత్యం అన్వేషించేవాడా!
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా,
ఆకసంలో, సముద్రంలో అన్వేషించేవాడా!
అశాంతుడా! పరాజయం ఎరుగనివాడా!
ఊర్ధ్వదృష్టీ! మహామహుడా! మహా ప్రయాణికుడా!
మానవుడా! మానవుడా!
                                      -మహాకవి శ్రీశ్రీ.

****************************
కరోనా కల్లోలంపై... మానవాళి తక్షణ కర్తవ్యంపై ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో కరోనాపై నేను రాసిన గిరీశం వ్యాఖ్యానం... చదవగలరు, థాంక్యూ! కింద లింకులో రెండు కథనాలున్నాయ్. సెకెండ్ రైటప్! 👇

https://www.google.com/amp/s/www.eenadu.net/vyakyanam/apvyakyanam/2/120048839

క్రిమి సంహారం, sorry,
ఉపసంహారం: ఆ 'బుద్ధ' నేనే! ☺️


Thursday, 9 April 2020

క్వారంటైన్ టాక్ with లార్డ్ శివ!

భక్తా..!

కాదు సార్. నాకే పొలిటికల్ అఫిలియేషన్సూ లేవు. నేను జస్ట్ మధ్య తరగతి మనిషిని. అంతే. దట్సాల్!  ఐనా, ఇదేం బాగోలేదు సార్, డైరెక్టుగా బెడ్రూంలోకొచ్చి భక్త్..ఆ?’ అని అడగడం. వాటీజ్ దిస్ అండీ? కొంపదీసి, మీరు.... పేస్టులో ఉప్పుందా; హార్పిక్ అబ్బాస్-మస్తాన్ టైపా?’

ఓరీ, మూర్ఖపు సన్నాసి! నేను దేవుణ్ని రా!! అది ప్రశ్న కాదు రా, సిల్లీ ఫెలో. భక్తి కలిగిన వాడా... భక్తా అని నిన్ను సంబోధించాను రా.  ఐనా, ఆ సార్, సార్ అని సంబోధన ఏంట్రా? వింటానికే పరమ కంపరంగా ఉంది.

ఓహ్, సారీ సార్. తప్పైంది. ఇక్కడ మా బాస్ ని సార్.. సార్.. అని పిలిచి ఆ మాట డీఫాల్ట్ అయిపోయింది సార్. కాస్త అడ్జస్ట్ చేసుకోండి! అవును, ఎలా ఉన్నారు, సార్?’

అఘోరించావులే కానీ, నీ తపస్సుకు మెచ్చాను. ఏం కావాలో కోరుకో!

,  ఊరుకోండి సార్, జోకులేయడానికి నేనే దొరికానా మీకు? నేనెప్పుడు తపస్సు చేశా సార్? నాకలాంటి మంచి అలవాట్లు లేవుగా. నా నుండి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మీరు. తర్వాత ఫీలవుతారు, చెప్పలేదనేరు, మీ ఇష్టం.

ఒరేయ్, కుళ్లు జోకులేశావంటే త్రిశూలంతో డొక్కలో పొడుస్తానేవనుకున్నావో, భడవా. ఐనా, ఇందాక వజ్రాసనంలో కూచుని, నా నామాన్ని స్మరించావు కదరా, వేస్ట్ ఫెలో!

నేనా...? Me...? मैंने क्या किया...?’

రేయ్, ఆ సంతూర్ యాడ్ ఓవరాక్షన్లు చేయకు. నాకసలే కోపమెక్కువ. మూడ్ పాడైందనుకో, మూడో కన్ను తెరిచి భస్మం చేసి, ఆ బూడిద తీసుకుని, నా నుదుటన నామాలు పెట్టుకుని వెళ్లిపోతా వెధవ.

ఓహ్ సారీ సార్. మీరూ అచ్చం.. మా బాస్ లానే సార్. అయిందానికీ కానిదానికీ ఒకటే చిరచిర, చిరాకు. ఐనా, మీరు కూడా కైలాసానికే బాసేగా?  నాకో విషయం తెలీక అడుగుతా సార్. ఈ బాసులంతా ఇంతేనా? కామెడీ, సారీ, అదే, హాస్యరసం ఎంజాయ్ చేయరా, సార్?’

ఒరేఏఏఏయ్..........

ఆగండాగండి సార్. విషయం గుర్తొచ్చింది. ఇప్పుడంతా లాక్ డౌన్ టైం కదా సార్. ముప్పూటలా తింటం, సిస్టం ముందు కూచోడం, తోచకపోతే టిక్ టాక్ చేసుకోవడం, కళ్లు కాయలు కాచేలా కునుకేయడం తప్ప డెయిలీ రోటీన్ లో పెద్ద వెరైటీ లేకుండా పోయింది సార్. చాలా చికాగ్గా ఉంది సార్. పైగా, ఈ బొజ్జ ఒకటి - దరిద్రపు సంత - బెలూన్ లా ఉబ్బిపోతోంది. రెండు వారాలకే ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసింది సార్. మీరు మాత్రం సూపర్ సార్, యుగయుగాలుగా ఎప్పుడూ ఏ ఫొటోలో చూసినా, సిక్స్ ప్యాక్ బాడీతో సల్మాన్ ఉంటారు. ఈ పాడు పొట్ట గురించే ఆలోచిస్తూ...  ఎప్పుడో ఏదో టీవీలో... తిన్న వెంటనే వజ్రాసనంలో ఓ పది నిమిషాలు కూచుంటే... అజీర్తి సమస్యలు పోతాయని, పొట్ట తగ్గుద్దని విన్నట్టు గుర్తు. అందుకే, అలా వజ్రాసనంలో కూచున్నా సార్. పనిలో పనిగా,  ఏ మూవీ చూద్దామా అని థింక్ చేస్తూ శివఅనుకున్నట్టు గుర్తు. అదీ సార్ సంగతి. ఐనా, మీరేంటి సార్, మరీ 10 నిమిషాలకే, అదేదో ఫైరింజన్ వచ్చినట్టు, అలా  వచ్చేస్తారా, వరాలివ్వడానికి? నేను సినిమాల్లో చూసింది కరెక్టే సార్, మీరు మరీ టూ మచ్ లిబరల్ అండ్ జెనరస్, అదే.. భోళా, సార్

ఏడిశావులే రా, కుంక. ఎక్కువ టైం లేదు గానీ, ఏం కావాలో చెప్పు?’

ఆగండి సార్. రాక రాక వచ్చారు, పైగా ఎండన పడి వచ్చారు. కాస్త చల్లగా మజ్జిగ తీసుకుంటారా? పోనీ సుత్తి లేకుండా సూటిగా అడుగుతాను... sprite తీసుకుంటారా?’

నువ్వెక్కడ దొరికావు రా, నా ప్రాణానికి?’

ఇదన్యాయం సార్. దేవుళ్లకు కూల్ డ్రింక్స్ ఇచ్చుకునే భక్తుల ప్రాథమిక హక్కును కూడా కాలరాస్తున్నారు సార్ మీరు? ఇది రాజ్యాంగ విరుద్ధం సార్. కైలాస విరుద్ధం కూడా. నేను హర్ట్ అయ్యా సార్.

ఏడిశావులే గానీ, గ్రీన్ టీ ఉంటే పట్టుకు రా

కనిపెట్టేశా సార్, హాలాహలానికి ఈక్వలెంట్ గ్రీన్ టీ అన్నమాట. మీరెప్పుడూ ఇలా కషాయాలే తాగుతారా సార్. పోన్లెండి, తులసి గ్రీన్ టీ ఉంది, తీసుకొస్తానాగండి. పైగా తులసిబ్రాండ్ అమ్మవారికి కూడా ప్రియమైన పత్రం. ఇలా సోఫాలో కూచుని చిన్న విరామం తీసుకోండి, చిటికెలో గ్రీన్ టీ తెస్తాను.

టీవీ చూసీ చూసీ నీ బుర్ర పాడైందిరా అబ్బాయ్. అచ్చు తింగరోడిలా మాట్లాడుతున్నావు

ఏం చేయమంటారు సార్, అసలే కరోనా క్వారంటైన్ ఐసోలేషన్ లాక్ డౌన్ టైమాయే. ఫ్రెండ్సుతో కూచుని కబుర్లు చెప్పుకుని చాల్రోజులైంది. జీవితం మీద విరక్తొస్తోంది సార్. మీకేంటి సార్, కోపమొచ్చినా, చికాకొచ్చినా, సంతోషమొచ్చినా.. అన్ని ఎమోషన్లకు చక్కగా అల్లు అర్జున్ లా స్టెప్పులేసి డాన్సు చేసుకుంటారు. నా ఖర్మకి నేను సూపర్ స్టార్ క్రిష్ణలా కూడా డాన్సులు చేయలేను. జీవితం మరీ బోరింగ్ గా ఉంది, సార్.

సర్లే గానీ, ఇంట్లో ఎవరూ లేరా?’

నెలక్రితమేదో ఫంక్షనుందని పుట్టింటికెళ్లింది సార్. నన్నూ రమ్మంది సార్. నేనే కాస్త ఓవరాక్షన్ చేసి, ఆఫీసు వర్కుంది, నెక్ట్స్ వీకెండ్ వస్తానని హెచ్చులు పోయా. ఇక్కడిలా అడ్డంగా బుక్కైపోయా. ఈ ఇల్లు ఊడ్చడం, తుడవడం, పాత్రలు తోమడం, వంట చేయడం, బట్టలు ఉతుక్కోవడం లాంటివేవీ తెలీకుండా పెరిగిన తుచ్ఛమైన మగమహారాజు బతుకు సార్ నాది కూడా. ఇంట్లో అమ్మ, ఇక్కడ ఆవిడ చేసిపెట్టినన్నాళ్లూ కింగులా గడిచిపోయింది. ఇప్పుడు పైసాకు పనికి రాకుండా పోయింది సార్ జీవితం. ఒక్కసారి వంట చేసుకుంటే మూడ్రోజులు ఫ్రిజ్జులో పెట్టి తింటున్నా. కిచెన్లోకి పోతే సింకులోని పాత్రలు మీద పడి  సింకులో పాత్రలు మీద పడి కొడతాయేమోనని అటేపు కూడా చూడట్లేదు. ఏదో టీ షర్ట్, నిక్కరేసుకుని లాగించేస్తున్నా సార్. బయటికొళ్తే పోలీసులు కొడతారు. ఇంట్లో ఉంటే బోర్ కొడతది. నావల్ల కావట్లేదు సార్. ఈ లాక్ డౌన్ ఎత్తేయగానే ఎవరికీ చెప్పకుండా శంకరగిరి మాన్యాలకు పాదయాత్ర చేసుకుంటూ పోతా, సార్.

హహ్హా! శంకరగిరి మాన్యాలా? ఇంతకీ అవెక్కడుంటాయో తెలుసా రా నీకు?’

ఏముంది సార్, ఫోన్లో జీపీఎస్ స్టార్ట్ చేస్తే అదే తీసుకెళతది. అది ఈజీ టాస్క్ సార్.

ఓరి నీ బండబడా! ఇలా తయారై చచ్చారేంట్రా?’

ఏదోలెండి సార్. అన్నట్టు, మేడం, పిల్లలు బాగున్నారా సార్?’ నాకో డౌటు సార్. కైలాసంలో కూడా ఈ స్వీపింగు, క్లీనింగు, వాషింగు, కుకింగ్ లాంటి పనులుంటాయా సర్? ఇవన్నీ ఎవరు చేస్తారు సార్? మేడమా? మీరా? లేక వర్క్ షేరింగ్ చేసుకుంటారా? మీ దగ్గర కూడా పురుషాధిక్య సమాజమా? లేక ఫెమినిజం ఉందా?’

ఒరే సన్నాసి. మేం దేవుళ్లం రా. అలాంటి తుచ్ఛమైన ఐహిక విషయాలకు మేం అతీతులంలే గానీ. సోది ఆపి, ఏం కావాలో చెప్పమన్నానా?’

నిజానికైతే నాకు పెద్ద కోరికలేం లేవు సార్. మా ప్రధాని మోడీలాగా ఫుల్ ఫిల్డ్ లైఫ్ సార్, నాది. మీరు మరీ మొహమాటపెడుతున్నారు కాబట్టి, ఏదో ఒకటి అడగకపోతే ఫీలవుతారు కాబట్టి, అడుగుతున్నా సార్.

ఒరేయ్ ఈ మధ్యకాలంలో నీవు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నావా? నీకు కొలెస్ట్రాల్ ఓ రేంజులో ఉన్నట్టుందిరా, వెధవకానా. త్వరగా అడుగు.

వావ్, సూపర్ పంచ్ సార్. మీ గురించి బయట భూలోకంలో, వైకుంఠంలో కాస్త డివైడెడ్ టాక్ ఉంది గానీ సార్, మీ సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ సార్. అన్నట్టు, కైలాసంలో కూడా మనం కామెడీ విత్ కపిల్షో లాగా; ‘సెన్సాఫ్ హ్యూమరసం విత్ డాన్సర్ శివ’.. అని ఓ ప్రోగ్రాం పెడితే పేలిపోద్ది, సార్?’

ఒరేయ్, ఇక్కడితో నీ నాన్ స్టాప్ వాగుడు కట్టిపెట్టకపోతే, నా నందిని, నాగుపామును వదులుతా, నిన్ను 360 డిగ్రీల్లో కుళ్లబొడుస్తారెధవ. త్వరగా విషయానికి రా

క్వారంటైన్ టైంలోనైనా మీతో కాసేపు కాలక్షేపం చేద్దామంటే మా ట్రంపులా సుడిగాలి పర్యటనలు పెట్టుకుంటారెప్పుడూనూ. సరే సార్. ఇక అడిగేస్తా. 

హా, అడగవోయ్.

చిన్న కోరికే సార్. ఈ కరోనా, లాక్ డౌన్ లతో వేగలేకుండా ఉన్నా, కాస్త మీతో పాటే నన్ను కూడా కైలాసానికి తీసుకెళ్లండి సార్. నాకూ ఓ కొత్త ప్లేసు చూసినట్టుంటుంది. మీరూ వరం ఇచ్చినట్టుంటుంది. కావాలంటే, మీకు డెయిలీ తులసీ గ్రీన్ టీ చేసి పెడతా సార్. మీ రుణం ఉంచుకొనే మనిషిని గాను నేను.

ఖర్మ రా బాబూ. నీ కోరిక తీర్చడానికి ప్రస్తుతం  కైలాసం రూల్స్ ఒప్పుకోవురా. ఇంకేదైనా అడుగు

అదేంటి సార్. కైలాసానికి మీరే కదా సీఈఓ. ఇంక రూల్స్ గురించి ఎవరడుగుతారు సార్. ఇది టూ మచ్ సార్. నన్ను అవాయిడ్ చేయడానికి మీరేవో సాకులు చెబుతున్నారు. ఇదేం బాగోలేదు సార్. నేను మళ్లీ హర్టు అవుతా.

ఓరి నీ అఘాయిత్యం కూలనని. నీకో సీక్రెట్ చెబుతా విని,. వెంటనే మరిచిపో. నిజానికి కైలాసానికి సీఈఓ నేనే అయినా, పవరాఫ్ అటార్నీ అంతా మా ఆవిడదే. మొన్న నీలాగే ఎవడో దరిద్రుడు శివశివా.. అన్నాడు, ఖాళీగా ఉన్నా కదాని, డమరుకం పట్టుకుని నాట్యం చేసుకుంటూ వచ్చేశా. వాడూ నీలాగే తింగరోడు. ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేశాడు. తీరా వాడికేదో బలుసాకు కావాలంటే ఇచ్చేసి, తిరిగి కైలాసానికి వెళ్లా. తీరా వెళ్లాక తెలిసింది.. భూలోకంలో కరోనా కరాళనృత్యం చేస్తోందని, అది నాకు వచ్చిందేమోనని డౌట్ వ్యక్తం చేసి.... 14 రోజులు ఎటైనా క్వారంటైన్ లో ఊరేగు ఫో... అని ఆవిడ గారు కైలాసం తలుపులు మొహంమ్మీదే మూసేశారు. నాకే ఎంట్రీ లేదురా అంటే, నాకు తోడు సోమలింగానికి నువ్వొకడికి జమయ్యావు. ఎవరికి చెప్పుకోవాల్రా నా బాధలు?’

ఓ మై గాడ్. మీకే ఇన్ని కష్టాలొచ్చాయా సార్. దిసీజ్ టూ బ్యాడ్, సార్. ఇప్పుడు వాటీజ్ టు బి డన్, సార్?’

ఆగు, ఇంకొకడెవడో తిన్నదరక్క వజ్రాసనంలో కూచుని, శివ అంటున్నాడు, నేనొస్తా, బై, టేక్ కేర్

ఓకే సార్, హ్యావ్ ఏ నైస్ క్వారంటైన్ టైమ్. ఎంజాయ్!