‘స్వామిజీ, ఒకప్పుడు ఒక ఐడియా జీవితాన్ని మార్చేది. అదేం చిత్రమో, ఒక్క వైరస్ నా జీవితాన్ని తలకిందులు చేసింది. భవబంధాల్ని తెంచేసుకుని, ఆశ్రమ జీవితంలోకి అరంగేట్రం చేయించింది. ఐతే, నాదో ధర్మ సందేహం. కరోనా వస్తే క్వారంటైను, లాక్డౌనులేవో వచ్చాయి. మరి, తపస్సు చేస్తే ఏమొస్తుందంటారు?’
‘ఏముందోయ్. ఎడాపెడా చేస్తే నిద్ర. ఏకాగ్రతతో చేస్తే జ్ఞానం. నిద్ర స్థితి తుచ్ఛమైంది. జ్ఞాన సిద్ధి ఉత్కృష్టమైంది. స్థూలంగా, తపఃఫలాలు ఈ రెండే, నాయనా.’
‘లాక్డౌన్ కాలంలో నిద్ర మత్తు నిత్యం అనుభవైకవేద్యమే. ఐనా, సగం జీవితాన్ని నిద్రకే అర్పించా. ఈ క్వారంటైన్ బద్ధక జీవితపు విముక్తి కోసమే మిమ్మల్ని ఆశ్రయించా. కానీ, స్వామీజీ, ధ్యానంలో జ్ఞానోదయమైందని తెలిసేదెలా? న్యూాటన్ మహాశయునిలాగా, ఏ యాపిల్ పండో నెత్తిన పడితేనేగానీ జ్ఞానబల్బు వెలిగిందనే విషయం తెలీదంటారా? లేక, ముఖంలో తేజస్సు, శిరస్సు వెనక కాంతిపుంజంలాంటివేమైనా దర్శనమిస్తాయంటారా?’
‘హహ్హా! తలపై యాపిల్ పడ్డప్పుడో; తొట్టెలో నీళ్లు ఒలికినప్పుడో మెరుపులా తట్టేవి ఐడియాలోయ్. జ్ఞానజ్యోతి కథ వేరులే. ఈ సమస్త విశ్వం తాలూకు సమగ్ర తత్వం బోధపడితేనే జ్ఞానోదయం. ఆ తత్వం అంతుచిక్కనంతవరకు బతుకంతా అజ్ఞానాంధకార బంధురమే.’
‘అజ్ఞానంతో నాది దశాబ్దాల బంధంలే, స్వామీజీ. ఇక కరోనా రాకతో జీవితంలో నిర్వేదం అలముకుంది. అందుకే, బుద్ధిని కప్పేసిన తమస్సును తొలగించే తత్వాన్ని ఒడిసిపట్టే మార్గం చూపి పుణ్యం కట్టుకోండి.’
‘అసతోమా సద్గమయా! అంటే, సత్యమార్గాన్ని చూపే తత్వశాస్త్రాన్ని ఔపోశన పట్టాలి. చీకట్లో నడిచే మనిషికి తత్వశాస్త్రమనేది టార్చిలైటుగా దారి చూపుతుంది, నాయనా.’
‘కానీ గురూజీ, ఫిలాసఫీ అనేది బూజు పట్టిన కాలజ్ఞానమనీ; ఫిలాసఫర్ అనే మాటొక వెటకారపు తిట్టు అనుకునే రోజులివి. అసలీ తత్వశాస్త్రానికి సరైన భాషణమేంటంటారు?’
‘గొప్ప సందేహాన్నే సంధించావోయ్! ప్రకృతి అనంతమైంది, పైగా విశిష్టమైంది. అన్నట్టు, ప్రకృతి నిండా పదార్థమే. ఆ పాదార్థిక భౌతిక ధర్మాలను శోధించేదే ఫిజిక్స్. రసాయనిక నియమాలను నిగ్గుతేల్చేదే కెమిస్ట్రీ. జీవ ధర్మాలను అధ్యయనం చేసేదే బయాలజీ. ఇలా పదార్థం తాలూకు అనేక నిగూఢ రహస్యాలను శోధించే శాస్రాలెన్నో. ఆ శాస్త్రాలు వెల్లడించే సత్యాలెన్నో. ఐతే, అవన్నీ కూడా ప్రకృతి తాలూకు నిర్దిష్ట సత్యాలు మాత్రమే. ఆ నిర్దిష్ట సత్యాలను వెల్లడించే శాస్త్రాలన్నింటినీ దండగా గుదిగుచ్చి పరిపూర్ణ సత్యాన్ని బోధించి, జీవితానికి మార్గదర్శకం చేసేదే తత్వశాస్త్రమోయ్. నిర్దిష్ట సత్యాన్ని శోధించి, సాధించేవాడు శాస్త్రవేత్త. పరిపూర్ణ సత్యాన్ని ఆవిష్కరించేవాడు తత్వవేత్త.’
‘ఆహా..! మన జీవిత కురుక్షేత్ర సంగ్రామంలో తత్వశాస్త్రమొక బ్రహ్మాస్త్రమంటారైతే. సరే, ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడే విధివిధానాలేంంటో సెలవీయండి, స్వామీ.’
‘ఈ సృష్టిలో శాశ్వతమైంది ఏదీ లేదోయ్. ప్రతిదీ చలనంలో ఉంటుందన్నట్టు. ఇక, మంచీచెడూ, కష్టసుఖాలు, పగలూరేయీ, బొమ్మాబొరుసూ, ఆటుపోటు, చావుపుట్టుకలు.. ఇలా ప్రతీదీ ద్వంద్వాత్మకమే. మార్పు, ద్వంద్వం.. ఈ రెండే ఫిలాసఫీ తాలూకు మౌలిక ధర్మాలు. ఈ ధర్మసూక్ష్మం పట్టుబడితే చాలు, ఫిలాసఫీ దన్నుతో ప్రకృతిలో దేన్నైనా తూర్పారబట్టి, అసలు సారాన్ని అట్టే గ్రహించవచ్చునోయ్.’
‘ఔరా, నిజమా?! ఐతే, కరోనా మహమ్మారికి సైతం ఫిలసాఫికల్ భాష్యం చెప్పవచ్చునా, గురూజీ?’
‘ఓహ్, భేషుగ్గా. ఒకప్పుడు ప్లేగు. ఆపై మశూచి. అటు పిమ్మట కలరా. నేడు కరోనా. ఇదీ మహమ్మారీ క్రిముల మార్పు తాలూకు పరిణామక్రమ చిత్రపటం. ఏదీ శాశ్వతం కాదు, మార్పు తప్పదని రూఢీ చేసే ఘటనలివి. ఇక కరోనా దేశాదేశానికీ కొత్త రూపురేఖలతో ప్రత్యక్షమవుతోంది. నిత్య పరివర్తనమే కరోనా తత్వం. బ్రహ్మాండానికే కాదు, అణువుకూ మహత్తరశక్తి కలదని ఆటంబాంబు చూపింది. రాక్షసబల్లులకే కాదు, వైరస్సకూ అంతే అఖండ శక్తి కలదని కరోనాతో రుజువైంది. ప్రకృతిలోని అంతర్లీన ద్వంద్వ స్వభావమిది. కరోనా రాకతో... మానవాళికి క్వారంటైన్ వాసం దక్కింది. ప్రకృతికి స్వేచ్ఛ లభించింది. మనుషుల్లో అహంకారం తగ్గింది. అప్రమత్తత పెరిగింది. జీవితంలో విశృంఖలత్వం-విలాసాలే కాదు, ఒద్దిక-విలాపాలు కూడా ఉంటాయనే నిష్టురసత్యం ప్రపంచానికి ఎరుకలోకి వచ్చింది. కరోనాకు పేదా పెద్దా తేడాలుండవనీ; మహమ్మారి దేశాల ఎల్లలు చూడదనీ తెలిసొచ్చింది. ప్రకతిలో సమస్థితి వచ్చింది. మనిషికి స్థితప్రజ్ఞత అలవడింది.’
‘ఆహా... సూక్ష్మంలో మోక్షం దర్శనం చేయించారు, స్వామీజీ. చివరాఖరుగా, ఈ కరోనాతో మానవాళి గమ్యం గమనం ఏ సుదూర తీరాలకు దారితీయనుందో భవిష్యద్ధర్శనం చేసి, కాస్త తత్వబోధ చేయండి.’
‘ఏముందోయ్. మార్పు తథ్యం. మార్పే సత్యం. ఒకనాటి ప్లేగు, మశూచి, పోలియోలు ఈనాడు లేవు. కరోనాకైనా అదే సూత్రం. కాకపోతే, కొంతకాలం సహజీనవ సూత్రం తప్పదేమో. శక్తియుక్తుల కన్నా, పరిస్థితులకు తగ్గట్టు ఒదిగిపోయే గుణమే ఏ ప్రాణికైనా శ్రీరామరక్ష అంటాడు డార్విన్ మహాశయుడు. ఈ విషయంలో మనిషి ఓ మెట్టు పైనే ఉంటాడాయే. ఎక్కడ తగ్గాలో, ఎలా నెగ్గాలో రెండూ తెలిసినవాడే మనిషి. కాబట్టి, ఇప్పటికిప్పుడు మానవాళికొచ్చిన ముప్పేమీ లేదోయ్.’
‘హమ్మయ్యా! ధన్యోస్మి గురూజీ!!’
No comments:
Post a Comment