Thursday, 7 May 2020

గీత బోధ!

‘నమస్తే, డాక్టర్!’

‘నమస్తే. చెప్పండి.’

‘ఏం చెప్పమంటారు డాక్టర్. ఒకప్పుడు కృష్ణశాస్త్రి బాధను ప్రపంచం పట్టించుకునేది. అవసరమైతే ప్రపంచం బాధను శ్రీశ్రీ అక్కున చేర్చుకునేవాడు. ప్చ్! కథ మొత్తం అడ్డం తిరిగింది సార్. ఇప్పుడంతా ఒకే కథ. కరోనా వ్యథ. క్వారంటైన్ గాథ. లాక్ డౌన్ బాధ. ఈ కకావికలం... నెవ్వర్బిఫోరూ, ఎవ్వరాఫ్టరండీ.’

‘నీక్కొంచెం తిక్క, ఆ తిక్కకో లెక్క, ఆ లెక్కకో టైమింగు, ఆ టైమింగుకో రైమింగు... ఇలా చాలానే ఉన్నట్టున్నాయ్. ఇండస్ట్రీలో జెండా పాతకపోయావా?’

‘ఊరుకోండి మహానుభావా! నా క్వారంటైన్ ప్రసవ వేదనకే దిక్కు లేదు. ఇక సినీ కళాపోషణ మాట దేవుడెరుగు. జీవితం మరీ బిగ్ బాస్ హౌసులా తయారైంది. పూటకో కష్టం. రోజుకో గండం. ఇవన్నీ రాస్తే రామకోటిని దాటిపోతుంది. తీస్తే కార్తీకదీపం సీరియల్ని మించిపోతుంది. తట్టుకోలేకపోతున్నా సార్.’

‘సర్లేవోయ్. పాండవులకే తప్పలేదు అరణ్య అజ్ఞాతవాసాలు. రాముడంతటి వాడు సైతం వనవాసం తప్పించుకోగలిగాడా? బుద్ధుడైనా బోధిచెట్టు చెంత చిరదీక్షా తపస్సమీక్షణలో బందీ కాలేదా? వాటితో పోలిస్తే నీ క్వారంటైన్ గోడు అసలు ఓ లెక్కలోదేనా? ఊరికే నస కాకపోతే!’

‘ఏంటి సార్ ఈ వివక్ష? సీతమ్మ తల్లిని కాసేపలా పక్కన పెట్టండి. పీత కష్టాలు మాత్రం కష్టాలు కావా? నా కడగండ్లనలా ఆటలో అరటిపండులా, కూరలో కరివేపాకులా తీసిపారేస్తారా?’

‘సరేనయ్యా. చరిత్రలో ఇదేం కొత్త కాదని మాటవరసకి రెండు ఉదంతాలు చెప్పాలే. పోనివ్వు. తమరి బాదరబందీలేవో ఏకరవు పెట్టండిక.’

‘అదో చాంతాడంత చిట్టా సార్. ఇంటిపట్టునుండి ఉట్టినే తినితినీ, పొట్ట చుట్టుకొలత రెట్టింపైంది. ఫోన్లో వైరస్ వార్తలు చూసీచూసీ దగ్గరిచూపు దగ్ధమైంది. బయటి ప్రపంచంతో సంబంధాలు దూరమై దూరపుచూపు దుమ్ము కొట్టుకుపోయింది. సబ్బులేసి రుద్దీ రుద్దీ చేతులు కొలిమిలోంచి తీసిన చింతనిప్పులయ్యాయి. జుట్టు కీకారణ్యమవడంతో ఓ పక్క శిరోభారం, మరోపక్క వినికిడికి అవాంతరం. ముక్కును మాస్కుతో కప్పీ కప్పీ ఏ వాసనా తెలీట్లేదు. పొద్దస్తమానం పద్మాసనమేసి వెన్నులో పోటొచ్చింది. నడక దూరమై కాళ్లల్లో పట్టు తగ్గింది. శ్రమ కరవై ఒళ్లు గుల్లయ్యింది. అంతేనా, కొలెస్ట్రాల్ మేటలేస్తోంది. షుగర్ ఫ్యాక్టరీ మొదలైంది. రక్తపోటు రెండో నెంబరు హెచ్చరిక జారీ చేసింది. హార్టు బీటు కాస్త అపశృతి చేస్తోంది.  థైరాయిడ్ తకధిమి తోం నాట్యం చేస్తోంది. విటమిన్లు పాతాళానికి పడిపోయాయి. మొత్తంగా శరీరం లాక్ డౌనై, ఆరోగ్యం క్వారంటైన్ అయిపోయింది మహాప్రభో!! ’

‘వార్నీ బండబడా! చంపేశావుగా. క్వారంటైన్ మైండ్ ఈజ్ కాళకేయాస్ వర్క్ షాప్ అనే కొత్త సామెతను పుట్టించావు. ఇదంతా గూగుల్ తెచ్చిపెట్టిన తలనొప్పిలే. ఇప్పుడు అందరూ పట్టా లేని డాక్టర్లే. సమాచార సునామీలో చిక్కి సొంత శల్యపరీక్షలకు ఒడిగడుతున్నారు. మిథ్యను సత్యమనుకుంటారు. లేని జబ్బును ఉందనుకుంటారు. అణువంత సమస్యను భూతద్దంలో చూసి బ్రహ్మాండం చేసుకుంటారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అనే నానుడి అతికినట్టు సరిపోతుంది.’

‘ఓ మై గాడ్! టక్కున అంత మాటనేశారేంటి సార్. అసలివి సమస్యలే కావంటారా?’

‘పూర్తిగా కొట్టిపారేసే సమస్యలు కావనుకో. కానీ, అంతలా పట్టించుకోవాల్సినంత ఆరోగ్య విపత్తులైతే కావని నా గట్టి నమ్మకం.’

‘అలా కాదు, డాక్టర్. శరీరమనే కాదు. మనసు కూడా తీవ్రంగా గాయపడింది.  తనివితీరా తుమ్మలేం. ధైర్యంగా దగ్గలేం. అయినవాళ్లతోనూ ఆప్యాయంగా మాట్లాడలేం. మాస్కులేని మనిషిని నమ్మలేం. సాటి మనిషితో సరదాగా గడపలేం. టీవీ చూస్తే భయం. పేపర్ చదివితే ఆందోళన. వైరస్ లెక్కలు చూస్తే డిప్రెషన్. ఓవైపు ఓసిడీ. మరోవైపు వెంటాడే కోవిడ్ విభ్రాంతి. కన్ను తెరిస్తే కరోనా. కన్ను మూస్తే కరోనా. బతుకంతా కలగాపులగపు కరోనా అన్నట్టుంది. ఇప్పుడు చెప్పండి సార్. మానసిక బాధలకు శల్యసారధ్యం వహిస్తున్నానని వీటిని కూడా కొట్టిపారేస్తారా? ’

‘పరిస్థితి కాస్త శృతి మించిందయ్యా. నిజానికిది కరోనా తెచ్చిపెట్టిన క్వారంటైన్ సహిత లాక్ డౌన్ తాలూకు సోషల్ డిస్టెన్స్ వల్ల వచ్చిన సిండ్రొమ్. దీనిపేరు ‘కొవిడ్ ఇండ్యూస్డ్ డెల్యూజనరీ హైపోకాండ్రియాక్ సిండ్రొమ్!’

‘వామ్మో..! అంత పెద్ద జబ్బా? మరి ఇది తగ్గేదెలా, డాక్టర్? ’

‘ప్రస్తుతానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే గీత బోధ. ’

‘అదేంటి డాక్టర్. మనిషి పోయాక కదా, గీత సారం వినిపిస్తారు. జబ్బులకు కూడా గీత బోధ పనిచేస్తుందా?’ 

‘నో నో! నేను చెబుతున్న గీత, సంక్లిష్టమైన భగవద్గీత కాదు. సరళమైన, సూక్ష్మమైన గీత సూత్రం. తరతరాలుగా ఉన్నదే. అదే పెద్దగీత-చిన్నగీత థియరీ. కరోనా అనేది అతి పెద్ద గీత. నీవు ఏకరవు పెట్టిన గోడంతా కలిపి చాలా చిన్న గీత అన్నట్టు. కాబట్టి, అతి చిన్న గీతను మరిచిపో. కావలిస్తే ఆ గీతనే బుర్రలోంచి తుడిచెయ్. కర్కశ కరోనా బారిన పడనందుకు సంతోషించు. ఇక నోటికి మాస్కేసి క్వారంటైన్ చెెయ్. పిచ్చి ఆలోచనలకు తాళమేసి లాక్ డౌన్ చెయ్. నాకు ఫీజు కట్టి బయటకు దయ చెయ్.’ 

‘హ్మ్!’ 

14 comments:

  1. ఒకసారి బుద్ధ అని ఒకసారి నాగ రాజ్ అని వ్రాస్తున్నారు. పాఠకులు కన్‌ఫ్యూజ్ అవుతారేమో ?

    ReplyDelete
  2. ఈనాడులో పది రోజుల వ్యవధిలో రెండో రైటప్ పబ్లిష్ చేయాల్సి వస్తే ఒకే పేరు వద్దంటున్నారండీ.. ఏదైనా పెన్ నేమ్ పెట్టుకోండి, అంటే, ఇలా బుద్ధ అవతారం ఎత్తాల్సి వచ్చిందండీ. థాంక్యూ :)

    ReplyDelete
  3. అదేమి పోలసీ అండీ ఆ పేపర్ వారిది, విచిత్రంగా ఉందే 🤔? ఒకే పేరుతో వ్రాస్తుంటేనే కదా ఆ రచయితకు పేరు నలుగురి నోళ్లల్లో నానుతుంది. ఎప్పటికప్పుడు వేరే వేరే పేర్లతో వ్రాస్తే ఎవరికి గుర్తుంటుంది? ఇలా అయితే అలనాడు “ఆషామాషీ” కబుర్లు వ్రాసిన రావూరు వెంకట సత్యన్నారాయణ గారు, “గొల్లపూడి కాలమ్” వ్రాసిన గొల్లపూడి మారుతి రావు గారు, అమెరికాలో వార్తాపత్రికలలో సెటైర్ రచనల కాలమ్ రచయిత Art Buchwald ..... వీరందరినీ ఈనాటికీ తలుచుకోవడంలా?

    ఏమిటో “ఈనాడు” వారి రూలు?

    ReplyDelete
    Replies
    1. ఏమోనండి.
      వాళ్ల పాలసీ ఎలా ఉందో మరి!

      Delete
    2. నాలుగు నోళ్ళలో రచయిత పేరు నానితే అతని రచనలకు డిమాండ్ పెరుగుతుంది.

      నాలుగు రాళ్లతో తృప్తి పడే జీతగాడు బ్రాండ్ ఇమేజీ పెరిగితే రేటు పెంచమమని అడుగుతాడు.

      నాలుగు చేతులా సంపాయిస్తున్న తాతగారికి అదెలా కుదురుతుంది?

      నాలుగు దశాబ్దాలుగా వ్యాపారసూత్రాలు ఎరిగిన గట్టి పిండం అక్కడ!

      నాలుగు మాటలు మంచీ చెడు చెబుతామని రాసాను.

      Delete
    3. Haha.

      నో కామెంట్స్! థ్యాంక్సండీ!! :)

      Delete
  4. ఈసారి సాక్షిలో రాయండి. అలాగే ఈ బ్లాగ్ లో పబ్లిష్ చెయ్యడం
    మర్చిపోకండి.

    ReplyDelete
    Replies
    1. హహ్హా.
      నేను ఈటీవీ-ఈనాడు ఎంప్లాయ్ నండీ.
      సాక్షిలో రాయడం కుదరదు. థాంక్యూ :)

      Delete
    2. ఎలాగూ పేరు మార్చి రాస్తున్నారు కాబట్టి కుదురుతుందేమో సార్!
      అఫ్కోర్స్ నేను సాక్షి చదవను లెండి. బ్లాగ్ లో పబ్లిష్ చేయడం మరచిపోవద్దని అన్నది అందుకే!

      Delete
    3. పేరు మార్చింది కూడా ఈనాడు కోసం మాత్రమే :)

      బ్లాగులో వేస్తానండీ. ఓ రికార్డుగానైనా పనికొస్తుంది, గుర్తుంటదని!
      థాంక్యూ!

      Delete
  5. Are you sure?
    మీ సంస్ధ వారి మరొక నిబంధనేమన్నా కూడా ఉందేమో కనుక్కుంటే మంచిది కదా? అదే .... పేపర్లో వ్రాసింది బ్లాగుతో సహా వేరెక్కడా ప్రచురించకూడదని, బ్లాగులో వ్రాసుకున్నది పేపర్లో ప్రచురించకూడదనీ.
    ఎంతైనా మీరు ఆ సంస్ధలో ఉద్యోగి కదా, freelance కాదుగా.

    ReplyDelete
    Replies
    1. పేపర్లో పబ్లిష్ అయ్యాక సొంత బ్లాగులో వేసుకోవడానికేమీ ప్రాబ్లం లేదండి. అలాంటి నిబంధనలేమీ లేవు. ఇక, బ్లాగులో రాసుకున్నది బ్లాగు వరకే పరిమితం. పత్రికలో ప్రచురణకు వాటినేమీ పంపట్లేదు.

      Delete
  6. ఒక రచయితకు స్వతంత్రంగా పేరు రావడం ఈనాడులో చూడలేదు.తెలుగు అంటారు కానీ సాహిత్యానికి ఒక పేజీ కూడా ఉండదు.

    సాహితీ పరంగా ఉత్తమ కథలు కవితలు, విమర్శనా వ్యాసాలు ఇలాంటివి ఈనాడులో కనిపించవు.

    ఆంధ్రజ్యోతి సాక్షిలో సాహిత్యానికి సముచిత స్థానం ఉంది.

    ReplyDelete
    Replies
    1. పత్రికలో సాహితీ పేజీ అంటూ లేదు. నిజమే, కానీ ఈనాడు గ్రూపులో విపుల, చతుర, తెలుగు వెలుగు ఇలా ప్రత్యేకంగా మ్యాగజైన్లు ఉన్నాయి కాబట్టి పత్రికలో ప్రత్యేకంగా పెట్టలేదేమో :)

      Delete