‘భక్తా..!’
‘కాదు సార్. నాకే
పొలిటికల్ అఫిలియేషన్సూ లేవు. నేను జస్ట్ మధ్య తరగతి మనిషిని. అంతే. దట్సాల్! ఐనా,
ఇదేం బాగోలేదు సార్, డైరెక్టుగా బెడ్రూంలోకొచ్చి ‘భక్త్..ఆ?’
అని అడగడం. వాటీజ్
దిస్ అండీ? కొంపదీసి, మీరు.... పేస్టులో ఉప్పుందా; హార్పిక్ అబ్బాస్-మస్తాన్ టైపా?’
‘ఓరీ, మూర్ఖపు సన్నాసి! నేను దేవుణ్ని రా!! అది ప్రశ్న
కాదు రా, సిల్లీ ఫెలో. భక్తి కలిగిన వాడా... భక్తా అని
నిన్ను సంబోధించాను రా. ఐనా, ఆ సార్,
సార్ అని సంబోధన
ఏంట్రా? వింటానికే పరమ కంపరంగా ఉంది.’
‘ఓహ్, సారీ సార్. తప్పైంది. ఇక్కడ మా బాస్ ని సార్..
సార్.. అని పిలిచి ఆ మాట డీఫాల్ట్ అయిపోయింది సార్. కాస్త అడ్జస్ట్ చేసుకోండి!
అవును, ఎలా ఉన్నారు,
సార్?’
‘అఘోరించావులే కానీ, నీ తపస్సుకు మెచ్చాను. ఏం కావాలో కోరుకో!’
‘ఛ, ఊరుకోండి సార్, జోకులేయడానికి నేనే దొరికానా మీకు? నేనెప్పుడు తపస్సు చేశా సార్? నాకలాంటి మంచి అలవాట్లు లేవుగా. నా నుండి చాలా
ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మీరు. తర్వాత ఫీలవుతారు, చెప్పలేదనేరు, మీ ఇష్టం.’
‘ఒరేయ్, కుళ్లు జోకులేశావంటే త్రిశూలంతో డొక్కలో
పొడుస్తానేవనుకున్నావో, భడవా. ఐనా, ఇందాక వజ్రాసనంలో కూచుని, నా నామాన్ని స్మరించావు కదరా, వేస్ట్ ఫెలో!’
‘నేనా...? Me...? मैंने क्या किया...?’
‘రేయ్, ఆ సంతూర్ యాడ్ ఓవరాక్షన్లు చేయకు. నాకసలే
కోపమెక్కువ. మూడ్ పాడైందనుకో, మూడో కన్ను తెరిచి
భస్మం చేసి, ఆ బూడిద తీసుకుని, నా నుదుటన నామాలు పెట్టుకుని వెళ్లిపోతా వెధవ.’
‘ఓహ్ సారీ సార్.
మీరూ అచ్చం.. మా బాస్ లానే సార్. అయిందానికీ కానిదానికీ ఒకటే చిరచిర, చిరాకు. ఐనా,
మీరు కూడా
కైలాసానికే బాసేగా? నాకో విషయం తెలీక అడుగుతా సార్. ఈ బాసులంతా ఇంతేనా? కామెడీ,
సారీ, అదే,
హాస్యరసం ఎంజాయ్
చేయరా, సార్?’
‘ఒరేఏఏఏయ్..........’
‘ఆగండాగండి సార్.
విషయం గుర్తొచ్చింది. ఇప్పుడంతా లాక్ డౌన్ టైం కదా సార్. ముప్పూటలా తింటం, సిస్టం ముందు కూచోడం, తోచకపోతే టిక్ టాక్ చేసుకోవడం, కళ్లు కాయలు కాచేలా కునుకేయడం తప్ప డెయిలీ రోటీన్
లో పెద్ద వెరైటీ లేకుండా పోయింది సార్. చాలా చికాగ్గా ఉంది సార్. పైగా, ఈ బొజ్జ ఒకటి - దరిద్రపు సంత - బెలూన్ లా
ఉబ్బిపోతోంది. రెండు వారాలకే ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసింది సార్. మీరు మాత్రం సూపర్
సార్, యుగయుగాలుగా ఎప్పుడూ ఏ ఫొటోలో చూసినా, సిక్స్ ప్యాక్ బాడీతో సల్మాన్ ఉంటారు. ఈ పాడు
పొట్ట గురించే ఆలోచిస్తూ... ఎప్పుడో ఏదో
టీవీలో... తిన్న వెంటనే వజ్రాసనంలో ఓ పది నిమిషాలు కూచుంటే... అజీర్తి సమస్యలు
పోతాయని, పొట్ట తగ్గుద్దని విన్నట్టు గుర్తు. అందుకే, అలా వజ్రాసనంలో కూచున్నా సార్. పనిలో పనిగా, ఏ మూవీ చూద్దామా
అని థింక్ చేస్తూ ‘శివ’ అనుకున్నట్టు గుర్తు. అదీ సార్ సంగతి. ఐనా, మీరేంటి సార్,
మరీ 10 నిమిషాలకే,
అదేదో ఫైరింజన్ వచ్చినట్టు, అలా
వచ్చేస్తారా, వరాలివ్వడానికి? నేను సినిమాల్లో చూసింది కరెక్టే సార్, మీరు మరీ టూ మచ్ లిబరల్ అండ్ జెనరస్, అదే.. భోళా,
సార్’
‘ఏడిశావులే రా, కుంక. ఎక్కువ టైం లేదు గానీ, ఏం కావాలో చెప్పు?’
‘ఆగండి సార్. రాక
రాక వచ్చారు, పైగా ఎండన పడి
వచ్చారు. కాస్త చల్లగా మజ్జిగ తీసుకుంటారా?
పోనీ సుత్తి
లేకుండా సూటిగా అడుగుతాను... sprite
తీసుకుంటారా?’
‘నువ్వెక్కడ
దొరికావు రా, నా ప్రాణానికి?’
‘ఇదన్యాయం సార్.
దేవుళ్లకు కూల్ డ్రింక్స్ ఇచ్చుకునే భక్తుల ప్రాథమిక హక్కును కూడా కాలరాస్తున్నారు
సార్ మీరు? ఇది రాజ్యాంగ
విరుద్ధం సార్. కైలాస విరుద్ధం కూడా. నేను హర్ట్ అయ్యా సార్.’
‘ఏడిశావులే గానీ, గ్రీన్ టీ ఉంటే పట్టుకు రా’
‘కనిపెట్టేశా సార్, హాలాహలానికి ఈక్వలెంట్ గ్రీన్ టీ అన్నమాట.
మీరెప్పుడూ ఇలా కషాయాలే తాగుతారా సార్. పోన్లెండి, తులసి గ్రీన్ టీ ఉంది, తీసుకొస్తానాగండి.
పైగా ‘తులసి’
బ్రాండ్ అమ్మవారికి
కూడా ప్రియమైన పత్రం. ఇలా సోఫాలో కూచుని చిన్న విరామం తీసుకోండి, చిటికెలో గ్రీన్ టీ తెస్తాను.’
‘టీవీ చూసీ చూసీ నీ
బుర్ర పాడైందిరా అబ్బాయ్. అచ్చు తింగరోడిలా మాట్లాడుతున్నావు’
‘ఏం చేయమంటారు సార్, అసలే కరోనా క్వారంటైన్ ఐసోలేషన్ లాక్ డౌన్ టైమాయే.
ఫ్రెండ్సుతో కూచుని కబుర్లు చెప్పుకుని చాల్రోజులైంది. జీవితం మీద విరక్తొస్తోంది
సార్. మీకేంటి సార్, కోపమొచ్చినా, చికాకొచ్చినా,
సంతోషమొచ్చినా..
అన్ని ఎమోషన్లకు చక్కగా అల్లు అర్జున్ లా స్టెప్పులేసి డాన్సు చేసుకుంటారు. నా
ఖర్మకి నేను సూపర్ స్టార్ క్రిష్ణలా కూడా డాన్సులు చేయలేను. జీవితం మరీ బోరింగ్ గా
ఉంది, సార్.’
‘సర్లే గానీ, ఇంట్లో ఎవరూ లేరా?’
‘నెలక్రితమేదో
ఫంక్షనుందని పుట్టింటికెళ్లింది సార్. నన్నూ రమ్మంది సార్. నేనే కాస్త ఓవరాక్షన్
చేసి, ఆఫీసు వర్కుంది, నెక్ట్స్ వీకెండ్ వస్తానని హెచ్చులు పోయా. ఇక్కడిలా అడ్డంగా బుక్కైపోయా.
ఈ ఇల్లు ఊడ్చడం, తుడవడం, పాత్రలు తోమడం,
వంట చేయడం, బట్టలు ఉతుక్కోవడం లాంటివేవీ తెలీకుండా పెరిగిన తుచ్ఛమైన
మగమహారాజు బతుకు సార్ నాది కూడా. ఇంట్లో అమ్మ,
ఇక్కడ ఆవిడ
చేసిపెట్టినన్నాళ్లూ కింగులా గడిచిపోయింది. ఇప్పుడు పైసాకు పనికి రాకుండా పోయింది
సార్ జీవితం. ఒక్కసారి వంట చేసుకుంటే మూడ్రోజులు ఫ్రిజ్జులో పెట్టి తింటున్నా.
కిచెన్లోకి పోతే సింకులోని పాత్రలు మీద పడి
సింకులో పాత్రలు మీద పడి కొడతాయేమోనని అటేపు కూడా చూడట్లేదు. ఏదో టీ షర్ట్, నిక్కరేసుకుని లాగించేస్తున్నా సార్. బయటికొళ్తే
పోలీసులు కొడతారు. ఇంట్లో ఉంటే బోర్ కొడతది. నావల్ల కావట్లేదు సార్. ఈ లాక్ డౌన్
ఎత్తేయగానే ఎవరికీ చెప్పకుండా శంకరగిరి మాన్యాలకు పాదయాత్ర చేసుకుంటూ పోతా, సార్.’
‘హహ్హా! శంకరగిరి
మాన్యాలా? ఇంతకీ అవెక్కడుంటాయో తెలుసా రా నీకు?’
‘ఏముంది సార్, ఫోన్లో జీపీఎస్ స్టార్ట్ చేస్తే అదే తీసుకెళతది.
అది ఈజీ టాస్క్ సార్.’
‘ఓరి నీ బండబడా! ఇలా
తయారై చచ్చారేంట్రా?’
‘ఏదోలెండి సార్.
అన్నట్టు, మేడం,
పిల్లలు బాగున్నారా
సార్?’ నాకో డౌటు సార్. కైలాసంలో కూడా ఈ స్వీపింగు, క్లీనింగు,
వాషింగు, కుకింగ్ లాంటి పనులుంటాయా సర్? ఇవన్నీ ఎవరు చేస్తారు సార్? మేడమా?
మీరా? లేక వర్క్ షేరింగ్ చేసుకుంటారా? మీ దగ్గర కూడా పురుషాధిక్య సమాజమా? లేక ఫెమినిజం ఉందా?’
‘ఒరే సన్నాసి. మేం
దేవుళ్లం రా. అలాంటి తుచ్ఛమైన ఐహిక విషయాలకు మేం అతీతులంలే గానీ. సోది ఆపి, ఏం కావాలో చెప్పమన్నానా?’
‘నిజానికైతే నాకు
పెద్ద కోరికలేం లేవు సార్. మా ప్రధాని మోడీలాగా ఫుల్ ఫిల్డ్ లైఫ్ సార్, నాది. మీరు మరీ మొహమాటపెడుతున్నారు కాబట్టి, ఏదో ఒకటి అడగకపోతే ఫీలవుతారు కాబట్టి, అడుగుతున్నా సార్.’
‘ఒరేయ్ ఈ మధ్యకాలంలో
నీవు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నావా? నీకు కొలెస్ట్రాల్ ఓ రేంజులో ఉన్నట్టుందిరా, వెధవకానా. త్వరగా అడుగు.’
‘వావ్, సూపర్ పంచ్ సార్. మీ గురించి బయట భూలోకంలో, వైకుంఠంలో కాస్త డివైడెడ్ టాక్ ఉంది గానీ సార్, మీ సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ సార్. అన్నట్టు, కైలాసంలో కూడా మనం ’కామెడీ విత్ కపిల్’ షో లాగా; ‘సెన్సాఫ్ హ్యూమరసం విత్ డాన్సర్ శివ’.. అని ఓ ప్రోగ్రాం పెడితే పేలిపోద్ది, సార్?’
‘ఒరేయ్, ఇక్కడితో నీ నాన్ స్టాప్ వాగుడు కట్టిపెట్టకపోతే, నా నందిని,
నాగుపామును వదులుతా, నిన్ను 360 డిగ్రీల్లో
కుళ్లబొడుస్తారెధవ. త్వరగా విషయానికి రా’
‘క్వారంటైన్
టైంలోనైనా మీతో కాసేపు కాలక్షేపం చేద్దామంటే మా ట్రంపులా సుడిగాలి పర్యటనలు
పెట్టుకుంటారెప్పుడూనూ. సరే సార్. ఇక అడిగేస్తా.’
‘హా, అడగవోయ్.’
’చిన్న కోరికే సార్.
ఈ కరోనా, లాక్ డౌన్ లతో వేగలేకుండా ఉన్నా, కాస్త మీతో పాటే నన్ను కూడా కైలాసానికి
తీసుకెళ్లండి సార్. నాకూ ఓ కొత్త ప్లేసు చూసినట్టుంటుంది. మీరూ వరం
ఇచ్చినట్టుంటుంది. కావాలంటే, మీకు డెయిలీ తులసీ
గ్రీన్ టీ చేసి పెడతా సార్. మీ రుణం ఉంచుకొనే మనిషిని గాను నేను.’
‘ఖర్మ రా బాబూ. నీ
కోరిక తీర్చడానికి ప్రస్తుతం కైలాసం
రూల్స్ ఒప్పుకోవురా. ఇంకేదైనా అడుగు’
‘అదేంటి సార్.
కైలాసానికి మీరే కదా సీఈఓ. ఇంక రూల్స్ గురించి ఎవరడుగుతారు సార్. ఇది టూ మచ్ సార్.
నన్ను అవాయిడ్ చేయడానికి మీరేవో సాకులు చెబుతున్నారు. ఇదేం బాగోలేదు సార్. నేను
మళ్లీ హర్టు అవుతా.’
‘ఓరి నీ అఘాయిత్యం
కూలనని. నీకో సీక్రెట్ చెబుతా విని,.
వెంటనే మరిచిపో.
నిజానికి కైలాసానికి సీఈఓ నేనే అయినా,
పవరాఫ్ అటార్నీ
అంతా మా ఆవిడదే. మొన్న నీలాగే ఎవడో దరిద్రుడు శివశివా.. అన్నాడు, ఖాళీగా ఉన్నా కదాని, డమరుకం పట్టుకుని నాట్యం చేసుకుంటూ వచ్చేశా. వాడూ నీలాగే తింగరోడు. ఇలాగే
కబుర్లతో కాలక్షేపం చేశాడు. తీరా వాడికేదో బలుసాకు కావాలంటే ఇచ్చేసి, తిరిగి కైలాసానికి వెళ్లా. తీరా వెళ్లాక
తెలిసింది.. భూలోకంలో కరోనా కరాళనృత్యం చేస్తోందని, అది నాకు వచ్చిందేమోనని డౌట్ వ్యక్తం చేసి.... 14 రోజులు ఎటైనా క్వారంటైన్ లో ఊరేగు ఫో...
అని ఆవిడ గారు కైలాసం తలుపులు మొహంమ్మీదే మూసేశారు. నాకే ఎంట్రీ లేదురా అంటే, నాకు తోడు సోమలింగానికి నువ్వొకడికి జమయ్యావు.
ఎవరికి చెప్పుకోవాల్రా నా బాధలు?’
‘ఓ మై గాడ్. మీకే
ఇన్ని కష్టాలొచ్చాయా సార్. దిసీజ్ టూ బ్యాడ్,
సార్. ఇప్పుడు
వాటీజ్ టు బి డన్, సార్?’
‘ఆగు, ఇంకొకడెవడో తిన్నదరక్క వజ్రాసనంలో కూచుని, శివ అంటున్నాడు, నేనొస్తా, బై, టేక్ కేర్’
‘ఓకే సార్, హ్యావ్ ఏ నైస్ క్వారంటైన్ టైమ్. ఎంజాయ్!’