(Plz read lighter vein satire in today's EENADU edit page regarding Swachcha Bharat, thank you)
మరక మంచిదే అన్నది యూపీఏ
అధికారిక నినాదం! అవును మరి, వారిదొక మహా మురికి చరిత్ర, పైగా ఎవరి మురికి
వారికి మహదానందమాయె! ఇక, మురికిని ఉతికారేస్తానంటాడు మోడీభాయ్. అవునవును, ఉతకడంలో
ఉన్న కిక్కే వేరు. మొన్న జపాన్ పర్యటనలో అక్కడి శుచీ శుభ్రతకు అచ్చెరువొందిన
ఛాయివాలా ఇండియాకొచ్చాక దేశానికి పట్టిన మురికిని కడిగి పారేయాలని బలమైన కంకణం ఒకటి
కట్టుకు తిరుగుతున్నారు. దీంతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ‘స్వచ్ఛ భారత్’ పేరిట శంఖారావం చేసి, ఓ సభ పెట్టి, అన్నీ పార్టీల అధినేతలను
హాజరు కమ్మని కబురెట్టాడు.
పదవి లేక,
పెళ్లి అవక కొంతకాలంగా శంకరగిరి మాన్యాల్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్న శ్రీమాన్
రాహుల్ బాబు వెంటనే రాజమాత పాదధూళిని నెత్తిన ఆశీర్వాదంగా చల్లుకుని, మాసిన చొక్కా
వేసుకుని, నెరసిన గెడ్డంతో హాజరయ్యారు. ఇహ ‘తాట తీస్తా, తుక్కు రేపుతా’ అని హస్తినలో హల్ చల్ చేసి, తీరా ష్.. గప్ చుప్ అయిపోయిన క్రేజీవాలా చిరిగిన టోపీ,
విరిగిన చీపురు చేత పట్టుకుని, మఫ్లర్ కనిపించకపోవడంతో చెవుల్లో దూది పెట్టుకుని
వేంచేశారు. వంగదేశంలో లంగరెత్తి, తెరచాప ఎగరేసి పేరిణీ తాండవం చేస్తున్న దీదీ నారచీరలో
ముతక సంచి ఒకటి భుజాన వేలాడేసుకుని కాషాయం పార్టీపై కారాలు మిరియాలు నూరుతూ చక్కా వచ్చేశారు.
స్మార్టు పాలనపై కసరత్తు కోసం సింగపూర్ వెళ్తూండగా మార్గమధ్యంలో ఫోన్ రావడంతో
విమానాన్ని ఢిల్లీకి మళ్లించి బాబు కూడా సభా స్థలికి చేరుకున్నారు. ఫాంహౌజులో
లాభసాటి పూలసాగులో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న గులాబీ దళపతి కూడా నిజాం కాలంనాటి
ఓ కారేసుకుని రయ్ మని వాలిపోయారు. ఎన్నికల తర్వాత అస్సలు పనీపాడూ లేక ఇడుపులపాయలో
గోళ్లు గిళ్లుకుంటూ సొంత ఓదార్పు చేసుకుంటున్న యువనేత కూడా కుయ్..కుయ్...మని శబ్దం
చేసే అంబులెన్స్ వేసుకుని వచ్చేశారు. సభ మొదలైంది. మోడీ గళం విప్పాడు.
‘మిత్రులారా!
నేడెంతో సుదినం. ఇక ముందున్నదంతా మంచికాలమే. సబ్ కే లియే,
మై అచ్ఛే దిన్ లావుంగా. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది బూజు పట్టిన పాలసీ. విదేశాల్లో
విజయవిహారం చేసి స్వదేశంలో మంగళయానం చేయాలన్నది నా పాలసీ.’
‘మోడీ మహాశయా!
మీ ఊకదంపుడేంటి? ఆ సుదీర్ఘ ఉపోద్ఘాతాలేంటి? నేను భూటాన్
వెళ్లాను, బాకా ఊదాను. బ్రెజిల్ వెళ్లాను, సాంబా నృత్యం చేశాను. జపాన్ వెళ్లాను, డప్పూ
డోలూ వాయించాను... ఇట్టాంటి పోచికోలు కబుర్లన్నీ మీరు ట్విట్టర్లో తీరిగ్గా రాసుకోండి.
మాకెందుకండీ మీ స్వోత్కర్ష. అసలీ సభ ఎందుకు ఏర్పాటు చేశారో కాస్త తొందరగా సెలవియ్యండి.
ఎక్కువసేపు జనాల మధ్య ఉండవద్దబ్బాయీ, నీవసలే తింగరోడివి, తిక్కతిక్కగా ఏదేదో వాగేసి,
మీడియాకి అడ్డంగా దొరికిపోతావని మా అమ్మా, చెల్లీ అదేపనిగా హెచ్చరిక చెప్పి మరీ నన్నిక్కడకు
సాగనంపార’’’ని నిద్రమత్తులో నిజం
వాగేసి నాలిక్కరుచుకున్నాడు రాహుల్ బాబు.
‘హతవిధీ! బేటా రాహుల్!
నిన్ను మార్చడం అంతర్వాణిని పట్టుకువేళాడే మీ అమ్మకే
కాదు, ఆ దేవదేవుడి తరం కూడా కాదయ్యా. సరే, అసలు విషయానికొస్తే, మీ పదేళ్ల పాలనలో దేశాన్ని
కుక్కలు చింపిన విస్తరి చేసి వదిలేశారుగా. ఆ చెత్తాచెదారాన్నంతా ఊడ్చిపారేసేందుకు నేను
నడుం బిగించాను. స్వచ్ఛ భారత్ సాధన కోసం మీరందరూ వారానికి రెండు గంటల చొప్పున,
ఏడాదికి వంద గంటలు నాకోసం, దేశం కోసం కేటాయించాలని సవినయంగా మనవి చేసుకుంటున్నా’.
‘మోడీభాయ్! ఏంటీ దారుణం? అన్నా పాయే, అవినీతి పాయె, ఆమ్ ఆద్మీ పాయె,
చివరకు ఢిల్లీ కూడా చేజారిపాయె. ఇక మాకు మిగిలిందల్లా గల్లీ రోడ్లల్లో చెత్తా
చెదారం ఊడ్చుకోవడమే. చీపురు పార్టీకి స్వత:సిద్ధంగా సంక్రమించిన ప్రాథమిక హక్కును
కూడా పాశవికంగా కాలరాస్తారా అధ్యక్షా. నేను తీవ్రాతితీవ్రంగా హర్టయ్యా. సభ నుండి
వాకౌట్ చేస్తున్నా’నని టోపీ తీసి
నేలకేసి గిరాటు కొట్టి, చీపురు పట్టుకుని, ముక్కు చీదుకుంటూ వెళ్లిపోయాడు
ఝాడూవాలా.
‘మోడీ గారు!
మీ శ్రమదానం కాన్సెప్టు నాకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది.
చెప్పుకోకూడదు గానీ, ఈ కాన్సెప్టు నాదే. ఇంకా చెప్పాలంటే ఇట్టాంటి దుమ్మురేపే ఐడియాలు
నా బుర్రలో కుప్పలుతెప్పలుగా కునుకుతీస్తూ పడున్నాయి. అమలుకు సమయం లేక
పక్కనెట్టేశా. మీకు నాదో ఉచిత సలహా. ఈ రకంగా చీపుర్లు పట్టుకుని ఊడ్చుకుంటూ కూచుంటే
మీకు, జనాలకు నడుంనొప్పి వస్తుందే తప్ప, పైసా ఫలితం ఉండదు. అందుకే మొత్తం ఈ
ప్రాజెక్టునంతా సింగపూర్ కంపెనీలకు కాంట్రాక్టుకివ్వండి. వాళ్లు రెండునెలల్లో
స్వచ్ఛ భారత్ ను మీ చేతుల్లో పెడతారు. మీకు ఓకే అయితే చెప్పండి, సింగపూర్ ప్రభుత్వంతో
నేను మాట్లాడతాన’ని చెప్పి, జై
జన్మభూమి, జై సింగపూర్ అంటూ నినాదాలు చేస్తూ విమానమెక్కి బుల్లెట్టులా
దూసుకుపోయారు బాబు.
‘మోడీ దాదా!
ఇప్పటిదాకా నాకు ఎరుపు మాత్రమే ఎలర్జీ అనుకునేదాన్ని. కానీ
ఈమధ్య కాషాయం కూడా పడట్లేదెందుకో. నాది ఒకే ఒక్క డిమాండ్. మీరు అమిత్ భాయ్ తో
మాటాడి, అతణ్ని మరో అయిదేళ్లపాటు బెంగాల్లో అడుగుపెట్టనివ్వనని హామీ ఇవ్వండి.
మీకెవ్వరికీ పిసరంత శ్రమ లేకుండా కొడవలి పీకల మీద పెట్టిమరీ మా బెంగాల్
లెఫ్టిస్టులతో మొత్తం దేశాన్నంతా క్లీన్ చేయించే పూచీ నాదీ’ అంటూ గొప్ప వరం ఒకటి ప్రకటించి మాయమైపోయారు దీదీ.
‘అయ్యా మోడీ గారూ! మహానేత ఎప్పుడూ
చెబుతుండేవారు... పారిశుధ్యం పరిఢవిల్లిననాడే ప్రజలకు నిజమైన పండగ దినమని. ఆ
మహానేత కలల్ని సాకారం చేయడానికి దిగివచ్చిన దేవుడు స్వామీ మీరు. అయితే, నాదొక
చిన్న విన్నపం. శ్రీకృష్ణజన్మస్థానప్రాప్తి కలిగించననే ఒకే ఒక్క భరోసా ఇవ్వండి
చాలు నాకు. మీ స్వచ్ఛ భారత్ కార్యక్రమ ఖర్చుల కోసం నా వేయిన్నొక్క స్విస్సు
బ్యాంకు ఖాతాల్లో కొన్నింటిని త్యాగం చేస్తా’నని ఆవేశంగా ఎడమచేయిని గాల్లోకెత్తి, కుడిచేతి వేళ్లను
ఫ్యాన్ రూపంలో గిరగిరా తిప్పుతూ ‘పుదుచ్చితలైవి’ని ఓదార్చడానికి అరవదేశం వైపు సుడిగాలిలా వెళ్లిపోయారు.
‘చూడండి, మోడీ బై! తెల్లదొరల తిక్క కుదర్చడానికి
మా నిజాం నవాబు అప్పట్లోనే రోల్సు రాయిస్ కారుకి చీపుర్లు కట్టి వీధులు
ఊడ్పించాడు. చెప్పాలంటే, అసలది దుమ్మురేపే ఐడియా అన్నట్టు. ఫాంహౌసులో పారిశుధ్యం
ఇలా చేయబట్టే దిమ్మతిరిగే దిగుబడి సాధిస్తున్నాం. మీరు కూడా కారు-చీపురు సూత్రం అనుసరించండి. ఓ పక్క పారిశుధ్యం, మరోపక్క
కడపులో చల్ల కదలకుండా కార్లో కూచుని ప్రచారం. అంతే. ఖేల్ ఖతమ్, దుకాణ్ బంద్.
బేఫికర్’ అంటూ
కార్చిచ్చులాంటి ఐడియా ఇచ్చేసి, కారు గుర్తుకే మీ ఓటు అంటూ కారేసుకుని
షికారుకెళ్లిపోయారు.
‘ఏమైంది? వీళ్లంతా ఏమైపోయారు? కాస్త కునుకు పడితే, కలలో
ప్రధానమంత్రి అయిపోయినట్టు మంచి కల ఒకటి వచ్చింది మోడీ భాయ్. సరే మరి, నాకు
నిద్రకు టైమైంది. వెళ్లొస్తాను. ఇంటివద్ద నా రాకకోసం అమ్మ ఆందోళన పడుతూ ఉంటుంద’ని చెప్పి కళ్లద్దాలు తుడుచుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ
వెళ్లిపోయాడు రాహుల్ బాబు.
ఛస్, వీళ్లను మార్చడం నా వల్ల కాదని చెప్పి అట్నుండి అటే విమానమెక్కి ఇంకో విదేశీ యాత్రకు వెళ్లిపోయారు మోడీ భాయ్.
ఛస్, వీళ్లను మార్చడం నా వల్ల కాదని చెప్పి అట్నుండి అటే విమానమెక్కి ఇంకో విదేశీ యాత్రకు వెళ్లిపోయారు మోడీ భాయ్.
No comments:
Post a Comment