Monday, 1 September 2014

బకెట్ మే సవాల్!!

[ఐస్ బకెట్ ఛాలెంజి.. ఎబోలా వైరస్ కంటే ఫాస్ట్ గా ప్రపంచాన్ని చుట్టబెడుతున్న నేపథ్యంలో మన రాజకీయ నాయకులు ఇంకొన్ని ఛాలెంజెస్ విసిరితే ఎలా ఉంటుందో ఊహించి రాసిందే ఈ బకెట్ మే సవాల్. ఇవాళ ఈనాడు ఎడిటోరియల్ పేజీలో పబ్లిష్ అయిన సెటైర్ ఇది.]



తంతే బూరెల బుట్టలో పడ్డావని ఓ సామెత. పక్కోణ్ని తన్ని మనం బూరెల బుట్టలో పడ్డం గురించి ఎప్పుడైనా విన్నామా?! ఐస్ బకెట్ ఛాలెంజిని కనిపెట్టిన మహాశయుడు ఆ కోవకే చెందిన వ్యక్తే. దమ్ముంటే, బకెట్టు నిండా గడ్డకట్టిన చన్నీళ్లని మీ నెత్తిన పోసుకోండి? మీ వల్ల కాదంటే, తలమీద ఓ తడిగుడ్డ వేసుకుని వంద డాలర్లు సమర్పించుకోండి. ఇదీ సవాల్! బస్తీమే సవాళ్లన్నింటినీ తలదన్నే తాతలాంటి సవాల్ ఇది. ఈ తతంగం ఎందుకయ్యా అంటే, ఓ నరాల బలహీనత వ్యాధి సహాయార్థం అన్నది అసలు సిసలైన కొసరు విషయం. మీకు గుర్తుందా, మొన్నామధ్య ఆఫ్రికా ఖండాన్ని ఎబోలా వైరస్సేదో ఉఫ్..మని ఆఫ్రికాని ఊపేస్తోందని, మైకు మింగిన కోడిపుంజులా మీడియా గోలగోల పెట్టి ప్రపంచాన్ని వణికించేసింది కదా. ఈ బకెట్లో చెలరేగిన తుపాను దెబ్బకు పాపం, ఆ ఎబోలా వైరస్ సైతం బిక్కచచ్చిపోయి, తోకముడిచి తుర్రుమంది. ప్రస్తుతం నెత్తిన నీళ్లు గుమ్మరించుకునే ఈ సవాల్ యావత్ ప్రపంచాన్ని సునామీలా ముంచెత్తుతోంది. సుడిగాలిలా చుట్టబెట్టోస్తోంది. కుల, మత, ప్రాంత, భాష, జాతి, వర్గాలకతీతంగా ఐక్యతను సాధించి ప్రపంచ జనమంతా నేడు బకెట్ నీళ్లలో తడిసి తలమునకలవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రముఖులు వినూత్నంగా ఎలాంటి ఛాలెంజీలు విసురుతున్నారో వారి మాటల్లో విందాం. 

ఒబామా: ప్రపంచ పెద్దన్న అమెరికా ఏం చేసినా అది లోకకళ్యాణం కోసమే. ఆనాడు హిరోషిమా, నాగసాకి మీద ఉత్తిపుణ్యానికే అణుబాంబులేసినా, దశాబ్దాల తరబడి సోవియట్ యూనియన్ మీద దుమ్మెత్తిపోసినా, నేడు గల్ఫ్ ప్రాంతాన్ని గప్ చుప్ గా తిమింగలంలా మింగేసినా... ఇలా మేమేం చేసినా అది ప్రపంచ శాంతి కోసమే సుమీ. నేడు ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటో తెలుసా? పేదరికమో, ఆర్థిక మాంద్యమో, గ్లోబల్ వార్మింగో, వ్యాధుల విలయతాండవమో అని ఎవరన్నా అంటే పప్పులో కాలేసినట్టే. ఇవాళ మానవాళికి అతి పెద్ద శత్రువు రంగూరూపూ, తలాతోకా, స్థలకాలాలు ఇవేవీ లేని, తెలీని ఉగ్రవాద భూతం. టెర్రరిజం గుట్టు ఒక్క అమెరికాకే తెలుసు. అందుకే ఒక్కొక్క దేశాన్నీ ఎంచుకుని మరీ మా మరఫిరంగుల తూటాల వర్షంతో జడిపించి, దెయ్యం విడిపించి, స్వస్థత చేకూరుస్తామన్నమాట. ఆ రకంగా ఉగ్రవాదాన్ని భూగోళం నుండి తరిమి తరిమికొట్టాలన్నది మా బృహత్ ప్రయత్నం. అందుకోసం ప్రపంచానికి మేం విసురుతున్న సవాల్ పేరు ‘‘డ్రోన్ బకెట్ ఛాలెంజి’’

జయలలిత: నా దారి రహదారి. అడ్డొస్తే లాఠీలతో పంచె ఊడేలా కుళ్లబొడిచి సెల్లో పారేయిస్తా. అర్థం కాలేదా? అయితే నా దెబ్బకు మూలన పడి, మంచం పట్టిన ఆ నల్ల కళ్లజోడు మనిషిని అడగండి. కథంతా కూలంకషంగా చెబుతారు. ఇక అసలు విషయానికొద్దాం. అమెరికాకి యుద్ధం బ్రాండు. ఆంధ్రాకి ఆవకాయ బ్రాండు. బీహారుకి గడ్డీగాదం బ్రాండు. బెంగాలుకి రాయల్ టైగర్ బ్రాండు. కానీ తమిళనాడుకు మాత్రం నేనే బ్రాండు. అదే అమ్మ బ్రాండు. గుండు పిన్ను నుండి గ్లోబలైజేషను దాకా అన్నింటినీ అమ్మమయం చేయడమే నా తక్షణ కర్తవ్యం. తమిళనాట అమ్మ పేరును అరవానికి ప్రత్యామ్నాయంగా మార్చడమే నా జీవిత ధ్యేయం. ఆ నల్ల కళ్లజోడుకు నేను విసిరే సవాల్ పేరు ‘‘బ్రాండు బకెట్టు ఛాలెంజి’’.

రాహుల్: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. భవిష్యత్తులో నేను రాయబోయే నా ఆత్మకథ పుస్తకం పేరు అది. నానమ్మ, నాన్న అనుకోని రీతిలో బకెట్ తన్నేశాక ఈ పాడు రాజకీయాల్లోకి అస్సలు రాకూడదనుకున్నా, కానీ వచ్చేశా. ఎలాగూ వచ్చాం కదా కనీసం ప్రధాని అవుదామనుకున్నా, కానీ ఆ ప్రాప్తం లేకపోయింది. పోనీ పార్టీలోనైనా చక్రం తిప్పుదామనుకున్నా, కానీ ఏకంగా చెయ్యే విరిగింది. చేసేదేం లేక, చివరకు పెళ్లి చేసుకునైనా దేశాంతరం పట్టుకుని పోదామనుకున్నా, ఏవిటో అదీ కుదిరి చావలేదు. ఈ రకంగా నా హస్తవాసిలో చక్రాలు, శంకులూ అన్నీ ఏడాపెడా, ఎలా పడితే అలా, అడ్డదిడ్డంగా తిరుగుతున్నా సరే, పార్టీ పగ్గాల్ని తిరిగి నా చేతికే అప్పగించాలని తీర్మానించారు మా తింగరి కురువృద్ధులు. ఈ లెక్కన హస్తం పార్టీ పాలిట నాది భస్మాసురహస్తం అవదు కదా అనే అనుమానం పెనుభూతంలా పట్టి పీడిస్తోంది. అందుకే నాకు నేనే వేసుకుంటున్న సవాల్ ‘‘డ్యామిట్ బకెట్టు ఛాలెంజి’’.


మమత: నాకు ఫైర్ బ్రాండ్ అని ముద్దుపేరు. నిజమే. నేనెక్కడున్నా అక్కడ నిప్పు రాజేసి, చిచ్చు పెట్టి, చలి కాచుకోవడమే నా మేనరిజం. యూపీఏ పాలిట పక్కలో బల్లెంలా, పంటి కింద రాయిలా, చెవిలో జోరీగలా తయారై వారిని ముప్పు తిప్పలు పెట్టి ముప్ఫై చెరువుల నీళ్లు తాగించిన ఘనత నాదే. ఇహ దశాబ్దాల తరబడిగా వంగదేశంలో పాగా వేసి పాతుకుపోయిన ఎర్రకోట పునాదుల్ని బద్ధలు కొట్టి బదాబదలు చేసిన ఖ్యాతీ నాదే. కామ్రేడ్ల కార్మికవర్గ నియంతృత్వ సుదూర స్వప్నానికి ధీటుగా బెంగాల్లో నిరాడంబర దీదీ నియంతృత్వాన్ని స్థాపించాలన్నది నా కల. కానీ ఈ ఛాయివాలా పార్టీ చాపకింద నీరుగా వంగదేశంలోకి చొరబడి ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. అందుకే కరడు గట్టిన లెఫ్టిస్టులకు, రైటిస్టులకు మధ్య కయ్యం పెట్టి పని కానిచ్చుకోవాలిప్పుడు. ఈ నేపథ్యంలో దాదాలకు దీదీ విసరుతున్న సవాల్ ‘‘లెఫ్ట్ రైట్ బకెట్ ఛాలెంజి’’. 


No comments:

Post a Comment