Tuesday, 7 October 2014

కార్టూనిస్టు శ్రీధర్ గారితో కాసేపు..!

డిగ్రీలోనో, అంతకుముందేనో, ఎప్పుడు మొదలైందో సరిగ్గా గుర్తు లేదు గానీ, ఉబుసుపోని సినిమా న్యూస్ కోసమో లేదంటే, ఇష్టమైన స్పోర్ట్స్ న్యూస్ కోసమో పొద్దుపొద్దున్నే చాయ్ బండి దగ్గరకెళ్లి, వేడి వేడి టీ తాగుతూ ఈనాడు చదవడమనే ఓ జాఢ్యం అంటుకుంది. అప్పటికింకా పొలిటికల్ న్యూస్ పెద్దగా ఒంటికి పడేవి కావు. ఐతే, చలసాని ప్రసాదరావు గారి ‘‘కబుర్లు’’ అనే ఎడిటోరియల్ పేజీ హాస్య-వ్యంగ్య రస గుళికల్ని మాత్రం ఎలాగోలా చప్పరించడం తెలీకుండానే అలవాటైపోయింది. నా మట్టుకు నాకు, ఇవి పోగా, ఈనాడులో చదవదగ్గది, చూడదగ్గది ఏదన్నా ఉందా అంటే అవి శ్రీధర్ గారి పొలిటికల్ కార్టూన్లు. పదునైన గీతలు + పంచ్ రాతలు = శ్రీధర్ కార్టూన్లు అని ఓ రఫ్ సూత్రీకరణ!

ఇప్పటికీ బాగా గుర్తు.
అప్పుడెప్పుడో అవినీతి గురించి శ్రీధర్ కార్టూన్ ఎలా ఉంటుందంటే....
1960లలో... నెహ్రూ ఓ పెద్ద కర్ర పైకెత్తి, అవినీతి అనే చిన్ని పామును కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు.../కట్ చేస్తే.../
1980లలో... అవినీతి అనబడు చిన్నపాము కాస్త, పెరిగి పెద్దదయ్యుంటుంది... ఇందిరాగాంధీ బూర ఊదుతూ ఆ పామును మచ్చిక చేస్కోడానికి ప్రయత్నిస్తూంటుంది.. /కట్ చేస్తే/
1990లలో... ఈసారి అవినీతి పామే బూర పట్టుకుని ఊదుతూ... రాజీవ్ గాంధీని ఆడిస్తుంటుంది...
కాంగ్రెస్ హయాంలో అవినీతి ఎంతలా పెరిగి పెద్దయిపోయి బుసలు కొడుతోందో చెప్పే ఈ కార్టూన్ అలా మనసులో ముద్రితమైపోయింది.

ఇలాంటిదే మరోటి. గోచీ, తువ్వాలు, టోపీ మాత్రమే ధరించి ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని పిలుపుచ్చిన ఓ బక్కపల్చని వ్యక్తి; //కట్ చేస్తే// అనంతరం ఖద్దరు వస్త్రాలు ధరించి, లావుపాటి బానపొట్టతో ‘మీ ఓటు నాకే’ అని ప్రజల్ని డిమాండ్ చేయడం; //కట్ చేస్తే// ఆ తర్వాత అదే వ్యక్తి అమాంతంగా పెరిగిపోయిన రాక్షస రూపాన్ని ధరించి ప్రజల మీద పడి వేధించుకు తినడం.... వెరసి ఇదంతా ‘‘కాంగిరేసోడి’’ అధోపతనాన్ని చిత్రించే మరో కార్టూన్. ఇలా శ్రీధర్ అక్షయతూణీరం నుండి జాలువారిన పదును తేలిన, పదికాలాల పాటు మనసుల్లో పదిలంగా నిలిచిపోయే కార్టూన్ల శర పరంపరకు లెక్కే లేదేమో.

అసలు విషయానికొస్తే... ఈనాడులో ఉన్నామన్నమాటే గానీ శ్రీధర్ గారిని ఎప్పుడూ కలిసింది లేదు. ఆయన కూడా అమావాస్య చంద్రుడిలా ఆఫీసుకెప్పుడెస్తారో, ఇంటికెప్పుడెళ్తారో ఆ దేవుడికే ఎరుక. మాబోటి సామాన్య జనానికి ఆయన ఎక్కడా కనిపించే వారు కాదు మరి. శ్రీధర్ గారి క్యాబిన్, ఎడిటోరియల్ బోర్డు వాళ్ల క్యాబిన్స్ పక్క పక్కనే ఉంటాయన్నది మాత్రం చూచాయగా తెలిసిన విషయం.

ఇంకోసారి కట్ చేస్తే....
ఎన్నికలు పూర్తయ్యాక... కేంద్రంలో మోడీ; ఆంధ్రాలో బాబు; తెలంగాణలో కేసీఆర్ పవరులోకి వచ్చాక... ఇహ రాయడానికేముంటుందని సెటైర్లు రాయడం తగ్గించేసేసరికి, ఎడిటోరియల్ బోర్డులో పెద్దదిక్కు అయినటువంటి మూర్తిగారు, ఆ పిల్లకాయని (నేనన్నమాట) ఓసారి ఈనాడుకి పిలిపించండి, కాస్త ఓదార్పు యాత్ర చేపట్టి, స్ఫూర్తి రగిలించి, మళ్లీ రాసేలా చేద్దామని చాలాకాలం క్రితమే కబురెట్టారు. నేను సాగదీసి, సాగదీసి... తీరిగ్గా మొన్న అక్టోబరు 1న వీలు చేసుకుని ఖైరతాబాద్ ఈనాడు ఆఫీసుకెళ్లా. ఆజానుభాహుడిలా ఉండే మూర్తిగారు... చూడు చిన్నయ్యా అని మొదలుపెట్టి... నేను రాయకపోవడంపై అక్షింతలు వేసి, సెటైర్ల కంటెంట్ గురించి ఓ 20 నిమిషాల పాటు ప్రైవేటు తీసుకున్నారు. దీంతో ఉత్సాహం రెట్టించిన వాడనై అక్కడి నుండి బయలు వెడలి... కార్టూనిస్టు శ్రీధర్ గారు ఎక్కడున్నారో కనుక్కుని ఆయన క్యాబిన్ లోకి ప్రవేశించితిని.

ఇంకోమారు కట్ చేసి... మరోసారి అసలు విషయానికొస్తే...
‘‘హలో సర్, నేను నాగరాజ్ అనిన్నీ, మన ఈనాడులో ఫలానా కొన్ని (పోచికోలు) సెటైర్లు రాస్తున్నవాడననిన్నీ..’’
‘‘ఓహ్, నువ్వేనటయ్యా నాగరాజువి, గుడ్ గుడ్, మరే నేనేమో.. నువ్వు బోల్డంత చాలా పెద్ద వయసున్నవాడివనుకున్నానే’’
‘‘లేదు సర్, నేనింకా చాలా బోల్డంత చిన్నా చితకా వాడినే’’
‘‘మరి ఈ మధ్య రాయడం మానేశావా??’’
‘‘ఆ.. అంటే, అద్దీ, అందుకే మూర్తిగారు అక్షింతలు వేస్తానంటే ఆ పనిమీద ఇటొచ్చానండీ’’
‘‘బాగుంది. అన్నట్టు, ఇంకేం రాస్తుంటావ్???’’
‘‘ఇంకా, అంటే... బాగా బలంగా కథలు రాద్దామనైతే ఉందండీ, ఇప్పటిదాకా ఒకే ఒక్కటి రాశానండీ, దాన్ని తీసి మన ఈనాడోళ్లే చెత్తబుట్టలోకి విసిరి గిరాటేశారనుకుంటానండీ,...’’
‘‘ఓహ్, అలాగా? మరేం ఫర్లేదు. కథలు, సాహిత్యం గట్రా చదువుతుంటావా మరి??’’
‘‘ఆ జర్నలిజం ట్రయినింగులో ఉండగా కక్షగట్టి మరీ బలవంతంగా కొన్ని పుస్తకాల్ని చదివించారండీ, అంతే. తర్వాత మళ్లీ బలాదూర్...’’
‘‘చదవాలి నాన్నా! మొపాసా, హెన్రీ, టాల్ స్టాయ్, దోస్తవోయిస్కీ, సోమర్ సెట్ మామ్ ఇలాంటి వాళ్లందరినీ బాగా స్టడీ చెయ్. మనుషుల జీవితాల్లోంచి కంటెంట్ ఎలా బయటకు తీయాలో తెలుస్తుంది. కథలు రాయడంలో కాస్త పట్టూ దొరుకుతుంది.’’
‘‘ఆయ్, అలాగే అలాగేనండీ. కచ్చితంగా చదువుతాను. కొన్ని కథలు చదివాను కానీ, ఏదో అల్లాటప్పాగా.... ’’
‘‘చదివితేనే... అన్ని విషయాలకు సంబంధించి నీ పర్ స్పెక్టివ్... బ్రాడ్ అవుతుంది నాన్నా"
‘‘తప్పకుండా... తప్పకుండా చదువుతానండీ’’

ఇంకా... అద్దీ, ఇద్దీ, ఏదేదో, ఏవేవో ఓ పదిహేను నిమిషాలు మాటాడేసుకున్నాక... సర్, మరే, నేను బయల్దేరుతాను, మీరు కార్టూన్లేసుకోవాలేమో, అసలే ప్రైమ్ టైమ్ లో వచ్చా... అంటూ సెలవు తీసుకొనబోతూ... చిన్ని విన్నపంగా... ‘‘మరేమో.. నేనేమో... మీతో ఓ ఫొటోగ్రాఫ్ తీసుకుందామని తెగ ఉవ్విళ్లూరుతున్నాన’’ని అసలు విషయం చెఫేశా. ‘‘ఓహ్, దానికేం భాగ్యం’’ అని శ్రీధర్ గారు, పైకి మడుచుకున్న షర్టు చేతుల్ని కిందకు దించేసి, ‘‘అసలే నాది ఫొటోజెనిక్ ఫేసు కూడా కాదాయే, కాస్త ముఖం కడుక్కోమంటావా’’ అని ఓ పంచ్ పలక్నామా విసిరారు. కాసేపు నవ్వుల పువ్వులు విరిసాయక్కడ. పక్కనే ఉన్న ఉల్చాల హరిప్రసాద రెడ్డి గారు (ఎడిటోరియల్ బోర్డు మెంబర్) నేను విసిిరిన నా మొబైల్ ఫోనుని జాంటీ రోడ్స్ లెవిల్లో క్యాచ్ చేసి, మా ఇద్దర్నీ ఇలా క్యాప్చరు చేసిచ్చారు. ఆ చిత్ర రాజమే కింద పెట్టిన కుఠో అన్నమాట.

అన్నట్టు, శ్రీధర్ గారు ఎంత సౌమ్యంగా, సున్నితంగా, గౌరవంగా మాట్లాడతారంటే... ఇంతటి మృదు స్వభావి... పొలిటీషియన్ల వీపు విమానం మోత మోగించేంత పవర్ ఫుల్ కార్టూన్లు ఎలా వేస్తారా అన్న చిన్న డౌటనుమానం రాకమానదు. అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల క్రితం ఈనాడులో చేరి, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ గా ఎదిగి, ఎవరెన్ని ఆఫర్లిచ్చినా తృణీకరించి, ఈనాడుకే అంకితమైన, ఆ స్థాయి వ్యక్తిలో దుర్భిణీ వేసి వెదికినా కించిత్తు కూడా గర్వాతిశయాలు ఏ కోశానా కనిపించకపోవడం, ఎదిగిన కొద్దీ ఎంతగా ఒదిగుండాలో నేర్పించే ఆయన సంస్కారానికి నిజంగా హ్యాట్సాఫ్!
 
ఉట్టి ఫొటో పెట్టి ఊరేగడం ఇష్టం లేక... ఏదేదో నొటికొచ్చిందంతా వాగేసి, చేతికి దొరికిందంతా టైపేసి ఊకదంపుడు చేశానన్నమాట. తప్పదు మరి, బ్లాగున్న పాపానికి అప్పుడప్పుడన్నా ఏదో ఒకటి బరకాలి, మీరు భరించాలి, ఆయ్ ;))

 

Friday, 3 October 2014

మరక మంచిదే!

(Plz read lighter vein satire in today's EENADU edit page regarding Swachcha Bharat, thank you)


మరక మంచిదే అన్నది యూపీఏ అధికారిక నినాదం! అవును మరి, వారిదొక మహా మురికి చరిత్ర, పైగా ఎవరి మురికి వారికి మహదానందమాయె! ఇక, మురికిని ఉతికారేస్తానంటాడు మోడీభాయ్. అవునవును, ఉతకడంలో ఉన్న కిక్కే వేరు. మొన్న జపాన్ పర్యటనలో అక్కడి శుచీ శుభ్రతకు అచ్చెరువొందిన ఛాయివాలా ఇండియాకొచ్చాక దేశానికి పట్టిన మురికిని కడిగి పారేయాలని బలమైన కంకణం ఒకటి కట్టుకు తిరుగుతున్నారు. దీంతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద స్వచ్ఛ భారత్ పేరిట శంఖారావం చేసి, ఓ సభ పెట్టి, అన్నీ పార్టీల అధినేతలను హాజరు కమ్మని కబురెట్టాడు.  

పదవి లేక, పెళ్లి అవక కొంతకాలంగా శంకరగిరి మాన్యాల్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్న శ్రీమాన్ రాహుల్ బాబు వెంటనే రాజమాత పాదధూళిని నెత్తిన ఆశీర్వాదంగా చల్లుకుని, మాసిన చొక్కా వేసుకుని, నెరసిన గెడ్డంతో హాజరయ్యారు. ఇహ తాట తీస్తా, తుక్కు రేపుతాఅని హస్తినలో హల్ చల్ చేసి, తీరా ష్.. గప్  చుప్ అయిపోయిన క్రేజీవాలా చిరిగిన టోపీ, విరిగిన చీపురు చేత పట్టుకుని, మఫ్లర్ కనిపించకపోవడంతో చెవుల్లో దూది పెట్టుకుని వేంచేశారు. వంగదేశంలో లంగరెత్తి, తెరచాప ఎగరేసి పేరిణీ తాండవం చేస్తున్న దీదీ నారచీరలో ముతక సంచి ఒకటి భుజాన వేలాడేసుకుని కాషాయం పార్టీపై కారాలు మిరియాలు నూరుతూ చక్కా వచ్చేశారు. స్మార్టు పాలనపై కసరత్తు కోసం సింగపూర్ వెళ్తూండగా మార్గమధ్యంలో ఫోన్ రావడంతో విమానాన్ని ఢిల్లీకి మళ్లించి బాబు కూడా సభా స్థలికి చేరుకున్నారు. ఫాంహౌజులో లాభసాటి పూలసాగులో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న గులాబీ దళపతి కూడా నిజాం కాలంనాటి ఓ కారేసుకుని రయ్ మని వాలిపోయారు. ఎన్నికల తర్వాత అస్సలు పనీపాడూ లేక ఇడుపులపాయలో గోళ్లు గిళ్లుకుంటూ సొంత ఓదార్పు చేసుకుంటున్న యువనేత కూడా కుయ్..కుయ్...మని శబ్దం చేసే అంబులెన్స్ వేసుకుని వచ్చేశారు. సభ మొదలైంది. మోడీ గళం విప్పాడు. 

మిత్రులారా! నేడెంతో సుదినం. ఇక ముందున్నదంతా మంచికాలమే. సబ్ కే లియే, మై అచ్ఛే దిన్ లావుంగా. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది బూజు పట్టిన పాలసీ. విదేశాల్లో విజయవిహారం చేసి స్వదేశంలో మంగళయానం చేయాలన్నది నా పాలసీ.

మోడీ మహాశయా! మీ ఊకదంపుడేంటి? ఆ సుదీర్ఘ ఉపోద్ఘాతాలేంటి? నేను భూటాన్ వెళ్లాను, బాకా ఊదాను. బ్రెజిల్ వెళ్లాను, సాంబా నృత్యం చేశాను. జపాన్ వెళ్లాను, డప్పూ డోలూ వాయించాను... ఇట్టాంటి పోచికోలు కబుర్లన్నీ మీరు ట్విట్టర్లో తీరిగ్గా రాసుకోండి. మాకెందుకండీ మీ స్వోత్కర్ష. అసలీ సభ ఎందుకు ఏర్పాటు చేశారో కాస్త తొందరగా సెలవియ్యండి. ఎక్కువసేపు జనాల మధ్య ఉండవద్దబ్బాయీ, నీవసలే తింగరోడివి, తిక్కతిక్కగా ఏదేదో వాగేసి, మీడియాకి అడ్డంగా దొరికిపోతావని మా అమ్మా, చెల్లీ అదేపనిగా హెచ్చరిక చెప్పి మరీ నన్నిక్కడకు సాగనంపార’’ని నిద్రమత్తులో నిజం వాగేసి నాలిక్కరుచుకున్నాడు రాహుల్ బాబు. 

హతవిధీ! బేటా రాహుల్! నిన్ను మార్చడం అంతర్వాణిని పట్టుకువేళాడే మీ అమ్మకే కాదు, ఆ దేవదేవుడి తరం కూడా కాదయ్యా. సరే, అసలు విషయానికొస్తే, మీ పదేళ్ల పాలనలో దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి వదిలేశారుగా. ఆ చెత్తాచెదారాన్నంతా ఊడ్చిపారేసేందుకు నేను నడుం బిగించాను. స్వచ్ఛ భారత్ సాధన కోసం మీరందరూ వారానికి రెండు గంటల చొప్పున, ఏడాదికి వంద గంటలు నాకోసం, దేశం కోసం కేటాయించాలని సవినయంగా మనవి చేసుకుంటున్నా’.   

మోడీభాయ్! ఏంటీ దారుణం? అన్నా పాయే, అవినీతి పాయె, ఆమ్ ఆద్మీ పాయె, చివరకు ఢిల్లీ కూడా చేజారిపాయె. ఇక మాకు మిగిలిందల్లా గల్లీ రోడ్లల్లో చెత్తా చెదారం ఊడ్చుకోవడమే. చీపురు పార్టీకి స్వత:సిద్ధంగా సంక్రమించిన ప్రాథమిక హక్కును కూడా పాశవికంగా కాలరాస్తారా అధ్యక్షా. నేను తీవ్రాతితీవ్రంగా హర్టయ్యా. సభ నుండి వాకౌట్ చేస్తున్నానని టోపీ తీసి నేలకేసి గిరాటు కొట్టి, చీపురు పట్టుకుని, ముక్కు చీదుకుంటూ వెళ్లిపోయాడు ఝాడూవాలా.  

 మోడీ గారు! మీ శ్రమదానం కాన్సెప్టు నాకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. చెప్పుకోకూడదు గానీ, ఈ కాన్సెప్టు నాదే. ఇంకా చెప్పాలంటే ఇట్టాంటి దుమ్మురేపే ఐడియాలు నా బుర్రలో కుప్పలుతెప్పలుగా కునుకుతీస్తూ పడున్నాయి. అమలుకు సమయం లేక పక్కనెట్టేశా. మీకు నాదో ఉచిత సలహా. ఈ రకంగా చీపుర్లు పట్టుకుని ఊడ్చుకుంటూ కూచుంటే మీకు, జనాలకు నడుంనొప్పి వస్తుందే తప్ప, పైసా ఫలితం ఉండదు. అందుకే మొత్తం ఈ ప్రాజెక్టునంతా సింగపూర్ కంపెనీలకు కాంట్రాక్టుకివ్వండి. వాళ్లు రెండునెలల్లో స్వచ్ఛ భారత్ ను మీ చేతుల్లో పెడతారు. మీకు ఓకే అయితే చెప్పండి, సింగపూర్ ప్రభుత్వంతో నేను మాట్లాడతానని చెప్పి, జై జన్మభూమి, జై సింగపూర్ అంటూ నినాదాలు చేస్తూ విమానమెక్కి బుల్లెట్టులా దూసుకుపోయారు బాబు. 

మోడీ దాదా! ఇప్పటిదాకా నాకు ఎరుపు మాత్రమే ఎలర్జీ అనుకునేదాన్ని. కానీ ఈమధ్య కాషాయం కూడా పడట్లేదెందుకో. నాది ఒకే ఒక్క డిమాండ్. మీరు అమిత్ భాయ్ తో మాటాడి, అతణ్ని మరో అయిదేళ్లపాటు బెంగాల్లో అడుగుపెట్టనివ్వనని హామీ ఇవ్వండి. మీకెవ్వరికీ పిసరంత శ్రమ లేకుండా కొడవలి పీకల మీద పెట్టిమరీ మా బెంగాల్ లెఫ్టిస్టులతో మొత్తం దేశాన్నంతా క్లీన్ చేయించే పూచీ నాదీఅంటూ గొప్ప వరం ఒకటి ప్రకటించి మాయమైపోయారు దీదీ.  

అయ్యా మోడీ గారూ! మహానేత ఎప్పుడూ చెబుతుండేవారు... పారిశుధ్యం పరిఢవిల్లిననాడే ప్రజలకు నిజమైన పండగ దినమని. ఆ మహానేత కలల్ని సాకారం చేయడానికి దిగివచ్చిన దేవుడు స్వామీ మీరు. అయితే, నాదొక చిన్న విన్నపం. శ్రీకృష్ణజన్మస్థానప్రాప్తి కలిగించననే ఒకే ఒక్క భరోసా ఇవ్వండి చాలు నాకు. మీ స్వచ్ఛ భారత్ కార్యక్రమ ఖర్చుల కోసం నా వేయిన్నొక్క స్విస్సు బ్యాంకు ఖాతాల్లో కొన్నింటిని త్యాగం చేస్తానని ఆవేశంగా ఎడమచేయిని గాల్లోకెత్తి, కుడిచేతి వేళ్లను ఫ్యాన్ రూపంలో గిరగిరా తిప్పుతూ పుదుచ్చితలైవిని ఓదార్చడానికి అరవదేశం వైపు సుడిగాలిలా వెళ్లిపోయారు. 

చూడండి, మోడీ బై! తెల్లదొరల తిక్క కుదర్చడానికి మా నిజాం నవాబు అప్పట్లోనే రోల్సు రాయిస్ కారుకి చీపుర్లు కట్టి వీధులు ఊడ్పించాడు. చెప్పాలంటే, అసలది దుమ్మురేపే ఐడియా అన్నట్టు. ఫాంహౌసులో పారిశుధ్యం ఇలా చేయబట్టే దిమ్మతిరిగే దిగుబడి సాధిస్తున్నాం. మీరు కూడా కారు-చీపురు సూత్రం అనుసరించండి. ఓ పక్క పారిశుధ్యం, మరోపక్క కడపులో చల్ల కదలకుండా కార్లో కూచుని ప్రచారం. అంతే. ఖేల్ ఖతమ్, దుకాణ్ బంద్. బేఫికర్అంటూ కార్చిచ్చులాంటి ఐడియా ఇచ్చేసి, కారు గుర్తుకే మీ ఓటు అంటూ కారేసుకుని షికారుకెళ్లిపోయారు.   

ఏమైంది? వీళ్లంతా ఏమైపోయారు? కాస్త కునుకు పడితే, కలలో ప్రధానమంత్రి అయిపోయినట్టు మంచి కల ఒకటి వచ్చింది మోడీ భాయ్. సరే మరి, నాకు నిద్రకు టైమైంది. వెళ్లొస్తాను. ఇంటివద్ద నా రాకకోసం అమ్మ ఆందోళన పడుతూ ఉంటుందని చెప్పి కళ్లద్దాలు తుడుచుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ వెళ్లిపోయాడు రాహుల్ బాబు.
ఛస్, వీళ్లను మార్చడం నా వల్ల కాదని చెప్పి అట్నుండి అటే విమానమెక్కి ఇంకో విదేశీ యాత్రకు వెళ్లిపోయారు మోడీ భాయ్.