Friday, 30 May 2014

తోక జీవితం !!



[ఇవాల్టి ఈనాడులో ప్రచురితమైన రాజకీయ చకోర పక్షుల లైటర్ వీన్ ఒరిజినల్ టెక్స్ట్ ఇక్కడ ఇస్తున్నా. స్టార్టింగ్ నేను రాసిన దాన్ని ఈసారి పిచ్చిపిచ్చిగా మార్చిపారేశారు వాళ్ల అవసరాల మేరకు. కొన్ని చోట్ల కొన్ని వాక్యాల్నే తీసేసారు. హేవిటో. ప్లీజ్ రీడ్. థాంక్యూ :-)]

జీవితం క్షణభంగురం. ఎప్పుడెలా గిరికీలు కొట్టి టపా కట్టేస్తుందో పైవాడికే ఎరుక. జీవితం ఓ నీటి బుగడ. ఎప్పుడు ఠప్ మని బకెట్ తన్నేస్తుందో ఎవ్వరికీ తెలీదు. జీవితం ఓ బంగాళాఖాతం. దిగితే కానీ లోతుపాతులు, అంతూదరీ తెలీవు. జీవితం ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచులాంటిది. ఏ నిమిషానికి ఏ మలుపు తీసుకుంటుందో నిశ్చయంగా చెప్పడం కష్టం. జీవితం ఓ థంబోలా గేములాంటిది. ఎవ్వరికి ఏ నెంబరుతో అదృష్టం వరిస్తుందో ఏ మేధావీ చెప్పలేడు. జీవితం ఓ స్టాక్ మార్కెట్ లాంటిది. ఎప్పుడు పాతాళానికి తంతుందో, ఎప్పుడు ఆకాశానికెత్తేస్తుందో కొమ్ములు తిరిగిన ఆర్థికవేత్తలకు సైతం అర్థం కాని పజిల్. ఇలా జీవితానికి సవాలక్ష నిర్వచనాలు, శతకోటి విశ్లేషణల్ని ఇచ్చుకోవచ్చు. ఛస్, జీవితాన్నిలా కొలవడమేమిటోయ్, పిచ్చి కాకపోతే, జిందగీని అనుభవించి పలవరించాలంతే అని గిరీశం లాంటోళ్లు గావుకేక పెట్టొచ్చుగాక. అయినా సరే, అదీ ఓ రకం నిర్వచనమే. ఇలాంటివన్నీ గ్రంథస్తం చేద్దామంటే, రాసుకోవడానికి చైనాగోడ, రాయడానికి మన జీవితం రెండూ సరిపోవు మరి. అదో చిక్కు.  

జీవితమంటే ఫర్లేదు. కిందా మీదా పడి ఎలాగోలా బండిని లాగించేయొచ్చు. కానీ, జీవితానికో తోక ఉంటుంది. అదే శేష జీవితం. వచ్చిన చిక్కంతా ఆ తోక జీవితంతోనే. క్రికెట్టునే తిని, తాగి, తొంగొనే ఓ గొప్ప ఆటగాడికి రిటైరయ్యాక ఏం చేయాలన్నది ఓ చిక్కుముడి. సినిమాల్లో ముఖానికి రంగేసి, చిందేసి, రఫ్పాడించే ఓ మహా నటుడికి తెరకు వీడుకోలు పలికాక ఏం చేయాలన్నది ఓ భేతాళ ప్రశ్న. అస్తమానం యుద్ధాలు, ఉగ్రవాదం, ఉపద్రవాలు, మన్నూమశానంతో నెత్తీనోరూ బాదుకునే అరివీర భయంకర అగ్రరాజ్య అధ్యక్షుడికి పదవి ముగిశాక ఏం చేయాలన్నది ఎటూ పాలుపోని ఓ బ్రహ్మపదార్థం. అచ్చంగా ఇలాగే మొన్న ఎన్నికల్లో చావుదెబ్బ తిని, చేతులెత్తేయడంతో పాటే, కళ్లూ ముక్కూ చెవులూ అన్నీ తేలేసిన మన రాజకీయ ఉద్ధండ పిండాలు శేషజీవితాన్ని ఎలా గడుపుతారు, ఏం చేస్తారు అన్నది కించిత్ ఆసక్తి గొలిపే అంశం. జన ఛీత్కారం, పదవుల పరాభవం మూటగట్టుకున్న మన నాయకమ్మణ్యులు తోకజీవితాన్ని ఎలా గడుపుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

పేరు: శ్రీమాన్ రాహుల్ బాబా
ప్రదేశం: శంకరిగిరి మాన్యాల్ 
ప్రత్యేకత: హస్త సాముద్రికా ప్రావీణ్యం.

మా నానమ్మ ఎప్పుడూ ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి అని ఓ కథ చెబుతుండేది. అదేదో కట్టుకథో, కాకమ్మ కథో అయ్యుంటుందిలే అని పెద్దగా పట్టించుకోలా. కానీ అసలు విషయం ఇప్పుడర్థమైంది. జీవితమంటే ఇన్నాళ్లూ పంచభక్ష్యాలు వడ్డించిన వెండి కంచం అనుకునేవాణ్ని. కానీ ఇలా కుక్కలు చింపిన, కాకులు కుళ్లబొడిచిన విస్తరి అవుతుందని కలలో కూడా అనుకోలేదు. అరవై ఏళ్లుగా జనం నెత్తిన శఠగోపం పెడుతూ, కాదు కాదు గొడుగు పడుతూ వచ్చిన హస్తం పార్టీకి ఈ స్థాయిలో హ్యాండిచ్చి బొంద పెడతారని ఏనాడూ ఊహించలేదు. అదేంటో నేను పాదం మోపిన చోటల్లా భస్మీపటలం సంభవించింది. ప్చ్.. పవరున్నప్పుడే పెళ్లి చేసుకుని ఉన్నా బావుండేదేమో. ఇప్పుడు పిల్లనిచ్చేవాడే కాదు, కనీసం గడ్డం గీసేవాడూ కరువైపోయాడు. నా పరిస్థితి రెంటికే కాదు, అన్నింటికీ చెడ్డ రేవడైపోయింది. రాజమాత చెప్పాపెట్టకుండా తట్టాబుట్టా సర్దుకుని ఇటలీకెళ్లిపోయింది. ఆస్థాన ముసలిసింహాలూ, కురువృద్ధులంతా అంపశయ్యమీద పడి హాహాకారాలు పెడుతున్నారు. ఇన్నాళ్లూ అమ్మ కొంగు పట్టుకుని అముల్ బేబీలాగా తిరిగినవాణ్ని. ఇప్పుడిలా హఠాత్తుగా రోడ్డున పడేసరికి దిక్కుతోచడం లేదు. కాళ్లరిగేలా తిరిగి తిరిగి, చివరికిలా శంకరగిరి మాన్యాల్ని వెదుక్కుని హస్తసాముద్రికాలయం పెట్టుకున్నా. జనం చేతుల్లో ముష్టిఘాతాలు తిన్న ప్రతోడూ చచ్చినట్టు ఇక్కడికే వస్తాడు కదా. అలాంటి అమాయక జీవుల్ని దొరకబట్టి, వాళ్ల హస్తవాసి చూస్తూ, పిట్టకథలు చెప్పుకుంటూ శేషజీవితాన్నిలా లాగించేద్దామనుకుంటున్నా.

పేరు: షోమాన్ గజన్
ప్రదేశం: చెంచల్ గూడా జైలు
ప్రత్యేకత: కెరీర్ కౌన్సెలింగ్

మహానేత తుపాకీ గొట్టంలోంచి దూసుకొచ్చిన తూటాని నేను. మడమ తిప్పని, మాట తప్పని ఫ్యాక్షన్ చరిత్ర నాది. విలువల కోసం, విశ్వసనీయత కోసం ఎంతటి అఘాయిత్యానికైనా తెగించే పవిత్ర హృదయం నాది. ఓదార్పుమంత్రాన్ని నమ్ముకుని అధికారమే ఆశగా, శ్వాసగా జీవిస్తున్న చకోరపక్షిని నేను. నా బ్యాంకు బ్యాలెన్సు కోసం మా నాన్న ప్రజాసంక్షేమాన్ని తాకట్టు పెడితే, దానికి నేనా బాధ్యుణ్ని? తీసుకెళ్లి జైల్లో బందీ చేస్తారా? ఇదేనా న్యాయం, ఇదేనా ధర్మం అని నేను హడగదలచుకున్నా. చివరికి నానా గడ్డీ కరిచి, కనిపించిన ప్రతోడి కాళ్లావేళ్లా పడి దుర్భర జైలు జీవితం నుండి విముక్తి పొందాల్సి వచ్చింది. తర్వాత తిండీతిప్పలు మాని మరీ ముడుపులపాయలో దీక్షలు చేశా. అమ్మతో అర్చనలు చేయించా. బామ్మర్దితో ప్రార్థనలు జరిపించా. నేనొదిలిన బాణం చెల్లాయితో తీర్థయాత్రలు చేయించా. కోట్లు వెదజల్లా. మద్యాన్ని వదరలు పారించా. ఇంత చేసినా పదవి యోగం మాత్రం పట్టకనేపాయె. గ్రహాలన్నీ కట్టగట్టుకుని మరీ నామీద కుట్ర పన్నిన్టట్టున్నాయి. నమ్ముకున్న హైకమాండు నట్టేట మునిగిపాయె. నేనేమో (ఫ్యాన్) రెక్కలు తెగిన పక్షినయ్యా. థూ... దిక్కుమాలిన జీవితం! ఇక ముందున్నవన్నీ గడ్డుదినాలే. ఆ నమోవాలా, ఈ సైకిల్ వాలా కలసికట్టుగా నా తాట తీస్తారేమో. శ్రీకృష్ణజన్మస్థాన పునర్దర్శనం తప్పేట్టు లేదు. నేనూ దానికే డిసైడైపోయా. ఈ పదేళ్లలో చెత్తాచెదారం, గడ్డీగాదం తిన్న ప్రతోడు తప్పక చెంచల్ గూడాకే వస్తారు కదా. అక్కడే వాళ్లందరినీ ఓదార్చి, వాళ్లందరికో ఉపాధి మార్గం చూపించి శేషజీవితంలో ఊరట పొందేందుకు ప్రయత్నిస్తా.

పేరు: క్రేజీ భూత్ నాథ్
ప్రదేశం: ఢిల్లీ శ్మశానవాటిక
ప్రత్యేకత: భూత, ప్రేత, పిశాచాల్ని వదిలించడం.

అవినీతి హఠావో, సమచార చట్టం, తోటకూర కట్ట, కొబ్బరిమట్ట ఇట్టాంటివన్నీ ఒకప్పటి నా నినాదాలు. ఆ చెత్తతో పోగేసిన గాలి కబుర్లన్నీ విని జనం జేజేలు పలికారు. ఢిల్లీ పీఠం కట్టబెట్టారు. నాక్కొంచెం తిక్కుంది కదా. తర్వాతర్వాత తిక్క లెక్కలేసి, తింగరి వేషాలేసి, చీపురు పట్టుకుని, జనం నెత్తిన టోపీ పెట్టడం మొదలెట్టాను. ప్రత్యర్థుల్నందరినీ నువ్వు నమో తాలూకు నామాల కాకివా, అంబానీ పంపిన అక్కుపక్షివా అని ఏకి పారేశా. చీల్చి చెండాడా. జనం మంగళహారతులు పట్టి ప్రధాని పీఠం కట్టబెడతారనుకుంటే చీపురు తిరగేసి వీపు విమానం మోత మోగించారు. ఉన్నదీ పాయె, ఉంచుకున్నదీ పాయె అంటే ఇదేనేమో. ఒక్కటి మాత్రం నిజం. వందకోట్ల జనాభాకి నమో దెయ్యం పట్టింది. ఇక ఈ అయిదేళ్లూ ఖాళీనే కదా. చేతబడి, క్షుద్రపూజలు, భూతవైద్యం వగైరా విద్యలపై పూర్తి పట్టు సాధించి, చీపురు చేతబట్టి జనాలకి పట్టిన నమో దెయ్యాన్ని వదిలించి తరిమేయకపోతే నా పేరు గుజ్రీ, ఛీఛీ క్రేజీ భూత్ నాథే కాదు. హ్హా!!


Thursday, 29 May 2014

పొట్టా, పామూ, వాకింగూ, వయొలెన్సూ !!



Disclaimer:
బ్లాగు ముఖం చూసి చాలా రోజులైంది కాబట్టి, ఏదో సరదాకి రాసి ఇక్కడో పోస్టు వేస్తున్నా

బేసిగ్గా మనుషులు రెండు రకాలు.
 
పట్టభద్రులు! పొట్ట భద్రులు!!
యేంది స్వామీ, ఈ పీహెచ్డీ భాష అంటారా? సరే, తెలుగులో మాటాడుకుందాం ఐతే. పెద్ద థీసిసేం కాదిది. పట్టభద్రుల్ని పక్కన పెడదాం. వాళ్లతో మనకు పెద్దగా పనేం లేదు. పొట్టభద్రుల్ని పట్టుకుందాం. తిన్నగా చెప్పాలంటే... నానా గడ్డీ తినేసి, కిలోల్లెక్కన కొవ్వునీ, కేలరీల్నీ కర్కశంగా కడుపులోకి తోసేసి, పొట్టని పెంచి పోషించడంలో ‘‘పట్టా’’ పొందినోళ్లనే పొట్టభద్రులంటారు. సింపుల్ డెఫినిషన్, బాంది కదా. మనదేశం ఆహార భద్రత సాధించిందో లేదో తెలీదు కానీ, మన జనాలు మాత్రం పొట్ట భద్రత బీభత్సంగా సాధించేస్తున్నారు. వండర్ ఫుల్ అఛీవ్ మెంట్! రొంబ సంతోషం!! ఇంకా నయ్యం. ఆ జైరాం రమేషు, కపిల్ సిబాల్ లాంటి తింగరి కాంగిరేసోళ్ల దృష్టి జనాల పొట్టల మీద పడలేదు కాబట్టి సరిపోయింది లేపోతే, అసలు ఎవరయ్యా ఇండియాలో పేదరికం ఉందన్నదని బుకాయించి పిచ్చి థియరీలు ప్రచారం చేసుండేవాళ్లేమో. థ్యాంగాడ్!

ఒక బానపొట్ట వంద రోగాల పెట్టు- అని ఓ తింగరి నానుడి. పైగా పొట్ట బారిన పడ్డవాడి జీవితం బుగ్గిపాలైనట్టేనని పురాణాలు కూడా అప్పుడెప్పుడో రన్నింగ్ కామెంటరీ చెప్పేశాయట. మెంటలెక్కించే ఓ సీరియల్ చూస్తే, బోనస్సుగా బుర్రని బేజాఫ్రై చేసుకుని తినే బోల్డు యాడ్స్ ఫ్రీ అన్నట్టు... ఒక్క బొజ్జ తెచ్చుకుంటే, బోనస్సుగా బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాలూ, గురకులూ, గుండెపోట్లూ... అబ్బో, కామాలే తప్ప, ఫుల్ స్టాప్స్ ఉండని లిస్టు ఇది. బొజ్జను కప్పెడదామనో, కవరింగ్ చేద్దామనో చేసే సవాలచ్చ ప్రయత్నాలూ వృథా ప్రయాస. లూజ్ షర్టులేసో, వంకర భంగిమ పెట్టో, ఊపిరి బిగపట్టో పొడుచుకొచ్చే పొట్టను ఆపలేరు. దాచేస్తే దాగని సత్యం అది. ఒక్కసారి బెల్లీ జ్ఞానోదయం జరిగాక... ఫుడ్డుతో రాక్షస ప్రయోగాలు మొదలెట్టడం మానవజాతికి ఆనవాయితీ. పిరమిడ్ డైటనీ, జీఎం ఫుడ్డనీ, రాజుగారి తిండనీ, బాబా గారి లడ్డూలనీ, మన్ననీ, మశానమనీ  ప్రయోగాలకి లెక్కే ఉండదు. ప్చ్... అలవాటు పడ్డ ప్రాణం కదా. ఆకలికి తట్టుకోలేం. నోటిని కట్టుకోలేం. పొట్ట రాకుండా ఆపనూలేం. అపజయానికి అరవై మెట్లలాగా, ఈ పిచ్చి ప్రయోగాలన్నీ పిచ్చపిచ్చగా బెడిసికొడతాయ్. చేసేదేం లేక పొట్ట చేతబట్టుకుని రోడ్డున పడతారు. దాన్నే పొట్టకు వ్యాయామ పథకం అంటారు. అదే వాకింగు. కట్ చేస్తే...

మనమిప్పుడు Snake View Parkలో ఉన్నాం. యెస్. మీ కళ్లు, చెవులు బానే పనిచేస్తున్నాయ్. ఒకప్పుడు దానికి Lake View Park అని పేరు. కాలక్రమంలో పాములు... వాకింగూ, జాగింగూ చేస్తున్న మనుషుల కాళ్ల మధ్య ఇష్టారాజ్యంగా ఖోఖో, కబడ్డీ లాంటి నేషనల్ గేమ్స్ ఆడుకునేంత స్వావలంబన సాధించడంతో దానిపేరును అలా మార్చిపారేశారు. అసలూ.. మనుషులు తిరిగే పార్కుల్లో పాములకేం పని, అనేగా డౌటు! అదేం పిచ్చి ప్రశ్న. పొట్టలు మనుషులకేనా, పాములకు రావా??? వస్తాయ్. ఓ డైంటింగూ పాడూ లేకుండా కనిపించిన కప్పల్నీ, తొండల్నీ అడ్డదిడ్డంగా మింగేసి, పనీపాట లేకుండా చెట్టూపుట్టల్లో తొంగుంటే పాములకు కూడా పొట్టలు వస్తాయ్ మరి. అది ప్రకృతి ధర్మం. అప్పుడు పెరిగిన పొట్టను కరిగించుకోవడానికి, మనుషులకు మల్లే వాకింగ్ కాన్సెప్టులాగే, పాములకు భీ పాకింగ్ (పాక్కూంటా వెళ్లడం) కాన్సెప్టు ఉంటది. అదొక పెద్ద కథ. తర్వాతెప్పుడైనా తీరిగ్గా చెప్పుకుందాం.

 
పోతే, తిరిగి మనం మన వాకింగు కాన్సెప్టుకొద్దాం.

బేసిగ్గా వాకర్స్ రెండు రకాలు. వయొలెంట్ వాకర్స్! నాన్ వయొలెంట్ వాకర్స్!!

వయొలెంట్ వాకర్స్... వాళ్లొక నడిచే విధ్వంసకారులు. అన్న అడుగేస్తే మాస్. అన్న నడిచొస్తే ఊర మాస్ అన్నట్టుగా ఉంటది వీళ్ల వాకింగ్ అఘాయిత్యం. పొట్ట తగ్గించకపోతే పోతావురారేయ్ అని డాక్టరు భయపెడితోనో, లేదంటే ఏ హాలివుడ్డు సినిమాల్లోనో వీరోగారి సిక్స్ ప్యాకులు చూసో... ఒకేసారి టెంప్టూ, ఇన్ స్పైరూ రెండు అయిపోయి, తల చెదరగొట్టుకుని, పిచ్చి పిచ్చి కలలు కనేసి, వెంటనే సండే చోర్ బజార్లో షూస్, టీషర్ట్, ట్రాక్స్ రీటైల్ రేటుకి కొనేసి, పొద్దున్నే గ్రౌండులో గద్దల్లా వాలిపోతారు. ఇహ చూస్కోండి, నా సామి రంగా! అరాచకానికి టీషర్టు, ట్రాకు తొడిగితే ఎట్టా ఉంటాదో, అట్టా చెలరేగిపోతారు వీళ్లు. కొందరేమో రెండు చేతుల్ని అటో ఫర్లాంగు, ఇటో ఫర్లాంగు కసి కొద్దీ విసిరేసుకుంటా నడుస్తారు. అక్కడికి ఆ గ్రౌండేదో/పార్కేదో వీడొక్కడి సొత్తు అయినట్టు. అమాయక ప్రాణులెవరైనా ఎరక్కపోయి వీళ్ల పక్కకెళితే... ధోనీ కొట్టిన హెలిక్యాప్టర్ షాట్ లా ఎగిరిపోయి బౌండరీ అవతల పడతారు. ఆ లెవెల్లో ఉంటాది వాళ్ల చేతులు విసురుడు వాకింగ్. ఇంకొందరేమో పైన చెట్లమీద కాకుల్ని, పిచ్చుకల్ని తోలుతున్నట్టుగా చేతుల్ని అలా పైన గాల్లో కథక్ నృత్యం చేయిస్తూ చెడామడా చెడ నడుస్తుంటారు. అర్రె, భలేగుందే, ఏంచేస్తున్నాడీయన అని గనక మనం పైకి చూస్తా అటేపు వెళ్లామో, అంతే ఇక, మన కాళ్లను నిర్దాక్షిణ్యంగా అణగతొక్కో, రాక్షసంగా తన్నో... ఊపుకుంటూ వెళ్లిపోతారు. చచ్చాన్రోయ్ అని పొలికేక పెట్టడం మనవంతు అవుద్ది. ఇంకొందరుంటారు... వీళ్లు వాకింగుకి పాశర్లపూడి బ్లోఅవుట్ స్కీమును జత చేసి నడుస్తుంటారు. తలా అలా పైకెత్తి, పొట్టలో కుంభించిన గాలిని, ముక్కు ద్వారా పక్కోళ్లమీదకు బలంకొద్దీ పిచికారీ చేసే నడకన్నమాట. ఇది బాబా గారి భయంకర కాన్సెప్టని వినికిడి. ఇలా వీళ్ల ముక్కుల బ్లోఅవుటులోంచి దూసుకొచ్చే రాకెట్ తుంపర్ల నుండి తప్పించుకుని బతికి బట్టకట్టాలంటే మన దగ్గర మినిమమ్ గొడుగన్నా ఉండాలి, లేదా నాణ్యమైన టవలన్నా ఉండాలి, తుంపర్లు పడ్డాక తుడుచుకోడానికి. వీళ్ల జిమ్మడిపోనూ! ఇంకోటైపు ఏంటంటే... రివర్సు మేళాలు. ఊరంతా ఒకేపు నడిస్తే, వీళ్లేమో ఉలిపికట్టెలా/సల్మాన్ ఖానులా వీపుకి కళ్లజోడు తగిలించుకుని, చెవుల్లో ఇయర్ ఫోన్లు పెఠేస్కుని, ఎవడెట్టా ఛస్తే నాకేం అని, అలౌకికానందంలో మునిగి... వెనక్కి రివర్సులో నడిచి ఛస్తూ మనల్ని ఛంపుతారు. ఎప్పుడు ఎవణ్ని డ్యాష్ కొడతారో, ఎక్కడ ఏ యాక్సిడెంటు అవుద్దో తెలీనంతగా అందరినీ హడలెత్తించే బ్యాచ్ ఇది.  


నాన్ వయొలెంట్ వాకర్స్... వీళ్లు చాలా కూల్ గురూ! యెస్. గట్టిగా నడిస్తే షూస్ పాడయిపోతాయకునే టైపు. ఎక్కువగా నడిస్తే కీళ్లు అరిగిపోతాయనుకునే రకం. బలంగా నడిస్తే కాలికింద చీమలేమైనా పడి సూసైడ్ చేసుకుంటాయేమో అన్నంత సున్నితంగా, సుతారంగా నడిచే కేటగిరీ. వీళ్లు హాఫ్ మినిట్ నడిచి, అరగంట కూచుని హస్కేసుకునే బ్యాచ్. ఊరకే కూచుంటారా అంటే అదీ ఉండదు. డ్రై ఫ్రూట్స్ తినుకుంటా... కొంపలో గోడు, వీధిలో గోల, ఆఫీసులో కుళ్లు అన్నింటినీ ముందరేసుకుని రచ్చ రచ్చ చేస్తుంటారు. ప్రశాంతతకు బదులు పిచ్చిని మెదళ్లలోకి జొప్పించుకుని ఇంటికెళ్లే రకం. వీళ్లిలా జీవితాంతం నడిచినా ఒక్క మైక్రోగ్రామ్ వెయిటు కూడా తగ్గరు. పైగా, వాకింగు కెళ్తున్నామహో అని టాంటాం చేసి,  మరిన్ని కేలరీలు మింగేస్తారు కాబట్టి వీళ్లకు పొట్టలు రాకుండా ఆ పరమేశ్వరుడు కాపాడలేడు. ఆమెన్! ఇంతే సంగతులు. చిత్తగించవలెను!! :-))

[PS: బాలక్రిష్ణ సినిమాల్లో లాజిక్కునీ, నాగరాజ్ పోస్టులో మెసెజ్ నీ వెదకడం IPC 420 సెక్షన్ ప్రకారం నిషేదించడమైంది, ఆయ్]