Thursday, 23 January 2014

మనసును మెలిపెట్టే దోస్తవోయిస్కీ తిరస్కృతులు!!

పుస్తకం హస్తభూషణం ఐతే... మరి,
పుస్తక పఠనాన్ని బుద్ధి వికాసానికి సాయపడే ఉత్ప్రేరకం అనాలేమో!
కాస్త క్యాచీగా రాద్దామని ప్రయత్నించా గానీ... లాభం లేకపోయింది. ప్చ్... రెండో వాక్యం బాగా పొడుగైపోయింది. Economy Of Words పాటించని వాణ్ణి నేనస్సలు క్షమించనంటాడు మహాకవి శ్రీశ్రీ. వ్యక్తీకరణలో పొడిమాటలు, చిట్టి వాక్యాలు రాయలేని నేను... శ్రీశ్రీ క్షమకు నోచుకోని అభాగ్యుల జాబితాలో ముందుంటానేమో! చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, సూక్ష్మంగా చెప్పలేకపోవడానికి కారణం... నాకు పుస్తక పఠనం అలవాటు లేకపోవడమేనేమో. చెబితే కాస్త చోద్యంగా అనిపిస్తుందేమో. చిన్నతనంలో అదృష్టవశాత్తూ ఎక్కడైనా చందమామ, బాలమిత్ర దొరికితే అపురూపంగా చదవడం తప్పిస్తే, డిగ్రీ దాకా పుస్తకాలు చదవాలనే స్పృహే లేకపోయింది. పైగా, దానినెవరూ అలవాటు చేయలేదు కూడా. పోనీ, కనీసం పాఠ్యపుస్తకాలైనా ఒద్దికగా, బుద్ధిగా చదివామా...అంటే అదీ లేదాయె. అన్నీ రాలుగాయి తిరుగుళ్లు. గాలి చదువులే. వీటిన్నింటి పాప పరిహారమే అనుకుంటా... ఏదైనా రాద్దామని కూచుంటే, ఆలోచనలు మొరాయిస్తుంటాయి. అక్షరాలు సహాయ నిరాకరణ చేస్తుంటాయి. అలాంటప్పుడు మన్మోహన్ సింగులా మౌనముద్ర దాల్చడం తప్ప వేరే చేసేదేముంటుంది. నా జీవితంలో ఓ 25 ఏళ్లు అలా వృథాగా గడిచిపోయాయి. పోనీయండి... గతాన్ని తవ్వుకుని బావురుమని బావుకునేదేమీ ఉండదని అనుభవం మీద తెలిసిన విషయం. జీవితానుభవాలకు మించిన జ్ఞానం ఏముంటుంది చెప్పండి?!

కొన్నేళ్ల క్రితం అనుకుంటా. పుస్తకాల అవసరం పెద్దగా లేకుండానే సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో ఒక భయంకరమైన కుదుపు, మలుపు, అలజడి చోటుచేసుకున్నాయని చెప్పడానికి చింతిస్తున్నా. ఈనాడు జర్నలిజం కోర్సుకు సెలెక్ట్ అవడంతో... పుస్తకాల్ని పురుగుల్లా చిన్నచూపు చూసిన నా నిర్వాకానికి తగిన ప్రతీకారమే జరిగింది. జర్నలిస్టు అనేవాడు ‘‘జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్’’గా ఉండాలనిన్నీ; ప్రపంచంలో ముద్రితమైన గొప్పగొప్ప పుస్తకాలన్నిటినీ కట్టగట్టి రోల్ చేసి నమిలి మింగేసి జీర్ణం చేసుకోవాలనిన్నీ; ఇలాంటివే ఇంకో ఐదో, ఆరో బాగా కిక్కిచ్చే సూక్తులు చెప్పి, ఆ ఏడాది ట్రైనింగులో చదవాల్సిన ఓ 53 పుస్తకాల జాబితాను చేతిలో పెట్టారు. అనగా... వారానికో పుస్తకం చదివి దాని మీద పోస్టుమార్టం రివ్యూ నిర్వహించాల్సిన బృహత్తర బాధ్యత అన్నమాట. అస్సలు ఏమాత్రం అలవాటు లేని పని కావడంతో చుక్కలు కనిపించాయి. మొత్తానికి కిందామీదా పడి, చచ్చీచెడీ, ఎలాగోలా తంతు ముగించాను. గుడ్ న్యూస్ ఏంటంటే, నేను కూడా కొన్ని పుస్తకాలు చదివానని కాలరెగరేసే స్టేటస్ కల్పించారు ఈనాడు వాళ్లు. ఇప్పుడొకసారి ఆ గడ్డుకాలాన్ని గుర్తు చేసుకుంటే, చెల్లాచెదురుగా అలెక్స్ హేలీ- ఏడు తరాలు; మ్యాక్సిం గోర్కీ- అమ్మ; శ్రీశ్రీ- మహాప్రస్థానం; తిలక్- అమృతం కురిసిన రాత్రి; నండూరి- విశ్వదర్శనం; ముళ్లపూడి- బుడుగు; గురజాడ- కన్యాశుల్కం... ఇలా కొన్ని పుస్తకాలు లీలగా స్మృతిపథంలో కదలాడుతుంటాయి. ఈనాడు ట్రైనింగు బందీఖానా నుండి బయటపడి జాబులో జాయినవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పుస్తక పఠనం అటకెక్కింది. ఏదో మధ్యమధ్యలో ఇష్టపడి శరత్ చంద్రుడి సమగ్ర సాహిత్యాన్ని కాస్త దీక్షతో చదవడం తప్ప పెద్దగా పుస్తకాలు చదివిన పాపాన పోలేదు. ఇదిగో మళ్లీ ఇంతకాలానికి ఓ పుస్తకం చదివాను. అది సుప్రసిద్ధ రష్యన్ నవలా రచయిత దోస్తవోయిస్కీ రాసిన ‘‘తిరస్కృతులు’’. 


‘‘క్లాసిక్’’ అనే మాట మనం తరచుగా వింటుంటాం. క్లాసికల్ ఎకానమీ అనీ; క్లాసికల్ ఫిజిక్స్ అనీ; క్లాసికల్ మ్యూజిక్ అనీ; క్లాసికల్ మూవీస్ అనీ... ఇలాంటివి. ఈ క్లాసిక్ అంటే... భాషకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అప్లై అయ్యేవనీ, ప్రజలకు అప్పీల్ చేసి, ఆకర్షించేవనే సత్యం చాలా ఆలస్యంగా, ఎక్కడో చదివాక గానీ తెలీలేదు. సాహిత్యంలో కూడా క్లాసిక్స్ ఉంటాయి. షేక్ స్పియర్, మిల్టన్, రూసో, వాల్టేర్, డికెన్స్, టాల్ స్టాయ్, చెహోవ్, దోస్తవోయిస్కీ, రవీంద్రుడు... ఇలా ఎందరో గొప్ప రచయితలు అన్నిరకాల ఎల్లలకు అతీతంగా మానవాళిని ఆకర్షించి, ప్రభావితం చేసి, మార్పును తీసుకొచ్చే క్లాసికల్ సాహిత్యాన్ని సృష్టించారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి క్లాసికల్ లిటరేచర్ కోవకు చెందిందే... దోస్తవోయిస్కీ నవల The Insulted & Injured కూడా. ఆ నవలకు తెలుగు రూపమే ఈ తిరస్కృతులు! పుస్తకం చిన్నదే. ఓ 200 పేజీలదాకా ఉంటాయి. పీకాక్ క్లాసిక్స్ ముద్రణ. అనువాదం చేసింది... జంపాల ఉమామహేశ్వరారావు. ఈయనెవరో కాదు... సహవాసి గారే. అది ఆయన అసలు పేరట. సహవాసిగా మారకముందు, ఇంకా చెప్పాలంటే ఆయన మొట్టమొదటి అనువాదం ఈ తిరస్కృతులు. సహవాసి చక్కటి చిక్కటి అనువాదం ఈ పుస్తకానికో పెద్ద ప్లస్ పాయింట్. కేవలం అనువాదాలు సరిగా లేకపోవడం వల్లే మనం చాలా మంచి పుస్తకాల్ని సైతం చదువుదామని మొదలెట్టి, తీరా ముందుకు సాగక, పక్కన పెట్టేస్తుంటాం. ముద్రా రాక్షసాలు ఎక్కడా కనిపించకపోవడం కూడా ఈ పుస్తకం పూర్తి చేయడానికి సహకరించే మరో అంశం. ఇక అసలు విషయానికొద్దాం. 

Time & Space!!
తెలుగులో స్థల కాలాలని అంటుంటారు. ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫిలసాఫికల్ కొనసాగింపు ప్రకారం... ఏ దృగ్విషయమైనా నిర్దిష్టంగా, అదేసమయంలో సాపేక్షంగా కూడా ఉంటుందనే సత్యం తెలిసిందే. ఇక్కడ సాహిత్యంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో. ఒక రచనను అర్థం చేసుకునేటప్పుడు గానీ, అంచనా వేసేటప్పుడు గానీ... దాని కాలమాన పరిస్థితుల్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలనుకుంటాను. లేదంటే ఆ రచన, రచనలో చర్చించిన ఇథివృత్తం కాలం చెల్లిందింగానో, లోపాలు కలిగినదిగానో, తప్పుల తడకగానో కనిపించే ప్రమాదముంటుంది. ఇక, తిరస్కృతులు నవలలో కథా నేపథ్యం 19వ శతాబ్దం నాటి రష్యన్ సామాజిక పరిస్థితులు. ఒకరకంగా ఫ్యూడల్ నేపథ్యమని చెప్పొచ్చు. అంటే, పారిశ్రామిక ప్రగతికి పూర్తిస్థాయిలో బీజాలు పడని రోజులవి. అంటే, ప్రజాస్వామిక భావనలు ఇంకా వెల్లివిరియని రోజులవి. అంటే, స్వేచ్ఛా జీవితం, స్త్రీ-పురుషుల మధ్య సమానత్వం, ప్రజల మధ్య సౌభ్రాతృత్వ భావనలు ఇంకా బలంగా వేళ్లూనుకోని కాలమది. కథా గమనం ఆ నేపథ్యంలోనే సాగుతుంది. ఈ నవలలో గట్టిగా ఏడెనిమిది పాత్రలకు మించి ఉండవు. వాటినొకసారి క్లుప్తంగా పరిచయం చేయాల్సి వస్తే...
ఇవాన్ పెట్రోవిచ్: హీరో. నవలలో రచయిత. అందరికీ తల్లో నాలుకలా ఉండే వ్యక్తి. ఇతనే కథంతా చెబుతుంటాడు.
నతాషా: నాయిక. ప్రేమ కారణంగా అటు ప్రియుడి వంచనకు, ఇటు తల్లిదండ్రుల నిరాదరణకు గురైన ప్రౌఢ.
ప్రిన్స్: విలన్. ధనవంతుడు. ఆస్తి కోసం, డబ్బు కోసం ఎంతటి వంచనకైనా పాల్పడే మేక వన్నె పులి. 
నికొలాయ్, అన్నా: నతాషా తల్లిదండ్రులు. ప్రిన్స్ దాష్టీకానికి బలైన చిన్నపాటి ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ.
అలెక్సీ ఆయేషా: ప్రిన్స్ కుమారుడు. నతాషా ప్రియుడు. అమాయకుడు. మాటలో, నడవడిలో నిలకడ లేని యువకుడు.
నీలి: ప్రిన్స్ వంచనకు గురైన ఓ అభాగ్యురాలి కూతురు. శారీరకంగా, మానసికంగా చిత్రవధకు గురైన అమ్మాయి.
మాస్లో: ప్రిన్స్ కుట్రలకు, కుతంత్రాలకు సాయపడే వ్యక్తి. ఇవాన్ పెట్రోవిచ్ కు క్లాస్ మేట్ మరియు మిత్రుడు.
క్యాథరీనా: ప్రిన్స్ కుమారుడు అలెక్సీ ఇష్టపడే మరో ధనవంతురాలైన అందమైన, అద్భుతమైన యువతి.


నవలలో కథాంశాన్ని గురించి క్లుప్తంగా చెప్పాల్సి వస్తే... ప్రిన్స్ అనే ధనవంతుడు ఒక ప్రాంతంలో తన ఎస్టేట్ వ్యవహారాల్ని చూసే బాధ్యతను నికొలాయ్ అనేవ్యక్తికి అప్పగిస్తాడు. వ్యవహారం కొంతకాలం పాటు సాఫీగానే నడుస్తుంది. అయితే ఈ క్రమంలో నికోలాయ్ కూతరు నతాషా, ప్రిన్స్ కొడుకు అలెక్సీ ఆయోషా ఇద్దరూ ప్రేమించుకుంటారు. డబ్బుకు, ఆస్తి విషయాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రిన్స్... ఈ ప్రేమ వ్యవహారాన్ని ఎలాగైనా తెగదెంపులు చేయాలనుకుంటాడు. ఓ కుట్ర పన్ని, తన ఎస్టేట్ వ్యవహారాలో అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి నికొలాయ్ ను కోర్టుకీడుస్తాడు. ప్రిన్స్ ను గుడ్డిగా విశ్వసించిన అత్యంత నిజాయితీ పరుడైన నికొలాయికి ఇది అతి పెద్ద షాక్. ఈ క్రమంలో నతాషా... ప్రేమ కోసం ఇల్లొదిలి వెళ్లిపోతుంది. తండ్రి నికొలాయికి ఇది రెండో అతి పెద్ద షాక్. ఈ రెండు వ్యవహారాల కారణంగా నికొలాయ్ దాదాపు ఆర్థికంగా దివాళా తీసి, కుంగిపోతాడు. ఈ క్రమంలో కూతురు నతాషాపై ఉన్న ప్రేమానురాగాలు సైతం తీవ్ర ద్వేషంగా పరిణమిస్తాయి. ప్రిన్స్ కుమారుడు అలెక్సీ అయేషా అనే యువకుడు... అత్యంత అమాయకుడు, నిలకడ లేని వ్యక్తి కావడం చేత, వాళ్ల నాన్న (ప్రిన్స్ పన్నాగం) కారణంగా... నతాషా-అలెక్సీల ప్రేమకథ కొంతకాలానికే విషాదాంతంగా ముగుస్తుంది. ఇక, నవలలో జరిగే కథనంతా ఇవాన్ అనే రచయిత మనకు చెబుతుంటాడు. ఇతనే ఇందులో హీరో. నికొలాయ్ కుటుంబానికి ఆప్తుడు. ఇవాన్ కూడా నతాషాను ప్రేమిస్తాడు. అయితే నతాషా వేరొకరిని ప్రేమిస్తోందని తెలిసాక; తన ప్రేమను త్యాగం చేసి; నతాషాకు, ఆమె కుటుంబానికి అన్ని విధాలా సాయపడే గొప్ప వ్యక్తిత్వం కల్గిన వ్యక్తి. ఈ కథలోనే ఇంకొక సబ్ ట్రాక్ ఏంటంటే... ప్రిన్స్ ధనదాహానికి బలై, వంచనకు గురైన ఒక మహిళకు పుట్టిన అమ్మాయి (నీలి), ఓ వృద్ధుడు (నీలి తాత) కనిపిస్తారు. వృద్ధుడు ఆరంభంలోనే మరణిస్తాడు. అయితే నీలిని మాత్రం ఇవాన్ చేరదీసి బాసటగా నిలుస్తాడు. చిన్నతనం నుండే అత్యంత అవమానాలను, ఛీత్కారాలను ఎదుర్కొంటూ ఎక్కడెక్కడో అనాథలా పెరిగిన నీలి... అంతులేని మానసిక ఆటుపోట్లకు గురైన అబలగా కనిపించి, ఆఖరుకు కన్నుమూస్తుంది. ప్రేమలో విఫలమైన నతాషా... చివరకు తన తల్లిదండ్రుల (నికొలాయ్, అన్నా) చెంతకు చేరుతుంది. అంతిమంగా ఇవాన్ - నతాషా కలసి పార్కులో అడుగులు వేస్తూ ముందుకు కదలడంతో కథ ముగుస్తుంది.


నేటి దృక్కోణంలోంచి చూస్తే... ఇది రోటీన్ కథ, కథనం కల్గిన నవలలాగే కనిపించొచ్చు. కానీ, 1850లకు ముందు నాటి రష్యన్ కాలమాన పరిస్థితుల దృష్ట్యా చూస్తే, ఆ కథాంశాన్ని ఎన్నుకోవడం; ఆనాటి సామాజిక గమ్యం, గమనాన్ని ప్రభావితం చేసే విధంగా నవలను నడిపించడం ఎంతమాత్రం ఆర్డినరీ విషయం కాదేమో అనిపిస్తుంది. నిజానికి 150 ఏళ్ల క్రితం నాటి జారిస్టు రష్యాలో... అప్పటికింకా ఒక యువతి- తనకు నచ్చిన గుణగణాలున్న యువకుణ్ణి ఎంచుకుని- ప్రేమించి, పెళ్లి చేసుకునే స్వేచ్ఛ, స్వతంత్రత తక్కువే. ఒకవేళ అలాంటిదేదైనా సంభవించినా ఆ ప్రేమలకు తల్లిదండ్రుల అంగీకారం ససేమిరా లభించని రోజులవి. అలాంటి స్థితిలో తల్లిదండ్రుల్ని ధిక్కరించి, ఇంట్లోంచి వెళ్లిపోతే... ఇక ఆ యువతికి - తల్లిదండ్రులకు సంబంధాలు దాదాపు కట్ అయినట్టే. అనాదిగా వస్తున్న పరువు-ప్రతిష్టల కోసం కన్నకూతురనైనా చూడకుండా విద్వేషం చిమ్మే రోజులవి. (మనదగ్గర అమ్మాయిలపై హానర్ కిల్గింగ్స్ అనేవి ఇప్పటికీ జరుగుతున్నాయి). దురదృష్టవశాత్తూ, ఆ యువతి ప్రేమలో కానీ, వివాహానంతరం కానీ వంచనకు గురైతే... ఇక, ఇటు తల్లిదండ్రుల విద్వేషానికి, అటు సామాజిక నిరాదరణకు గురై... తదుపరి జీవితం సింప్లీ నరకప్రాయమే. ఈ రకంగా అన్నిరకాల తిరస్కరణకు గురైన ‘‘తిరస్కృతులు’’ బలవంతంగా జీవితాన్ని అంతమొందించుకోవడం అన్నది ఆ వ్యవస్థకు కళంకంగా భావించొచ్చు. సరిగ్గా... ఈ తిరస్కృతులకే దన్నుగా నిలిచాడు దోస్తవోయిస్కీ. నవలలో సరిగ్గా ఇలాంటి ఉదంతాల్నే రెండింటినీ చిత్రీకరిస్తాడు దోస్తవోయిస్కీ. మొదటి  ఉదంతంలో ఓ యువతి- ప్రేమ వివాహం తర్వాత వంచనకు గురై, ఎక్కడా ఏ తీరం దొరక్క, చివరకు తండ్రి దగ్గర సైతం ఛీత్కారాన్నే ఎదుర్కొని, విధిలేని పరిస్థితుల్లో జీవితాన్ని కడతేర్చుకుంటుంది. ఆమెకు పుట్టిన కూతురు (నీలి) సొసైటీలో అత్యంత నిరాదరణకు గురై, ఎలాంటి మానసిన వ్యథను అనుభవిస్తుందో హృదయవిదారకంగా చిత్రీకరిస్తాడు. నాటి సామాజిక కట్టుబాట్లకు తలొగ్గి, కూతురిని, మనవరాలిని చెంతకు తీసుకోలేని దైన్య స్థితిలో తనువు చాలించే తండ్రి (వృద్ధుడు) పాత్ర మరొకటి ఇందులో కనిపిస్తుంది. రెండో ఉదంతంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నతాషా విషయంలో కూడా రిపీట్ అవుతుంది. తండ్రీ కూతుళ్లిద్దరికీ సేమ్ టార్చర్. అయితే, అన్నిరకాలా తిరస్కరణకు గురైన నిస్సహాయ నతాషాను, ఆమె తండ్రి నికోలాయ్ తిరిగి చేరదీసేలా పాత్రల్ని, సన్నివేశాల్ని మలిచిన తీరు నిజంగా అద్భుతం. నవలను చదివే పాఠకుడికి సైతం నతాషాను, ఆమె తండ్రి దగ్గరకు తీస్తే బాగుణ్ణు అని అనిపించేలా చేయడంలోనే రచయిత గొప్పతనం దాగుంటుంది. అలాంటి రసావిష్కరణతో పాఠకుల హృదయాల్ని గెలవడంలో దోస్తవోయిస్కీ 100 శాతం సఫలీకృతమయ్యాడనే చెప్పాలి.


నిజానికి ఏ బంధానికైనా mutual appreciation of values and qualities అన్నది బేసిస్ గా ఉండాలి. అప్పుడే ఆ బంధం స్థిరంగా, సజీవంగా ముందుకు కొనసాగే అవకాశముంటుంది. ప్రేమ బంధానికైనా ఇదే బేసిస్. ఈ కొలమానంతో చూస్తే... నతాషాది పరిణతి కల్గిన ప్రేమగా కనిపించదు. అఫ్ కోర్స్, ఆ యుక్త వయసులో ఆకర్షణ తాలూకు ప్రేమలే ఎక్కువ. ఈ నవలలో కూడా దోస్తవోయిస్కీ అలాంటి ప్రేమనే చిత్రించాడు. పెద్దగా బేస్ లేకపోవడంతో, సహజంగానే ఆ ప్రేమ అట్టే ఎక్కువకాలం నిలవదు. ఏ ప్రేమ కోసమైతే తల్లిదండ్రుల్ని సైతం ధిక్కురించి ఇంటి నుండి వచ్చేస్తారో, ఆ ప్రేమే విఫలమైతే లేదా ఆ ప్రేమలో వంచనకు గురయితే... అనంతరం ఆ యువతి పరిస్థితి ఏంటనే విషయంలో సరైన పరిష్కార మార్గాల్ని అన్వేషించి, సామాజిక పురోగమనానికి సరైన దారి చూపడంలోనే రచయిత ఔన్నత్యం దాగుంటుంది. ఈ విషయంలో రకరకాల ట్రెండ్స్ కనిపిస్తుంటాయి. ఒక ట్రెండ్- ప్రేమ కోసం అందరినీ వదిలేసి లేచిపోవడం, ఆ ప్రేమ (ఆకర్షణ) ఉన్నంతకాలం అతనితో గడపడం, ఈ సమయంలో తన నగలు-నట్రా, డబ్బూదస్కం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం, ఆ ప్రేమ (ఆకర్షణ) ఆవిరైపోగానే మరొకరితో లేచిపోవడం, వగైరా వగైరా ఇలాంటి (విలువలు లేని) విశృంఖల పరిష్కారాలను సూచించిన (గొప్ప) రచయితలు చాలామందే కనిపిస్తారు. మరో ట్రెండ్- అసలు ఈ ప్రేమలే తప్పు అని చిత్రించే విధంగానో; లేదంటే ప్రేమలో లేక ప్రేమ తాలూకు వివాహ బంధాల్లో వైఫల్యమో, వంచనో సంభవిస్తే, ఆ యువతిని కడతేర్చడమో చేసే నైరాష్యపు పరిష్కారాన్ని సూచించే రచయితలు కూడా కోకొల్లలు. అయితే, దోస్తవోయిస్కీ మాత్రం... యవ్వనం తాలూకు ఆకర్షణలో, తెలిసీ తెలీని తనంతో జీవితంలో తప్పటడుగు వేసి, విధి వంచితులుగా మారిన నతాషా లాంటి అపురూపమైన యువతులు... సామాజిక కట్టుబాట్ల పదఘట్టనల కింద పడి ఛిద్రమైపోకుండా... తమ తప్పును సరిదిద్దుకుని కొత్త జీవితం ప్రారంభించేందుకు గాను తల్లిదండ్రులు, సమాజం కచ్చితంగా అవకాశమివ్వాలని కోరతాడు. ఉన్నత భావాలు, ఆదర్శాలు కల్గిన ఇవాన్ ను, జీవితంలో అనేక ఒడిదుడుకుల, అనుభవాల సారంతో మెచ్యూరిటీ సాధించిన నతాషాను కలిపి ముందుకు నడపి నవలను ముగించడం ద్వారా దోస్తవోయిస్కీ... సమాజంలో ఒక ఉన్నత ఆదర్శానికి దారి చూపించాడని చెప్పవచ్చు. నవలలో ప్రిన్స్, మాస్లో ప్రవర్తనను, సైకాలజీని చిత్రించిన తీరు; సమాజంలో తిరస్కృతులుగా మిగిలి, అత్యంత దయనీయ స్థితిలో కడతేరే నీలి, నీలి మదర్, గ్రాండ్ ఫాదర్ లను దోస్తవోయిస్కీ చిత్రించిన తీరు కూడా సింప్లీ సూపర్బ్!!!


(ఉపసంహారం: ఈ నవల చదివి, ఫ్రెండ్సుతో డిస్కస్ చేశాక, కలిగిన కలగాపులగపు ఫీలింగ్సు అన్నింటినీ ఈ బ్లాగులో ఒక్కచోటకు చేర్చే ప్రయత్నం చేశా. అలా రాస్తూ పోతే కొంత పొడగాటి రైటపే తయారైంది. ఎకానమీ ఆఫ్ సెంటెన్సెస్ సాధించి, చిన్నదిగా రాయలేకపోయినందుకు మరోసారి చింతిస్తున్నా. థాంక్యూ!!)

Tuesday, 31 December 2013

కొత్త నిర్ణయం!

Disclaimer: 

ఇటాలిక్ అక్షరాల్లో... నేను
బోల్డ్ అక్షరాల్లో ... నా అంతరాత్మ

నేను vs నా అంతరాత్మ!


యా..హూ..!
ఏం రోగం??
జాన్ ఫస్ట్ కమింగ్... 
హేవిటీ....?
జనవరి ఫస్ట్ వచ్చేస్తోంది!
ఆ... వస్తే...?
న్యూ ఇయర్  కదా....
ఆ... అయితే...?
ఫ్రెష్ ఇయర్, ఫ్రెష్ ఐడియాస్, ఫ్రెష్ రెజల్యూషన్స్, ఫ్రెష్ లైఫ్, ఫ్రెష్....
ఆగక్కడ... విసిగించక, విషయానికిరా...
కొత్త ఏడాది... కొత్త నిర్ణయాలు తీసుకోవాలి కదా...
తమరికలాంటి రక్త చరిత్ర లేదుగా... ఇప్పుడెందుకీ అఘాయిత్యం?
ఆ... అప్పుడంటే... ఇలాంటివి తెలీక పెద్దగా పట్టించుకోలా...
ఇప్పుడేమొచ్చింది... బుర్రలో జ్ఞానదీపం వెలిగిందా?
అంత సీను లేదు గానీ, అందరూ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారుగా...
అంటే... అందరూ చేస్తేనే చేస్తావా? నీకంటూ ఓన్ ఇండివిడ్యువాలిటీ లేదా...?
నలుగురితో పాటే నారాయణా, చైతన్యా, రాఘవులూ, నీవూ, నేనూ, అందరూనూ....
ఏంటా పిచ్చి వాగుడు? నీవూ నేనూ ఓకే. ఈ నారాయణా చైతన్యా రాఘవులూ ఎవరు?
పాత సామెతకు ఓ నాలుగు తోకలు తగిలించా, పడుంటాయని. బాగోలేదా?
ఏడ్సినట్టే ఉంది. నీలో రానురాను విషయం తక్కువ, వాగుడెక్కువైపోతోంది....
నువ్వు నా ఇమేజీని మరీ దారుణంగా డ్యామేజీ చేసిపారేస్తున్నావ్....
అబ్బ.. ఛ... నీదో పవన్ కళ్యాణ్ ఇమేజీ, దానికో డ్యామేజీ..?
బాబూ... అన్ సివిలైజ్డ్ అంతరాత్మా, నీకో దణ్ణం. నా మానాన నన్నొదిలెయ్? 
చాల్లే నిష్టూరం? నేను లేక నీవు లేవు... తెలుసా? 
సర్లే.... ప్రస్తుతానికి దయ చెయ్..
సరే, కాసేపలా పైరగాలి పీల్చుకొస్తా...
ప్లీజ్.....
బ్లాగుంది కదాని, అడిగేవాడు లేడు కదాని, అడ్డదిడ్డంగా పిచ్చి రాతలు రాయమాక...
యూ....
ఓకే ఓకే... బై...
థాంక్స్... 

*****

వీడేం అంతరాత్మండీ, బాబూ! హార్ట్ లెస్ ఆర్కేలాగా.. డెవిల్స్ అడ్వకేటులాగా... నాన్ స్టాపుగా, నాన్సెన్సుగా, న్యూసెన్సు ప్రశ్నలేసి దుంప తెంచుతున్నాడు. మాంచి భూతవైద్యుడితో చేతబడి చేయించి, పీక మీద పిన్నో, దబ్బునమో గుచ్చి, వీడి పీడ వదిలించుకుంటే గానీ జీవితానికి ప్రశాంతత ఉండదు. ఇతగాడి క్రాస్ క్వశ్చనింగ్ దెబ్బకు బుర్ర హీటెక్కి అసలు కంటెంట్ ఆవిరైపోయింది. రెండంటే రెండు నిమిషాల్లో... రాద్దామనుకున్న విషయాన్నే మర్చిపోయేలా చేసి, నన్ను వీర గజినీలా మార్చేశాడంటే, వీడు మామూలోడు కాదు బాబోయ్. ఇప్పుడేం చేయను? ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం.

*****

ఆ...
యురేకా...  Got it...
గుర్తొచ్చింది...
నేను న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకోవాలి.
మన, సారీ... నా అంతరాత్మారామ్ వచ్చేలోపే ఆ పనేదో కానిచ్చేయాలి. 
లేకపోతే కాల్చుకుతింటాడు. ఒకటే నస మేళం!

ఈ కొత్తేడాదిలో....
# ఏకువనే బ్రహ్మ ముహూర్తంలో ఠంచనుగా ఏడింటికే నిద్ర లేవాలి!
# రోజూ జాగింగు కెళ్లాలి, వీలైతే మినిమమ్ నాలుగు పలకలు ట్రై చేయాలి!!
# ఇకపై వారంలో కనీసం ఒక్కరోజన్నా ఆఫీసు పంచ్..  టైముకే కొట్టాలి!
# ‘డే ప్లాన్’ అంటూ ఒహటుండాలి! దాన్ని రాత్రంతా మేల్కొని రివ్యూ చేయాలి!
# వారానికి నాల్గు సిన్మాలకు మించి చూడరాదు. ఆరునూరైనా ఏడాదికో పుస్తకం చదివి తీరాల్సిందే!
# డెయిలీ డైరీ రాయాలి! అన్నీ నిజాలే రాయాలి! అబద్ధాలు అస్సలు రాయరాదు!!

ఛస్, వెధవ జీవితం! 
భూమి పుట్టినప్పట్నుంచీ ప్రతోడూ ఇవే పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకోవడం...
అటూఇటూగా ఓ వారం రోజులు పల్టీలు కొడుతూ ప్రయత్నించి, వాటికి పాతరేసి, మళ్లా మరుసటేడాది ఘోరీ తవ్వి అవే నిర్ణయాల్ని కొత్తగా తీసుకోవడం... ఓహో... బాగుంది వరస! చూల్లేక చస్తున్నామిక్కడ. ఏదైనా కొత్తగా చేయండి, బాబయ్యా!

ఓ గ్గాడ్! 
మళ్లీ తగలడ్డావా! 
వీడో పెద్ద ఫెవికాల్ అయిపోయాడే...
నీకిస్తానుండు... ఓ పవర్ ఫుల్ పంచింగు పలక్నామా!!

ఈ కొత్తేడాదిలో....
# రోజూ సిక్స్ ప్యాక్స్ సిగార్స్ ఉఫ్...మని ఊదేసేలా (గిరీశంలా) నన్ను నేను తీర్చిదిద్దుకోవలె!
# మా ప్రెస్ క్లబ్బులో చీపుగా లభించే విస్కీ, రమ్ము, జిన్, వైన్ వగైరా ఇకపై రోజూ తాగేలా సిద్ధమవ్వవలె!
# అర్జంటుగా బైక్ నేర్చుకుని, ఈ ఏడాదైనా చిత్రవిచిత్ర బైక్ విన్యాసాలతో కనీసం గిన్నీసన్నా ఎక్కవలె!

ఓల్డే... 
ఓల్డే... 
హల్లో బాస్! 
నువ్వేం రాస్తున్నావో / మాటాడుతున్నావో, కనీసం నీకన్నా అర్థమవుతోందా?
నీకంత దృశ్యం లేదు గానీ... ఏదన్నా జరిగే విషయాలు చెప్పబ్బా!

వీడికి 
నేను బాగుపట్టమూ ఇష్టం లేదు. 
అలాగని చెడిపోవడమూ ఇష్టం లేదూ. 
ఎట్టా చచ్చేదిరా భగమంతుడా. సరే... 

ఈ కొత్తేడాదిలో....
# బస్సులూ ,రైళ్లూ, ఇమానాలు అస్సలెక్కను!
# హాస్పిటల్లో చచ్చినా సరే అడ్మిట్ అవను!!
# నాకు పెళ్లై పిల్లలు పుట్టాక గవర్మెంటు బళ్లు, కాలేజీల్లో వాళ్లను కేజీ నుండి పీజీ దాకా ఫీజుల్లేకుండా చదివిస్తా!

ఓర్నీ బండబడా!
నీ అసాధ్యం తగలడా!
ఏం మాట్టాడుతున్నావయ్యా!
ఇంకొన్ని ఇట్టాంటి మాటలు వింటే నేను తిరిగిరాని లోకాలకో, కోమాలోకో ఎళ్లిపోతానేమో. అమంగళం ప్రతిహతమగుగాక! మనుషులు ఇట్టాంటి నిర్ణయాలు కూడా తీస్కొంటారా, నా నాయనే? నా తండ్రే! 

ఒరేయ్...!
అర్థం పర్థం లేకుండా వాగే అంతరాత్మా!
ఊరకే నోట్లో నరం లేకుండా , మెడపై మెదడు లేకుండా వాగడం కాదు...
నీవు నిజంగా నా అంతరాత్మవే అయితే...
నీకే గనక ఓ బుర్ర ఉంటే, అందులో బూడిద పదార్థం (గ్రే మేటర్) అనేదే ఉంటే...
ఓ నిర్ణయాల చిట్టా చెప్పవోయ్... చూద్దాం.
ఆఆ......... !

ఓయ్...
ఊర్కే తెగ ఇదైపోయి..
ఉట్టినే ఆవేశపడిపోమాక...
బీపీ పెరిగి బుర్రలో నరాలు చిట్లిపోగలవ్ జాగర్త..
సరే, నీ ఛాలెంజీని స్వీకరించి చెబుతున్నా...
వినుకో... రాజా!

ఈ కొత్తేడాదిలో...
# ఆ దిక్కు మాలిన ఫేస్ బుక్కు మూసేయాలబ్బా!
# ఆ పనికి మాలిన ప్లస్సుల జోలికి అస్సలు పోరాదబ్బా!
# అస్తమానూ ఆ బ్లాగుల్లో పడి ఊరేగడం అర్జంటుగా బందు చేయాలబ్బా!!


ఉరేయ్... 
ఉరేయ్...
ఉరేయ్...
ఆపరా....
నీ నాలుక పడిపోనూ. 
నీ గుండె కాయ ఆగిపోనూ..
నీ తలకాయ బద్దలవనూ.... 
అవేం ముదనష్టపు మాటలోయ్... 
కళ్లు పేలిపోతాయ్. పళ్లు రాలిపోతాయ్. గోళ్లు సాగిపోతాయ్. 

ఓహో...
నువ్వేగా ...
కాలరెగరేసి సవాళ్లు విసిరావ్...
నిన్ను ట్విట్టర్లో పెట్టి పిచ్చిపిచ్చిగా ట్వీట్ చేసి చంపేస్తానేమనుకున్నావో... ఆయ్.
అంతరాత్మలతో అణిగి మణిగి ఉండాలబ్బా... నువ్వన్నా చెప్పు సిద్ధప్పా!

అయ్యా...!
అంతరాత్మగారూ...!
బుద్ధొచ్చింది... ఇకపై అంతరాత్మలతో ఆలింగనాలే తప్ప అంతర్మథనాలు అస్సలు చేయను!
సివరాఖరగా... ఒకే ఒక్క నిర్ణయం తీసుకుని సెలవు తీసుకుంటా....

ఈ కొత్తేడాదిలో...
#  అస్సలు ఎలాంటి కొత్త నిర్ణయాలూ తీసుకోరాదని నిర్ణయించుకున్నా!

ఏయ్ స్టడీ....
ఏవైంది బాబయ్యా....
హర్ట్ అయ్యావా.... 
పోెన్లే... ఇక వేధించను.
అవునూ.. 
ఇది కొత్త నిర్ణయమా?
ఇదో..... చెత్త నిర్ణయం !! 
ఛీ... వ్యాక్... నాకు నచ్చలే. 

నాకు నచ్చింది...
చెత్త నిర్ణయమైనా...
ఇదే నా ‘కొత్త నిర్ణయం’!
ఈ జీవితానికి ఇదే నిర్ణయం!
ఇంతే సంగతులు. చిత్త గించవలెను!!

ఆగండాగండి....

వన్ మినిట్... మరచిపోయా...

అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు
కొత్త వసంతంలో మీరు తలపెట్టినవన్నీ సాకారం కావాలని మనసారా కాంక్షిస్తూ...

సెలవ్... మరి!!