దేవ, దానవులు కలిసి పాల కడలిని చిలుకుతున్నారు. మొదట హాలాహలం వెలువడింది. దీంతో కోలాహలం బయలుదేరింది. లోకకళ్యాణార్థం ఆ విషాన్ని ‘ఆదిమ కమ్యూనిస్టు’ శివుడు మింగేశాడు. తర్వాత మథనం కొనసాగింది. ఈసారి సురాభాండం ఉద్భవించింది. దాన్ని గంపగుత్తగా దానవులకు ధారాదత్తం చేసేశారు. ఆ కల్లును ఫుల్లుగా తాగి దానవులు మత్తులో మునిగిపోయారు. తిరిగి మథనం మొదలైంది. ఈలోపు ఉద్భవించిన ఉచ్ఛైశ్రవాన్ని బలి చక్రవర్తికి గిఫ్టుగా ఇచ్చేశారు. తర్వాత పుట్టిన కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, అప్సరసలను ఇంద్రుడు తస్కరించేశాడు. దానవులింకా మత్తులోనే మధిస్తున్నారు. తర్వాత పుట్టిన కౌస్తుభమణితో సహా లక్ష్మీదేవిని మహా విష్ణువు చేపడతాడు. అనంతరం వచ్చిన పారిజాత వృక్షాన్ని అక్కడే నాటేసి, చంద్రుణ్ణి పైకి విసిరేశారు. మథనం కొనసాగింది. చివరగా, ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవించాడు. అమృతం కోసం గొడవ మొదలైంది. దీంతో విష్ణుమూర్తి జగన్మోహిని అవతారమెత్తాడు. దేవ, దానవుల్ని రెండు ఫంక్తుల్లో కూచోబెట్టాడు. మొదట దేవతలకు అమృతం పంపిణీ మొదలెట్టాడు. చూడగా, అమృతం దానవుల ఫంక్తిదాకా వచ్చే సూచనలు కనిపించలేదు. ఈ మోసాన్ని ఓ యువ రాక్షసుడు పసిగట్టాడు. అంతే. అమృత కలశాన్ని దొంగలించి పరుగు తీశాడు. వాణ్ని ఇంకో యువ రాక్షసుడు అనుసరించాడు. కొంతదూరం వెళ్లాక అమృతాన్ని ఇద్దరూ చెరి సగం పంచుకున్నారు. దేవతలకు దొరక్కుండా ఒకడు కర్నాటక వైపు; మరొకడు బెంగాల్ వైపు పారిపోయారు. ఒకడు చిక్ మగళూర్ కొండల్లోకి వెళ్లి విశ్రమించాడు. మరొకడు డార్జిలింగ్ లోయల్లోకి వెళ్లి సేదతీరాడు. అలా ఇద్దరు నిద్రిస్తున్న టైంలోనే, గాలికి ఆకులు రాలి, ఇద్దరి అమృత కలశాల్లో రాలిపడ్డాయి. పొద్దున నిద్ర లేచి చూస్తే, చిక్ మగళూర్ రాక్షసుడి చెంబులో ‘కాఫీ’, డార్జిలింగ్ రాక్షసుడి మగ్గులో ‘టీ’ తయారైంది. ఆ విధంగా అమృతం తాలూకు రెండు అంశలుగా టీ, కాఫీలు ఈ భూమ్మీద ఉద్భవించాయి. మొదట్లో, శివుడు విధిలేక మింగిన హాలాహలమే... ‘గ్రీన్ టీ’!!